"నీ భార్యకు తెలివుంటే ప్రతిఘటించవచ్చు ఏదైనా ఉపాయంతో అతడిని కాసేపు ఆపవచ్చు. లేదా సుకుమార్ పై నీవు చెప్పిన దేశభక్తి ప్రభోధం పని చేసి వుండవచ్చు. ఎనిమిది నలభై అయిదు కల్లా నా మనుషులు ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. అటు పైన అంతా సుకుమార్ మంచితనం మీదా, నీ భార్య తెలివి మీదా ఆధారపడి వుంది. ఇక్కణ్ణించి ఇంటికి పోయావా -- నీకు గొప్ప అవకాశం - ఇంకా వుండవచ్చు. బాగా ఆలోచించుకో.."
జగదీష్ క్షణ మాత్రం ఆలోచించాడు. ఆ తర్వాత అక్కణ్ణించి ఒక్క పరుగు తీశాడు.
"పూర్ ఫెలో! లేకపోతె నా ఆచూకీ తీయడానికి నా ప్రాణం తీసి ఉండేవాడు. సుకుమార్ చేతికి అందిన అందాన్ని వదులుతాడా? ఎవడి కర్మకెవరు కర్తలు...." అనుకుంటూ క్రూరంగా నవ్వుకున్నాడు విఠల్.
కొద్ది క్షణాల్లో అతడి పక్కన ఓ కారు ఆగింది. కార్లోంచి ఓ వ్యక్తీ తల బయటకు పెట్టి చూసి -- "హలో విఠల్! కాయా, పండా?" అనడిగాడు.
"పండే!"
"వెల్ డన్!" అంటూ ఆ వ్యక్తీ డోర్ తెరిచాడు విఠల్ కారెక్కాడు.
6
కాలం స్థంభించినట్లు సుకుమార్ భావించినప్పటికీ మొత్తం మీద టైము ఎనిమిది నలభై అయిదయింది. ఉక్కు పిడుగు కాక మరో ముగ్గురు మనుషులతడి వద్దకు వచ్చారు. "జగదీష్ రాలేదు. మనసుకు గాభరాగా వుందని మీ నాన్న నిద్ర మాత్రలేసుకుని పడుకున్నాడు. మేము వెళ్ళిపోతున్నాం. మా పని అయిపొయింది...." అన్నాడ వారిలో ఒకడు.
సుకుమార్ వారిని సాగనంపి తలుపులు వేసుకున్నాడు.
అతడి శరీరంలో సన్నని వణుకు, మనసులో ఏదో మధుర భావన, కానీ అంతలోనే భయం.
జ్యోత్స్న కు తనంటే నిజంగా ఇష్టమో కాదో తెలియదు. ఇష్టం కాకపోతే తనామేను బలవంతం చేయగలడా?"
ఇంట్లో తండ్రి ఒక్కడే వున్నాడు. నిద్రమాత్రలేసుకుని పడుకుంటే ఆయనకు భూకంపాలు వచ్చినా, వెయ్యి ఏనుగులు ఘీంకరించినా మెలకువ రాదు. గదిలో అసహాయ స్థితిలో జ్యోత్స్న ఆ గదికి తాళం.....తనవద్ద తాళం చెవి వుంది.
ఏం చేయగలదామె? ఆ స్థితిలో తననసలు ప్రతిఘటించగలదా?
సుకుమార్ లో ఆవేశం పుడుతోంది. ఆవేశాన్ని భయం కమ్మేస్తోంది. మధ్యలో జగదీష్ వస్తాడేమోనని అతడు భయపడుతున్నాడు.
ఆ విధంగా టైము పదయ్యేవరకూ అతడు జాప్యం చేశాడు.
జగదీష్ ఇంకా రాలేదు.
సుకుమార్ లో క్రమంగా ధైర్యం వచ్చింది. అతడు లేచి వెళ్ళి గది తలుపులు -- తాళం తీసి తెరిచాడు.
ఆ వెనువెంటనే -- "జగదీష్!" అందో కోమల స్వరం.
ఆ గొంతు జ్యోత్స్న ది.
సుకుమార్ మాట్లాడకుండా లోపలకు అడుగు పెట్టాడు. అతడు తలవంచుకొని వున్నాడు. తలెత్తడానికి ధైర్యం చేయడానికి కాసేపు పట్టింది. తలెత్తగానే జ్యోత్స్న ను చూశాడు. అతడి నరనరాన విద్యుత్ ప్రవహించింది.
మంచం మీద కూర్చుని వుంది జ్యోత్స్న. రెండు తలదిండ్ల ను తన శరీరానికి దగ్గరగా అదుముకుందామే . మంచం మీద దుప్పటి కూడా లేదు.
జ్యోత్స్న సుకుమార్ వంకనే చూసి---"నువ్వా?" అంది.
సుకుమార్ ఆమె వైపే చూస్తున్నాడు. అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది కానీ ధైర్యమింకా చాలడం లేదు.
"అంటే జగదీష్ రాలేదన్న మాట " అంది జ్యోత్స్న.
"నేను రావడం నీకు నచ్చలేదా?" అన్నాడు సుకుమార్ చటుక్కున. విఠల్ ఆమె కులట అని చెప్పిన విషయం అతడికి హటాత్తుగా గుర్తుకొచ్చింది.
"అంటే నువ్వు విఠల్ ఇచ్చిన అవకాశం ఉపయోగించదల్చావన్న మాట....నిజంగా...." అని ఆగిపోయింది జ్యోత్స్న.
సుకుమార్ మానంగా ఆమెను సమీపించి -- "నీకు నీ భర్తతో కాక ఇతర పురుషులతో సంబంధమున్నట్లు విఠల్ చెప్పాడు. అందుకే నేను వచ్చాను" అన్నాడు.
జ్యోత్స్న వెంటనే -- "విఠల్ నా గురించి చెప్పిందంతా నిజం. నేను నిన్ను కూడా ప్రతిఘటించను..." అంది.
సుకుమార్ మంచం మీద కూర్చుని --"నేనంటే నీకిష్టమే కదూ...." అన్నాడు.
"నా యిష్టంతో నీకు నిమిత్తం మేమిటి?"
"నిమిత్తం లేదు. ప్రతిఘటించనని మాటివ్వు చాలు...."
"నిన్ను ప్రతిఘటించి ఏమి లాభం? జగదీష్ నన్నింక ఏలుకోడు...."
"ఇందులో తప్పేముంది? తనే నిన్ను రక్షించుకోలేకపోయాడు...."
"ఏది యేమైనా యిది పురుష ప్రపంచం. జగదీష్ కి నాకంటే దేశమే ఎక్కువ. అందుకే నామానాన నన్ను వదిలి వెళ్ళాడు. అనుకున్న టైముకు తను రాలేక పోయాడుగా -- ఇంక నన్ను చూడ్డానికి కూడా రాడు" జ్యోత్స్న వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
"ఇది చాలా అన్యాయం...." అన్నాడు సుకుమార్.
జ్యోత్స్న ఏడుస్తూనే -"ఇందులో అన్యాయమేముంది? దేశ ద్రోహమని తెలిసీ నువ్వు నాకోసం వచ్చావు. నీ గురించే జగదీష్ నన్ను వదిలేస్తాడు. ఆ సంగతి నీకు తెలుసు. అయినా నువ్వు నామీద వాంఛను చంపుకోవు. పోనీ అతడు వదిలేస్తే నిన్ను వివాహమూ చేసుకోవు-" అంది.
సుకుమార్ ఆవేశంలో వున్నాడు - "నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను--" అన్నాడు చటుక్కున.
"అది ఆవేశంలో అంటున్న మాట. అదే నిజమైతే ప్రస్తుతానికి నన్ను వదిలి పెట్టి - పెళ్ళి చేసుకునే వరకూ అగవచ్చుగా --" అంది జ్యోత్స్న.
సుకుమార్ మాట్లాడలేదు.
"నాకు తెలుసు. ఇది పురుష ప్రపంచం. స్త్రీకి అన్యాయం చేయడమే పురుషుడి ధ్యేయం. స్త్రీకి జరిగిన అన్యాయాన్ని క్షమించక పోవడమే పురుషుడి గొప్ప తనం...." అంది జ్యోత్స్న. ఆమె మళ్ళీ వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
ఆమె ఏడుస్తుంటే సుకుమార్ కి యేదోలా ఉంది. తనేదో తప్పు చేసిన అనుభూతి అతడిలో కలిగింది. అతడిలో ఆవేశం చల్లారింది.
"నా నిజాయితీని నిరూపించుకుంటాను...." అంటూ అతడు గది బయటకు వెళ్ళాడు. జ్యోత్స్న అతడు వెళ్ళిన వైపే చూస్తోంది. తిరిగివచ్చిన అతడి చేతిలోని ప్లాస్టిక్ సంచీని చూసి ఆమె తేలికగా నిట్టూర్చింది.
అతడా సంచీని మంచం మీద ఉంచాడు.
"చాలా థాంక్స్! బీరువాకు తాళం పెట్టి అ తాళాలు బీరువా మీద పెట్టాడా విఠల్. అవి కూడా తీసి మంచం మీద పెట్టి వెళ్ళిపో. నీ మేలు మరిచిపోను. నీ ఋణం ఉంచుకోను--" అంది జ్యోత్స్న.
సుకుమార్ అలాగే చేసి వెళ్ళిపోయాడు. జ్యోత్స్న నగ్న శరీరాన్ని కూడా చూడలేకపోయినప్పటికీ అతడి కిప్పుడే ఎంతో తృప్తిగా ఉంది. అయితే ఆ రాత్రి నిద్ర పోవడానికి తనూ నిద్రమాటలు వేసుకున్నాడతడు.
7
మర్నాడు బాగా ఆలస్యంగా నిద్ర లేచాడు సుకుమార్. క్రమక్రమంగా అతడికి నిన్నటి రాత్రి అనుభవమంతా గుర్తుకొచ్చింది.
జ్యోత్స్న తనకు దక్కవలసింది కానీ తనెంతో ఉదార బుద్దితో వ్యవరించించాడు. అయినప్పటికీ భర్త ఆమెను వదిలి పెట్టేస్తాడనుకుంటుందామె. ఆమాత్రానికే భర్త ఆమెను వదిలేస్తాడా? ఆఖరి కామె తనను వివాహం చేసుకోమని కూడా కోరింది.
తనకామే అంటే యిష్టం. ఆమెతో అనుభవాన్ని కోరాడు. ఆమెకు వివాహమైందనీ కానీ, ఆమెకు భర్త ఉన్నాడని కానీ అతడు పట్టించుకోలేదు. మనసారా ఆమెను కోరాడు. అటువంటప్పుడు చేసుకోదానికేం?
సుకుమార్ కి రణధీర్, రవి శంకర్ గుర్తుకొచ్చారు. ఇద్దరూ పెద్దవాళ్ళు, జ్యోత్స్న పిల్లలు, జ్యోత్స్న ఆ పిల్లలకు తల్లిలా కనపడకపోవచ్చు . కానీ వాళ్ళమే పిల్లలు. ఆమె జగదీష్ తో కాపురం చేసిందనడానికి నిదర్శనం వాళ్ళు.
లాభం లేదు. తనామేను వివాహం చేసుకోలేడు. తను కన్యను తప్ప వివాహం చేసుకోడు.
సుకుమార్ రెండు రోజుల పాటు జ్యోత్స్న ను కలుసుకోలేదు. ఆమెను కలుసుకుందుకు సిగ్గు , మొహమాటం భయం అన్నీ కలిగాయతడికి. అయితే తండ్రి ద్వారా ఆమె గురించి వివరాలన్నీ తెలిశాయతడికి. జగదీష్ యింటికి రాలేదు. ఆఫీసులో వాకబు చేస్తే అతడు రాజీనామా యిచ్చి వెళ్లిపోయినట్లు తెలిసింది. పిల్లల్ని అతడు కూడా తీసుకుని వెళ్ళిపోయాడట.
ఇవన్నీ రూడయ్యాక జ్యోత్స్న -- ఇంట్లో ఫర్నిచర్, ఇతర వస్తువులు అయిన కాటికి అమ్మేసి -- ఇంటద్దె కట్టేసి వెళ్ళిపోయింది. సుకుమార్ ఆమె తనకు బాధ్యత గా మారుతుందన్న భయంతో -- ఆమెను తప్పించుకునే తిరిగాడు. ఆమె కూడా ఆ విషయం అర్ధం చేసుకున్నదానిలా అతడిని కలుసుకునేందుకు ప్రత్యేకంగా యే ప్రయత్నమూ చేయలేదు.
జ్యోత్స్న వెళ్ళిపోయాక రెండు వారాలకు జగదీష్ పని చేస్తున్న ఆఫీసు నుంచి సుకుమార్ కి పిలుపు వచ్చింది. ఎందుకోననుకుని వెళ్ళాడతను.