Read more!
 Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 4


    ఓ అమ్మాయి గొంతు లీలగా తన చెవులకు సోకడంతో కళ్ళు తెరిచాడు. తను బోర్లా పడుకొని వున్నాడు. అర్ధమైందా. ఎవరో తన వీపుమీద నొక్కుతున్నారు. అందుకే నీళ్ళు నోట్లో నుంచి బయటకు వచ్చాయి. తరువాత వెల్లకిలా తిప్పి, పొట్టపైన నొక్కాడు.
    భళ్లు.... భళ్ళు.... మంటూ నీళ్ళొచ్చేసాయి. ఎదురుగా అందమైన అమ్మాయిలు నలుగురు.
    వాళ్ళల్లో చుడీదార్ అమ్మాయి మరీ అందంగా....
    "నేను....నేనెక్కడున్నాను?" అస్పష్టంగా  గొణిగి అడిగాడు అభినయ్.
    "స్వర్గానికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్  డిస్టెన్స్ లో వున్నావు..." ఆ అమ్మాయి జవాబు చెప్పింది. అతని గొణుగుడు విని.
    మెల్లగా లేచాడు ఓపిక తెచ్చుకొని.
    "హమ్మయ్య! పదవే విరజా! ఇక పోదాం. అతనికి మెలకువ వచ్చిందిగా!" అంది వాళ్ళల్లో ఓ అమ్మాయి.
    "మీరు వెళ్ళగలరా?" అడిగింది ఆప్యాయంగా విరజ అనే అమ్మాయి.
    నీరసంగా నవ్వాడు అభినయ్ సమాధానంగా.
    ఫ్రెండ్స్ అందరూ అప్పటికే లేచి కారు దగ్గరికి నడిచారు. విరజ వాళ్ళతో పాటు వెళ్తూ... ఎందుకో ఓసారి వెనక్కి తిరిగి చూసింది.
    అతను మోకాలిపై తలపెట్టుకొని అలానే కూర్చుండిపోయాడు.
    ఏమనిపించిందో  తనకే తెలీదు. విరజ ఫ్రెండ్స్ వున్నారని కూడా చూడకుండా వెనక్కి తిరిగి అతని దగ్గరికి పరుగెత్తింది.
    అతను ఆశ్చర్యంగా చూడసాగాడు.
    "కమాన్! మా ఇంటికి వెళదాం రా! ఎన్ని రోజులయిందో మీరు అన్నం తిని" అంది.
    ఆ మాటలు అమృతప్రాయంగా తోచాయి అభినయ్ కి. సిగ్గూ, అభిమానం అన్నీ మరచిపోయి ఆమె వెంబడి నడిచాడు.
    "వాట్ దహెల్ యూ ఆర్ డూయింగ్ విరజా! వై యు ఆర్ టేకింగ్ రిస్క్? లీవ్ హిమ్ హియర్..." వాళ్ళల్లో చుడీదార్ విసుగ్గా అంది.
    ఫ్రంట్ సీట్ లో ఎక్కమన్నట్టు అభినయ్ వైపు చూసింది. అభినయ్ తడబడుతూనే ఎక్కి కూర్చున్నాడు.
    ఫ్రెండ్స్ నలుగురూ బ్యాక్ సీట్ లో సర్దుకున్నారు.
    కారు కదిలింది....
    ఎవరూ ఏం మాట్లాడలేదు. నిజం ఏం చేసినా ఇక ఎదురు చెప్పే ధైర్యం లేదు వాళ్ళకి.
    వాళ్ళందర్నీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసేసి బంజారాహిల్స్ వైపు పోనిచ్చింది కారుని.
    అభినయ్ కి అంతా చిత్రవిచిత్రంగా ఉంది. క్షణం క్రితం తనూ కార్లో తిరగాలనుకున్నాడు. బుద్ధభగవానుడ్ని ప్రశ్నించి, ప్ర్రార్ధించాడు కూడా!    
    అప్పుడే ఈ మిరాకిలా?
    తనేమిటి.... ఇలా అందమైన అమ్మాయి పక్కన కూర్చుని కార్లో తిరగడమేమిటి లేకుంటే... వండర్... ఇట్సె వండర్....
    అతని ఆలోచనలని ఆమె పట్టించుకోకుండా ఏ.సి. ఆన్ చేసింది.
    అతను తడిచి వున్నాడేమో వణకసాగాడు. అది గమనించిన ఆమె ఏ.సి. ఆఫ్ చేసేసింది.
    
                                      * * *
    
    రోడ్ నెంబర్ టెన్....
    ఓ ఇంటిముందు ఆగింది కారు. కారు హారన్ వింటూనే గూర్ఖా గేటు తెరిచాడు గబగబా....
    స్లోప్ గా వున్నా అవలీలగా లోపలికి పోనిచ్చింది కారుని.
    విరజ కారుదిగి-ఇవతలకి వచ్చి డోర్ తెరిచి, "దిగండి" అంది.
    అభినయ్ సంశయంగా చూస్తుండిపోయాడు.
    విద్యుత్ కాంతితో అందంగా మెరిసిపోతున్న పెద్ద బంగ్లా అది. తనలాంటి వాళ్ళకోసం కన్నెత్తి చూస్తేనే మాసిపోతుందేమో అన్నంత నీట్ గా వుంది.
    "నిజంగా దిగనా?" అడిగాడు అపనమ్మకంగా.
    "అబద్దంగా కూడా దిగుతారా? మీరు భలేవారే దిగండి ముందు" అంది నవ్వుతూ విరజ.
    అతను దిగాడు.
    "పదండి...." అంది లోపలికి నడుస్తూ.
    అతను మొహమాటంగా ఆగిపోయాడు.
    చకచకా మెట్లెక్కి హాల్లోకి అడుగు పెడుతూ వెనక్కి తిరిగి చూస్తే ఇంకా అభినయ్ సంశయంగా నిలబడి వున్నాడు.
    "మీర్రండి...." అంటూ మరోమాటకు అవకాశం ఇవ్వకుండా లోపలికి నడిచింది.
    అభినయ్ హాలంతా పరిశీలిస్తూ లోపలికి నడిచాడు చేసేదిలేక.
    విరాజ సోఫాలో కూర్చుని బ్యాగ్ గిరాటేసింది. మరో సోఫాలోకి.
    "ఇప్పుడు చెప్పండి! టాంక్ బండ్ లొ పడి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మీకెందుకొచ్చింది? చూస్తే బాగానే ఉన్నారు. నిరుద్యోగ సమస్యా?" అడిగింది.
    "నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడమేమిటి?" ఆశ్చర్యంగా అన్నాడు అభినయ్.
    "మరి..... సరదాగా ఈత నేర్చుకుందామని దూకారా?" అయినా టాంక్ బండ్ లొ ఈత కొడితే ఈతరాదు. ఆ కంపు నీళ్ళతో రోగాలొస్తాయి..."
    అభినయ్ అప్పుడు గొంతు విప్పాడు.
    "నేను ఆత్మహత్య కోసం దూకలేదండీ! కళ్ళు తిరిగి పడిపోయానంతే బ్యాడ్ లక్ ఏమిటంటే...."
    "మీకు ఈత రాకపోవడమా?"
    "ఉహూ..." అని ఆగి మెల్లిగా చెప్పాడు "ఈత కొట్టే శక్తి నా శరీరంలో లేకపోవడం...."
    "వాట్....?"
    "అవును నిజమే.... యింకా డిటైల్డ్ గా చెప్పాలంటే...." అని ఒక్క క్షణం ఆగి....
    "మీ ఇంట్లో తినడానికి ఫుడ్డు వుందా? ఎట్ లీస్ట్ బిస్కెట్స్, బ్రెడ్ లాంటివయినా సరే....' నిస్సంకోచంగా అడిగాడు అభినయ్.
    "సారీ! ఇప్పుడే తెస్తాను. ముందుగా డ్రెస్ ఛేంజ్ చేసుకోండి." అంటూ లోపలికి వెళ్ళి లుంగీ, ఓ షర్ట్, టవల్ తెచ్చి యిచ్చింది. "ముందు మీరు తల తుడుచుకొని. బట్టలు మార్చుకొని రండి" అంది.
    అతను నవ్వి "దానిక్కూడా ఓపిక లేదు మేడమ్. ముందు ఏదైనా పెట్టండి" అన్నాడు అభిమానం చంపుకొని.
    ఆకలి అభిమానాన్ని, సిగ్గుని చంపేస్తుందనడానికి అప్పటి అభినయ్ ఓ ఉదాహరణ.
    విరజ గబగబా కిచెన్ లోకెళ్ళి ఓ ప్లేట్ లో అన్నం, కూర, సాంబారు వేసి తెచ్చింది.
    అతను మొహమాట పడలేదు ఈసారి. అతనే అందుకుని గబగబ తినసాగాడు.
    ఒక్కసారిగా అతనికి పొలమారింది. ఆ అమ్మాయి తలమీద కొట్టింది మెల్లిగా.
    ఒక్క క్షణం ఆ అమ్మాయి వంక చూసి, మళ్ళీ తినసాగాడు.
    అయిదు నిమిషాల పాటు ఆగకుండా, నాన్ స్టాప్ గా తిని, జగ్ పైకెత్తి మంచినీళ్ళు తాగి, రిలాక్సయ్యాడు.
    తృప్తిగా చూశాడు విరజవైపు.
    "ఐస్ క్రీం తింటారా?" ఫ్రిజ్ తెరుస్తూ అడిగింది విరజ.
    "వద్దు- తినలేనిక.... అవునూ... ఇంతకీ నాకింత మంచి ఫుడ్ తినిపించడానికి కారణం?"
    "ఇప్పుడు గుర్తొచ్చిందా?" అంది నవ్వుతూ.
    "నిజమే అప్పుడే అడగవలసింది. కానీ నా ఆకలి మరేం ప్రశ్నించనివ్వలేదు..." సిగ్గుపడుతూ అన్నాడు అభినయ్.
    "ఇంతకీ మీ గురించి చెప్పలేదు"
    "నా గురించి ఏముంటుంది చెప్పుకోవడానికి అనాధని. మూడ్రోజులుగా అన్నం తినలేదు. అఫ్ కోర్స్! అన్నం తినకపోవడం అన్నది నాకు కొత్తకాదు. నాన్ స్టాఫ్ గా మూడ్రోజులు అన్నది ఒక విధంగా రికార్డే. ఒకటిన్నర రోజు- రెండు రోజులు.... రెండున్నర రోజులు..... నా ప్రీవియస్ రికార్డు. ఈసారి ఆ రికార్డులను బ్రేక్ చేసింది....."

 Previous Page Next Page