20
గోదావరి గట్టుమీద జనం గుంపులు గుంపులుగా చేరారు.
ప్రతి ఒక్కరి మొహంలోనూ ఆందోళన కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది.
ఆవలితీరం అంచు కనపడకుండా అనంతంగా కనిపిస్తోన్న గోదావరిని చూస్తుంటే గుండెల్లో గుబులు పేరుకొంటోంది.
గోదావరి నీరు చిక్కగా, మడ్డిరంగులో సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. ఆ నీటి వేగాన్ని చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి.
జనం గోలగా మాట్లాడుకొంటున్నారు.
భయంతో గుండెలమీద చేతులు వేసుకొంటున్నారు.
నీటిలో చెట్ల కొమ్మలు, పాములు, పూరి గుడిసె కప్పులు, పశువులు, కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. కంటికి కనిపిస్తోన్న ఆ భయానక దృశ్యం కడుపులో చేయిపెట్టి కెలికినట్టుగా వికారాన్ని కలిగిస్తోంది.
నీరు గట్టు అంచుని తాకీతాకకుండా వేగంగా కదిలిపోతోంది.
వరద ఉధృతం పెరుగుతూనే వుంది.
రైలు బ్రిడ్జి దగ్గర, ధవలేశ్వరం ఆనకట్ట దగ్గర గంట గంటకీ నీటిమట్టం పెరుగుతోంది.
జిల్లా కలెక్టర్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రమాద పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన ఆదేశాలని అధికారులకి జారీ చేస్తున్నారు. పోలీసు బలగాన్ని, సైన్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగులనీ ఊపిరి తీసుకోనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడాయన.
తను జారీచేసిన ఆదేశాలని అమలు చేయడానికి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆయనకి అనవసరం. ఆ ఇబ్బందులని సైతం అధిగమించి పరిస్థితిని మెరుగుపరచడం క్రింది ఉద్యోగుల బాధ్యత.
ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. వాన కురుస్తూనే వుంది ఆగి ఆగి.
ప్రవాహ వేగానికి గట్టుకున్న మట్టిని కోసి తన కడుపులో దాచేసుకొంటోంది గోదావరి. కొద్ది కొద్దిగా నీరు అంచును దాటి గట్టుమీదనుండి ఇవతలకి జారుతోంది.
పిల్లలు పెద్దవాళ్ళ చేతులని గట్టిగా పట్టుకుని చూస్తున్నారు.
ప్రపంచంలోని దుఃఖం, కష్టం అన్నీ తెలీని ఆ పసికందులు మనసులో క్రమంగా భయం తగ్గగానే తెలీని ఉత్యాహముతో కేరింతలు కొడుతూ పరుగులుదీయటం, వానలో ఆటలాడ్డం ప్రారంభించారు. ఓ పక్క రోడ్లమీద మోకాలి లోతు నీళ్ళు పారుతున్నాయి.
అదే వేగంతో నీటిమట్టం పెరిగితే మరో నాలుగు గంటల్లో వరదనీరు గట్టు పైనించి పొంగి ఊళ్ళోకి రావడం ఖాయం.
అప్పటికి నాలుగురోజులనాడే పల్లపు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులై పోయారు. ఇళ్ళు తడిసిపోయి గోడలు చమ్మరిస్తున్నాయి.
ప్రమాదం వున్న ప్రదేశాలనుంచి ప్రజలని ఖాళీ చేయించి స్కూళ్ళలోనూ, కాలేజీలలోనూ ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు.
లారీలు, జీపులు హడావుడిగా నీళ్ళలో తిరుగుతున్నాయి. లారీల్లో జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అలాంటి సమయంలో అభినయ్ బృందం రాజమండ్రి చేరుకున్నారు.
తమ ఊహకంటే హృదయవిదారకంగా అక్కడ పరిస్థితి కనబడే సరికి అభినయ్ కి గుండెలో చేయిపెట్టి కెలికినట్టయింది.
రాఘవరావు, అభినయ్ వెంటనే కలెక్టర్ ని కలుసుకున్నారు. తమ వంతు చేయూత నివ్వడానికి సంసిద్ధతను తెలియజేశారు.
ఏఏ ప్రాంతాల ప్రజలకి తక్షణ సహాయం అవసరమో కనుక్కొని ఆ ప్రాంతానికి బయలుదేరాడు అభినయ్ బృందం.
ఒక బ్యాచీ గోదావరి గట్టు దగ్గరకి వెళ్ళారు.
ఎటుచూసినా జనం. వాళ్ళ మొహాల్లో ఆందోళన.... ఆరాటం....
నిరాశ్రయుల ఘోష హోరెత్తిపోతోంది.
మనసులని కలచివేస్తున్న దారుణ దృశ్యాలని చూస్తున్న కొద్దీ ఆవేశం ముంచుకొస్తోంది యువతలో. గట్టుమీద మెరుపుల్లా కదులుతున్నారు వాళ్ళు.
నీటి అంచుల రాపిడికి గట్టుకు వున్న మట్టి పెళ్ళలు పెగళ్ళుగా కరిగి గోదావరిలో కలిసిపోవడం వాళ్ళకంట పడింది.
అదే వేగంతో మట్టి కొట్టుకుపోవడం జరిగితే ఘోర ప్రమాదం తప్పదు. గండి పడిపోతుంది.
వరద నీరు శివుని ఝటాఝటా బంధనా విముక్తురాలైన గంగలా మహోధృత వేగంతో ఊళ్ళోకి ప్రవహిస్తే పరిస్థతి తీవ్రంగా విషమించి పోతుంది.
అంతే! క్షణం ఆలస్యం చేయలేదు అభినయ్. 'ఎవరిది' అని కూడా ఆలోచించకుండా అక్కడ కనిపించిన సైకిల్ మీదికి ఎగిరి కూర్చుని నీళ్ళలో తొక్కుకుంటూ పోసాగాడు అభినయ్.
వెంటనే ఆ విషయాన్ని అధికారులకి తెలియజేయాలన్నది అతని ఆలోచన. లేకపోతే ఘోర ప్రమాదం తప్పదు.
సైకిల్ యజమాని "బాబో.... దొంగ.... నా సైకిల్ ఎత్తుకుపోతున్నాడు" అని అరవసాగాడు.
ఆ సైకిల్ ని అభినయ్ తీసుకెళ్ళడం బృందంలోని సభ్యులు చూశారు.
"కంగారుపడకు. అతను దొంగకాదు, మా నాయకుడు. అటొక్కసారి చూడు నీ సైకిలెందుకు తీసుకెళ్ళాడో నీకే తెలుస్తుంది" అన్నాడు దాసు.