"మీరు కోపం తెచ్చుకుని ప్రయోజనంలేదు. ఇటు నేను ఊరు మొత్తాన్ని కొనగల ధనవంతుడ్ని.... నామాటకు ఎదురు లేని వాడ్ని....ఇప్పుడు నాపని అయోమయంలోకి దిగింది. ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడు నన్ను బెదిరించటమా! ఇది నాకు ఎంత తలవంపుల విషయం....."
"నా విషయానికి వస్తే నాపని అంతేగా లాల్ జీ! నా అధికారం ఏమిటి? నా హోదా ఏమిటి? ఒక పోలీసాఫీసర్ కి బెదిరింపు లేఖా! నేనేమనుకోవాలి?"
"ఇలా యిద్దరం అనుకుంటూ కూర్చుంటే పనులు కావు ఇన్ స్పెక్టర్! వాడు మళ్ళీ ఏదొకటి చేస్తాడు. ఎందుకో ఠాకూర్ మనమీద కసి పూనాడన్న మాటకి వెనుకనున్న కధ..."
"బలంగా లేదంటారు అంతేనా లాల్ జీ"
అవునన్నట్లు తలూపాడు బన్సీలాల్.
"ఓకె. మీ వూహప్రకారం ఇది ఠాకూర్ పనికాదు అనుకుందాము. మరి మనకి శత్రువు ఎవరు? అది వూహించ గలరా లాల్ జీ!"
"ఊహకి అందిన మరుక్షణం శతృవుని సర్వనాశనం చేసే కార్యక్రమంలో మునిగి తేలనా! ఠాకూర్ కావచ్చని మనిద్దరం అనుకుంటున్నాము....మరో శత్రువంటూ ఎవరూ కనబడలేదు కాబట్టి అనుమానంతో ఆలోచిస్తున్నాను. అణుమాత్రం ఆధారం దొరికితే చాలు...."
"నేను అణుమాత్రం ఆధారంకోసం చూస్తున్నాను.
"మనం ఇలా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుందాము...వాడు మరోసారి రంగంలోకి దిగి మన రోగం తక్కున కుదురుస్తాడు. ఇంతవరకు మీమాట తూచ తప్పకుండా పాటించాను. ఏం జరిగింది?" బన్సీలాల్ ఆవేశంగా అడిగాడు.
"అదీ మీరే చెప్పండి" ఇన్ స్పెక్టర్ ముఖంలో ఏ భావం కనబడనియ్యకుండా జాగ్రత్త పడుతూ అడిగాడు.
"ఆనందయ్యకి మనవడు దక్కాడు....వాడు ఆనందంగా నా కళ్ళముందు తిరుగుతున్నాడు. గోపన్న రహస్య గూడచారిలాంటి వాడన్న సంగతి నేనే కనిపెట్టి వాడ్ని జెయిలుదాకా లాక్కొచ్చాను. మీరు చల్లగా వాడు జారుకుంటుంటే వూరుకున్నారు. మళ్ళీ ఈ బెదిరింపులేఖ ఒకటి." బన్సీలాల్ అంతవరకు అని ఆపై ఏం మాట్లాడాలో తెలీక మిన్నకుండిపోయాడు.
"లాల్ జీ!" ఆప్యాయంగా పిలిచాను ఇన్ స్పెక్టర్.
"ఊ..."
"మీరు అంతవరకే ఆలోచించారు గాని డీప్ గా వెళ్ళి చూడలేదు."
"చూడటానికేముంది నా బొంద!"
"ఈ భాష మొగవాళ్ళు వాడకూడదు. ముఖ్యంగా మీలాంటివాళ్ళు. ఆనందయ్య మనవడి విషయంలో ఆలోచించండి అంటే నాకు శత్రువులంటూ ఎవరూ లేరు...ఠాకూర్ తప్ప యిది వాడి పనే అన్నారు. లేనిపోనిది మీ నౌకర్లచేత నన్ను కొట్టించారు. మంచివాడ్ని కాబట్టి యిందులో మీ పాత్ర లేకపోవటంతో కాస్త సర్దుకున్నాను. మీ నౌకర్లమీద నాకు అనుమానంగా వుంది అని చెప్పిన తర్వాతే కదా మీరు వాళ్ళమీద ఓ కన్నువేసి వుండటం దాంతో గోపన్న బయట పడటం జరిగింది. ఎటొచ్చీ మీరు గోపన్న మీదకి దొంగతనం నేరంతోసి కేసుపెట్టి బయటకి పంపించి తరువాత దెబ్బతినటం నేను జరిగింది యిదేకదా! ఇక్కడ మీరొకటి గమనించాలి. మనిద్దరి శతృవు ఒకరా! లేక మీ శత్రువే నాపై కూడా కినుక బూని నన్ను దెబ్బ తీస్తున్నాడా! వేరు వేరు వాళ్ళా'! విషయం పూర్తిగా తెలియకపోయినా ఒకటిమాత్రం నిజం. ఈ బెదిరింపు లేఖలు పంపింది మాత్రము ఒకరే."
"ఆ విషయం తెల్సిపోతూనే వుంది"
"కనుక నామీద చిరచిరలాడి ప్రయోజనం లేదు లాల్ జీ! వాడు మళ్ళీ మనిద్దరికీ ఓ డోస్ ఇవ్వబోతున్నాడు. తగిన మెలుకువగా వుండి దెబ్బ తగలకుండా చూసుకోవటం ముఖ్యం ఆ తర్వాత శత్రువుని కనిపెట్టి ఉచ్చు లాగించటం కూడా ముఖ్యం. అంతేగాని మనం కలహాలాడుకుంటే ప్రయోజనం ఏముంది?"
ఇన్ స్పెక్టర్ అన్న తీరుకి బన్సీలాల్ తగ్గాడు. కసి తీరక మసి పూసుకున్నాడట వెనుకటి కొకడు. అలా ప్రవర్తించబోయాను. మళ్ళీ తెలివితెచ్చుకుని ఇన్ స్పెక్టర్ పై నిష్టూరాలు ఆడితే ఎవరికీ నష్టం. పైగా ఆయనకూడా రెండుసార్లు దెబ్బతిని వున్నాడు కదా అనుకున్నాడు.
"మీరు చెప్పింది నిజమే. ఏం చేయాలో తెలియక కొట్టు మిట్టాడుతున్నాను. కానీండి ఎన్నాళ్ళు ఈ చాటు శతృవు మనతో పరాచికాలు ఆడుతాడో!" నిట్టూర్పు విడుస్తూ అన్నాడు బన్సీలాల్.
"ఆడవాళ్ళ భాషలో చెప్పాలంటే పాపం పండాలి. ఆ శుభసమయం కోసం చూద్దాము లాల్ జీ! ఈ లోపల నా శాయశక్తులా ప్రయత్నిస్తాను శతృవు ఆచూకీ లాగే విషయంలో." భారంగా బదులు పలికాడు ఇన్ స్పెక్టర్.
ఆ తర్వాత...
కానరాని శతృవు గురించి మరికాసేపు చర్చించుకుని బన్సీలాల్ కి వచ్చిన లేఖని తన లేఖతోపాటు తన దగ్గర భద్రంగా వుంచుకుంటానని చెప్పి, బెదిరింపు లేఖని తీసుకుని ఇన్ స్పెక్టర్ శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
బన్సీలాల్ ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాడు.
ఆకాశరామన్న నుంచి వచ్చిన రెండు లేఖలు ఏ శతృవు సృస్టించలేదని, బన్సీలాల్ ని అవమానం చేయాలి అన్న ప్లానులో మొదటిభాగంగా ఇన్ స్పెక్టర్ లేఖలని సృష్టించి తన అడ్రస్ కి ఒకటి, బన్సీలాల్ అడ్రస్ కి మరొకటి వేశాడు. ముందు తనే బన్సీలాల్ ఇంటికి వచ్చి తన లేఖ చూపించి నాలుగు కబుర్లు చెప్పి చల్లగా లేఖతో సహా వెళ్ళిపోయాడు.