చదువుసంస్కారం, సభ్యత త్రివేణిసంగమంలా వుండవలసినచోటు వరదపోటున వుండే సప్తగోదావరంలా అయిపోయింది. అన్నిటికి మించి రుక్మిణి ఆశించింది.....
రఘురసావిష్కరణాగమనం.....అయితే అతను రాలేదు.....
రాకఅవుతుందనుకున్న అతని రాక అతను రాక నీరసనీరవ నిరీహ నిర్నిమేషమయిపోయింది.
అదిగోఆస్థితిలో..... మూడుయుగాలు గడిపి, బ్రతుకుజీవుడా అనుకుంటూ గుండె నిండవలసినవేళలో, రసపల్లవాలు చిగుర్చవలసిన ఆమనిలో బ్రతుకుబరువును లాగేనిశీధిలా, ఆమనేలేని యామినిలా నిరాశా నిస్పృహలు నిండిన పేద గుండెతో.
ఒంటరిగా జనసముద్రమధ్యంలో
కొందరు సూర్యదర్శనం చేసుకోందేభోజనం చేయరు. వర్షరుతువులో రెండు మూడు రోజులు ముసురు పట్టి ఎండపొలకువే కనిపించదు. అయినా వాళ్ళలాగే వుంటారు. అప్పుడెప్పుడో రవి కిరణసహితుడై.....
అప్పుల్లోమునిగీ తేలేమార్గమే కనిపించని దుర్భర మనసికావస్థలో లక్షల రూపాయలులాటరీరూపంలో భాగ్యలక్ష్మి....
అంతుతెలియని ఆందోళనాతిమిరంలో ఆత్మజ్యోతిఒక్కసారిగా..... కనిపించినట్లు ఆ బస్టాండుల్లో-
ఆ జనసమూహాన్ని చీల్చుకుంటూ
కోటిమంది లోనయినా తన ప్రత్యేకరూపు నిలుపుకునే రాఘవ.....రఘు..... అతని దర్శనం రుక్మిణికి కనువిందైంది.
'ఈ గుండె మీద శయనిస్తే ఎంత చల్లగా వుంది రఘూ! ఇది నా హృదయసింహాసనం లాగా, నా పట్టుపాన్పు లాగా నా కోసమే నువ్వు జన్మించావన్న మధుర భావన....
'మినీ.....'
జలతరంగిణిపై సప్తసరాల్లో రెండు అతిమనోమోహనంగా, కళ్యాణావహంగా ఎదను మీటినట్లువినిపించింది.
'రఘూ! మూడు రోజులు మూడు యుగాలుగా ఎదురుచూశాను. కళ్ళు కాయలుకాచి పోయాయి. గుండెబరువు తగ్గిపోదు. ఎదలోపలి వేదన వెలువడదు. చెప్పుకోటానికి నువ్వు లేవు. బాధ పంచుకునేదికాదు వెలువరించేదీకాదు. ఎలా భరించానో!'
ఆమె అతని గుండెలపై కూర్చిన పూల చెండులాపడుకుని వుంది. పొందలేని దేదో పొందగలిగిన తృప్తికళ్ళల్లో కాపురం పెట్టింది. రసమయ సంగీతం వింటూ పులకరించిపోతున్న భావన. మధురమధుర మృదువీచికలకు పరవశిస్తున్న అనుభూతి.
అతనామె కురులు సవరించాడు.
అతి నెమ్మదిగా వీపు నిమిరాడు.
ఆ స్పర్శ ఓ వరసవేది
ఆ అనునయంమనోనయనపరరసమయం
ఆ చేయిపది జన్మలకి సరిపడా తృప్తినిచ్చేహాయి సమకూర్చే రేయి.
అతనేమీ జవాబీయలేదు.
దేవీ సన్నిధానంలో మనోనేత్రాలకి నయనానందకరంగాదేవి దర్శనం పొందిన ఏకాంత భక్తశిఖామణి మానసిక స్థాయిలో వున్నాడతను.
'నా ఉత్తరం అందలేదా!'
అందలేనట్టుగా అతని చేయికదలాడింది.
'నువొస్తావని- జీవితంలో అపూర్వంగా లభించిన యీ సువర్ణావకాశంలో మనకు ఏకాంతం లభిస్తుందని యీ మూడు రోజులూమూడు మనంతరాలకీ సరిపడ తాదాత్మ్యం పొందవచ్చని గుండెచేసి ఆరాధించి, ఆరాధనార్చన అందుకోవచ్చని ఎంత ఆశపడ్డాను.
కోరిందేది కొంగు బంగారం కాదేమో!
కోర్కెలహరివిల్లు మనస్సులో విరుస్తుందే తప్ప జీవితంలో విరయదేమో!
కలలెప్పుడూ కల్లలుగానే వుండిపోయిఫలించవేమో!
మరిఅలాటప్పుడు - ఎందుకీతపనలు? ఎందుకీరసలాలస? ఏల యీ ఆవేదన? ఎందుకోసమీ ఆరాటం.....గుండెగులాబీ దండైగుబాళించేదెందుకు?
'ఎందుకు? ఎందుకు రఘూ?'
అతనేం జవాబు చెప్పలేదు.
ఎక్కడో ఎద లోయల్లో కదలాడి ఎగసి ఎగసి, అలసిసొలసి కంటి మార్గానకదిలి, ప్రిదిలిచెదరి జారినకన్నీటి చుక్క......
ఆమె ఎక్కడ గమనిస్తోందన్నశంకతో -
అది ఒక చుక్కయి...... జారి..... ఆమెసిగలో ..... అతని మనస్సు అగరొత్తిగా మారి పొగలైసెగలై పూవైనట్టున్న ఒక గులాబీ విరిబాలదోసిట్లో జారిపడింది.
ఠప్పున శబ్దం కాలేదు.
బరువెక్కినగుండె బాధతో నిట్టూర్చిమూగవోయింది.
'రఘూ! టైమెంతయింది?'
అతను జవాబివ్వలేదు.
గడియారంచూసుకుంటే యిద్దర్నీ విడదీసేందుకు కాలంసెకన్లయి - నిమిషాలయి - గంటలయి ఎలా పరిగెత్తిందో తెలుస్తుంది.
విడిపోవటానికి సమయం సమీపిస్తోందని గుర్తు చేస్తోంది.
తెలిసితెలిసి గుండెకెవరుగాలం గుచ్చుకుంటారు? ఎదకెవరు ఉరి వేసుకుంటారు? అందుకే రాఘవ గడియారం చేతినుంచితీసి టేబిల్ పై పెట్టాడు.
'నాకు బస్ టైం అవుతుందేమో!'
అతని నాభి నుండి బయలుదేరిన దుఃఖం వీచిక గుండెదాకావచ్చి గాఢంగా స్పృశించిగొంతుని తడిమి నులిమి నులిమి అక్కడే తానూ.....
ఆమె తలెత్తి చూసింది.