Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 39


    "మగవాళ్ళలో ఈ విషయంలో వున్నా పర్వర్షన్ లెక్కకు అందవు" అంది.
    
    "ఆఁ" ఆశ్చర్యపోతూ అంది సూర్యాదేవి.
    
    "నువ్వు ఇలాంటి పర్వర్టెడ్ మనుషుల గురించి విన్నావు. నేను స్వయంగా చూశాను ఆ బాధలన్నీ అనుభవించాను" అంది ప్రియ బాంధవి.
    
    "నిజమా?"
    
    "ఆఁ నాకు పెళ్ళయినప్పట్నుంచీ నేనెన్ని బాధలు అనుభవించానో తెలియదు. భర్త చనిపోయాని తెలిసినప్పుడు నిజం చెప్పుద్దూ పీడా విరగడై పోయినట్లనిపించింది. ఎవరైనా వింటే భర్త చనిపోయినప్పుడు సంతోషించావా అని నా మీద దుమ్మెత్తి పోస్తారనుకుంటా కానీ అత్తగైర్మ్ట్లో నేను పడ్డ బాధ అలాంటిది" అని అన్నది.
    
    "నేను అర్ధం చేసుకోగలను ప్రియబాంధవీ, అన్ని జెవెఇథాలు అచ్చు గుద్దినట్లు ఒకలానే వుండవు. ఎవరికీ వారికి ప్రత్యేక పరిస్థితులు ఎదురవుతుంటాయి కానీ ఈ నిజం చాలామందికి తెలియదు.
    
    అందుకే తమ జీవితాలకంటే ప్రత్యేకమయినటువంటివి చూస్తే "అలా ఏమీ జరగలేదు" అని ప్రత్యక్షంగా ఆ బాధలన్నీ అనుభవించిన వ్యక్తి ముఖం మీదే అనేస్తారు. నీకు పెళ్ళయింది.
    
    భర్త పోయాడు. ఇంతకాలం మరోతోడు లేకుండానే గడుపుతున్నావా?"
    
    "అదంతా చెప్పాలంటే చాలా పెద్దకథ అవుతుందిలే" అంది ప్రియ బాంధవి.
    
    "ఫరవాలేదు చెప్పు" అంది సూర్యాదేవి.
    
    "చెబుతాను వయసు వచ్చేసరికి నేనేమనుకున్నానో, ఆ తరువాత నా అత్తగారింట్లో ఎలాంటి వుంత మనుషులు నాకు ఎదురయ్యారో, నా భర్త ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడో, ఆ పిమ్మట ఒంటరితనంతో నేనెంత మదనపడిపోయానో చెబుతాను. నేను చూసినంత మంది వింత మనుషుల్ని చూస్తే ప్రపంచం ఎంత దుర్మార్గమైందో తెలుస్తుంది. కాఫీ తాగాక తీరిగ్గా మాట్లాడుకుందాం"
    
    పనిమనిషిని పిలిచి రెండు కాఫీలు తెమ్మని చెప్పింది సూర్యదేవి.
    
    కాఫీ తాగి ప్రియబాంధవి చెబుతుంటే కంటి మీద రెప్ప కూడా వేయకుండా ఉత్సుకతతో వింటోంది సూర్యాదేవి.
    
    "మానాన్న రైల్వే ఎంప్లాయ్ కావడంతో చిన్నప్పుడు చాలా ఊర్లు తిరిగాను. అలా ఊర్లు తిరుగుతూనే ఇంటర్ మీడియట్ కి వచ్చాను. అక్కయ్య ఎం.ఎ. పూర్తయిపోయింది. ఎం.ఎ. అయిపోగానే అక్కయ్యకు పెళ్ళి సంబంధం కుదిరింది.
    
    అమ్మా నాన్నకి మేమిద్దరమే ఆడపిల్లలం. మగపిల్లలెవరూ లేకపోవడంతో మాకు పెళ్ళిళ్ళు చేసెయ్యాలని తెగ ఆరాటపడి పోయేవాళ్ళు.
    
    అక్కయ్యకు పెళ్ళి సంబంధం కుదరడంతో అమ్మా నాన్న అనందానికి అవధులు లేకుండాపోయింది.
    
    పెళ్ళి కొడుకుది తిరుపతి దగ్గర ఓ పల్లెటూరు. ఎం.ఏ. చదివాడు ఒక్కడే కొడుకు కావడంతో ఉద్యోగానికి పోలేదు.
    
    భూములు బాగానే ఉండడంతో వ్యవసాయమే వృత్తిగా చేసుకున్నాడు.
    
    అతనితో అక్కయ్య పెళ్ళయిపోయింది. మేం అప్పుడు నెల్లూరులో ఉండేవాళ్ళం. నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను.
    
    సంవత్సరం గడిచింది అక్కయ్యకు ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఈ హడావుడి గడిచిందో లేదో నాన్నకు హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయ్యింది.
    
    రిటైర్ మెంట్ మరో ఏడాదే వుండడంవల్ల వాళ్ళతోపాటు నన్నూ హైదరాబాద్ తీసుకువెళ్ళడానికి నాన్న అంతగా ఇష్టపడలేదు.
    
    నన్ను తీసుకుని అక్కయ్య ఇంటికి వచ్చాడు.
    
    ఆ రాత్రి భోజనాలయ్యాక అందరం డాబామీదకు చేరుకున్నాం. నాన్న విషయం కదిపాడు.
    
    'నాకు హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయిందమ్మా. ఇప్పుడు ప్రియబాంధవిని తీసుకుని అక్కడి కెళ్ళడానికి నాకు మనసొప్పడం లేదు. మీరొప్పుకుంటే దాన్ని ఇక్కడ పెట్టేస్తాను. తిరుపతి కాలేజీలో చేర్పించేస్తాను. తిరుపతి అయితే యూనివర్శిటీ కూడా వుంటుంది. రిటైరయ్యాక తిరుపతిలోనే సెటిలైపోతాను. వచ్చే పి.ఎఫ్.తో ఇల్లు కొనుక్కుంటే నిశ్చింత. నువ్వూ దగ్గరే ఉంటావు కాబట్టి హాయిగా వుంటుంది. ఏం అల్లుడుగారూ! అంతేనా' అని అడిగాడు.
    
    మా బావ విశ్వనాథ్ ఈ ఐడియా బేషుగ్గా వుందన్నాడు. అక్కయ్య కూడా ఒప్పుకుంది.
    
    'అలానే నాన్నా, ప్రియ మా ఇంట్లోనే వుంటుందిలే. ఆ ఒక్కతే మాకేమైనా భారమా! మీరూ తిరుపతిలో సెటిలైతే అంతకంటే ఆనందం ఏం వుంటుంది. మనందరము దగ్గర దగ్గర వుంటాం.'
    
    'అలానే చేద్దామమ్మా'
    
    మరో నెలకు నేను అక్కయ్య ఇంటికే వచ్చేశాను.
    
    జీవితంలో కుదురుగా ఉన్నట్లనిపించింది. దాంతో ఏవేవో కొత్త వూహలూ, కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. చదువు మీద నుంచి చూపుపక్కకు మరలుతోంది. పక్కకంటే ఆదిత్య ఇంటివేపుకి.
    
    మా పక్కిల్లే అతనిది. ఎం.ఏ. ఆ సంవత్సరమే పూర్తిచేసి ఇంటి దగ్గరున్నాడు, ఇంకా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లు లేదు. వ్యవసాయం చేయిస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు.
    
    మాదీ, వాళ్ళదీ పక్కపక్క డాబాలే కావడం వల్ల డాబామీదికి వెళితే వాళ్ళింటి డాబాతోపాటు పెరడూ, బావీ అన్నీ కనిపిస్తాయి.
    
    కాలేజీ నుంచి వచ్చి, స్నానం పూర్తి చేశాక, మా అక్కయ్య కొడుకు టింకూను తీసుకెళ్ళి డాబామీద రిలాక్స్ అవుతుండేదాన్ని.
    
    ఓరోజు అలా డాబా మీదికి వెళ్ళేటప్పటికి ఆదిత్య వాళ్ళ డాబామీద వున్నాడు. అతను అక్కడే వుండడంతో ఎంబ్రాసింగ్ గా ఫీలయ్యాను. వచ్చిన వెంటనే వెళ్ళిపోవడం బావోదనిపించి అటూ ఇటూ పచార్లు ప్రారంభించాను.
    
    ఆదిత్య మా టింకూను పిలవడం ప్ర్రారంభించాడు.
    
    "టింకూ... టింకూ"
    
    నేను పిట్టగోడ దగ్గరికొచ్చి "అదిగో" అంటూ ఆదిత్యను చూపించాను.
    
    టింకూతో మూగసైగలు చేస్తూ ఏవేవో మాట్లాడుతున్నాడు ఆదిత్య.
    
    "మీకు చిన్నపిల్లలంటే బాగా ఇష్టం వున్నట్లుందే" అన్నాను ఏమీ మాట్లాడకపోతే బావుండదని.
    
    అతను ఆ మాటలకు పడీ పడీ నవ్వాడు. నేనడిగిందాంట్లో అంత నవ్వొచ్చేదేమిటో నాకర్ధం కాలేదు.
    
    "సారీ... ఇలా నవ్వుతున్నందుకు ఏమీ అనుకోకండి. మీరు అలా అడిగేసరికి మా ఫ్రెండ్ గౌతమ్ అన్నది గుర్తు వచ్చి నవ్వాను.... అంతే" అన్నాడు.
    
    నేను ఏమిటన్నట్లు అతనివంక అయోమయంగా చూస్తున్నాను. "మా ఫ్రెండ్ గౌతమ్ అని ఒకడున్నాడు. ఓరోజు నేనూ వాడూ కలిసి మా ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళాం. ఆయన కూతురికి ఓ చినబాబు. మేము వెళ్ళేటప్పటికి ప్రొఫెసర్ బాత్రూమ్ లో వున్నారు. వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటూండగా ఆ బాబు అటొచ్చాడు. గౌతమ్ ఆ బాబుతో ఆడుకోవటం ప్రారంభించాడు.
    
    అంతలో వాళ్ళమ్మ వచ్చి బాబును తీసుకుంటూ మీకు ఇంతకు ముందు అడిగారే అలా గౌతమ్ లా మీకు పిల్లలంటే చాలా ఇష్టంలా ఉందే అని అడిగింది. దానికి మావాడు వెంటనే పసిపిల్లలే కాదు- వాళ్ళ తల్లులంటే కూడా ఇష్టమే" అన్నాడు.

 Previous Page Next Page