Previous Page Next Page 
సృష్టి పేజి 5


    మీ కీర్తి క్షణాల్లో పత్రికల్లో మార్మోగిపోవాలంటే అది చిట్కా నన్నొక్క విజిలేయమంటారా?" అల్లరిగా అంది కావ్య.


    
    "మెమెంటో యివ్వటం సరే. సదరు ఆర్ట్ గురించి తెలియాలి కదండీ" షేక్ స్పియర్ బ్రదర్ ఇన్ లా ఫేసు పెడుతూ అన్నాడు అభినవ్.

 

    "అఖ్ఖర్లేదండి బాబు. మీరేంటో ఒడ్డూ పోడువూ చెప్పేస్తే ఒకాయన పొగిడేడానికి సిద్ధంగా వుంటాడు. ఇంకొకాయన అశువుగా పంచరత్నాలు కట్టేస్తాడు. ఇంకొకాయన సభాధ్యక్షతకు రెడీ. నేను సరదాగా చెపుతున్నా ననుకున్నారా? డామ్ సీరియస్ -రవీంద్రభారతి మీదొట్టు."

 

    "సారీ  కావ్యగారూ! నేనర్జంటుగా గొప్పవాడ్ని అయిపోవాలని కోరుకోవడంలేదు. మీరెందుకొచ్చారో చెప్పండి" అలా నిష్కర్షగా అడిగేసరికి అసలు విషయంలోకొచ్చేసింది కావ్య.

 

    "మా యాడ్ ఏజెన్సీకి ఆర్ట్  డైరెక్టర్ గా మీరుండాలి. మీకెంత జీతం  కావాలో చెప్పండి."

 

    చాలాసేపు కావ్య కన్విన్స్ చేస్తేనే తప్ప ఆర్ట్ డైరెక్టర్ గా వుండడానికి వప్పుకోలేదు అభినవ్. అదీ గౌరవ డైరెక్టర్ గానే.

 

    "టెన్ టు ఫైవ్ డ్యూటీలంటే నాకు చిరాకు. నా మానసిక అందానికి, నేను వేసుకునే పెయింటింగ్స్ కి ఎక్కడా ఆటంకం కలగదంటే మీరు చెప్పిన పనికి వప్పుకుంటాను."

 

    కావ్య అలాంటి విచిత్రమైన మనిషిని చూడటం అదే ప్రదమం.

 

    "మీ పనులకు ఏ మాత్రం ఆటంకం  కలగాకుండా చూసే రెస్పాన్స్ బిలిటీ నాది. సరేనా?"

 

    ఎట్టకేలకు వప్పుకున్నాడు అభినవ్.

 

    అభినవ్ ని ఒప్పించటం కావ్య మొదటి విజయం.

 

    దానిక్కారణం కావ్య అభినవ్ ని అంతర్గతంగా యిష్టపడటమే. ఆ ఇష్టానికి ప్రత్యేకంగా ఆమెలో నిర్వచనం ఏర్పడలేదు..... అది వ్యామోహమా? ప్రేమా? ఆరాధనా?

 

    ఆ విషయాల గురించి ఆలోచించే తీరిక ప్రస్తుతం ఆమెకు లేదు. అప్పటి నుంచీ ప్రతి రెండు రోజులకొకసారి అభినవ్  ని కలుస్తూనే వుంది కావ్య.

 

    ఒకరోజు కావ్య వెళ్ళిపోయాక లోన గదిలోకెళ్ళిన అభినవ్ ఆ గదిలోంచి ఎప్పుడూ  బయటకు రాని. రాలేని చెల్లి నందిని మంచం దగ్గరకు  వెళ్లి నిలబడ్డాడు.

 

    "ఎవరా  అమ్మాయి? ఫ్రెండా? నీకు ఆడ ఫ్రెండ్స్ వున్నారా?" తనకు ఊహ తెల్సిన  దగ్గర్నుంచి అన్నయ్య  అభినవ్ ఒక ఆడపిల్లతో చనువుగా మాట్లాడటం అదే మొదటిసారి.

 

    "ఏదో  యాడ్  ఏజెన్సీ  పనిమీదోచ్చింది" మాట తప్పించటానికి చూశాడతను.

 

    "నేన్నమ్మను" వీపు వెనక్కి పిల్లోని సర్దుకుని కూర్చుంటూ అంది నందిని.

 

    నందిని కళ్లల్లోకి చూశాడు అభినవ్.

 

    నందినిని, నందిని కళ్లను చూసినప్పుడు చనిపోయిన తల్లే గుర్తుకొస్తుంది. తండ్రి తమ చిన్నప్పుడే చనిపోయాడు. రెక్కలు ముక్కలు చేసుకుని కుట్టుపని చేసి తమని పెంచింది తల్లి. ఇప్పటికీ ఆమె జ్ఞాపకార్థముగా గదిలో ఒక మూల పాత  మోడల్  ఉషామిషన్ బూజు పట్టేసుంది.

 

    నందిని టెన్త్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ లో పాసైంది. ఇంటర్ లో చేరాలి. సెలవుల్లో  తనతోపాటు గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఆర్ట్  ఎగ్జిబిషన్ కు బయలుదేరింది. గోవా  బస్టాండులో బస్సు దిగి నడుస్తున్న సమయం హఠాత్తుగా నడవలేక కూలబడిపోయింది.

 

    అప్పటికప్పుడు నందినిని హాస్పిటల్లో జాయిన్  చేశాడు అభినవ్. పదిహేను రోజులు హాస్పిటల్లోనే వుంది. పదహారో రోజున స్పెషలిస్టు చెప్పిన  మాట విని నిర్ఘాంతపోయాడు అభినవ్.

 

    "ఎక్స్ రేల్లోనూ, బాడీ  స్కానింగుల్లోనూ ఏ ఫాల్టూ కనిపించటం లేదు  అకస్మాత్తుగా బ్లడ్ సరకులేషన్ లో అవరోధం ఏర్పడటం, రక్తం గడ్డకట్టుకుపోవడం జరుగుతోంది. మామూలు డాక్టర్స్  వలన ఈ జబ్బు నయంకాదు. స్పెషలిస్ట్ లకు చూపించటం మంచిది. ముందు జబ్బేమిటో డయాగ్నయిజ్ చేయాలి. మద్రాస్  అపోలో హాస్పిటల్ సూపరింటెండెంట్ నా ఫ్రెండ్. ఆయన్ని కలవండి" అని చెప్పటం జరిగింది.

 

    ఆ తరువాత నందినిని అపోలో హాస్పిటల్ కు తీసికెళ్ళాడు. ఆర్డినరీ టెస్టులకే పదివేల రూపాయలయింది.

 

    జబ్బేమిటో అంతుపట్టటం లేదు. పేషెంటుని నెల రోజులు హాస్పిటల్లో వుంచండి. ఇద్దరు ముగ్గురు స్పెషలిస్టులు డేటుడే డెవలప్ మెంట్స్ అబ్జర్వ్  చెయ్యాల్సి వుంది అని చెప్పటంతో.....

 

    అపోలో హాస్పిటల్లో నెలరోజులు. అందులోనూ ఆర్డినరీ డిసీజ్ కాదు. మొత్తం ఖర్చు ఎంత  అవుతుందో ఎంక్వయిరీ చేస్తే....

 

    లక్ష రూపాయలు అని తేలేసరికి, అభినవ్ కి తన నరాలు చచ్చుబడి పోయినట్లనిపించింది.

 

    లక్ష రూపాయలా? ఎక్కడనుంచి తెస్తాం. ఇప్పుడు నేనేం చచ్చిపోనుగా, ఖరీదైన జబ్బులు డబ్బును  పిండుతాయి తప్ప  బాధలు  పెట్టవట.

 

    లక్ష రూపాయలు విలువచేసే  బ్రతుకేం కాదు నాది. ఇప్పటికే  నేను నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను" నందిని యథాలాపంగా అన్నా, ఆ  మాటల వెనుకున్న విషాదాన్ని, నిర్లిప్తతను గుర్తించలేకపోలేదు అభినవ్.

 

    డబ్బు సంపాదించలేని, చేతకాని ఆర్టుని మాత్రమే తనకిచ్చినందుకు ఆ భగవంతుడ్ని మొట్టమొదటిసారిగా తిట్టుకున్నాడు అభినవ్.

 

    ఏదో డాక్టర్లు నామకా ఇచ్చే మందులు వాడటం తప్ప, నందిని కోసం ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడు తను.

 

    అలాంటి సమయంలోనే ఒకరోజు చెప్పింది కావ్య-

 

    "ఈ రోజు పేపర్  చూశారా? నేషనల్ ఆర్ట్  అకాడమీ వాళ్ళు ఈ ఏడాది కూడా పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టారు. ఫస్ట్ ప్రైజ్ ఒకళ లక్ష రూపాయలు......"

 

    "మీరు పెయింటింగ్ వేస్తారా?" అనుమానంగా  అడిగాడు అభినవ్.

 

    పెద్దగా నవ్వేసింది కావ్య.

 

    "నేను కాదండీ బాబూ! మీ కోసమే చెప్తున్నా. ప్రతి ఏడాది  మా యాడ్  ఏజెన్సీ ఆర్టిస్టులచేత పెయింటింగ్స్ వేయించి కాంపిటీషన్స్ కి పంపడం నా హాబీ. ప్రతి ఏటా మాకు  కన్సొలేషన్ ప్రయిజెస్ వస్తున్నాయి. ఈసారి మీరు  వెయ్యండి పంపుదాం. ఫస్ట్ ప్రైజ్ మనకే."

 

    "నేనా! పోటీలకు వెయ్యడమా? నో! ఈ కమర్షియల్  పోటీలు నాకు ఇష్టం వుండదండీ సారీ."

 Previous Page Next Page