కలవరిస్తున్నట్లు అన్నాడు విశ్వనాధం.
"వరలక్ష్మి - నా ప్రాణానికి ప్రాణం నువ్వు! కానీ నేను ఆ పాపిష్టి డబ్బుని ఇంటికి తెచ్చాక నీకు నేనంటే అనుమానం కలిగింది. ఆ పాపపు సొమ్ము మనకి అచ్చిరాదనీ, అది న్యాయంగా ఎవరికి చెందాలో వారికి అప్పగించి రమ్మని నా చెవిలో ఇల్లుకట్టుకుని పోరావు. కానీ నీ మాటలు పెడచెవిన పెట్టాను. అందువల్ల నీకు నేనంటే అయిష్టం కలిగింది. అప్పటినుంచి నాతొ ఎడమొహం ఉండటం మొదలెట్టావు. అయినా కూడా భూదేవికి ఉన్నంత ఓర్పు నీకు ఉండటం వల్ల నన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోలేకపోయావు.
"వరలక్ష్మి! ధారాళంగా డబ్బు వుంటే తప్ప సుఖం వుండదని భ్రమపడ్డాను నేను. డబ్బు ద్వారా సుఖాన్ని పొందవచ్చునన్న ఆశ ఎండమావిలో నీళ్ళు తాగవచ్చునన్న అడియాసలాంటిదని తేలిపోయింది. నిజానికి ఆ పాపిష్టి డబ్బు నాచేతికి వచ్చినప్పటి నుంచే నా కంటికి నిద్ర కరవయింది. వరలక్ష్మి......... అప్పటినుంచే నా రెండు కళ్ళలాంటి నువ్వూ, హరీన్ నాకు దూరమైపోయారు.
"ఈ భాధలను మరచిపోవాలంటే మరింత డబ్బు సంపాదించడం ఒక్కటే మార్గం అని నమ్మకం ఏర్పడింది నాకు. అందుకని మరికొన్ని వ్యాపారాలు పెట్టాను. ఒక లేడీ సెక్రటరీని పెట్టుకున్నాను. తనతో కులకడం సాగించాను. ఉన్నదంతా దానికే దోచిపెట్టడం మొదలెట్టాను.
"తనకోసం నేను అంతచేసినా, ఆ వగలాడి నన్ను కుక్కకన్నా హీనంగా చూసింది. చివరికి ఇప్పుడు నన్ను చంపించి, ఆస్తి అంతా చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో వుంది తను.
"వరలక్ష్మి - నేను ఈ జీవితంలో డబ్బు ఒక్కటి మాత్రమే సంపాదించగలిగాను. అది తప్ప మిగతా సర్వస్వం కోల్పోయాను వరలక్ష్మి ! సుఖశాంతులు దూరమైపోయాయి నాకు. కట్టుకున్న భార్యకి, నేనంటే జుగుప్స కలిగింది. ఉంచుకున్న ప్రియంవద నన్నొక అడ్డంకిగా భావించి తొలగించుకోవాలని చూస్తోంది. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న నా కొడుకే నా ప్రధమ శత్రువుగా మారాడు. ఉల్ఫాగా వచ్చిన డబ్బుతో, అన్ని రకాల వ్యసనాలకూ బానిసనైపోయాను నేను. రోగంతో వళ్ళంతా పుచ్చిపోయింది. అశాంతితో నా మనసు చచ్చిపోయింది.
"ఇంక నేను బతికి వృధా వరలక్ష్మి! నాలాంటి పాపి బతికి ఉండటం వాళ్ళ భూమాతాకి భారం తప్ప మరో ప్రయోజనం లేదు" అన్నాడు విశ్వనాధం.
"దయచేసి అలా మాట్లాడకండి!" అంది వరలక్ష్మి వివశురాలయి రోదిస్తూ.
నిర్జీవంగా నవ్వాడు విశ్వనాధం.
"భయపడకు వరలక్ష్మి - అప్పుడే చావను నేను. పాపీ చిరాయు అని వినలేదా? కానీ చావు ముంచుకొచ్చేలోగా ఒక పనిచెయ్యాలి నేను."
"ఏమిటది?"
"ఈ ఆస్తి అంతా న్యాయంగా ఎవరికి చెందాలో వారికే అందజేస్తాను . అప్పటిదాకా నిద్ర ఉండదు. నాకు నిష్కృతి వుండదు!"
తటపటాయిస్తూ అడిగింది వరలక్ష్మి.
"అసలు ఇంతకీ ఏం జరిగిందండీ? హటాత్తుగా ఎలా వచ్చింది మీకు అంత డబ్బు? ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నా చెప్పనేలేదు మీరు!"
"బాబూగారూ!" అన్నాడు - అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న తోటమాలి "ఆ మహాతల్లి మళ్ళీ దిగాబదేలోగా మీరిక్కడ నుంచి ఎల్లిపోవడం మంచిది బాబూ!"
అతని మాటలు విని తెప్పరిల్లుకొని అన్నాడు విశ్వనాదం.
"వరలక్ష్మి - ఎలాగైనా నన్ను రామాపురం చేర్చగలవా వరలక్ష్మి!" అన్నాడు ఆర్తిగా.
విస్తుపోయి చూసింది వరలక్ష్మి.
"రామాపురమా - ఎందుకండీ? అయినా ఇంత అనారోగ్యంతో ఉన్న మీరు అంతదూరం ఎలా ప్రయాణం చేస్తారు.వద్దండీ!"
"చెప్పాను కద వరలక్ష్మి! రామాపురం చేరేలోగా నా ప్రాణం పోదు - పోనివ్వను నేను"
"ఎవరున్నారండీ ఆ ఉళ్ళో?"
"ఒకప్పుడు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్నారో లేదో తెలియదు"
"ఎవరండీ?"
"బాబూ - మీరు తొందరగా ఎల్లిపోవాలి" అన్నాడు తోటమాలి, మళ్ళీ హెచ్చరిస్తూ.
"పద వరలక్ష్మి! జరిగినదంతా పూసగుచ్చినట్లు చెబుతాను. కానీ ఇక్కడ కాదు. నా ఘాతకం ఏ కుటుంబం నాశనమైపోయిందో, వాళ్ళ ముందే చేతులు జోడించి నిలబడి, అక్షరం పొల్లుపోకుండా చెబుతాను" అని అడుగు ముందుకు వెయ్యబోయి, మళ్ళీ ఆగాడు విశ్వనాధం.
"వరలక్ష్మి.....మరి రైలు ఖర్చులకి డబ్బులు - " అని నాన్చేశాడు.
సుజలనయనాతో తన చేతులకి ఉన్న రెండు బంగారు గాజుల వైపు చూపించింది వరలక్ష్మి.
"ఇవి మీరు మీ కష్టార్జితంతో కొని పెట్టినవే! అందుకే వీటిని ఇంకా పెట్టుకునే ఉన్నాను. వీటిని కుదవపెడితే రైలు చార్జీలకు సరిపడే డబ్బు రాకపోదండీ!" అంది.
వెంటనే ఆమె చేతుల్లో మొహం దాచుకుని, భోరున విలపించడం మొదలెట్టాడు విశ్వనాధం.
అంతలోనే దూరం నుంచి ప్రియంవద కారు హరన్ వినబడింది.
* * *
హరీన్ ఇంట్లో -
రైటర్ వనమాలీ కధ చెబుతూ ఉంటే జాగ్రత్తగా వింటున్నారు హరీన్ , కరుణా.
"దాదాపు పదేళ్ళ క్రితం ఒకరోజున నేను మంచి కధ ఒకటి రాయదలుచుకుని, ఏకాంతాన్ని వెతుక్కుంటూ మా ఊరికి దగ్గరలోనే ఉన్న నదీ తీరానికి వెళ్ళాను. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. ఫైవ్ స్టార్ హోటల్లో రూం బుక్ చేసి, స్కాచ్ విస్కీ పక్కన బెడితే తప్ప రాయడానికి మూడ్ రాదు అన్న విలాసాలు అప్పట్లో నేను ఎరగను. చిరుగులు పడ్డ లాల్చి పైజమా పెదిమల మధ్య చార్మినార్ సిగరెట్టు , జేబులో కలం, చేతిలో కాగితాలు, ఆకలివేస్తే సింగిల్ చాయ్ -
"అదీ అప్పట్లో నా స్థితి"
"నా ఆలోచనలే తప్ప మరో ఆస్తి ఉండేది కాదు నాకు. కానే నేను సృష్టించి మంచి సాహిత్యం అంతా ఆకలిరోజుల్లోనే. ఇప్పుడు నేను రాస్తున్నదేముంది? అంతా కమర్షియల్.
"సరే...నదీ తీరానికి వెళ్ళాను. అక్కడికి దగ్గరలోనే ఒక రైలు బ్రిడ్జి ఉంది. అక్కడ కూర్చుని తలవంచుకుని రాసుకుంటున్నాను నేను. అదే సమయంలో ఒక రైలు బ్రిడ్జి మీద నుంచి వెళ్ళింది అప్పుడు -
"హటాత్తుగా ఎవరో ఒక మనిషి రైల్లో నుంచి నదిలోకి పడిపోయినట్లు అనిపించింది నాకు.
"నేను తలెత్తి చూసేసరికి రైలు వెళ్ళిపోయింది. నది నిర్మలంగా ఉంది.
"నేను చూసింది నిజమేనా లేక అది నా భ్రమా అన్న అనుమానం కలిగింది నాకు.
"అదేమిటో తెల్సుకోవడానికి గానూ లేచి నిలబడ్డాను నేను. అల్లంత దూరంలో ఎవరో మనిషి కొట్టుకుపోతున్నట్లు తోచింది.
"నీళ్ళ అంచునే కొద్ది దూరం పరిగెత్తాను నేను. కొద్ది క్షణాల తర్వాత ఆ మనిషి ఇంక కనబడలేదు. ఈ విషయం ఎవరితోనన్నా చేబుదమన్నా అక్కడెవరూ లేరు. నదీ తీరమంతా నిర్మానుష్యంగా ఉంది.
"ఇంక ఆ తర్వాత అక్కడ కూర్చుని రాసుకోలేకపోయాను నేను. వికలైపోయిన మనసుతో ఇంటికి వచ్చేసి, ఈ విషయం నా భార్యకి చెప్పాను. వెంటనే ఈ సంగతి పోలీసులకి రిపోర్టు చేద్దామన్నాను.
"అది విని నెత్తి నోరూ కొట్టుకుని మొత్తుకుంది నా భార్య. అసలే బతకలేక బతుకుతున్న బక్కప్రాణులం మనం. ఓసారి పోలీసు స్టేషనులో అడుగు పెడితే కేసనీ అదనీ ఇదనీ వాళ్ళు మనని చెండుకుతింటాను. ఆ ఆతర్వాత ఇంక పోలీసు స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేక మన పనయిపోతుంది. పిల్లలు అన్యాయమైపోతారు. అందుకని అలాంటి పిచ్చిపనులేం చెయ్యకండి." అని ప్రాధేయపడింది నన్ను.
"ఆమె చెప్పింది నిజమే! పోలీసు కేసులలో ఇరుక్కుపోతామేమో అన్న భయం కొద్ది యాక్సిడెంట్లు చూసినా, ఘోరాలూ నేరాలూ చూసినా కూడా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నారు జనం. అలా ఉంది ఈ వ్యవస్థ.
"ఆమె మాటలువిని ఆలోచనలో పడ్డాను నేను. ఆ తర్వాత మూడు రోజులపాటు కనిపించిన ప్రతి వార్తాపత్రికా కొని చదివాను.
"చిత్రంగా ఏ పేపర్లోనూ ఆ సంఘటన గురించిన వార్తే లేదు."
అంటే -
"నేను చూశాననుకుంటున్నదంతా కేవలం నా భ్రమే అయివుండాలి. మళ్ళీ అనుమానం మొదలయింది నాకు. రైల్లో నుంచి మనిషి పడటం నిజమా లేక అదంతా నా భ్రమా?
"కానీ ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళకీ కట్టినట్లే కనబడుతోంది. మనిషి నిజంగా పడివుంటాడనే ఇంకా నా నమ్మకం!
"మనిషి నిజంగానే పడివుంటే -
"అతను కాలుజారి పడ్డాడా, తనే ఆత్మహత్య చేసుకోవడానికి దూకేసి ఉంటాడా? లేకపోతే అతన్ని ఎవరైనా హత్య చేసి నదిలోకి నేట్టేశారా?
"ఆత్మహత్య అయి వుంటే అందుకు కారణమేమి అయివుంటుంది?
"అదిగనక హత్య అయి ఉంటే ఆ హత్య ఎవరు చేసి ఉంటారు? ఎందుకు?
"ఇలా ఎన్నెన్నో ఆలోచనలు కందిరీగల్లా నా మనసులో ముసిరేసి , నాకు ఆత్మశాంతి లేకుండా చేసేవి.