Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 38

 

    "కాదు"
    "వండర్ ఫుల్ - అయితే నేను చెప్తాను చూడండి , లైలా - మజ్నూల లవ్ ఎందుకు ఫెయిలయింది? వాళ్ళిద్దరూ ఒరిజినల్ గా బావామరదళ్ళు అవటం వల్ల! పార్వతీ- దేవదాసులు ఎందుకు పెళ్ళి చేసుకోలేకపోయారు? దేవదాసు దూరపు చుట్టరికం వల్ల తనకు బావ అవుతాడని పార్వతికి తెలియటం వల్ల. మల్లేశ్వరి అన్ని ట్రబుల్స్ ఎందుకు పడింది? ఎన్టీఆర్ బావ అవటం వల్ల. ఇలా ఎన్నో కోట్ల కొద్దీ ఎగ్జాంపుల్స్ వున్నాయ్"
    అఖిలభాను లేచి నిలబడింది.
    "టైము ఒంటిగంటవుతోంది - ఇక పడుకుందాం పదండి" అందామె. ఆ రాత్రంతా భవానీశంకర్ కి నిద్రపట్టలేదు.
    స్మితారాణిని ముమ్మూర్తులా పోలి వున్న సంధ్యారాణి గురించే ఆలోచిస్తున్నాడు.
    ఆ అమ్మాయి ఎలా అంతర్ధానమయినట్లు? ఎవరు మాయం చేసినట్లు? ఆమె నేవరయినా చంపెశారా? లేక ఆమె పారిపోయిందా? మాధవారావు , సిద్దార్దరావ్ మధ్య వైరం ఎందుకొచ్చింది? ఆ పుస్తకం తాలుకూ సిక్రెట్ ఏమిటి? ఎంత ఆలోచించినా ఎటూ తేలటంలేదు.
    ముందు సంధ్యారాణి ని వెతికి పట్టుకుంటే గానీ తనకు ఈ కేసు వివరాలు తెలీవు. కానీ ఆమె ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? అసలు ఆమెకూ స్మితారాణికి అంత పోలికలున్నాయా?
    లేచి కూర్చున్నాడు భవానీశంకర్. టైము తెల్లవారుఝామున నాలుగావుతోంది. తను సంధ్యారాణి ఫ్లాటు కెళ్ళి మళ్ళీ వెతికితే ఆమె తాలూకు వివరాలు కొన్ని దొరికే అవకాశముంది. ఆమె చదువు సంధ్యలు, ఆమె స్నేహితురాండ్రు , ఆమె తల్లిదండ్రులు.
    నెమ్మదిగా నిలబడి షర్టు వేసుకున్నడతను. అందరూ గాడ నిద్రలో వున్నారు. శబ్దం కాకుండా తలుపు తీసి శ్యామ్ సైకిల్ బయటకు తీసి తలుపులు దగ్గరాగా మూసి రోడ్ మీద కొచ్చాడు. సంధ్యారాణి ఫ్లాటు తలుపు బయట తాళం వేసుంది. తన సైకిల్ తాలుకు స్క్రూడ్రైవర్లతో గొళ్ళెం విప్పటానికి అరగంట సేపు పట్టిందతనికి.
    లోపలకు నడిచి తలుపు బోల్టు వేసేశాడు. లైటు స్విచ్ వేస్తూ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంట్లో సామాన్లన్నీ చిందర వందరగా ఇల్లంతా పూర్తిగా వెతికి వెతికి వెళ్ళినట్లు తెలిసిపోతోంది. బహుశా తను సునంద ఆ నోట్ బుక్ తీసుకుపోయాక ఇంకెవరో ఆ పుస్తకం కోసం వెతికి వుండాలి.
    త్వరత్వరగా అల్మారాలూ, సూట్ కేసులూ వెతకసాగాడతను. చాలాసేపటి తర్వాత అతని ప్రయత్నం ఫలించింది. బెడ్ రూమ్ లోకి కప్ బోర్డులో అరలో కనిపించింది ఫోటో ఆల్బం.
    అక్కడే కూర్చుని త్వరత్వరగా ఆల్బమ్ తెరచి చూశాడు. మొదటి కార్డుమీదే కనిపించింది కలర్ ఫోటో. ఆ ఫోటో చూస్తూనే నిశ్చేష్టుడయ్యాడతను. అచ్చం స్మితారాణి లాగానే వుందామే కూడా. ఇద్దరికీ డ్రస్ లో తప్ప మరెందులోనూ తేడా వున్నట్లు కనిపించలేదు. సంధ్యారాణి చాలా ఆధునికమైన డ్రస్ లో వుంది. జీన్స్, మిడ్డి, చుడీదార్ అన్నీ అలాంటి డ్రస్ లే!
    ఒక్కొక్క కార్డు తీసి చుస్తున్నడతను. సునందతో దిగిన ఫోటోలు, మరికొంతమంది బోయ ఫ్రెండ్స్ తోనూ, గాళ్ ఫ్రెండ్స్ తోనూ దిగిన ఫోటోలు. ఎక్కువగా భార్గవ్ తో దిగిన ఫోటోలు కనబడ్తున్నాయి అతనికి. ఆఖరి పేజీలో కనిపించింది అతనికి కావలసిన ఫోటో.
    ఆమె, మరో యువకుడు మాధవరావు దంపతులకు చెరో వేపు, కూర్చుని వున్నారు. వెనుక తాజ్ మహల్ కనబడుతోంది. అంటే ఒకవేళ సంధ్యారాణి మాధవరావుకి కూతురా? లేక బంధువా?
    మొత్తం మిస్టరీ అంతా క్షణంలో సాల్వ్ అయిపోయినట్లు అర్ధమయిందతనికి. స్మితా రాణిని సిద్దార్ధరావు గ్రూపు వాళ్ళు చంపటానికి ప్రయత్నించటానికి కారణం ఆమెను సంద్యారాణి గా భ్రమ పడటమే. అందులో ఏ మాత్రం అనుమానం లేదు.
    కానీ అసలు సంధ్యారాణిని  ఎందుకు చంపాలనుకున్నారో మాత్రం తెలీటం లేదు . ఈ దారుణాలన్నీ కూడా ఆ అడ్రస్ బుక్ వల్లే జరుగుతున్నాయని మాత్రం తెలుస్తోంది.
    త్వరత్వరగా ఆ అల్భం లోని ఫొటోలన్నీ తీసుకుని ఇంటి బయటికొచ్చాడతను. అప్పటికే పూర్తిగా తెల్లారిపోయింది. తలుపు దగ్గరగా వేసి మెట్లమీద నుంచి వడివడిగా కిందకు దిగి సైకిల్ మీద ఇంటికి చేరుకున్నాడు.
    శ్యాం, అఖిలభాను, స్మితారాణి, తులసి ఇల్లంతా చిందర వందరగా పడి వున్న సామాన్ల మధ్య కూర్చుని ఉన్నారు దిగులుపడి.
    "ఏమిటది ? ఏం జరిగింది?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
    "విలన్స్ వచ్చారంకుల్! శ్యాం అంకుల్ తోనూ, స్మితా అంటీ తోనూ, అఖిలాంటీతోనూ పైటింగ్ చేసి ఓడిపోయి పారిపోయారు........" అంది తులసి ఉత్సాహంగా.


                                                        11


    భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు. "ఇలా జరగవచ్చనీ నేననుకుంటూనే ఉన్నాను కామ్రేడ్."
    "ముందు ఆ అడ్రస్ పుస్తకం కోసం ఇల్లంతా వెతికారు. ఆఖరుకి బెడ్ రూంలో నిద్రపోతున్న స్మితారాణిని చూసి ఆమెను కిడ్నాప్ చేయబోయే సరికి నేను పిస్టల్ తీయాల్సి వచ్చింది" చెప్పాడు శ్యాం." అప్పుడు గానీ కాలికి బుద్ది చెప్పలేదు వాళ్ళు."
    "అందుకే నీకు పిస్టల్ ఇచ్చాను కామ్రేడ్! మనం తక్షణం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయకపోయినట్లయితే స్మితారాణిని ఇంటర్నేషనల్ లెవల్లో స్మగ్లింగ్ చేసే గాంగ్ లు యాక్షన్ లోకి దిగటం ఖాయం అన్నాడు భవానీ శంకర్ తన చేతిలోని ఆల్బం శ్యాం మీదకు విసురుతూ.
    శ్యాం దానిని కింద పడకుండా పట్టుకుని మొదటి పేజీ చూశాడు చూస్తూనే ఆశ్చర్యంగా అఖిలభాను వేపు చూశాడు.
    'అఖిల! ఇదిగో ఈ అమ్మాయ్ చూడు! అచ్చం మన స్మితారాణి లాగానే ఉంది" అన్నాడు అల్భం ఆమె ముందు పెడుతూ.
    తులసీ, స్మితారాణి కూడా చూశారది.
    "అబ్బ! అచ్చం స్మితా అంటీయే " అంది తులసి.
    "ఎవరీ అమ్మాయ్?" అడిగింది అఖిలభాను భవానీ శంకర్ వేపు చూస్తూ.
    "ఆఖరులో ఉన్న గ్రూప్ ఫోటోని బట్టి చూస్తుంటే మాధవరావ్ కుటుంబానికి చెంది ఉండాలి. లేదా వాళ్ళ కుటుంబానికి అతి సన్నిహితమున్న వ్యక్తయినా అయిండాలి- మన స్మితారాణిని చూసి ఈ అమ్మాయే అనుకుని హత్యాప్రయత్నాలు చేశారని నాకనిపిస్తుంది" వివరించాడతను. స్మితారాణి ముఖంలో భయం కనిపించింది.
    "మనం ఇప్పుడేమిటి చేయటం? ఏదొక విధంగా స్మితారాణికి వేరు సంధ్యారాణి వేరన్న విషయం అందరికీ తెలిసేలా చేయకపోతే స్మితారాణికి చాలా ప్రమాదం" అన్నాడు శ్యాం ఆలోచనల్లో సతమతమవుతూ.

 Previous Page Next Page