"కళ్ళు మూసుకోండి. నేను చెప్పిన మంత్రాలుచ్చరించండి." అన్నాడు భీమన్న. కళ్ళుమూసుకుని అతడుచెప్పిన విధంగా మంత్రోచ్చారణ చేస్తున్నాను కానీ నాకు ఏకాగ్రత కుదరలేదు.
ఈ పూజ మూర్ఖత్వమని ఓమూల మనసులో తోస్తోంది. దీనికోసం మూడువేలు అడ్వాన్సూ నెలకు ఆరువందలు జీతమూ ఇచ్చిన రాయుడు మూర్ఖుడా కాడా అన్న ఆలోచన కూడా కలుగుతోంది.
"ఇప్పుడు దేవికి సాష్టాంగ నమస్కారం చేయండి, సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు కదలకూడదు. నేను చెప్పేదాకా అలాగే వుండండి." అన్నాడు భీమన్న.
హఠాత్తుగా పాతాళభయిరవి సినిమా గుర్తుకువచ్చింది. విక్రమార్కుడికథ జ్ఞాపకం వచ్చింది. దేవికి బలి ఇవ్వడం కోసం మాంత్రికుడు నరున్ని ధెవీ సాష్టాంగ పడమంటాడు. అయితే వారికి ముందుగానే హెచ్చరిక ఉందికాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడతారు.
అయితే నేను బలిపశువునా?
ఈ అనుమానం రాగానే నా శరీరం జలదరించింది. ఉదయం నుంచీ నన్ను వేధిస్తున్న ఎన్నో సమస్యలకు జవాబులు లభించాయి. ఏడాదిపాటు నా నిమిత్తం లేకుండా వుత్తరాలూ, మనియార్డర్లూ-సూరయ్య నాకు శిరోముండనం చేయడమూ, భీమన్న బొట్టుపెట్టి పసుపు బట్టలివ్వడమూ.....ఇవన్నీ నన్ను బలిపశువుగా తయారు చేయడంకోసమేనా?
చటుక్కున లేచి కూర్చున్నాను. దేవీ విగ్రహం వెనుక నుంచి ఓ పెద్ద కత్తి తీస్తున్న భీమన్న నేను కూర్చోవటం చూసి - "దేవికి సాష్టాంగపడమన్నానా? నేను చెప్పేవరకూ లేవద్దన్నానా" అన్నాడు కోపంగా, కంగారుగా.
నేను సమాధానమివ్వకుండా లేచి ఆ గదిలోంచి పరుగెత్తబోయాను. అయితే గది తలుపులు గడియవేసి వున్నాయి. మెరుపు వేగంతో ఆ తలుపు తీసి అక్కడ్నించి బయటపడబోయాను. అక్కడ సూరయ్య నవ్వుతూ నిలబడి నన్ను వడిసి పట్టుకున్నాడు.
చావుబ్రతుకుల్లో వున్న క్షణం. జాప్యంచేసి లాభంలేదు. ఆ సర్వశక్తులూ క్రోడీకరించి సూరయ్యతో పెనుగులాడి ఒక్క తోపు తోశాను. పెనుగులాటలో సూరయ్య దేవీ విగ్రహమున్న గది వైపు తిరిగాడు. నా తోపుకు అతను ఆ గదిలో పడ్డాడు. చటుక్కున తలుపు మూసి గడియపెట్టి హాల్లో అటూ ఇటూ పరుగెత్తాను.
లోపల్నుంచి సూరయ్య, భీమన్న తలుపులు బద్దలు కొట్టడానికి చేస్తున్న ప్రయత్నం నాకు వినబడుతూనే వుంది. వాళ్ళ బలానికి ఆ తలుపులో లెక్కలోనివి కాదు. ఈలోగా నేను ఇక్కడ్నుంచి బయటపడాలి. అయితే అన్ని తలుపులూ లోపల గడియవేసితాళం వేయబడివున్నాయి.
ఇంట్లోంచి బయటపడే దారిలేదు. అప్పుడు నాకు వంట మనిషి విషయం గుర్తుకు వచ్చింది. ఆ మనిషిని బెదిరించి అక్కడ్నించి పారిపోవాలనుకున్నాను. వంటమనిషి దగ్గర తప్పక తాళాలుంటాయి అనిపించింది నాకు.
వెతుక్కుంటూ వంట గదిలోకి వెళ్ళాను. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డాను. ఓ మనిషి క్రింద స్పృహ తప్పి పడివున్నాడు. ఓ అంధమైన యువతి వాడ్ని పరీక్షగా చూస్తోంది. ఆ యువతి చాలా అందంగా వుంది.
"ఈ ఇంట్లోంచి బయటపడ్డానికి తాళాలు కావాలి" అన్నాను. ఆడపిల్లను చూడగానే నా ధైర్యం పెరిగింది. ఆమె చటుక్కున నా వైపు చూసి "నువ్వూ బలిపశువ్వా? బ్రతికున్నావా, చచ్చేవా!" అంది.
"ఇంకో క్షణముంటే చస్తాను...." అన్నాను.
"నిన్ను చావనివ్వను. నిన్ను రక్షించడానికే వచ్చాను. కాస్త ఆలశ్యమయింది. పద...." అంది ఆమె. నేనామెను అనుసరిస్తూంటే ఆమె తిన్నగా దేవీ విగ్రహమున్న గది వైపే దారి తీస్తోంది. నాకు భయం వేసింది. ఇందులో ఏదో మోసమున్నదని నాకు తోచింది. భయంగా ఆమెను వారించబోయాను.
"నేనుండగా నీకు భయంలేదు. ఈ ఇంట్లో నరబలి జరుగనివ్వను. తాళాలు భీమన్న ]దగ్గరే ఉన్నాయిమరి...." అంది ఆ యువతి. ఆమె మాటలను నమ్మడం మినహా నాకూ గత్యంతరంలేదు. ఆమె వెళ్ళి ఆ గది తలుపులుతీసింది. భీమన్న, సూరయ్య గదిలోంచి బయటకూరాబోయి ఆమెను చూస్తూనే వణకసాగారు.
"తాళాలిలాయిచ్చి గదిలోకిపొండి!" అంది ఆ యువతి. భీమన్న భయంగా తన మొలలోంచి తాళాలుతీసి ఇచ్చి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె తలుపులు గడియ పెట్టింది.
వీధిగుమ్మం వరకూవచ్చి తలుపులువేసి, "వీలయినంత త్వరగా ఇక్కన్నుంచి వెళ్ళిపో. మళ్ళీ రాయుడుగారికి కనబడకు. ఎప్పుడయినా ఏ మూర్తిరాజయినా, రాయుడు అయినా తటస్థపడి నిన్ను బెదిరిస్తే మంజరి ఉండగా ఈ ఇంట్లో నరబలి కొనసాగదన్నదని చెప్పు....." అంది.
ఆమె రాయుడిగారికూతురో, దగ్గర బంధువో అయివుండాలనుకొన్నాను. అక్కన్నుంచి పరుగు లంకించుకున్నాను.
ఇంటికి ఎలా చేరుకున్నానో తెలియదు. ఇంటివద్ద నన్ను చూసి అంతా కలవరపడ్డారు.
నాన్నగారింట్లోలేరు. నాగురించి చాలా భయపడుతున్నారట. ఎందుకంటే, మాకు దూరపుచుట్టాలున్నారు. వాళ్ళ అమ్మాయీ ఉద్యోగం కోసమని రాయుడుగారింటికి వెళ్ళిందట. నెలనెలా మానియార్డర్లు వచ్చాయట. ముందు మూడు వేల రూపాయలుకూడా వచ్చాయట. ఆ అమ్మాయి జాడ లేదుట. రాయుడుగారు తనకుటుంబ క్షేమంకోసం నరబలి ఇస్తాడన్న వదంతి ఉన్నదట. ఈ విషయాలన్నీ నేను కుక్కలపాలెం బయలుదేరిన రోజునే తెలిశాయట. నాన్న గారు కంగారుపడి కుక్కలపాలెం వెళ్ళారట. ఇంకారాలేదు.
నేను తిరిగివచ్చిన ఓ రెండుగంటలకు తిరిగివచ్చిన నాన్నగారు "రాయుడుగారికి మనవాడి గురించి ఏమీ తెలియదన్నారు" అంటూ నన్నుచూసి మహదానందపడ్డారు. నా అవతారచూడగానే నాకధ సగం పైగా అర్ధమయిందాయనకు.
"ఇంతకీ ఆ అమ్మాయియెవరు నాన్నా?" అన్నాను.
"ఆ అమ్మాయిపేరు మంజరి" అన్నారు నాన్నగారు.
మంజరి అనగానే నా హృదయం జలదరించింది. ఆమెనుచూసి భీమన్న యెందుకు వణికిపోయాడో అర్ధం అయింది.
మనిషి మనిషిని అన్నివిధాలా బలిపశువుగా వాడుకో డానికి చూస్తున్న ఈ రోజుల్లో నాబోటి వాళ్ళను రక్షించడానికి మానవాతీతశక్తి అయినా ఒకనాటి బలిపశువే! తను బలి అయినా ఇతరులను బలికాకుండా కాపాడటం కూడా మానవాతీతశక్తియే కదా!
* * *