Previous Page Next Page 
జీవనయానం పేజి 42


    నరసింహస్వామి గుట్ట దగ్గర ఒక తడకల సినిమాహాలు వెలసింది. అందులో టీ సినిమా చూపారు. సినిమాకు టిక్కెట్టు కాణీ. ఒక కప్పునిండా చాయ్ ఇస్తారు. అది తాగింతరువాత కప్పు ఉచితం - సినిమా చూడొచ్చు. అయితే టీ మాత్రం వాళ్ల ముందు తాగాలి!

 

    నేనూ కొందరు మిత్రులూ కాసులు సంపాదించాం. చాయ్ కోసం కాదు - సినిమా కోసం! అసలు మనం - అగ్రవర్ణం అనిపించుకొనేవాళ్లు - వాళ్లు చేసిన చాయ్ తాగవచ్చునా అనే మీమాంస మాకు! పాలు వేసిన నీళ్లు త్రాగవచ్చుగదా! టీ అంటే వేడిపాలేగదా అని సంతృప్తి! ఇంతా ఎందుకంటే - సినిమా చూడ్డానికి! మాకు సినిమా చూడ్డం ప్రధానం - వాళ్లకు చాయ్ తాగించడం ప్రధానం!   

 

    ఈనాటికీ ప్రచారపు మూలసూత్రం అదే!

 

    కానీ ఇచ్చి - ఎవరూ  చూడలేదని మేము అనుకొని - టీ తాగి - కప్పులు ఇంట్లోకి రానివ్వనందున వదిలి, సినిమాహాల్లో జొరబడ్డాం. అందరూ నేలమీదనే! అక్కడ వ్యత్యాసాలు లేవు.

 

    తెరమీద సినిమా - ఒక ఆడ మనిషి జీవితంలో విసిగిపోతుంది. నూతిలో పడడానికి వస్తుంది. నూతి దగ్గర ఒకడు టీ కప్పు అందిస్తాడు. ఆమె టీ తాగుతుంది. ఆమెలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఆడుతుంది. పాడుతుంది. ఆమె భర్త టీ కప్పుతో వస్తాడు. ఇద్దరూ ఆడుతూ పాడుతూ సాగిపోతారు!  

 

    ఒక రైతు పొలం దున్నుతుంటాడు. అలసిపోతాడు. డీలా పడిపోతాడు. అరకమీద - ఉసూరుమంటూ - కూలబడ్తాడు. ఎద్దులు అతన్ని పడేస్తాయి. సాగిపోతాయి. రైతు చతికిలపడి ఆకాశాన్ని చూస్తుంటాడు. రైతు భార్య చద్దితోపాటు టీ తెస్తుంది. కప్పులో భర్తకు అందిస్తుంది. తానూ అందుకుంటుంది. వారిలో ఉత్సాహం పొంగుతుంది. ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకొని ఎగురుతారు. ఎద్దులు అరక తెచ్చి వారిముందు పెడ్తాయి.

 

    ఇలాంటివే ఒక ఫ్యాక్టరీ వర్కరు, విద్యార్థి వగైరాలకు కలిగిన ఉత్సాహపు అనుభవాలు చూపారు.

 

    సినిమా నుంచి బయటికి వచ్చి మేమందరం అనుకున్నదేమంటే - టీ తాగితే మార్కులు బాగా సంపాదించవచ్చని! ఆనాటి పరిస్థితుల్లో ఆ సినిమా మమ్ములను ఆ నిర్ణయానికి రావడానికి పురికొల్పడం అత్యంత అద్భుతం! అద్భుతాది అద్భుతం!!

 

    కూడళ్లలో చేసిన టీ పారపోయడానికే ఎక్కువ ఉపయోగపడింది. కొంతకాలానికి అవి మాయం అయినాయి. అక్కడ టీకి అలవాటుపడినవాళ్లూ - వినోదం కోసం వచ్చినవారూ నిరాశ చెందారు.

 

    అంతటితో టీ వాళ్లు విరమించలేదు. పధ్ధతి మార్చారు. కెటిల్ పట్టుకొని ఇంటింటికి వెళ్లారు. తమముందు త్రాగేవారికి టీ ఇచ్చారు. కప్పులు ఇవ్వడం మానారు. ఈ పథకం పనిచేసింది.

 

    ఇప్పుడు ఇళ్లకు వెళ్లడం మానారు. కెటిల్ తో ఒక కేంద్రంలో కూర్చునేవారు. జనం వారిచుట్టూ మూగేవారు. అలా కొంతకాలం సాగింది. తరువాత డికాక్షన్ మాత్రం ఇచ్చారు. పాలు - చెక్కెరా కలుపుకొమ్మన్నారు. ఆ దశలో జనం విరగబడ్డారు. అలా కొంతకాలం జరిగింది!

 

    తరువాత పధ్ధతి మార్చారు. టీ పొడి పొట్లాలు ఉచితంగా ఇచ్చారు. అవి తగ్గించారు. జనం దుకాణాలకు ఎగబడ్డారు! కొంతకాలం తరువాత అదీ మానేశారు. ఒక హ్యాటు పెట్టుకున్న, వ్యక్తి - మరొకడు, తోసే - ఎర్రటి బండిలో దుకాణాలకు టీ పొడి సరఫరా చేస్తుండేవాడు!

 

    ఆ విధంగా పాకిన టీ ప్రపంచమంతటా అసంహార్యం అయింది!

 

    అయితే వాస్తవంగా టీ మనిషికి అంత అవసరం అయిందా అనే విషయం ఆలోచించకుండా చేయడమే వాణిజ్య వ్యవస్థ లక్షణం.

 

    మాలాంటి సంప్రదాయ కుటుంబాలు తేనీటిని - తొలిరోజుల్లో - తమ ఛాయలకు రానివ్వలేదు. 'అప్రాచ్యుల ఆచారం' అని చాలామందిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు. అయితే, పెట్టుబడిదారునిది కబంధ హస్తం. వీరుకూడా వారి పిడికిట్లో చిక్కుకున్నారు!

 

    టీ అంటరానిదని భావించిన మాతామహులు చివరి రోజుల్లో చెంచెడుచాయ్ గ్లాసులో పోసుకుని త్రాగారు. అప్రాచ్య ఆచారం అని నిరసించిన నాయన ఉదయాన చాయ్ లేకుండా ఉండలేకపోయారు. అమ్మకు వేళకు చాయ్ లేకుంటే నరాలు బిగపట్టినట్లు అనిపించేది.

 

    ఇది కొద్దిలో టీ - చాయ్ - తేనీటి వృత్తాంతం.

 

    ఆ రోజుల్లో టీ - కాఫీల మీద దండకాలు వచ్చాయి.   

 

    పిండిమర:

 

    ఖమ్మంలో ధాన్యపు - నూనె గిర్నీలు - మిల్లులు ఉన్నాయని చెప్పాను. అయితే జనుల నిత్యజీవితాన్ని అవి అంతగా ప్రభావితం చేయలేదు. ఇంటి - వంట పనిముట్లలో మార్పు రాలేదు.

 

    అలా ఉండగా ఒకనాడు చేగొమ్మవారి కొట్లలో ఒకదానిలో పిండిమర వెలిసింది. అది మహిళాలోకంలో సంచలనం కలిగించింది. "ఇటు గింజలు పోస్తే - అటు పిండి వస్తుందట - ఆదేం చోద్యమమ్మా!" అని చెప్పుకున్నారు. చాలమంది దాన్ని చూడ్డానికిమాత్రమే వెళ్లారు.   

 

    మేమూ చూడ్డానికి వెళ్లాం - గొట్టంలో గుప్పున పొగ - పెద్ద రొద - చక్రాలు గిరగిరా తిరగడం - మరలో గింజలు పోస్తే పిండి అయి డబ్బాలో పడడం వింత! విసుర్రాళ్లతో పిండి ఎంతకాలం విసరాలి? అమ్మకు శ్రమ తప్పింది అనుకున్నాం. ససేమిరా కుదరదు అన్నారు నాయన!     

 

    మాట్లాడే స్తంభం:

 

    బీటు బజారులో విజ్ఞాన నికేతన గ్రంథాలయం ఉండేది. ఆనాటి గ్రంథాలయాలు విద్యకు - విజ్ఞానానికి - వికాసానికి - చైతన్యానికి నిలయాలు! ఆ గ్రంథాలయానికి రేడియో వచ్చింది. ఆ పేరు ఎవరికీ తెలియదు. "మాట్లాడే స్తంభం" వచ్చిందనుకున్నారు. అప్పుడు రేడియో అంత పెద్దగా ఉండేది. స్తంభం పలకడం చూడడానికీ వినడానికీ జనం బాగా కూడేవారు. తొలిరోజుల్లో మాకు స్తంభం కనిపించలేదు. మాటా - పాటా వినిపించాయి. అప్పుడు మేము అనుకున్నాం "ఆకాశవాణి"లా ఉందని! అది "ఆకాశవాణి" కావడానికి స్వాతంత్ర్యం రావలసి వచ్చింది. అర్ధశతాబ్ధంలో రేడియో టీకన్న పాపులర్ అయింది.   

 

    కదిలే బొమ్మ:

 

    "కదిలే బొమ్మ" అంటే ఒకనాడు వింత. మనకు తోలుబొమ్మలు ఉన్నాయి. వాటి ఆటలు - పాటలు - సహితంగా తెల్లవార్లూ సాగేయి. ఊరంతా రాత్రి సాంతం - అందులో లీనమై - చూసేది. కాని, అది ఈనాటి సినిమా కాదు. దానికి టిక్కెట్టు అక్కరలేదు.

 

    సినిమా మొదలయింది "కదిలే బొమ్మ"తో. ఇప్పటికీ దీని పేరు మూవీ - అంటే చలనచిత్రం. ఖమ్మంలో మొత్తం రేకుల - అంటే గోడలు సహితంగా రేకుల హాలు ఉండేది. దాని పేరు "పిక్చర్ పేలస్". మూగ సినిమాలు వచ్చేవి. నేను ఒకటి రెండు చూచాను. అవి ఇంగ్లీషువి. ఏవో ఎగరడం, గంతులు వేయడం. సినీమా పేరు గుర్తు లేదు. పాసింగ్ షో కావచ్చు. అందులో ఒకడు సిగరెట్టు పెదవుల మధ్య బిగిస్తాడు. అది అమాంతంగా బారెడు అవుతుంది. చప్పున వేలెడు అవుతుంది!

 

    తరువాత మాటల సినిమాలు వచ్చాయి. పిక్చర్ పేలస్ "నవాబ్ టాకీస్" అయింది. హరిశ్చంద్రలాంటి పౌరాణికాలు పద్యాలు సహితంగా వచ్చాయి. పుల్లయ్యగారనుకుంటా - అచ్చం పిల్లలతో అనసూయ - ధ్రువుడు - సుమతి కథలు సినిమాగా తీశారు. అనసూయ దిగంబరంగా ముమ్మూర్తులకు పాలివ్వడాన్ని అద్భుతంగా చిత్రించారు. ధ్రువుని చిత్రం నామీద ఎంత ప్రభావం వేసిందంటే - ఏటి వడ్డుకు తపస్సుకు వెళ్లిపోయాను!

 

    ఎందుకో నవాబ్ టాకీసు మూత పడింది. అరకాలవాళ్ల బావిదగ్గర టూరింగు సినీమా వచ్చింది. ఆ రోజుల్లో దేశభక్తి, సంఘసంస్కరణ ప్రధాన లక్ష్యంగా సినిమాలు తీసేవారు. నాయన ఎంత ఛాందసుడయినా మమ్ములను "మాలపిల్ల" పిక్చరుకు తీసికెళ్లారు. తరువాత రైతుబిడ్డ, గృహలక్ష్మి తెలుగువారి మీద చెరగని ముద్ర వేశాయి! ఆ పేర్లతో ఆనాడు చీరలు వచ్చాయి. కన్నాంబ "పల్నాటి యుద్ధం", "చండిక" అద్భుత దృశ్యాలు. దేశభక్తి ప్రదీపకాలు.

 

    హిందీలో "వాడియా ముటోటీన్" వారి సలుంటు చిత్రాలు. అన్నింటిలో నాడియాయే హిరోయిన్. అదే హీరోయిన్ అదే కారు, అదే గుర్రంతో. అనేక సినిమాలు వచ్చాయి. పేర్లు దొరక్క "పంజాబ్ మెయిల్", పంజాబ్ మెయిల్ కి బేటీ" ఇలాంటి పేర్లుండేవి. అన్నింటిలో కథ ఒక జమీందారు దౌర్జన్యం - దాన్ని ఎదిరించడమే! అయినా ఏదో వెరయిటీ! అన్నీ చూసేవాళ్లు.

 

    ఉర్దూలో సికందర్ - పుకార్ భారతదేశాన్ని అదరగొట్టాయి. సికిందర్ లో యుద్ధపు సీనులు అద్భుతం! "పుకార్"లో సొహరాబ్ మోడీ సుదీర్ఘములయిన ఉర్దూ డయలాగులకు హాలులో కరతాళ ధ్వనులకు విరామం ఉండేది కాదు. తరువాత వచ్చిన "ఖజాంచీ" అశోక్ కుమార్ - లీలా చిట్నిస్ ల "అఛూత్ కన్యా", "బసంత్" "ఖిస్మత్" జనాన్ని ఉర్రూతలూగించాయి!

 Previous Page Next Page