Previous Page Next Page 
జీవనయానం పేజి 43


    హిందీ - ఉర్దూ సినీమాలు వచ్చినపుడు వ్యాఖ్యానం చెప్పేవారు. డైలాగుల కన్నింటికీ ఒకరకపు గ్రాంథికంలో చెప్పుతూ పోయేవారు. అది భాష తెలియని వాళ్లకు హుషారు - తెలిసినవాళ్లకు విసుగు కలిగించేది.

 

    అప్పుడప్పుడూ నాటకాల కంపెనీలు వచ్చేవి. "సత్యహరిశ్చంద్ర" - "శ్రీకృష్ణ లీలలు," "పాండవ ఉద్యోగ విజయాలు", "కురుక్షేత్రం" వేసేవి. అవి ఆడినన్నాళ్లూ ప్రజల నాలుకలమీద పద్యాలు నాట్యమాడేవి. తిరుపతి వేంకట కవులు పద్యాన్ని ప్రజాయత్తం చేశారు!

 

    నాటకం యాంత్రికకళ కాదు. అది సజీవ కళారూపం. సామాన్యుడు స్టేజిమీద తన వేషంలో జీవించడాన్ని చూడడం ఒక అద్భుత అనుభవం. స్టేజిమీది నటనకు స్టేజి కిందివారి స్పందన - ఈలలు - 'వన్స్ మోర్'లు స్టేజిమీది వారి ప్రతిస్పందన - ఆ ఆనందంలో మళ్లీ పాడడం, అదంతా ఒక అద్భుతస్పందన!  

 

    తోలుబొమ్మలు - పగటివేషాలు - దొమ్మరిఆటలు - హరికథలు - కాలక్షేపాలు - అరుదుగా పాటకచేరీలు - వగైరాలు వినోదాలు

 

    ఒకసారి ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారు వచ్చారు. వారి గడ్డం - కళ్లలో మెరుపు ఆకర్షణీయంగా ఉండేవి. వారు మంధరం వ్రాస్తున్నారు! వారి చుట్టూ జనం! వారి రామాయణ ప్రవచనం పటికిబెల్లం, "రామకోటి" వ్రాయించడం వారే ప్రారంభించారనుకుంటా!

 

                                                         తొమ్మిది

 

    "సత్త్వానురూపం ఫలం":

 

    1938 హైదరాబారు రాజ్య చరిత్రలో ఉజ్వల సంవత్సరం. ఆ సంవత్సరం రాజ్యంలో రాజకీయపార్టీ స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. నిరంకుశ నవాబు పార్టీ ఏర్పడకముందే నిషేధించాడు! ఇది చరిత్ర ఎరుగని విచిత్రం!! ఏర్పడనున్న పార్టీని నిషేధించడం అంటే, పుట్టక ముందే మరణ శిక్ష విధించడం!!! నిజాముకు జనం - సంఘం - పార్టీ - చదువు అంటే బెదురు. అవి తనను కూలదోస్తాయని బెదురు. అయితే, అతను బెదిరినట్లుగానే జరిగింది. జనం అతని అధికారానికి గోలకొండ కిల్ల కింద గోరీ కట్టారు.

 

    1937-38 భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో కూడా ప్రభావాత్మకం అయిన సంవత్సరాలు. భారత ప్రభుత్వ శాసనం, 1935 ప్రకారం బ్రిటిషిండియాలోని రాష్ట్రాల అధికారం ప్రజలకు అప్పగించడం జరిగింది. 1937లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1585 సీట్లల్లో కాంగ్రెసు 715 సీట్లు గెలుచుకుంది. మద్రాసు - బొంబాయి - సంయుక్త పరగణాలు - మధ్య పరగణాలు - బీహార్ - ఒరిస్సాలలో మెజారిటీ స్థానాలు సాధించి, ప్రభుత్వాలు ఏర్పరిచింది. అస్సాంలో 108కి 35, సరిహద్దు ప్రాంతాల్లో 36కు 15, బెంగాల్లో 250కి 60, పంజాబులో 175కు  18, సింధులో 60కి  8 సీట్లు వచ్చాయి.

 

    ఈ ఎన్నికల్లో మత - మిత పార్టీలు ఒటమి చవిచూడ్డం విశేషం. కాంగ్రెసును ఎదిరించిన లిబరల్ మితపక్షం స్వరాజ్య పార్టీ మితపక్షం, చెరిగిపోయాయి. హిందూ మహాసభ విఫలం అయింది. జిన్నా ముస్లింలీగుకు బెంగాల్లో కొంత విజయం కలిగింది. అయితే, ముస్లిములు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో నాలుగు శాతం ఓట్లు మాత్రమే లభించాయి.

 

    గమనించవలసిందేమంటే - బ్రిటిషిండియాలోని ప్రముఖ రాష్ట్రాల్లో, ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ పేర - హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడానికి జన్మ జన్మాల బూజు, నిజాం రాజు సహించలేకపోయాడు.

 

    బ్రిటిషిండియాలో సాగుతుండిన స్వాతంత్ర్య పోరాటస్ఫూర్తి దేశీయ సంస్థానాల్లో కూడా కనిపించింది. మైసూరు - తిరువాన్కూరు - రాజకోట్ సంస్థానాల్లో ప్రజా ఉద్యమాలు పెల్లుబికాయి.

 

    భారత స్వాతంత్ర్య పోరాట ప్రభాకరుని కాంతిని అరచేతిలో అడ్డడానికి ప్రయత్నించిన నిజాం ముష్కరుని ప్రయత్నం ఫలించలేదు.

 

    బ్రిటిషిండియాలో వెలిగిన చైతన్య జ్వాల నిజాంరాజ్యపు హద్దులను దాటి ప్రజల్లో ప్రవేశించింది. వుజం రాజ్యంలో తొలి రాజకీయపార్టీ - హైద్రాబాదు స్టేట్ కాంగ్రెస్ - స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి.

 

    29  జనవరి 1938నాడు హైద్రాబాదు స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటుచేసి, సభ్యులను చేర్పించడం వంటి ప్రాథమిక కార్యక్రమం అప్పగించారు. తాత్కాలిక కమిటీ వారు - మతాలతో సంబంధం లేని - రాజకీయ పార్టీ ఆవశ్యకతను వివరిస్తూ ఒక అప్పీలు విడుదల చేశారు. అందులో నవాబు ఆగ్రహానికి గురికాకుండే పదజాలాన్ని ఉపయోగించారు. నిజాం ప్రభువులకు విశ్వాస ప్రాత్రులం అనే శపథం చేశారు. మతాలతో సంబంధం లేదని ఘంటాపథకంగా చెప్పారు. తమ పార్టీకి రాజ్యానికి బయటి ఏ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు.

 

    తాత్కాలిక కమిటీ అప్పీలు అద్భుతంగా పని చేసింది. ఎంతకాలంగానో ఇలాంటి విన్నపానికి ఎదురు చూస్తున్నట్లు ప్రజలు ప్రతిస్పందించారు. ఒక్క నెలలో స్వచ్ఛందంగా 1200 మంది సభ్యులు అయ్యారు. దుష్టనిజాం రాజ్యపు ప్రమాణాలకు ఇది ఆశ్చర్యకర సంఖ్య!    

 

    ప్రజల నుంచి లభించిన ఈ ఉత్సాహాన్ని - ప్రోత్సాహాన్ని చూచిన నిర్వాహకులు 9 సెప్టెంబరు 1938న సర్వసభ్య సభ జరిపి నియమావళిని రూపొందించడం - కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరగాలని నిశ్చయించారు.

 

    నిర్వాహకుల ఈ నిశ్చయం మాత్రమే నిజామును నిద్రాహీనం చేసింది. అతడు ఉలికిపడ్డాడు. ప్రజలు తనను ముట్టడిస్తున్నట్లు కలలు గన్నాడు. తాను పట్టుకున్న సింహాసనాన్ని గుంజుకుపోతున్నట్లు కలవరించాడు. ఏడు తరాల ఆసఫ్జాహీ వంశం అంతరిస్తున్నట్లు ఆరాటపడ్డాడు.

 

    నిజాం రాజు - తొమ్మిదిన కావలసిన సభను నిషేధిస్తూ రెండు రోజులముందు - 7-9-1938 ఫర్నానాను జారీ చేశాడు. అందులో చూపిన కారణాలు ఏమంటే -

 

    1. పైకి ప్రజాసంస్థగా కనిపించినా ఇది మత విద్వేషం చెలరేపటానికి ఏర్పడుతున్న పార్టీ.

 

    2. వేషానికి సౌమ్యంగా కనిపించినా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహం ప్రేరేపించే పార్టీ.

 

    3. ఈ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి "కాంగ్రెస్" అనే పేరును వాడుకోవాలనుకుంటున్నది.

 

    ఫర్మానుదారి ఫర్మానుది. పోలీసులు తమ బలప్రయోగం చేశారు. పోలీస్ కొత్వాలు తాత్కాలిక కమిటీ ప్రముఖ సభ్యుణ్ణి పిలిపించాడు. అతని ఇంట్లోనే సభ జరగాల్సింది. సభ జరిగినా - వాళ్ల ఇంట్లో జరిగినా - అతని ఇల్లు జప్తు చేస్తామని బెదిరించాడు. అలాంటి ఉత్తరు వేదీ లేదు. అది నోటి మాటే కాని, నిజాం రాజ్యంలో వ్రాత పూతలుండవు. నోటిమాటకే తలలు ఎగిరిపోతాయి! అంతేకాదు, అవి కొత్వాలు మాటలు మాత్రం కావు, అవి హుంజూర్ అనిపించిన ఆజ్ఞలు!

 

    ఆ ప్రముఖ సభ్యుడు ప్రభువు ఆగ్రహాన్ని కమిటీకి తెలియపరచాడు. కమిటీ - మర్యాద దక్కించుకోవడానికి - సర్వసభ్య సమావేశాలణు నిరవధికంగా వాయిదా వేసింది!

 

    పుట్టని కాంగ్రెసుణు నిషేదించిన వారానికి గాంధీజీ 'హరిజన్' పత్రికలో ఇలా వ్రాశారు:

 

    "సర్ అక్బర్ హైదరీ విద్యావేత్త, తాత్వికుడు పుట్టని సంస్థను ఖండించే ప్రకటనకు అతడు కారకుడు కావడం విచారం. మతరీత్యా ఒక ప్రజ అత్యధికంగా ఉన్న రాజ్యంలో మతతత్వం అంటే అర్థం ఏమిటి?"   

 

    సర్ అక్బర్ హైదరీ ఆనాటి నిజాం రాజ్యపు ప్రధాని.

 

    జనరల్ బాడీ సమావేశపు తేదీ మాత్రమే నిర్ణయించగా ఏర్పడనున్న సంస్థను నిషేధించడం నిర్వాహకులకు - సంస్థకు - ప్రజలకు అవమానం అనిపించింది. తాత్కాలిక కమిటీవారు కరుణించవలసిందని ప్రభువు వారికి అనేక విన్నపాలు  చేశారు. కాని, వీరి శంఖం నిజాం చెవిటికి వినిపించనే లేదు.  

 

    తాత్కాలిక కమిటీ సభ్యుల్లో ఒకరయిన మందుముల నరసింగరావుగారు స్వయంగా ప్రభుత్వంతో మంతనాలు జరిపారు. వారి మిత్రుడు అలీయావన్ జంగ్ ఖాన్ అప్పటి ప్రభుత్వ సెక్రటరీ ఉభయులకూ ఎడతెగని చర్చలు జరిగాయి. ఒక దశలో సంస్థ పేరునుంచి "కాంగ్రెస్" తొలగించడానికి సహితం నిర్వాహకులు అంగీకరించారు. బాధ్యతాయుత ప్రభుత్వ నినాదం వదులుకోవాలని ప్రభుత్వం పట్టుపట్టింది. కాంగ్రెస్ వారు అంగీకరించలేదు. ప్రభుత్వం నిషేధం తొలగించలేదు. చర్చలు విఫలం అయినాయి.             

 Previous Page Next Page