Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 40

    "అయితే మీకూలేఖ వచ్చిందన్నమాట" బన్సీలాల్ కాస్త వూరట చెందుతూ అడిగాడు.
   
    "అన్నమాట కాదు ఉన్నమాట."
   
    "మీకేం రాశాడు?"
   
    అతను జేబులోంచి కవరు తీశాడు. "నా కవరు మీరు చదవండి. మీ కవరు నేను చదువుతాను" అంటూ కవరు యిచ్చాడు.
   
    బన్సీలాల్ కవరు అందుకుని తనకొచ్చిన కవరు ఇన్ స్పెక్టరుకి యిచ్చాడు.
   
    ఇరువురు ఏకసమయంలో చదవటం మొదలుపెట్టారు.
   
    బన్సీలాల్ లెటర్ యిలా వుంది....
   
    బన్సీలాల్ మహాశయా,
   
        నీకిదే (నమస్కార మస్కార) బాణాలు.
   
    నీవు అనవసరంపనులు చాలాచేస్తున్నావు. ముఖ్యంగా దొంగతనం అంటగట్టడం వుందిచూశావ్ అదిఅసలుసహించ రాని విషయం. మా జోలికి వస్తే కందిరీగల తుట్టెలో చేయి పెట్టినట్లే....ఓసారి హెచ్చరిక చేశాను. నువ్వు లెక్క చేయలేదు. ఈ తఫా చేసే అవసరం మాకులేదు. శాంపిల్ గా చిన్న దెబ్బ తీయబోతున్నాను కాచుకో నీ ఫ్రెండ్ రైట్ హ్యాండ్ ఎర్రటోపీల అధికారికి కూడా ఓ డోస్ యివ్వబోతున్నాం. నీ విషయం నువ్వు జాగ్రత్తపడితే వాడు వాడి విషయంచూసుకుంటాడు. ఇరువురూ కలిసి మళ్ళీ కిరికిరి చేయకండి ఇది నా హెచ్చరిక.
   
                                                                                                            ఇట్లు
                                                                                                      ఆకాశరామన్న
                                                                                                             గారి
                                                                                                    మండిపడే సూర్యుడు.
   
    బన్సీలాల్ లెటర్ ని ఇన్ స్పెక్టర్ చదివాడు.
   
    అలాగే...
   
    ఇన్ స్పెక్టర్ కి అందిన లెటర్ ని బన్సీలాల్ చదివాడు
   
    ఆ లెటర్లో__
   
    ఇన్ స్పెక్టర్ మహాశయా!
   
        నీకిదే (నమస్కార మస్కార) బాణాలు
   
    ఒరేయ్ బన్సీలాల్ నీ కెంత ఆప్తుడయినా అంత ఇది పనికి రాదురా, ఎవడు దోషో. ఎవడు నిర్దోషో ఆ మాత్రం గ్రహింపు లేకుండా నీవలా ప్రవర్తించటం మంచిది కాదు.
   
    నీ దృష్టిలో
   
    బన్సీలాల్ దేముడు
   
    గోపన్న దెయ్యం (దొంగ)
   
    అంతేనా!
   
    అంతే నాకు తెలుసు! రెండు దుష్టశక్తులు ఏకమయినప్పుడు జరిగే పని యిదే...అన్యాయం అంతమయ్యేరోజు అధర్మం అంతమయ్యే రోజు దగ్గరలోనే వుంది....ఇది నా హెచ్చరిక.
   
    నీకు యిదివరకే మా మందు చిన్న డోస్ యిచ్చాం. ఆ డోస్ చాలలేదనుకుంటాను. త్వరలో మరోడోస్ మందు ఎక్కిస్తాం చూస్తూ వుండు.
   
    బన్సీలాల్ కి మాత్రం ఈ తఫా ఫుల్ డోస్ మందు యిద్దామనుకుంటున్నాం వ్యాధి తీవ్రతని బట్టి ఫుల్ డోస్ యివ్వకతప్పదు. మందు ఎక్కించటం ఎలాగూ తప్పదు. కనుక విచారించి ప్రయోజనంలేదు. ఆ సంగతి బన్సీకి చెపితే చెప్పు నీ యిష్టం.
   
    ప్రస్తుతం
   
    నీవు
   
    గోపన్న ఎక్కడ కనపడ్డా కేసు తిరగదోడకు. అలాగే ఈ కేసు తాలూకా ఫైలు శాశ్వితంగా మూసెయ్యి.
   
    కాదంటే
       
    ఇరు నీకు అటు వాడికి మా న్యాయస్థానంలో శిక్ష తప్పదు. మేము ఎవరం అనే విషయం ఆరాతీయకు. ఆరాతీసి భంగపడకు ఇది నా హెచ్చరిక.
   
                                                                                                                  ఇట్లు
                                                                                                             ఆకాశరామన్న
                                                                                                                    గారి
                                                                                                         మండిపడే సూర్యుడు.
   
    ఇరువురూ లెటర్ చదవటం పూర్తిచేసి కొద్దిసేపు ఆలోచిస్తూ వుండిపోయారు.
   
    ముందుగా ఇన్ స్పెక్టర్ కన్నారావు పెదవి కదిపాడు.
   
    "హెచ్చరిక అందింది ఏం చేద్దామంటారు!"
   
    "ఇలాంటి కేసులని చీల్చి చెండాడటం మీరు చేయాలి....నాకేదో సలహా యిస్తారుకదా అని ఆశపడితే ఏం చేద్దామంటూ మీరు నన్ను అడుగుతున్నారు...ఇది ఏ రకంబెదిరింపు లేఖో అర్ధం కావటంలేదు....జెయిలులోంచి గోపన్నని విడిపించుకెళ్ళింది చాలక మళ్ళీ వార్నింగు ఏమిటి? వాడెవడో తెలిస్తే సజీవ సమాధి చేద్దును" బన్సీలాల్ గంగ వెర్రులెత్తిపోతూ ఆవేశంగా అన్నాడు.
   
    "మీరు ఉత్త సజీవ సమాధిమాత్రమే చేస్తారు లాల్ జీ! నేనలాకాదు...సెంటర్లో నుంచోపెట్టి సెంటర్ స్థానంలో లాగిపెట్టి తంతాను....వక్క దెబ్బకి వాడు గింగి రాలు తిరిగిపోవాలి....ఆ తర్వాత వాడి శరీరాన్ని అంగుళానికో ముక్క చొప్పున కోసి కాకులకి గద్దలకేసి అవి ఆరగిస్తుంటే ఆనందంగా చూస్తాను" ఇన్ స్పెక్టర్ రోషంగా శెలవిచ్చాడు.
   
    "ఆ...కొయ్యాల్సిందే కోతలు...." వ్యంగ్యంగ అన్నాడు బన్సీలాల్
   
    "లాల్ జీ!"

 Previous Page Next Page