Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 6

 

    "చాలా బుద్దిగా ఉన్నాడు సార్....ఎలా చెబితే అలా మసలుతున్నాడు. పోయి మంచం మీద పడుకుని పేపరు చదువుకుంటున్నాడు. మన మీ యింట్లో అడుగు పెట్టినట్లు పోరాపాటున కూడా యెవరికీ చెప్పనన్నాడు...."
    "వెరీ గుడ్ ....కుర్రాణ్ణి తీసుకురా...." అన్నాడు విఠల్. కొద్ది క్షణాల్లో ఆ ఉక్కు పిడుగు సుకుమార్ని వెంట బెట్టుకుని వచ్చాడు.
    "మిస్టర్ సుకుమార్! అన్నమాట నిలబెట్టు కుంటున్నాను. నీ సాయానికి ప్రతిఫలం ఈ తాళం చెవి...." అంటూ తాళం చెవి సుకుమార్ కి అందించాడు విఠల్. సుకుమార్ తాళం చెవి అందుకుని ప్రశ్నార్ధకంగా అతడి వంక చూశాడు.
    "మిస్టర్ జగదీష్! ఆ ప్లాస్టిక్ బ్యాగు సుకుమార్ కి యియ్యి..." అన్నాడు విఠల్.
    జగదీష్ ఆవేశాన్ని పళ్ళ బిగువున అణచుకొని సుకుమార్ కా బ్యాగందించాడు.
    "ఇందులో జ్యోత్స్న ధరించిన బట్టలున్నాయి. జ్యోత్స్న గదిలో వుంది. గదికి తాళం పెట్టాను. తాళం చెవి నీ చేతిలో వుంది. సరిగ్గా గంటన్నర వ్యవధి ఇస్తున్నాను. ఈలోగా ఆ గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించకు. ఇక్కడే సోఫాలో కూర్చో, గంటన్నర కాగానే గదిలోకి వెళ్ళు, ఆ తర్వాత నీ యిష్టం....' అన్నాడు విఠల్.
    "మిస్టర్ సుకుమార్!" అన్నాడు జగదీష్ అవేశంగా -- "జ్యోత్స్న నా భార్య . ఈ పాండురంగ విఠల్ దేశ ద్రోహి. ఇతడికి సహకరించడం దేశద్రోహం . నువ్వు నా భార్యకే అన్యాయం చేసినా అది దేశాద్రోహమే అనిపించుకుంటుంది. నేను దేశాద్రోహాన్ని క్షమించను...."
    విఠల్ నవ్వి -- "భార్య మానాన్ని రక్షించుకోలేని వాడు దేశాన్ని రక్షించుకోగలడా?" అన్నాడు.
    జగదీష్ మాట్లాడలేదు. అతడు తీక్షణంగా సుకుమార్ వంకా సుకుమార్ చేతిలోని తాళం చెవి వంకా చూస్తున్నాడు. తాళం చెవి పట్టుకున్న సుకుమార్ చేయి వణుకుతోంది. రెండో చేతిలో జ్యోత్స్న బట్టలున్న ప్లాస్టిక్ బ్యాగుంది. ఆ చేయి కాస్త వణుకుతోందేమో సంచీ చేతిలోంచి జారి పడింది.
    "బీ బ్రేవ్-- సుకుమార్.... ఇప్పుడు టైము ఏడుం పావయింది. ఎనిమిది నలభై అయిదు వరకూ నువ్విక్కడే కూర్చో. ఈలోగా తొందర పడ్డావా...."
    విఠల్ మాట పూర్తీ చేసేలోగానే --"నేనున్నాను కదా బాస్ ...." అన్నాడు ఉక్కు పిడుగు. సుకుమార్ అప్రయత్నంగా అతడి వంక చూశాడు.
    ఉక్కుపిడుగు ఎత్తుగా , బలంగా, నల్లగా ఉన్నాడు. వాడి కండలు నున్నగా మెరుస్తున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
    తనది ఆరడుగుల విగ్రహం కావచ్చు. కానీ వాడి ముందు తానెందుకూ పనికిరాడు.
    సుకుమార్ నిట్టూర్చి వాచీ చూసుకున్నాడు. వాచీ ఏడుం పావు దగ్గరే ఆగిపోయినట్లనిపించిందతడికి.
    జగదీష్ ను వెంట బెట్టుకుని విఠల్ వెళ్ళిపోయాడు.
    

                                     5
    జగదీష్ పిల్లలిద్దర్నీ కలుసుకోగానే వాళ్ళను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. వాళ్ళిద్దరూ అతణ్ణి చూసి ఏడ్చేశారు.
    "బీ క్విక్ -- అప్పుడే టైము ఏడూ ముప్పై అయిదు...." అన్నాడు విఠల్.
    జగదీష్ త్వరపడ్డాడు. పిల్లలిద్దర్నీ తీసుకుని ఓ యింటికి వెళ్ళాడు. ఆ యింట్లో వారికి వాళ్ళ నప్పగించాడు.    
    "టైము ఏడూ నలభై అయిదు...." అన్నాడు విఠల్ హెచ్చరికగా.
    "ఇప్పుడెం చేయాలి?"
    "నీ ఆఫీసుకు వెళ్ళాలి...."
    "వెళ్ళకపోతే?"
    "ఎనిమిది నలభై అయిదు దాటేక యేమవుతుందో నీకు తెలుసు...."
    "దాటాలి గదా ...."
    "మిస్టర్ జగదీష్ .....అతి తెలివికి పోకు...."
    "అతి తెలివి కాదు. ఆ ఫైలిప్పుడు లాకర్లో లేదు...."
    "ఏమయింది?"
    "ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో ఒక సురక్షిత స్థానానికి తరలించబడింది...."
    "ఎందుకని?"
    "పాకిస్తాన్ గూడ చారులు దాని కోసం అన్వేషణ ప్రారంభించినట్లు మాకు వార్త అందింది...."
    'అయితే ఏమంటావ్?"
    "ఇప్పటికీ నీకు నేను సాయపడగలను. కానీ నువ్విచ్చిన గడువు చాలదు...."అన్నాడు జగదీష్.
    "సుకుమార్ వంటి కుర్రాడిని-- అంత కంటే ఆపడం న్యాయం కాదు...."
    "{నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావా?"
    విఠల్ నవ్వి - "న్యాయం గురించి మాట్లాడానికి వేరే అర్హత లేమీ లేవు. అవకాశం, అదృష్టం కలిసి రావాలంతే!" అన్నాడు.
    "నా భార్యకు రక్షణ కల్పించ లేకపోతే నేను నీకు సాయపడను...."
    విఠల్ ఓ క్షణం అలోచించి -- "సరే -- ఇట్సాల్ రైట్ ....మనం యాభై కిలోమీటర్లు వెళ్ళొద్దు. మీ ఆఫీసుకే వెడదాం. అక్కడ నీ లాకర్లో ఫైల్సు చూసి అందులో నాక్కావలసిన వివరాలు లేకుంటే --నీకు కాస్త టైమిస్తాను...."అన్నాడు.
    "అక్కడ నిజంగా ఆ ఫైల్సు లేదు....' అన్నాడు జగదీష్.
    "నన్నక్కడకు తీసుకుని వెళ్ళే బాధ్యత నీది. ఫైల్స్ చూసుకునే బాధ్యత నాది"అన్నాడు విఠల్.
    జగదీష్ ఆలోచనలో పడ్డాడు.
    "బీ క్వీక్ ....టైము ఎనిమిది కావస్తోంది...."
    జగదీష్ తిరిగి స్కూటర్ స్టార్ట్ చేసి -- "పద అన్నాడు.
    విఠల్ స్కూటరెక్కాడు.
    స్కూటర్ శరవేగంతో దూసుకునిపోయి అయిదు నిమిషాల్లో జగదీష్ ఆఫీసు చేరుకుంది. అక్కడ దర్వార్ అతణ్ణి చూసి సెల్యూట్ చేశాడు.
    ఆఫీస్ బిల్డింగ్ మెయిన్ డోర్ తాళం పెట్టి ఉంది. దానికేదో నంబర్ కోడ్ ఉంది. జగదీష్ చకచకా ఏవో. నంబర్లు తిప్పాడు. అప్పుడు వాచ్ మాన్ తనవద్ద ఉన్న తాళం చెవి ఉపయోగించి మెయిన్ డోర్ తెరిచాడు.
    "చాలా జాగ్రత్త తీసుకుంటూన్నారే ...." అన్నాడు విఠల్.
    "నేను లేనిదే ఇందులో చీమ కూడా జొరబడలేదు"అన్నాడు జగదీష్. విఠల్ నవ్వి ఊరుకున్నాడు.
    ఇద్దరూ లోపలకు వెళ్ళారు. జగదీష్ ఆఫీసు గది చేరుకునేలోగా మరో మూడు ముఖ ద్వారాలు తెరవాల్సి వచ్చింది. అన్నింటికీ నంబర్ కోడ్ ఉంది. చివరకు జగదీష్ ఆఫీస్ గదిలోకి వెళ్ళారిద్దరూ.
    ఎయిర్ కండిషన్ డ్ గది. ఎగ్జిక్యుటివ్ టేబులు, చెయిర్ ఉన్నాయి. గది నానుకునే స్పెషల్ రూం వుంది.    
    స్పెషల్ రూం తలుపులు తెరుస్తూ -- "నేను దేశ ద్రోహం చేస్తున్నాను....' అన్నాడు జగదీష్.
    విఠల్ అతడి భుజం తట్టి -- "ఈ భూమి, ఈ గాలి , ఈ నీరు అందరిదీ! దేశం పేరుతొ ఎల్లలేర్పడితే అది రాజకీయ ప్రయోజనాలకు, మనకు దేశంతో నిమిత్తం లేదు. సుఖ జీవనానికవసర పడ్డ ధన సంపాదనే మన లక్ష్యం కావాలి. ప్రతి వ్యక్తీ ఒక దేశం, ఇదే గుర్తుంచుకుంటే నీలోంచి సంకుచిత భావాలు తొలగిపోతాయి..." అన్నాడు.
    జగదీష్ విఠల్ చెప్పిన ప్రకారం లాకర్ నంబర్ టూ తెరిచాడు. అందులో ఇరవై రెండో నంబరు ఫైలు తీశాడు. విఠల్ ఆ ఫైలు తీశాడు. అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన జేబులోని మినీ కెమేరాతో చకచకా ఫైల్లో ని కాగితాలన్నీ ఫోటోలు తీశాడు.
    "థాంక్స్!" అన్నాడు విఠల్.
    జగదీష్ టైము చూసుకుని -- "ఎనిమిదిం పావయింది . మనమిక పోదాం......."అన్నాడు.
    ఇద్దరూ చకచకా బయటకు వచ్చారు.
    అక్కడ స్కూటరు లేదు.
    వాచ్ మాన్ అతడికి సెల్యూట్ కొట్టి -- "విజయ అటో మొబైల్స్ లో పనిచేసే సత్యం అనే కుర్రాడు మీ స్కూటరు తీసుకొని వెళ్ళాడు. మీరు చెప్పారుటగా ...." అన్నాడు.
    సత్యం వాచ్ మాన్ కి బాగా పరిచయం. అతడికి అలవాటే! ముందుగా జగదీష్ చెబుతాడు. అతడు వచ్చి స్కూటర్ తీసుకొని వెళ్ళి చెక్ చేస్తాడు. అయితే తనీ రోజు సత్యానికి చెప్పలేదు. అతడేదో అనబోగా విఠల్ జగదీష్ ని వెనుక నుంచి నెమ్మదిగా గిల్లి తనేమో -- సరే మేము సత్యం దగ్గర్నుంచి స్కూటర్ తీసుకుంటాం లే...." అన్నాడు.
    అక్కణ్ణించి నాలుగడుగులు వేసేక -- "నీ తరపున సత్యానికి మా వాళ్ళే ఈ కబురందజేశారు....' అన్నాడు.
    "ఎందుకని?" అన్నాడు జగదీష్ వాచీ వంక చూసుకుంటూ.
    "కంగారుపడకు-- పక్క సందులో నా మోటారు సైకిలుంది. నేను నిన్ను డ్రాప్ చేస్తాను...." అన్నాడు విఠల్.
    జగదీష్ ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ముందు అర్జంటుగా ఇల్లు చేరుకొని జ్యోత్స్న ని రక్షించుకోవాలని అతడాత్రపడుతున్నాడు.
    పక్క సందులో నిజంగానే ఓ మోటారు సైకిలుంది. విఠల్ దాన్ని స్టార్టు చేశాడు. జగదీష్ వెనకాల యెక్కి కూర్చున్నాడు.
    కొంతసేపటికి మోటారు సైకిలు వేరే దారిలో వేడుతోందని గ్రహించాడు జగదీష్ -- "ఏయ్ -- ఏమిటిది? మా యింటికి దారిటు కాదు...." అన్నాడు.
    మోటారు సైకిలు ముందుకు దూసుకు పోతోంది.
    "ఏయ్ అపు....నిన్నే!" అన్నాడు జగదీష్ ఆత్రుతగా.
    విఠల్ మరో అయిదు నిమిషాల దాకా ఆపలేదు. అప్పుడతడు ఇంజన్ ఆపి స్టాండు వేశాడు.
    "అవతల టైము పరుగెడుతోంది. అపమంటే అపవేం?"
    "ఇప్పుడూ అపకపోదును. పెట్రోలు రిజర్వు లో వుంది. బండి తానంతటదే ఆగిపోయింది..."
    "అయితే...."
    "సరిగ్గా అయిదు నిమిశాలుంది ఎనిమిది నలభై అయిదుకి. ఇప్పుడు నాతొ పోట్లాటే వేసుకుంటావో ....ఇంటికే పరుగేడతావో.....ఆలోచించుకో....ఇది నీ ప్రేమకు పరీక్ష...." అన్నాడు విఠల్ క్రూరంగా నవ్వుతూ.
    "యూ....నిన్ను.....నిన్ను....."
    "ఆవేశపడి టైము వృధా చేసుకోకు...."
    "ఇంక నాకు టైము లేదు...." అన్నాడు జగదీష్.

 Previous Page Next Page