సరిగ్గా అప్పుడు సైకిలు బెల్లు ఒకటి వినబడింది.
వనజ, రిక్షావాడు-ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు.
అప్పుడే సైకిలు దిగిన ఓ యువకుడు సైకిలుకు స్టాండ్ వేస్తున్నాడు.
మొదటిసారిగా రిక్షావాడిలో కంగారు కనబడింది. అయితేవాడు మరోసారి పరిసరాలు చూసుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. తన చేతిలో కత్తి వున్నది.
"రక్షించండి!" గట్టిగా అరిచింది వనజ.
ఆ యువకుడు రిక్షావాడిని ఎదుర్కున్నాడు. క్షణాలమీద వాడిని మట్టి కరిపించాడు.
వనజ రెండు చేతులూ ఎత్తి ఆ యువకుడికి దణ్ణంపెట్టింది.
వనజకు రిక్షావాడు తీసుకున్న వస్తువులు వెనక్కు వచ్చేశాయి.
"నా పేరు శ్రీరామ్" అన్నాడా యువకుడు-"స్నేహితులతో పేకాడి ఇప్పుడు తిరిగి ఇంటికి వెడుతున్నాను."
వనజ క్లుప్తంగా తన కథ చెప్పి-"సమయానికి మీరు రాకపోతే బహుశా నా ప్రాణంపోయి వుండేది" అంది.
ఆడపిల్లలు ఒంటరిగా రాత్రి సమయంలో ఇలా బయల్దేరడం ప్రమాదం" అన్నాడా యువకుడు.
వనజ బుద్దిగా తలూపింది.
శ్రీరామ్ రిక్షావాన్ని రిక్షా ఎక్కమన్నాడు. కానీ వాడు కదలకుండా పడివున్నాడు. రిక్షాతొక్కే స్థితిలో లేడు.
"నేను నడిచి వెడతాను" అన్నది వనజ.
"మిమ్మల్ని ఇంటివద్ద దిగ విడుస్తాను-సైకిలు వెనకాల కూర్చోగలరా?" అన్నాడతను.
అప్పుడు వనజ వంట్లో శక్తిలేదు. ఆమె ఆ యువకుడు చెప్పినట్లు చేసింది.
దారిలో శ్రీరామ్ అన్నాడు - "ఈ విషయంలో రిక్షావాడిని తప్పు పట్టి లాభం లేదు వాడి కటువంటి అవకాశమివ్వడం మనదే తప్ప-అందులోనూ మీ అందం సాధారణమైనది కాదు."
వనజ సిగ్గుపడింది.
శ్రీరామ్ ఆమెను ఇంటివద్ద దింపాడు. వనజ అతడికి ధన్యవాదాలు చెప్పి చిరునామా తీసుకొన్నది.
4
తనకు జరిగిన అనుభవం వనజ ఇంట్లో చెప్పుకోలేదు. అంత రాత్రివేళ సాహసించి స్టేషనునుంచి ఇంటికి ఒంటరిగా వచ్చినందుకు ఇంట్లో అంతా ఆమెను కోప్పడ్డారు.
మర్నాడు సుమిత్ర వాళ్ళింటికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుని జరిగిందంతా చెప్పుకుంది. వనజ, సుమిత్రవంక నిర్లక్ష్యంగా చూసి- "నీ ముఖం చూడగానే వాడికి ధైర్యం వచ్చి వుండాలి. నా రిక్షావాడు నోరు మూసుకుని రిక్షాతొక్కాడు" అన్నది. జరిగిందేమిటో ఆమె ఎవ్వరికీ చెప్పదల్చుకోలేదు.
"ఎలాగైనా నువ్వు అదృష్టవంతురాలివి. నీ రిక్షావాడు నాకూ, నా రిక్షావాడు నీకూ తగలాల్సింది-అప్పుడు తెలిసేది నీ ప్రతిభ" అన్నది సుమిత్ర.
వనజకు తన అదృష్టంమీద నమ్మకం వున్నది. నిజానికి వనజకూడా సుమిత్రకులా ప్రవర్తించి వుంటే రిక్షా వాడామె జోలికి వచ్చి వుండేవాడు కాదు. ఆమె రిక్షావాడిని రెచ్చగొట్టింది. అప్పుడే వాడికి తను మగాడు, ఆమె ఆడది అని గుర్తుకు వచ్చింది. తన శక్తిని చూపాలనుకున్నాడు. అటు వంటి పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకునికూడా ఆమె ఆ ఇబ్బంది నుంచి బయటపడగలిగింది. అదృష్టం శ్రీరామ్ రూపంలో వచ్చింది.
"నువ్వు చెప్పేదంతా వింటూంటే నాకో అనుమానం కలుగుతున్నది ఆ రిక్షావాడు కేవలం డబ్బు తీసుకుని నిన్ను వదిలిపెట్టాడా అని?" అన్నది వనజ.
"పోనీ వదిలిపెట్టలేదనుకో" అంది సుమిత్ర.
"మరి.."
సుమిత్ర తేలికగా నవ్వి-"ఇప్పుడు మా అక్కకు నగ చేయించి ఇవ్వాలి. పొరుగింటావిడకు కొత్త వాచీ కొనివ్వాలి. పక్కింటాయన బాకీ తీర్చాలి. నేను పోగొట్టుకున్న వాటిలో ఇవే నాకు విలువైనవి" అన్నది.
వనజ నిట్టూర్చి-"కొన్ని కొన్ని విషయాలు నేను నీ అంత తేలికగా తీసుకోలేదు" అన్నది.
"అదృష్టవంతురాలివి ఎరువు సరుకులతో బయల్దేరాను. అన్నీ పోయాయి. అదే పరిస్థితుల్లో నీకేమీ పోలేదు" అన్నది సుమిత్ర. ఆమె మనసులో నిజంగానే వనజంటే అసూయపడుతున్నది. ఇప్పుడు తన కష్టాలు గట్టెక్కాలంటే తనకా ఉద్యోగం రావాలి. అయితే వనజ చాలా అదృష్టవంతురాలు. ఆ ఉద్యోగం వనజకే వస్తుందేమో నన్న భయం సుమిత్రకున్నది.
కానీ ఉద్యోగం విషయంలో ఇద్దరి అదృష్టమూ ఒకే విధంగా వున్నది. ఉద్యోగం ఇద్దరికీ వచ్చింది.
జీతం నెలకు అయిదు వందలు.
స్నేహితురాండ్రిద్దరూ కలిసే మళ్ళీ బయల్దేరారు. అయితే వనజ సుమిత్ర అంత ఉత్సాహంగా లేదు. కారణం శ్రీరామ్!
ఇంటర్వ్యూ నుంచి తిరిగి వచ్చినప్పట్నుంచీ ఆమె తరచుగా శ్రీరామ్ ను రహస్యంగా కలుసుకుంటున్నది.
శ్రీరామ్ నిరుద్యోగి. ఎంకాం ప్యాసయ్యాడు. మంచి ఆటగాడు. రెండేళ్ళుగా ఉద్యోగ ప్రయత్నంలో వున్నాడు. అతడి తల్లిదండ్రులు పూర్తిగా అతడిపైనే ఆధారపడి వున్నారు. అతడికి అప్లికేషన్ పెట్టడానికి కూడా డబ్బు దొరకని స్థితిలో వున్నాడు.
శ్రీరామ్ ది పేకాటలో హస్తవాసి మంచిది. కొందరు స్నేహితులతన్ని తన తరఫున ఆడిపెట్టమని బలవంతపెడుతూంటారు. పెట్టుబడి స్నేహితుడిది. నష్టం వచ్చినా స్నేహితుడిదే-లాభం వస్తే మాత్రం నాలుగోవంతు శ్ర్రీరామ్ కి వస్తుంది. ఈ విధంగా శ్రీరామ్ నెలకు యాభై రూపాయలు తక్కువ లేకుండా సంపాదిస్తున్నాడు. ఆ డబ్బే అతడు పై ఖర్చులకూ, ఇతరులకూ ఉపయోగపడుతున్నది.
చాలా తొందరగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
"మన ఇద్దరిలో ఎవరికి ఉద్యోగం వచ్చినా-మనం వెంటనే పెళ్ళి చేసేసుకుందాం" అంది వనజ.
"మీ పెద్దవాళ్ళొప్పుకుంటారా?" అన్నాడు శ్రీరామ్.
"మీ పెద్దల సంగతి, నీ సంగతీ చూసుకో - నేను నా యింట్లో అన్ని విధాలా సర్వస్వతంత్రురాలిని" అన్నది వనజ.
"అయితే నాకు అంగీకారమే!" అన్నాడు శ్రీరామ్.
ఇప్పుడు వనజ కుద్యోగం వచ్చింది. శ్రీరామ్ ను అక్కడికి వచ్చేయమన్న దామె.
"మా వాళ్ళను వదిలి ఎలా వచ్చేది? పైగా అక్కడైతే అద్దె కూడా యిచ్చుకోవాలి. ఇక్కడ మాకు స్వంతిల్లు ఉన్నది" అన్నాడు శ్రీరామ్.
"నే నక్కడికి వెళ్ళి నీ కోసం ప్రయత్నిస్తాను" అన్నది వనజ.
ఉప్పుడామెకు శ్రీరామ్ తో రోజూ మాట్లాడడం అలవాటయింది అతణ్ణి చూడకుండా ఉండగలనా అనిపిస్తున్న దామెకు. అందుకే వెళ్ళి ఉద్యోగంలో చేరడానికి ఉత్సాహంగా లేదామెకు.
5
అదృష్టం మరోసారి వనజకు కౌగలించుకున్నది.
ఆమె బాస్ సత్యనారాయణ. అతడామెను తొలి చూపులోనే ప్రేమించాడు. ఆమెతో తరచుగా మాట్లాడుతూండే వాడు ఏకాంతానికి ప్రయత్నిస్తూండేవాడు. వనజకు అతడి తీరు నచ్చలేదు. బాస్ కదా అని సహించింది.
ఆఖరికి ఒకరోజున సత్యనారాయణ ఆమెతో "నన్ను నువ్వు తప్పుగా అర్ధం చేసుకోకూడదు నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఇష్టపడితే నిన్ను పెళ్ళిచేసుకుంటాను" అన్నాడు.
వనజలో ఒక ఆకర్షణ వున్నది. ఆ ఆకర్షణకు చాలా మంది పురుషులు గురి అవుతూంటారు.
"మీరు నన్ను నిజంగా ప్రేమిస్తూంటే మీరు నా ప్రేమను గౌరవించాలి" అన్నది వనజ.
"అంటే?" అన్నాడు సత్యనారాయణ.
వనజ తన ప్రేమకథ చెప్పుకుని "మీరు శ్రీరామ్ కు ఏదైనా దారి చూపించి మీ ప్రేమ ఎంత స్వచ్చమైనదో నిరూపించుకోండి" అన్నది.
సత్యనారాయణ తన ప్రేమస్వచ్చతను నిరూపించుకున్నాడు. ఫలితంగా ఆ ఊళ్ళోని మరో కంపెనీలో శ్రీరామ్ కు నెలకు మూడువందల రూపాయల జీతంమీద అప్రెంటీస్ ట్రెయినీగా పోస్టింగయింది.