Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 3


    "నాకిలాంటివాటిపై నమ్మకం లేదు...."
    "నమ్మకం అవసరంలేదు. ఏకాగ్రత ఉంటేచాలు. ఓ ఏడాదిపాటు ఏకాగ్రతతో పూజచేస్తే...."
    "నాకు ఏకాగ్రతగా వుండడంకూడా చేతకాదు. అనుక్షణం మనసు పరిపరివిధాల పోతూనే వుంటుంది."
    "ఫరవాలేదు. దేవిముందు అయిదు నిముషాలు కూర్చుంటే ఏకాగ్రత దానంతటదే వస్తుంది..." అన్నాడు భీమన్న. అతను నా సమాధానాలకు ఇసుమంత కూడా చలించినట్లు, కలవరపడినట్లు అనిపించడంలేదు. అది నాకు ఆశ్చర్యం గానూ, అనుమానంగానూ కూడా వుంది.
    "ఈ విగ్రహం కేవలం పూజలకోసమేనా ఇక్కడున్నది?" అన్నాను.
    "అవును. ఇది రాయుదిగారి కులదేవత....." అన్నాడు భీమన్న.
    "ఇంతకీ ఈ ఇంట్లో నేను రోజూ ఏంచేయాలి?" అన్నాను.
    "రోజూ సంగతి ఎలాగున్నా ఈ రోజు కార్యక్రమం నిర్ణయించబడింది. మంగలి సూరయ్య మీకు తలంటుతాడు. తర్వాత పట్టుబట్టలతో మీరు దేవిముందు కూర్చుంటారు. నేను చెప్పిన మంత్రాలు కొన్ని ఉచ్చరిస్తారు. తర్వాత రేపటిసంగతి తేలుతుంది...." అన్నాడు భీమన్న. నా ప్రశ్నలకు అతను వెంటవెంటనే సమాధానాలిచ్చేస్తున్నాడు. అయితే అవన్నీ ఎంతో ముక్తసరిగా వుంటున్నాయి.
    "నువ్వు నిజం చెప్పడంలేదు...." అన్నాను అనుమానంగా.
    "నిజం అన్ని సమయాల్లోనూ సంతోషం కలిగించేదిగా వుండదు-" అన్నాడు భీమన్న తాపీగా.
    ఉలిక్కిపడి-"ఏమన్నావ్?" అన్నాను.
    ఏమన్నాడో భీమన్న చెప్పలేదు-"కాసేపు విశ్రాంతి తీసుకోండి-" అన్నాడు.
    వంటమనిషిని చూడాలనిపించింది-"వంటిల్లు కూడ చూసేక...." అన్నాను.
    "అది రేపు చూద్దురుగాని...." అని నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు భీమన్న. ఆ గదిలో సౌకర్యంగా నిద్రపోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. భీమన్న నేను గదిలోకి వెళ్ళగానే గదితలుపువేసి బయట తాళంవేశాడు. ఈ పద్దతి ఇంకా విచిత్రంగా తోచింది నాకు.
    
                                       4
    
    నిద్రపట్టలేదు నాకు. నా ఉద్యోగం ప్రమాదకరమైన దన్న భావం నాలో కలిగింది. ఏవేవో ఆలోచిస్తూ అలా మేనువాల్చాను.
    ఇప్పుడు నా ఊహల్లో నెలనెలా నేను వేయబోయే నిల్వల గురించిన ఆలోచనలు లేవు. ఏడాదిపాటు నా నిమిత్తం లేకుండా ఇంటికి మానియార్దర్లుచేసే ఏర్పాటు ఎందుకు జరిగిందా అన్న ఆలోచన నా మెదడును దొలిచేస్తోంది. ఏడాది తర్వాత ఏమవుతుంది? నా అంతట నేను ఇంటికి మానియార్దర్లు పంపగల్గుతానా?
    రాత్రి ఏడుగంటల సమయానికి కాబోలు నా గది తలుపులు తెరుచుకున్నాయి. భీమన్నవచ్చి "పదండి, స్నానాల గదికి వెడదాం-" అన్నాడు. నేను లేచి అతన్ని అనుసరించాను.
    స్నానాలగదిలో మంగలి సూరయ్య అన్ని ఏర్పాట్లు తోనూ సిద్దంగా ఉన్నాడు. నేను ఒక చిన్న స్టూలుమీద కూర్చున్నాను. సూరయ్య నా తలకు నూనె రాశాడు రెండు నిముషాలు మర్దనాచేశాక కత్తితీశాడు.
    "అదెందుకు? నేను రేజర్ తో గడ్డం గీసుకుంటాను. అదీ వుదయంపూట-" అన్నాను.
    "కత్తి గెడ్డం గీయడానికికాదు. శిరోముండనానికి-" అన్నాడు భీమన్న.
    నేను కలవరపడుతూ "-శిరోముండనం నాకిష్టముండదు. తిరుపతి దేవుడిక్కూడా దర్శనానికే కానీ శిరోముండనం గురించి నేనెప్పుడూ మొక్కుకోలేదు-" అన్నాను.
    "కానీ పూజకు ఇది అవసరం. మీరు అభ్యంతరం చెప్పకూడదు......"
    "అభ్యంతరంచెబితే ఏమవుతుంది?" అన్నాను కోపంగా. నా వుద్యోగం ఊడుతుందని భీమన్న అనేపక్షంలో తక్షణం వుద్యోగం వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్దంగా వున్నాను. ఇక్కడంతా నాకు చాలా భయంగా వుంది. పొరపాటున తెలివితక్కువగా ఇందులో ఇరుక్కున్నాను.
     కాళ్ళూ చేతులూ కట్టి మా పనిచేయడం నాకిష్టంలేదు-" అన్నాడు భీమన్న.
    అతనివంక చూసాను. నా కళ్ళకు అతనిముఖం కనబడలేదు. ఆరడుగుల విగ్రహానికన్న బలిష్టమైన అవయవాలు మాత్రం కనబడ్డాయి. మరి మాట్లాడలేదు. కదలలేదు.
    మంగలి సూరయ్య నా తలనీలాలు పూర్తిగా తీసివేయలేదు. తలమీద అక్కడక్కడ చిన్న చిన్న పిలకలుంచాడు. అద్దంలో చూసుకుంటే నా రూపం నాకు భయంకరంగా, అసహ్యంగా కనబడింది. కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాను!
    సూరయ్య నాచేత స్నానం చేయించాడు. తర్వాత వళ్ళంతా తుడిచాడు. నేను కళ్ళప్పగించి చూస్తున్నాను. హఠాత్తుగా నాలో పెద్దరికం నశించి చంటిపిల్లాడి మనస్తత్వం ఆవహించింది. దుఃఖం తెరలు తెరలుగా వచ్చేస్తోంది. నా చేతుల్లో ఏమీలేదు. అన్నీ నా ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి.
    నా ముఖానికి పెద్ద కుంకంబొట్టు పెట్టాడు భీమన్న. పసుపు బట్టలుయిచ్చి కట్టుకోమన్నాడు. కట్టుకున్నాను. ఇద్దరమూ పూజా గృహంలోకి వెళ్ళాం.
    "నాకు ఆకలేస్తోంది-" అన్నాను.
    "పూజకాగానే భోజనం. వంట తయారవుతోంది."
    "పూజ ఎంతసేపు పడుతుంది..."
    "అరగంట!" అన్నాడు భీమన్న.
    భీమన్నవైపే భయం భయంగా చూస్తున్నాను. అతను ఏదో ఆలోచిస్తున్నాడు.
    నాలోనూ ఏవో రకాల ఆలోచనలు వచ్చాయి. నమ్మకంలేని మనిషిచేత పూజచేయించి ఈ మనిషి బావుకునేదేమిటి? అందువల్ల రాయుడిక్కలిగే ప్రయోజనమేమిటి?

 Previous Page Next Page