అనూరాధ పి.డి.యస్.యు మెంబరా?....ఆశ్చర్యంగా పుస్తకం తెరిచింది. 'మారుర్' అని సంతకం వుంది. 'సంకెళ్ళలో భారతదేశం' ....ప్రభుత్వం బ్యాన్ చేసిన పుస్తకం... పుస్తకం అంతా చదివినట్లు అక్కడక్కడా, కొన్ని వాక్యాలు అండర్ లైన్ చేసున్నాయి. అక్కడక్కడా కామెంట్స్ కూడా వున్నాయి. అది రాధ రైటింగ్ కాదు. తెలుగు భాషమీద పూర్తి అధికారం వున్న వ్యక్తిది. ఎవరీ మధు? అనూరాధ బాయ్ ఫ్రెండా?
కిరణ్మయి అన్నీ సర్దేసి, ఒక నవల తీసుకోబోతూ చప్పున ఆగింది!
అల్మైరాలో ఒక పక్కగా రాధ బ్యాగ్ వుంది. అపురూపలక్ష్మి గదితాళం అందులో వుందేమో!
కిరణ్మయి చప్పుడు కాకుండా బ్యాగ్ తీసింది. నిద్రలో అనూరాధ అటునుంచి ఇటు దొర్లింది. కిరణ్మయికి తన గుండెల చప్పుడు తనకే వినబడుతూంది. ఎప్పుడూ చేయనిపని అది. చేతులు వణుకుతున్నాయి. బ్యాగ్ లో పుస్తకాలు, మరేవో కాగితాలు తప్ప పనికివచ్చేవి మరేవీ లేవు. అందులో ఒక ఇన్ లాండ్ లెటర్ మీద ఆమె దృష్టి పడింది. ఫ్రం అడ్రస్ దగ్గిర "అపురూప" అని వుండటంతో ఆమెలో ఉత్సుకత ఎక్కువైంది. అనూరాధ హాస్టల్ నుంచి శలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు అపురూపలక్ష్మి ఇక్కడనుంచి వ్రాసిన వుత్తరం అది.
నిద్రపోతూన్న అనూరాధకి మెలకువ రాకుండా జాగ్రత్త పడుతూ లైటుదగ్గిర చేరి ఆ వుత్తరాన్ని చదవసాగింది కిరణ్మయి-
"అనూ
నీ వుత్తరం అందింది. మీ నాన్నగారికి కులాసా అని తెలిసి సంతోషించాను. నేను మా వూరు వెళ్ళలేదు. మనసేం బావోలేదు. అక్కడ అమ్మకి జ్వరమట-అయినా వెళ్ళాలనిపించటంలేదు.
అనూ,
నేను నిన్నెంత మిస్ అవుతున్నానో ఎలా చెప్పను? నీ కెన్నో చెప్పాలనివుంది. కానీ ఉత్తరంలో వ్రాయాలంటే భయంగా వుంది. ఈ పదిహేను రోజుల్లో జరగకూడనివి జరిగిపోయాయి. 'రోహిణి' వల్ల నేను మోసపోయానని అనటంలేదు. జరిగినదాంట్లో నా ప్రమేయం కూడా వుంది. నాలుగురోజుల్లో నాన్నగారు కూడా వస్తున్నారు. ఆయనకు నా మొహం ఎలా చూపించను? నన్ను చూడగానే విషయం కనిపెట్టేస్తారేమో. అలా జరిగితే మాత్రం నేను భరించలేను. అందులోనూ 'రాగిణి' కూడా నన్ను మోసం చేసింది.
ఒకప్పుడు నాన్నగారు వస్తున్నారంటే, సంబరపడుతూ క్షణాలు లెక్కపెట్టేదాన్ని. ఆయన రాకపోతే బావుండుననిపిస్తోంది. ఆయన వచ్చేలోపులో నువ్వు రాకూడదూ. నువ్వు పక్కనుంటే నాకు ధైర్యం. ఆ రోజు నువ్వు అన్నావు- 'ఈ సమయంలో నువ్వు నా పక్కన వున్నావు కాబట్టి బ్రతికాను' అని. ఆ రోజు నేను అనుకొన్నాను. 'నేను చేసిందేమిటా? తను కృతజ్ఞతతో అంటోందిగానీ' అని! కానీ.....ఇప్పుడనిపిస్తోంది! ఈ సమయంలో నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని. ఈ ఉత్తరం అందగానే బయల్దేరి వచ్చెయ్యి.
నీ
అపురూప."
కిరణ్మయి తిరిగి ఉత్తరం లోపల పెట్టేసింది.
రోహిణి ఎవరు?
రాగిణి ఎవరు?
... తమ బోయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకునేటప్పుడు అలా 'కోడ్'లో ఆడపిల్లల పేర్లు వ్రాసుకోవడం పరిపాటి. అలాటిదేనా ఇది?
'రాగిణి-రోహిణి'ల్లో ఒకరు రాయన్న! రెండోది ఎవరు?
అప్పటికప్పుడే అనూరాధని నిద్రలేపి అడగాలన్న కోర్కెని అతి బలవంతంమీద ఆపుకొన్నది. బ్యాగ్ ని వున్నచోట పెట్టేసి పక్కమీద పడుకోబోయి చప్పున ఆగింది.
అనూరాధ తలదిండు క్రింద నుంచి కనబడుతూంది-
తాళాలగుత్తి!!!
గుండెల్లోంచి ఉద్విగ్నత బైటకి వెల్లువలా తన్నుతూండగా, కంపిస్తూన్న చేతుల్తో, రాధకి నిద్రాభంగం కలుగకుండా జాగ్రత్తగా తాళాల్ని దిండు క్రిందనుంచి బయటికి లాగింది.
అందులో వుంది పదమూడో నెంబరు గది తాళంచెవి.
అర్దరాత్రి పన్నెండు గంటలు కావొస్తూండగా కిరణ్మయి మొట్ట మొదటిసారి అపురూపలక్ష్మి గదిలో ప్రవేశించింది.
--* * * *--