Previous Page Next Page 
సృష్టి పేజి 4


    అందమైన పేరు.

 

    లిపి కన్పించలేదు. బాబు కూడా కన్పించలేదు.

 

    ఎవరికీ ఎవరూ ఏమీ కారు.

 

    కాని అభినవ్ చిత్రించిన  చిత్రంలో వాళ్ళిద్దరూ అద్భుతమైన మాతృ ప్రేమకు ఉపయోగపడిన మోడల్స్!

 

    ఈ చిత్రాన్ని చూసి కావ్య ఏమంటుందో!

 

    ఆ ఆలోచన రావడంతోనే హుషారుగా స్టేషన్ బయటికొచ్చి ఆటో  ఎక్కాడతను.

 

    ఆటో ఖైరతాబాద్ వెళ్ళటానికి అరగంట పట్టింది.

 

                                            *    *    *

 

    ఆటో దిగి  ఇంట్లో కొస్తున్న లిపిని చూసి వంటగదిలోంచి బైటకొచ్చిన లిపి తల్లి రాజ్యం ఎదురెళ్ళి సూట్  కేస్  అందుకుంది.

 

    "తమ్ముడు భాస్కరం ఎలా వున్నాడే? ఏం  చేస్తున్నాడు?"

 

    ఆ ప్రశ్నకు తలెత్తి అసహనంగా తల్లివైపు చూసి కుర్చీలో కూర్చుంది లిపి.

 

    "ఇంటర్వ్యూ  కెళ్ళొచ్చిన  దానిని  మొదట వెయ్యాల్సిన ప్రశ్న ఇంటర్వ్యూ ఎలా అయింది? ఉద్యోగం  వస్తుందా అని. రెండో ప్రశ్న భాస్కరం గాడి గురించి."

 

    "అవునమ్మాయ్....! వాడు సిన్మాల్లో చేరానన్నాడు. ఏం చేస్తున్నాడేంటి?" ఉత్సాహం  చంపుకోలేక అడిగాడు తండ్రి  తిరుమలరావు.

 

    "నువ్వు కూడా ఆఖరికి డొంకతిరుగుడుగా తమ్ముడు గురించే అడిగావు నవ్వుతూ తండ్రివైపు చూసింది లిపి.

 

    "మగపిల్లాడు...... అందునా ఒక్కగానొక్కడు..... అడగవేవిటే చాదస్తం కాకపొతేనూ! చూడూ.... అన్ని విషయాలు తిన్నగా చెప్పు. పొద్దున్నే నాకు బి.పి. తెప్పించకు" కాఫీ గ్లాసుని చేతిలో పెడుతూ అంది రాజ్యం.

 

    "భాస్కరంగాడు స్టేషన్ కొచ్చాడు. విల్లివాకంలో చిన్న రూమ్! అక్కడ తెలుగువాళ్ళే ఎక్కువమంది వుంటార్లే! ఈ మధ్యే స్వంతంగా మేకప్  వెయ్యడం నేర్చుకున్నాట్ట ఫరవాలేదు! నెలకు మూడు నాలుగు వేలు సంపాదిస్తున్నాడు" చెప్పింది లిపి.

 

    "నాలుగువేలే....! అలాంటప్పుడు మనకో వెయ్యి పంపిస్తే ఏం పోయిందే వాడికి? అడగలేకపోయావూ?" కోపంగా అంది తల్లి.

 

    "ముందు దాన్ని చెప్పనీవే! చెప్పు తల్లీ! నీ ఇంటర్వ్యూ గురించి చెప్పు" తండ్రి అడిగాడు.

 

    "ఇంటర్వ్యూ బాగానే  జరిగింది. డాక్టర్  గారికి ఏభై ఏళ్ళుంటాయి. నెలకో పదిహేను వందలు, స్టార్టింగ్ లో యిస్తానన్నాడు. నర్సింగ్ హోమ్ పెద్దదే. వారం రోజుల్లో వచ్చి చేరమన్నాడు" మోమును చీర  చెంగుతో తుడుచుకుంటూ అంది లిపి.

 

    "మన రోజులే బాగుంటే ఆ క్లినిక్కో, నర్సింగ్ హోమో మనమే పెట్టుకుంటే డాక్టరీ చదివిన పిల్ల వుద్యోగానికెళ్ళే బాధ తప్పేది కదా? ముందు జాగ్రత్తతో పనులు చేయకపొతే పిల్లల బ్రతుకులు ఇలాగే చల్లారిపోతాయి" భర్తవేపు ఓరకంట కోపంగా చూసి గుమ్మం మీద కూర్చుంది రాజ్యం.

 

    దానికేం బదులివ్వలేదు తిరుమలరావు.

 

    "పోనీలే జాబ్  వచ్చినట్టే కదా! కలో గంజో అక్కడే అందరం కలిసి  తాగుదాం. మనకీ మంచి రోజులు రాకపోవు" కాఫీ  కప్పుని నేలమీద  పెడుతూ అన్నాడు తిరుమలరావు.

 

    "అయితే ఇల్లు ఖాళీ చేసేస్తామని ఇల్లుగలాయనతో చెప్పేమంటావా?" నిర్ధారణ కోసం అడిగింది రాజ్యం.

 

    "నాలుగురోజుల్లో ఖాళీ చేసేస్తామని చెప్పు" లిపి అంది వెంటనే.

 

    "చెప్పటం చెప్పేస్తాను. రెండు నెలల ఇంటద్దె బాకీ. వెచ్చాలవాడికి అయిదువేలు బాకీ. వేటికవి అలా వుండగా ఎలా వెళ్ళిపోతామే?"

 

    లిపి హేండ్ బ్యాగ్ లోంచి నోట్ల దొంతరను తీసి తండ్రి చేతుల్లో పెట్టింది.

 

    "ఇంత డబ్బెక్కడిది?" ఆశ్చర్యంగా అడిగాడాయన.

 

    "పదివేలు భాస్కరం యిచ్చాడు. అప్పులు తీర్చేసి  వెంటనే వచ్చేయ మన్నాడు" చెపుతూ లోన గదిలోకి నడిచింది లిపి.

 

    భార్యా భర్తలిద్దరూ  ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ మొహాలు ఆనందంతో విప్పారాయి.

 

    కావ్య అయిదడుగుల నాలుగంగుళాల ఎత్తుంటుంది. అందంగా, కట్ చేసుకున్న బాబ్డ్ హెయిర్, చురుకయిన కళ్ళు, పల్చటి పెదిమలు, ఎర్రటి  శరీర ఛాయ, నాజూకయిన శరీరం..... ఆమెను చూస్తూనే ఎవరికైనా ఆమె తన అందంపట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందో యిట్టే అర్థం చేసుకోగలరు.

 

    తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ ఫ్లూయంట్ గా మాట్లాడగలదు. ఎగ్జిక్యూటివ్ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి ఆమెలో.

 

    సృజ ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సీ హైదరాబాద్ బ్రాంచ్ కి కావ్య చీఫ్  ఎగ్జిక్యూటివ్..... ఆ ఏజెన్సీ హెడ్ ఆఫీస్ మద్రాసులో వుంది. ఆరు  నెలల క్రితం కావ్య ఒకే వీధిలో వుండే అభినవ్  ని పరిచయం చేసుకుంది.

 

    అభినవ్ ని మొట్టమొదటిసారి చూసినప్పుడే అతడిలోని విలక్షణమైన వ్యక్తిత్వాన్ని, ప్రతిభను  పసికట్టింది కావ్య.

 

    ఏం గురూజీ! మసిబొగ్గుల మధ్య మణిలా యిలా వుండిపోయారేంటండీ? మీరు ఎంత గొప్ప ఆర్టిస్టో మీకు తెలుసా?" గోడలకున్న పెయింటింగ్స్ రెప్పలార్పకుండా చూస్తూ అంది కావ్య.

 

    "నాకు తెలుసు. ప్రపంచానికి తెలీదు" మెల్లగా నవ్వుతూ అన్నాడు అభినవ్.

 

    అభినవ్ ని చూడగానే ఆమెను ఆకర్షించింది ఒక్క అతని వ్యక్తిత్వమే కాదు. స్ఫురద్రూపం, విలక్షణత్వం.

 

    "ప్రపంచంలో బ్రతుకుతెరువు తెలిసిన ఆర్టిస్టులందరూ ఏం చేస్తారో తెల్సా? ఆర్ట్ ని నమ్ముకుని బ్రతుకుతారండీ బాబూ. ఆర్ట్ ని అమ్ముకుని బ్రతుకుతారు. మీ ఆర్ట్ లో ఏముందో మీరే చెప్పుకుని తిరగాలి. లేకపొతే మైక్ పట్టుకుని  చెప్పేవాళ్ళు చాలా మందుంటారు. వాళ్లను పట్టుకోవాలి" కన్రెప్పల్ని చిత్రంగా కదుపుతూ అంది కావ్య.

 

    "నా ఆర్ట్ లో ఏముందో మైక్  పట్టుకుని చెప్పేవాళ్ళు చాలామంది  వుంటారా? నాకు తెలీదే? ఎక్కడుంటారు?" సహజంగా , అమాయకంగా అడుగుతుంటే నవ్వకుండా వుండలేకపోయింది కావ్య.

 

    "అయ్యో పూర్  గురూజీ! హైద్రాబాద్, సికింద్రాబాదుల్లో కళాసేవ  చేస్తామని బోర్డులు పెట్టుకుని చందాల  పుస్తకాలు పట్టుకుని మెమెంటోల్ని గుడ్డసంచీలో వేసుకుని చాలామంది ప్రతీ గల్లీల్లో నుంచుంటారు. వాళ్ళ పనేంటో తెల్సా? గల్లీల్లో, మారుమూల వున్న ప్రతిభను జుత్తుపట్టుకుని పైకి లాగడం, వేదికలెక్కించడం- వాళ్ళచేత పద్యాలూ, రాగాలూ తీయించడం. దండేసి , దండం పెట్టేసి, మెమెంటో యిచ్చేసి ఆ వీధి చివరన వదిలేయడం.

 

 Previous Page Next Page