Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 37


    భవానీ శంకర్ బాధతో పొట్ట రెండు చేతులతో పట్టుకొని కూర్చునిపోయాడు. అంతవరకూ సిద్దార్దరావు పక్కనే నిశ్శబ్దంగా కూర్చున్న యువతి ఆందోళనగా చూసింది సిద్దార్ధ వేపు.
    "నీకేమయినా పిచ్చెక్కిందా? మనకి ఆ పుస్తకం దొరక్కుండా చంపేస్తానంటావేమిటి?" అంది చిరాకుగా.
    సిద్దార్ధరావు మాట్లాడలేదు. కర్చీఫ్ తో ముఖం తుడుచుకున్నాడు .
    "వదిలేయండి" అందామె భవానీ శంకర్ ని బంధించి పట్టుకున్న వ్యక్తులతో.
    ఇద్దరూ అతనిని వదిలేశారు. భవానీ శంకర్ లేచి నిలబడ్డాడు మళ్ళీ.
    "మాగాడికంటే ఆడది తెలివిగలదనటానికి మీ ఇద్దరే కరెక్ట్ ఎగ్జాంపుల్ కామ్రేడ్! భవిష్యత్తులో కూడా మీ గాంగ్ మొత్తం ఆమె మాట వింటే బాగుపడతారు" అన్నాడు సిద్దార్ధతో.
    "ఏయ్ ! ఆఖరి మాటగా చెప్తున్నాను. ఆ పుస్తకం ఇస్తే నీకు లక్ష రూపాయలిస్తాను. అంతకుమించి చిల్లిగవ్వ కూడా ఇవ్వను -" కోపం అణుచుకుంటూ అన్నాడు అతను.
    "లక్షా! ఆహ్హాహ్హ లక్షా! లక్ష రూపాయలకు వాల్యు ఎప్పుడో పోయింది కామ్రేడ్! కనీసం పది లక్షలయినా లేందే రాజీకి రావటం అసంభవం."
    సిద్దార్ధరావ్ అసహనంగా లేచి నిలబడ్డాడు.
    "నీకు పిచ్చెక్కింది. పది లక్షలంటే తమాషాగున్నట్లుందే నీకు. వెళ్ళు! ఒక్క పైసా కూడా ఇవ్వను. మన పాతికేళ్ళ సర్వీసులో మనం డబ్బు తీసుకోవటమే కాని ఎవరికీ ఒక్క పైసయినా ఇవ్వలేదు. వెళ్ళు నీ ముఖం చూస్తేనే కత్తితో చెక్కబుద్దవుతోంది" ఉద్రేకంగా అరిచాడు అతను.
    "బాష కామ్రేడ్! మరికొంచెం మంచిబాష వాడడానికి ప్రయత్నించు పైకొస్తావు! లేకపోతే ఎప్పటికి ఇలానే "ఫిట్ ఫర్ నధింగ్"లెవల్లో మిగిలిపోతావు." అనేసి బయటకు నడిచాడు. సిద్దార్ధరావు అనుచరులందరూ అతనివేపే చూస్తూ నుంచున్నారు. తలుపు మూసుకునే ముందు భీకరంగా అరిచాడు సిద్దార్ధరావ్.
    "ఏం ఆఖరిసారిగా చెపుతున్నా! రేపు ఉదయం పదిగంటలలోగా ఆ పుస్తకం తెచ్చియ్యకపోయావో - నీ శాల్తీ గల్లంతవుతుంది గుర్తుంచుకో"
    "సరే కామ్రేడ్! అలాగే గుర్తుంచుకుంటాను. జ్ఞాపశక్తికి మనం పెట్టింది పేరు" అనే తలుపు మూసి బయటకొచ్చాడు . సన్నటి వ్యక్తీ, లావుపాటి వ్యక్తి యిద్దరూ నిలబడి వున్నారు బయట. మెట్లు దిగి కిందకు వచ్చాడు తను. బార్ లో తలుపు దగ్గర నిలబడి వున్నాడు శ్యామ్.
    "హమ్మయ్యా! లోపల ఇంతసేపు వుండిపోయేసరికి నిన్నేం చేస్తున్నారో అని భయపదిపోయాను" అన్నాడతను.
    "పద - ఇంటికేళదాం! ఇవాళ చాలా అభివృద్ధి సాధించాం ఈ కేసులో - మిగతా కార్యక్రమం రేపు"
    సైకిల్ ఇంటివేపు దూసుకుపోయింది.
    అఖిలభాను, స్మితారాణి, తులసీ మేలుకునే వున్నాడు. ఇద్దరూ సైకిల్ మీద యిల్లు హ\చేరుకోవడం చూడగానే వాళ్ళిద్దరి ముఖాలూ వికసించాయి.
    "మీరేమైపోయారో , ఏం గొడవల్లో ఇరుక్కున్నారోనని నాకొకటే భయంగా ఉంది. ఇంక మీరు ఈ పరిశోధనలూ, తిరుగుళ్ళు మానేసి యింట్లో కూర్చోండి" అంది అఖిలభాను కోపంగా.
    "ఏమిటి? మధ్యలో వెనక్కు తిరగటమా! ఇంపాజిబుల్ సిస్టరిల్లా! అభిమన్యుడు - పద్మవ్యూహం గురించి వినలేదా? మనమూ అంతే"
    "అయితే ఆ గొడవేదో నువ్వేపడు! శ్యాముని ఇందులోకి లాగొద్దు" ఖచ్చితంగా చెప్పేసిందామె. శ్యాం ఆనందంగా గర్వంగా చూశాడు భవానీశంకర్ వేపు.
    "చూశావా నేనంటే ఎంత ప్రేమో" అన్నాడు నవ్వుతూ.
    అఖిలభాను కోపంగా చూసింది శ్యామువేపు.
    "అంకుల్ ఇవాళ మళ్ళీ ఫైటింగ్ చేశారా?" ఆత్రుతగా అడిగింది తులసి.
    "ఓ! టిరిఫిక్ ఫైట్! ముగ్గుర్ని చట్నీ చేసేశాము"
    "అబ్బ! త్రిమూర్తులలో పైట్స్లాగానా?"
    "ఎగ్జాక్ట్ లీ"
    అంతవరకూ వాళ్ళ మాటలు వింటున్న స్మితా రాణి కలిపించుకుంది.
    "పోనీ నేనూ తులసీ మాబావ వెంకటరత్నం వాళ్ళింటికి పోతామే అఖిలా! అనవసరంగా నావల్ల మీ అందరికి సమస్యలు ఎక్కువవుతున్నాయ్" దీనంగా అందామె.
    భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు.
    "వాట్ కామ్రేడ్ స్మితారాణి! మధ్యలో ఈ బావ వెంకటరత్నం ఎవరు? ఇంత హటాత్తుగా ఆ పాత్ర మన కధలో కెందుకొచ్చింది?" అడిగాడు ఆత్రుతగా.
    స్మితారాణి ఏదో చెప్పబోయి సిగ్గుపడింది.
    "వెంకటరత్నం వాళ్ళ దూరపు బంధువు .వీళ్ళిద్దరికీ వివాహం చేయాలని వాళ్ళక్క బావలు నిశ్చయించారట" చెప్పింది అఖిల.
    "నో నో నో ! నేనొప్పుకోను కామ్రేడ్! ఈ బావ మరదళ్ళ పెళ్ళిళ్ళన్నీ ఫ్లాష్ అవుతున్నాయి ఈమధ్య. వాళ్ళందర్నీ ఇంటర్వ్యు కూడా చేశాన్నేను. మగాళ్ళు- అంటే ఈ బావ అసోసియేషన్ వాళ్ళు చెప్పేదేమీటంటే మరదలు పిల్లలతో చిన్నప్పట్నుంచి చనువుగా గడపటం వలన పెళ్ళికూతురు ఇచ్చే థ్రిల్ వాళ్ళకు ఏమాత్రం దొరకటంలేదట. అందుకు బావలను పెళ్ళిచేసుకుని ఆ నరకం భరించలేక గత వారంరోజుల్లో డెబ్బయి ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారట. నిన్న ఈవెనింగ్ ఎడిషన్ లో వేశారు"
    "అవునంకుల్ సినిమాలలో కూడా అంతే! బావా బావా అంటూ తిరిగే అమ్మాయిని వదిలేసి ఇంకో హీరియిన్ ని చేసుకుంటాడు హీరో అంది తులసి."
    "బైదిబై మీరు హిస్టరీ స్టూడెంటా స్మితాగారూ?"

 Previous Page Next Page