Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 38

 

    సైకిల్ యజమాని దాసు చూపించిన వైపు చూసి గతుక్కుమన్నాడు. గుండె మీద చెయ్యి వేసుకున్నాడు.


    మట్టి గెడ్డలు గెడ్డలుగా విరుచుకొని గోదావరిలో పడుతోంది. నీళ్ళలో కలిసిపోతోంది. ఆ ఊళ్ళో సర్వనాశనం జరగడానికి మరెంతోసేపు పట్టదు. గండి పడి వరదనీటితో వూరు మునిగిపోతుంది. నిమిషాలు...క్షణాలు లెక్కపెట్టుకోవాలి.


    అంత వర్షంలోనూ, గాలిలోనూ అతనికి చెమటలు పోయసాగాయి. కాళ్ళల్లో సన్నని ఒణుకు. పెదాలు తడి ఆరిపోయినాయి.


    "బాబూ! మీరందరూ ఇక్కడ్నుంచి పారిపోండి" గొంతు చించుకొని అరిచాడో మనిషి వున్నట్టుండి.


    "దేనికి?" దాసు అడిగాడు అతనికేసి చూసి.


    "దేనికేమిటి? మీకు గోదావరి గురించి తెలీదు. గట్టు తెగిపోతోంది. మనం కొట్టుకుపోతాం. ప్రాణాలు కాపాడుకోవాలి. పదండి, పరుగెత్తండి" అదురుతోన్న గొంతుతో అరిచాడు ఇంకొకతను.


    జనం పోగయిపోతున్నారు. చూసి పరుగులు తీస్తున్నారు.


    హాహాకారాలు, కేకలు, ఏడుపులు....


    తక్షణచర్య ఏమిటి?


    ఇలా చెయ్యండి అని ఎవరన్నా చెబితే గోదారిలోనే దూకగల సాహసం అభినయ్ బృందానికి వుంది. తమని ఏం చెయ్యవలసిందీ కూడా చెప్పకుండా అతను సైకిల్ మీద వెళ్ళాడు. పూర్ణ కూడా లేడు.


    "ఇప్పుడేం చెయ్యాలి?" అడిగారు ముక్తకంఠంతో.


    "సురక్షిత ప్రాంతానికి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలి" అన్నాడో వ్యక్తి.


    "నో!" అరిచింది గీత.


    అందరూ ఆశ్చర్యంగా ఆమెకేసి చూశారు.


    అప్పటికే ఆమె వానలో పూర్తిగా తడిసిపోయింది. నెత్తిమీద నుంచి మొహం మీదకి పడుతోన్న నీటిని చేత్తో విదిలిస్తూ-


    "మనం ఇంత దూరం వచ్చింది పారిపోడానికి కాదు, పిరికితనంతో పారిపోవడమే పరమావధిగా అనుకుంటే యింత దూరం రావడంలో అర్ధం లేదు."


    "ఫ్రెండ్స్!


    ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం వుంటుంది. సమస్యకి భయపడక తెలివిగా పరిష్కారం కోసం చూడాలి. అభినయ్ అధికారులని కలుసుకోడానికి వెళ్ళాడు. మనం యిక్కడే వుండి మైకులో ప్రజల్ని అప్రమత్తం చేయాలి" అంది గీత గంభీరంగా.


    అభినయ్ అక్కడ లేకపోయినా అతని స్థానంలో నిలబడి ఓ ఆడపిల్ల ధైర్యాన్ని రంగరించి పోస్తుంటే చాలామంది విడ్డూరంగా చూశారామెకేసి.


    "చిన్నపిల్ల ఏదో అంటుంటే అలా చూస్తా నించుంటారెందుకయ్యా? ఇది నీళ్ళగుంట కాదు, గోదావరయ్యా బాబూ గోదావరి" సైకిల్ యజమాని నెత్తి కొట్టుకుంటున్నాడు.


    "మేం రాం. నీకు భయంగా వుంటే వెళ్ళిపో" అన్నాడు ఓ విద్యార్ధి.


    "మరి నా సైకిలు?" ఆందోళనగా అడిగాడు అతను.


    "నీ సైకిలెక్కడికీ పోదు. మా లీడర్ వచ్చాక తీసుకో."


    "ఈలోగా గోదావరిలో కొట్టుకుపోతే?" అన్నాడు అతను.


    "అప్పుడు నీ సైకిల్ తో పనే వుండదు" ఎవరో అన్నారు.


    "ఓరయ్యో! ఆడెవడో తెలివైనవాడిలా వున్నాడు. ఛస్తానని భయపడి నా సైకిలెక్కి పారిపోయాడు దొంగనాయాల. పోతే పోనీ. బతికుంటే కారు కొనుక్కుంటాను" అని పరుగు తీయబోయాడు. దాసు అతని జబ్బ పట్టుకుని ఆపాడు.


    "ఓయ్, దొంగా గింగా అని నోటికొచ్చినట్టు వాగద్దు. కొంచెం సేపాగు. నీ సైకిల్ నీకిస్తాం" దాసు కోపంగా అన్నాడు.


    ఆ వ్యక్తి పారిపోదామన్నా వీలులేకుండా విడిచిపెట్టడం లేదు వాళ్ళు.


    ఎలా చెప్పినా వినే స్థితిలో ఆ కుర్రాళ్ళు లేరు.


    "ఓరి దేవుడో నువ్వే దిక్కు నాకు. నన్ను గోదావరిలో కొట్టుకుపోకుండా కాపాడు నాయనోయ్!" అని ఏడుస్తూ జనం మధ్య చతికిలబడి పోయాడు.


    అంతలో అక్కడికి ఒక లారీ వేగంగా దూసుకొచ్చింది. దాని వెనుక మరొకటి, దాని వెనుక ఇంకొకటి.


    బిలబిలమని పోలీసులు, సైన్యం దిగారు వ్యానుల్లోంచి.


    లారీలనుండా సిమెంట్ బస్తాలున్నాయి. ముందు ఆగిన లారీలోంచి దిగాడు అభినయ్. వెనుక బాడీలోంచి సైకిల్ని దింపాడు కానిస్టేబుల్. దాన్ని తీసుకుని తన మిత్రబృందం దగ్గరకి వచ్చాడు అతను.


    "మా అభినయ్ వచ్చేశాడు ఇదిగోనోయ్ లింగయ్య నీ సైకిల్" అరిచాడు విద్యార్ధి.


    "నా పేరు లింగయ్య కాదు, సింహాద్రి."


    "క్షమించండి సింహాద్రిగారూ. పరిస్థితిని చూశాక మిమ్మల్ని అడిగే వ్యవధి లేకపోయింది" అన్నాడు అభినయ్.


    సింహాద్రి లారీలని, సిమెంట్ బస్తాలని, సైన్యాన్ని, అధికారులనీ చూసి నోరెళ్ళబెట్టాడు. పరిస్థితి పూర్తిగా అర్ధం అయ్యింది సింహాద్రికి. బాధ్యతని నెత్తిన వేసుకున్న ఆ కుర్రాడి గురించి తనెంత తప్పుగా ఊహించుకున్నాడు. దొంగనుకున్నాడు.


    చిన్నవాడైనా చెయ్యెత్తి మొక్కదగినవాడే! ప్రాణభయంతో పారిపోయాడనుకున్నాడు. తోటి స్నేహితుల్ని పులినోటికి అందించి తెలివిగా తప్పుకున్నాడనీ అనుకున్నాడు.


    కానీ అలాంటి కుర్రాడు తన సైకిల్ని తనకి అప్పగించాడు. తగిన బందోబస్తుతో తిరిగి వచ్చాడు. అందుకే కాబోలు అంటారు. ఏది చేసినా కుర్రాళ్ళే చేయాలి అని.


    ఆ క్షణంలో అభినయ్ తీసుకున్న నిర్ణయంవల్ల ఎన్ని వేలమంది ప్రాణాలని కాపాడేలా చేసిందో వూహించుకున్నాడు సింహాద్రి.


    అంతే అతను అభినయ్ కాళ్ళమీద పడిపోయాడు.


    "అరే! ఇదేంటి?" అన్నాడు ఆశ్చర్యంగా అభినయ్.


    "బాబూ! నీ గురించి తెలీక నిన్ను తప్పుగా అంచనా వేశాను. దేవుడెక్కడో లేడు బాబూ. ఇక్కడే, ఇక్కడే నా ఎదురుగా వున్నాడు బాబూ" చేతులు జోడించాడు అతను.


    "బాగుంది లే! పెద్దవాడివి. అవతల పోలీసులకి మనం సాయం చేయాలి" అన్నాడు అతను.


    సింహాద్రిని వాళ్ళు పట్టించుకోలేదు. అతి వేగంగా లారీలని చేరి బస్తాలని వీపుమీద వేసుకుని చిన్నతనంనుంచి కాయకష్టం తెలిసిన వాళ్ళలా గట్టు పూడ్చడం ప్రారంభించారు. సింహాద్రి సైకిల్ సంగతి మరిచిపోయాడు.


    ఆ విద్యార్ధులెవరు?


    ఎక్కడివాళ్ళు!


    ఎవరు రమ్మంటే వచ్చారు?


    ఎందుకింత కష్టపడుతున్నారు?


    తను? ఆ వూరిలో పుట్టి పెరిగినవాడు తను చేద్దామనుకున్నదేమిటి?


    "ఛీ! నాదీ ఓ బతుకేనా?" అనిపించింది సింహాద్రికి.


    అంతే! సింహాద్రి లారీవేపు కదిలాడు.


    అతన్ని చూసి మరికొందరు....


    "బాబూ! ఓ బస్తా ఈ భుజం మీద వేయండి" అన్నాడు సింహాద్రి.


    లారీమీద కెక్కిన అభినయ్ పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేసింది.

 Previous Page Next Page