Previous Page
గోరువెచ్చని సూరీడు పేజి 42

   ఈ ప్రోసెస్ లో ఆమె సుమారు నాలుగు నిముషాలు ఖర్చు చేసింది... ఫ్యాక్టరీ సెక్యూరిటీకి ఫోన్ చేసింది కాని ఏమైందో తెలియనట్టు కంటీన్యూగా ఎంగేజ్ వస్తుంది.   
    నగరమంతా కాకపోయినా అతి ముఖ్యమైన పాలనా యంత్రాంగాన్ని ఆమె నిద్ర లేపగలిగింది కాని ఎవరు ఎంతవరకూ సాయపడగలరూ అన్నది ఆమె ఊహించలేదు....    
    కంట్రోల్ రూం ద్వారా ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ సహాయంతో ఉపాధ్యాయ ఫ్యాక్టరీ పరిసరాలలో పోలీసుల్ని అప్రమత్తం చేసాడు కమీషనర్.
    కాని వెంటనే ఏం చెయ్యాలో వారికీ అర్ధం కాలేదు...కృషి చెప్పిందే నిజమైతే మరికొన్ని నిముషాలలో విష వాయువు ఫ్యాక్టరీ నుంచి నలుదిక్కులా వ్యాపిస్తుంది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరి ప్రాణాల్నీ తీస్తుంది. అందుకే పోలీసులు ప్రజల్ని అప్రమత్తం చేయటానికి బదులు తమ తమ కుటుంబాల్ని దూరప్రాంతాలకి తరలించడంలో నిమగ్నమైపోయారు.        
    రాష్ట్ర హోం సెక్రెటరీ డిజిపీలు నిజాయితీగా రియాక్టయి మిలటరీ కంటోన్ మెంటుని సంప్రదించి సహాయక చర్యలకోసం ప్రయత్నించారు కాని వాళ్ళూ తమ నిస్సహాయతని వ్యక్తం చేసి మిగిలిన గడువులో తమని తాము కాపాడుకోటానికి మార్గాలు అన్వేషించడం ప్రారంభించారు.    
    కృషి ఇవేమీ పట్టించుకోవడం లేదు.        
    మరణమే తప్పనిసరయితే అది పోరాటం ద్వారానే పొందాలి తప్ప పిరికిదానిలా తనుపారిపోలేదు.    
    అందుకే ఏక్సి లేటర్ నొక్కింది మరింత బలంగా.    
    విస్సు గుర్తుకొచ్చాడు.    
    ఏమయ్యాడు.    
    ఫ్యాక్టరీని చేరగలిగి ఉంటాడా.    
    లేక ఇంకా చేరే ప్రయత్నంలోనే వున్నాడా.    
    "భగవంతుడా" మరణయాతనలాంటి స్థితిలో దేవుడ్ని ధ్యానించింది కృషి. "ఈ క్షణంలో నేను ఆలోచిస్తున్నది నా గెలుపు గురించి కాదు. నువ్వు పొందకూడని ఓటమి గురించి. అవునయ్యా మృత్యువును ఆపగలిగే శక్తి నీకు మాత్రమే వుంటే ప్రాణాలు కోల్పోవటానికి సిద్దంగా వున్న లక్షలమందిని కాపాడాల్సిన బాధ్యత నీది. ఏ దుష్టశక్తి విజ్రుంభించినా శిష్యుల్ని రక్షించడం అవతార పురుషుడివైన నీ బాధ్యత అయితే యిదిగో నువ్వు దేవుడివని నిరూపించుకోవాల్సిన క్షణాలు సమీపించాయి"    
    మేధస్సుతో గాక కేవలం దైవికంగానే ఆగాల్సిన ఓ ఘోరం గురించి కృషి అశ్రుశిక్త నయనాలతో విధిని అడుగుతున్నప్పుడు టైం రాత్రి పదకొండు గంటలుదాటి ఏభై ఏడు నిమిషాలు.    
    ఓ మారణహోమానికి మిగిలింది కేవలం మూడే మూడు నిముషాలు...   
                           *    *    *    *
    తూటాల మోతతో నిశిరాత్రి వణికిపోయింది.    
    తుఫాను మేఘంలా కదిలిన ఆత్మాహుతి దళం ఫ్యాక్టరీ సెక్యూరిటీ గేట్ ను దాటి అప్పటికే ఆరుగురు సిబ్బందిని కడతేర్చేసారు. ఉన్నట్టుండి వినిపించిన బుల్లెట్ల చప్పుడికి అర్ధం తెలీని ఫ్యాక్టరీ కార్మికులు కకావికలై పరుగెడుతున్నారు.   
    ఎటు చూసినా రక్తం ఆ పైన హోరులాంటి హడావిడి. దుండగులు నిశీధిలోని టాంకర్ వేపు కదులుతున్నారు వేగంగా.    
    మరో అరనిముషంలో టేంకర్ వాల్వ్ ని చిన్నాభిన్నం చేసేవారే.    
    అదిగో అప్పుడు జీపుతో లోపలికి దూసుకొచ్చాడు విస్సు. టెలిఫోన్ బూత్ దగ్గర జీపుతాకిడికి ఓ చేయి అప్పటికే విరిగిపోయింది. పైబడిన గూండాల కత్తిపోట్లకి పొట్టనుంచి రక్తం చిమ్ముతూంది. అయినా పోరాడి జీపుని స్వాధీనం చేసుకున్నాడు. కడగంటిపోతున్న ప్రాణాలతో వేగంగా దూసుకురాగలిగాడు ఫ్యాక్టరీ దాకా.    
    వ్యవధిలేదు. చివరి ఘట్టానికి సన్నద్దుడు కావాలి. ఆ క్షణంలో విస్సుకి దేవుడు గుర్తుకి రాలేదు. మరికొన్ని లిప్తల్లో ప్రాణాలు కోల్పోయే వేల లక్షలమంది అమాయకులైన వ్యక్తులు జ్ఞప్తికొచ్చారు. కాలావధులతో పోరాడాల్సిన నిరవధిక నిశీధిలో చివరి సాక్ష్యంగా మిగిలిన కేసెట్ ని జీపులోనే వుంచి కిందికి దుమికాడు నీరసంగా.    
    కెరటంలా క్షీణించిపోతూ కడలిగా మారాలని చేస్తున్న విఫల ప్రయత్నంలో పద్మవ్యూహాన అడుగుపెట్టిన అభిమన్యుడయ్యాడు.    
    అనుకోని అవాంతరం క్షణంపాటు దూసుకొస్తున్న విస్సు కథని ముందు పూర్తిచేయాలని వెనక్కి తిరిగారు.
    నిశ్శబ్దంపై శబ్దంలా తూటాలు వర్షించాయి. చీకటిలోకి తప్పుకున్నాడు విస్సు.    
    అదీ అరక్షణమే వెనువెంటనే ఉత్పాతమై కదిలి ఓ మూల నిలబడ్డ ఆగంతకుడిపై బడ్డాడు. విస్సు వృక్షఛాయల ఉచ్వాసంలా ముందుకురికిన ఓ వ్యక్తి నుంచి తనను తాను కాపాడుకోటానికి పట్టింది రెండు లిప్తలు. అయినా ఓతూటా భుజాన్ని చీల్చింది విషాదజంత్ర సంగీతంలా.    
    ఆక్రందనకి సైతం అవకాశంలేని గ్రీష్మాగ్నికీల. అతడు కనురెప్పలు బరువుగా వలిపోతుంటే మృత్యు రంగస్థలంపై కదిలే సూర్యశిశువులా శక్తిని కూడగట్టుకున్నాడు.    
    పేలిన భ్రుకుటిలో నుంచి పైకురికిన మూడో నేత్రమై ప్రత్యర్ధి చేతిలోని స్టెన్ గన్ అందుకున్నాడు ఒక్క వుదుటున.    
    అంతే...    
    "తదా దేహాంతర ప్రాప్తి"   
    ర్దీర స్తత్ర సమూహ్యతి"    
    ఓ దేవుడా దేహనాశనం గురించి నేను ఇప్పుడు ఆలోచించటం లేదు. మరణానికైనా నేను సిద్దమే కాని మారణహోమాన్ని ఆపేశక్తిని ప్రసాదించు.    
    ధాత్రి నిస్తబ్దతని చెరిపేస్తూ దగ్ధగీతమై ప్రత్యర్ధులపై తూటాల వర్షం కురిపిస్తున్నాడు.    
    "తస్మాత్యర్వాణి భూతాని    
    నత్వం శోచియ మర్హసి"    
    నేనున్నది సర్వప్రాణులలోనే అయినప్పుడు నేను పోతేనేం ఆ ప్రాణుల్ని కాపాడే అవకాశాన్ని నాకు దక్కించు"  
    మృత్యు మస్తిష్కపు వాకిలిముందు నిలబడి బడలికతో తూలిపోతూ ఇంకా పోరాడుతూనే వున్నాడు. ఏమౌతున్నదీ అర్ధం కావడం లేదు ప్రత్యర్దుల్లో ఎందరు నేలకూలింది తెలీడం లేదు. అసలతను ఇంకా బ్రతికే వున్నాడా లేక స్వప్నగర్భస్థమైన స్థితిలో కదులుతున్నాడా అన్నది తోచడం లేదు.    
    తను బిందువా లేక పగిలిన సింధువా అన్నది నిర్ణయించుకునే లోగానే కాలఘంటాద్వానాలకి దూరంగా సుదూరంగా దేవుడు ఆశీర్వదించిన ఉపనిషద్వాక్యంలా నేల కూలిపోయాడు.    
    ఏమైంది దేవుడూ...    
    నేను అనుకున్నది సాధించానా, నరమేధాన్ని ఆపగలిగానా...    
    ఓ భ్రాంతిలాంటి భావం.    
    అదిగో అప్పుడు కనిపించారెవరో మసకగా-    
                            *    *    *    *    
    అపోలో హాస్పిటల్...    
    ఇరవై నాలుగుగంటల సుదీర్ఘ పోరాటం తర్వాత కళ్ళు తెరిచిన విస్సుకి ముందు కనిపించింది కృషి.    
    శరీరం నిండా శవానికి చుట్టినట్లు తెల్లని బేండేజ్.    
    తను ఇంకా బ్రతికేవున్నాడా.    
    ఎన్ని యుగాల నిరీక్షణ తర్వాతనో కోరిన మనిషి తిరిగి దక్కినంత సంతృప్తితో కృషి లాలనగా అతడివేపు చూసింది.    
    అయితే తాను బ్రతికాడన్న మాట.    
    ఇంత మొండిపిల్లే. కృషి కూడా కంటతడి పెట్టగలదా.    
    "థేంక్యూ విస్సూ...థేంక్యూ" గొణుగుతుంది వెక్కిపడుతూనే.    
    "ఏమైంది ఆ ప్రమాదం...." ఆ క్షణంలో సైతం విస్సు అడిగింది తన స్థితి గురించి కాదు తను ఆపాలనుకున్న మారణహోమం గురించి    
    "నీకు నా అభినందనలు విస్సూ" ఆప్యాయంగా తలనిమురుతూ పరామర్శిస్తున్నాడో వ్యక్తి.    
    అతడెవరో ముందు పోల్చుకోలేదు. పోల్చుకునేవాడే కాని గాయాలతో మెదడూ శరీరం మొద్దుబారిపోయింది.   
    "లక్షలమంది ప్రాణాలను కాపాడటానికి నీ ప్రాణాల్ని అర్పించాలనుకున్న నీ ప్రయత్నం చారిత్రాత్మకమైనది. ప్రత్యర్ధుల్ని పట్టించావు. ఓ ఉప్పెన్ని ఆపగలిగావు. థేంక్స్ అండ్ కంగ్రాట్స్"    
    విస్సు అప్పుడు గుర్తించాడు అభినందించిన వ్యక్తెవరో.    
    "థేంక్యూ ప్రైమ్ మినిస్టర్"    
    భాష కందని అభినందన బాష్పమైతే ఇప్పుడు విస్సూని పరామర్శించటానికి ప్రత్యేకంగా రాష్ట్ర రాజధాని తరలివచ్చిన ప్రధాని నేత్రాలు చెమ్మగిల్లుతున్నాయి.    
    "యూ లౌ ఈచదర్" కృషి విస్సుని చూసి నవ్వింది. ప్రధానమంత్రి "బట్ ఐ లవ్ బోతాఫ్ యూ" ఆశీస్సుల్ని అందించి నెమ్మదిగా బయటకి నడిచారు.    
    హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఖాళీ అయింది మరో రెండు నిముషాలలో.    
    ఇంకోలిప్తలో జీవతకాలం నీకేర్ నాదే అన్నట్టు కృషి పెదవులు విస్సు పెదవులతో కలిసి వూపిరి నింపే ప్రయత్నంలో నిమగ్నమయ్యాయి.                          

                            __: శుభం :__

 Previous Page