"ఈ ఆలోచనలన్నిటికీ రూపం ఇస్తూ ఒక కధ రాయాలని మొదలెట్టాను నేను. దానికోసం ఎన్నో రోజులు. ఎన్నో రాత్రులు శ్రమించాను.
"కానీ ఎంత ప్రయత్నించినా కూడా నా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. నా కధకి సరైన రూపం కుదరలేదు.తగిన ముగింపూ దొరకలేదు.
"అందుకని ఆ కధని అలా అర్ధంతరంగా, అసంపుర్ణంగానే వదిలెయ్యావలసి వచ్చింది" అన్నాడు వనమాలీ మరో సిగరెట్ వెలిగిస్తూ.
35
"ఆ తర్వాత ఏమయింది?" అన్నాడు హరీన్ ఉత్సుకతతో.
"కధని అక్కడ ఆపేసినా, దాన్ని గురించి చాలా రకాలుగా ఆలోచించానని చెప్పాను కదా? చాలా వర్షన్స్ రాశాను. ఒక వర్షన్ లో ఆ పడిపోయిన వ్యక్తీ మధ్యతరగతి కుటుంబీకుదనీ రాశాను. అతనికి పెద్ద సంసారం. తలకు మించిన అప్పులు, పెళ్ళి కెదిగిన కూతురు. రోగిష్టి భార్య.
"ఈ ఈతి బాధలన్నీ తట్టుకోలేక అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు."
"నో!" అని పెద్దగా అరిచింది కరుణ.
రైటర్ వనమాలీ, హరీన్ ఆమె వైపు చిత్రంగా చూశారు.
సంభాళించుకుని చెప్పడం మొదలెట్టింది కరుణ.
"ఆ మనిషి బీదవాడయి ఉండదు. నా ఉద్దేశంలో ఆ చనిపోయిన మనిషి చాలా ఘరానా కుటుంబీకుడయి ఉంటాడు. అయన దగ్గర ఒక ఖరీదైన బ్రీఫ్ కేసు వుంది. దాని నిండా కట్టలు కట్టలుగా డబ్బు వుంది. ఆ డబ్బు అతని బిజినెస్ కి సంబంధించినది. ఆ డబ్బు చూసి కన్ను కుట్టింది. తోటి ప్రయాణికుడు ఒకడికి. ఆ పెద్దమనిషిని అమానుషంగా నదిలోకి నెట్టేసి, ఆ డబ్బు తీసుకుని పారిపోయాడు.
శవం కూడా కనబడకుండా పోవడంతో, ఆ వ్యక్తీ తాలూకు బిజినెస్ పార్ట్ నర్స్ అయన తమ డబ్బు కూడా తీసుకుపారిపోయాడని భ్రమపడ్డారు. తమకు రావలసిన బకాయిల కింద అయన ఆస్తిని జప్తు చేయించారు. చివరికి ఇల్లు కూడా వేలం వేయించారు.
"ఆయనకి భార్య, ఒక కూతురూ వున్నారు. నిన్నటిదాకా ఉళ్ళో అతి ఘరానాగా బతికిన కుటుంబం వాళ్ళది. ఒక్కసారిగా కలిగిన ఆ షాక్ కి ఆమె తట్టుకోలేకపోయింది. చనిపోవాలన్న కోరిక తీవ్రంగా కలిగింది ఆమెకి. కానీ తన కూతురి కోసం బతకవలసి వచ్చింది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో చాకిరీ చేసి, ఆర్నెల్ల పాటు కూతురిని పోషించిన తర్వాత మనోవ్యాధి ఎక్కువైపోయింది ఆమెకు. మంచం పట్టి, మరణించింది.
"దానితో పూర్తిగా దిక్కులేనిదయిపోయింది ఆ పిల్ల. అప్పుడు దూరపు బంధువులెవరో దేవదూతల్లాగా దిగారు. ఆ అమ్మాయిని తామే పెంచుకుంటామని చాలా నమ్మకంగా చెప్పారు.
"కానీ వాళ్ళ అసలు ఉద్దేశం వేరే వుంది. ఆ పసిపిల్లని పనిపిల్లగా ఉపయోగించుకోవచ్చునని వాళ్ళ ఆశ.
"ఆ బంధువుల ఇంట్లో ఆ అమ్మాయి అష్టకష్టాలు పడుతూ పెరిగింది. ఆ అమ్మాయికి కడుపునిండా తినడానికి తిండి వుండేది కాదు. కట్టుకోవడానికి సరైన బట్ట కూడా ఉండేది కాదు. ఇంటెడు పనీ తనే చెయ్యవలసీ వచ్చేది.
"ఆ హంతకుడు పాపపు సొమ్ముతో మిద్దెలు కట్టించుకుని వుండవచ్చు. భూమీ, పుట్రా , నగ నట్రా కొని వుండవచ్చు. అయినా అతనికి ఏనాడో ఓనాడు ఈ ఆడపిల్ల ఉసురు తగలకపోదు" అంది అక్కసుగా.
"తగిలి తీరుతుంది" అన్నాడు హరీన్ నిదానంగా. "నా ఉద్దేశ్యంలో ఆ హంతకుడు ఆ డబ్బు తీసుకుని పారిపోయాడు. ఉన్న ఊరు మార్చేశాడు. కొత్త ఉళ్ళో భూములూ, గట్రా కొన్నాడు. వ్యాపారాలు పెట్టాడు.
"ఇదంతా చూసి అతని భార్యకు అతని మీద అనుమానం కలిగింది. "ఆ పాపపు సొమ్ము మనకి అచ్చిరాదు. అది న్యాయంగా ఎవరికి చెందాలో వారికే ఇచ్చేసి రండి ' అని ప్రాధేయపడింది. కానీ అతను ఆమె మాటలని పెడచెవిన పట్టాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ఎడమొహం పెడమొహం.
" ఆ గొడవల నుంచి మర్చిపోవడానికిగానూ అతను మరింత డబ్బు సంపాదించాలనుకున్నాడు. మరిన్ని వ్యాపారాలు పెట్టాడు. ఒక లేడీ సెక్రటరీని పెట్టుకున్నాడు. ఆమెతో కులకడం మొదలెట్టాడు. చివరికి ఆమెని తన రెండో భార్యగా చేసుకున్నాడు.
"ఇకపోతే అతని కొడుకుది చాలా చిత్రమైన స్వభావం. ఆ పిలవాడు ఏ విషయమూ కూడా తనంతట తాను తెలుసుకుని నిర్ధారించుకోకుండా నమ్మడు.
"నిన్నటిదాకా ఓ పెన్సిలు ముక్క కొనిపెట్టమంటే డబ్బులేదని విసుక్కున్న తండ్రి ఈవాళ ఇంత ధారాళంగా ఎలా ఖర్చు పెడుతున్నాడా అని ఆశ్చర్యం కలుగుతుంది అతనికి. తండ్రి ఏదో ఘాతకం చేసి వుంటే తప్ప ఒక్కసారిగా అంత డబ్బు రాదని అతనికి అర్ధం అవుతుంది.
"తండ్రి ఇదివరకు పదేపదే అన్న మాటలు అతనికి గుర్తొస్తాయి. "ఈ డబ్బు ఇబ్బందులలో నుంచి బయటపడాలంటే ఏ బ్యాంకునన్నా దోచాలి లేదా బాగా డబ్బున్నవాడి తల బద్దలుకొట్టి డబ్బెత్తుకోచ్చేయ్యాలి" అని.
"తన తండ్రి ఈ రెండు పనుల్లో ఏదో ఒకటి చేసి ఉంటాడనీ అనుకుంటాడు ఆ కుర్రాడు. అతనికి తండ్రి అంటే వైముఖ్యం కలుగుతుంది."
"తను సంపాదించిన డబ్బుతో తన కొడుకుని పెద్ద చదువులు చదివించి ఐ.ఏ.యస్. ఆఫీసర్ ని చెయ్యాలని ఆ హంతకుడి కోరిక. కొడుకు బ్రిలియంట్ కుర్రాడే! అయినా చదువు అంటే అసలు ఇంట్రస్టు లేదు. అతనికి నాటకాలంటే ప్రాణం. పరిషత్తులలో ఫ్రైజులు కొడుతూ వుంటాడు.
"అతి కష్టం మీద టెన్త్ క్లాస్ దాకా రాగాలుగుతాడు ఆ కొడుకు. అక్కడ అతని చదువు డింకీలు కొట్టడం మొదలవుతుంది. టెన్త్ క్లాస్ రెండుసార్లు ఫేయిలవుతాడు.
కొడుకు మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న ఆ తండ్రికి ఒళ్ళు మండిపోతుంది. కొడుకుని చడామడా తిడతాడు. మాటామాటా పెరుగుతుంది. ఆవేశంలో కొడుకు మీద చెయ్యి చేసుకుంటాడు అతను.
"పౌరుషం పొడుచుకొచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు కొడుకు.
"ఒకసారి ఇల్లు వదిలి వెళ్ళిపోయాక , ఇంక అతను తనని తానే పోషించుకోవాలి.
"అందుకుగానూ అతనికి చేతనయిన విద్య ఒక్కటే!
"అదే నటన!
"అతను స్టుడియోల చుట్టూ , ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఒక జూనియర్ ఆర్టిస్టు వేషం సంపాదించాడు. అతని అదృష్టం కొద్ది ఆ సినిమాలో అతనికి కొన్ని క్లోజప్పులు వచ్చాయి. ఫలితంగా ఒక ప్రముఖ నిర్మాత అతన్ని గమనించాడు. తన స్వయంకృషికి ఆ నిర్మాత ఇచ్చిన ప్రోత్సాహం తోడయి, అతను అచిరకాలంలోనే ఆకాశాన్ని అందుకోగలిగాడు.........బిజీస్టార్ అయిపోయాడు."
"నా లాగానా?" అన్నాడు శ్రద్దగా వింటున్న వనమాలి.
"నాలాగానే? ఇంకా చెప్పాలంటే న కధే ఇది!" అన్నాడు హరీన్.
ఒక్కసారిగా ఉపిరి లోపలికి తీసుకుంది కరుణ. "అయితే.......అయితే.....మీ తండ్రి ఒక హంతకుడా?" అంది సంభ్రమంగా.
"అని గట్టిగా చెప్పలేను. కానీ అటువంటి పని ఏదో చేసే ఉంటాడనీ నా అనుమానం. ఒకరాత్రి అయన భయంకరమైన నేరం ఏదో చేసిన వాడిలా గజగజ వణికిపోతూ, వళ్ళంతా చెమటలు కారిపోతూ వుండగా ఇంట్లో దూరడం, వారం రోజుల పాటు తలుపులు బిదాయించుకుని ఇంట్లోనే వుండిపోయి, వీధి మొహం చూడకపోవడం, హటాత్తుగా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం, ఆ తర్వాత వున్న వూరు మార్చేసి, కొత్త ఉళ్ళో మకాం పెట్టాడం...........ఇవన్నీ చూస్తే నాకు అనుమానం కలిగింది."
"అంతేకాదు - అర్ధరాత్రి పూట హటాత్తుగా లేచేవాడు నా తండ్రి. తన గుండెలమీద ఎవరో అదృశ్యశక్తి కూర్చుని గొంతు నులుముతున్నట్లు భ్రమపడుతూ మూలిగేవాడు 'పాపం ఉరికే పోదు ఈ పాపం ఉరికే పోదు' అని అరిచేవాడు.
తడి ఆరిపోయిన గొంతుతో అడిగింది కరుణ - "ఆ తర్వాత ఏం జరిగింది?"
"ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వు చెప్పాలి కరుణా! ఏం జరుగుతుంది ఆ అమ్మాయికి?"
చెప్పడం మొదలెట్టింది కరుణ.
"ఆ అమ్మాయి ఆ దూరపు బంధువుల ఇంట్లోనే పెరిగి పెద్దదయింది. చూస్తూ వుండగానే ఏళ్ళు గడిచిపోయాయి. యుక్తవయసు వచ్చింది ఆ అమ్మాయికి. అప్పుడు మరో ఇబ్బంది ఎదురయింది. ఆ అమ్మయిమీద కన్నేశాడు కిట్టూ అనే జులాయి వెధవ. బలవంతం చెయ్యడం మొదలెట్టాడు."
ఏదో పీడకల కంటున్నదానిలా కరుణ పెదిమలు గజగజ వణకడం మొదలెట్టాయి. కంపిస్తున్న స్వరంతో చెప్పడం మొదలెట్టింది. -
"అప్పుడా అమ్మాయి అనుకుంది - ఇన్నాళ్ళ పాటు ఇన్నిరకాల కష్టాలు పడుతూ ఇక్కడ గడిపాను గానీ, ఇలాంటి కష్టం కూడా ఎదురయితే ఇంక ఇక్కడ వుండడం కష్టం - అనుకుని ఇల్లువదిలి , పారిపోయింది.
"అయినా ఆ జులాయి వెధవ వదలలేదు. వెంటబడి తరిమాడు.
"ఆ అమ్మాయికి దిక్కుతోచలేదు. ముందూ వెనుకా చూడకుండా ఒక రైలు బ్రిడ్జి మీదకి ఎక్కేసింది.
"అప్పుడొక దయామయుడు ఆ అమ్మాయిని రక్షించడానికి గుర్రం మీద వచ్చి....."
"మైగాడ్ ......కరుణా! ఇది నీ కధే!" అన్నాడు హరీన్ ఎగ్జయిటేడ్ గా.
సజల నయనాలతో , అవునన్నట్లు తల పంకించింది కరుణ.
"మళ్ళీ మొదటీనుంచీ చెప్పు! ఏమయింది అసలు?"
మళ్ళీ మొదటినుంచి అంతా వివరంగా చెప్పింది కరుణ.
సాలోచనగా అన్నాడు హరీన్.
"వనమాలీగారు చెప్పిన కధ , నా కధా ఒకదాని కొకటి సరిగ్గా సరిపోతున్నాయి కరుణా!.....ఒక పజిల్ లోని మూడు ముక్కలలాగా , ఒక త్రికోణంలోని మూడు రేఖల్లాగా!"
ఉద్వేగంతో అన్నాడు వనమాలీ.......
"ఎన్నాళ్ళనుంచో నేను పూర్తీ చెయ్యలేని కధ ఓ కొలిక్కి వచ్చింది ఇప్పుడు - మీ ఇద్దరూ మీ మీ చరిత్రలు చెప్పడం వల్ల!"
"అయితే ఇంక ఒక్కటి మిగిలిపోయింది!" అన్నాడు హరీన్.
"ఏమిటిది?" అంది కరుణ.
"వనమాలీగారు చూస్తుండగా రైల్లోనుంచి పడ్డ మనిషి ఎవరో తెలియాలి. కరుణ తండ్రి ఎమయిపోయాడో తెలియాలి. మా తండ్రికి ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియాలి. ఏది ఏమైనా ఈ మూడు సంఘటనలకీ చాలా దగ్గర సంబంధం వుంటుందనిపిస్తోంది నాకు."
"ముమ్మాటికీ " అన్నాడు వనమాలీ.
అప్పుడు వినిపించింది కాలింగ్ బెల్.
ఆపకుండా మోగిస్తున్నారు ఎవరో.
36
కాలింగ్ బజార్ శబ్దం వినబడగానే వెళ్ళి తలుపు తెరిచింది కరుణ.
తలుపు దగ్గర ఒక వృద్దుడూ - ఆయనతో బాటు వయసు మళ్ళిన ఒక స్త్రీ నిలబడి వున్నారు.
కరుణని చూడగానే, గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంటూ, "మీ నాన్న పేరేమిటమ్మా?" అని అడిగాడు విశ్వనాధం.
"నారాయణమూర్తిగారు" అని మెల్లిగా చెప్పి, "మీరెవరు? ఎందుకు అడుగుతున్నారు?" అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసింది.


