Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 37


    'మీకు పెళ్ళి కాకుండా పదహారేళ్ళ బాలకుమారిగా వుంటే బహుశా మీమీద  ఇంత మోహం వుండేది కాదేమో' అన్నాడు.

 

    అతని జవాబు నా తల తిప్పింది. పెళ్ళి కావడమే అతను నన్ను  ఇష్టపడడానికి వున్న క్వాలిఫికేషన్ అని డైరెక్టుగా చెప్పాడు.

 

    "అనుభవాలతో పండిన మీ అందం నన్ను పిచ్చివాడ్ని చేస్తోంది" అని కళ్ళు దించుకున్నాడు. ఈసారి  అతను సీరియస్ అయిపోయాడు. తను చెబుతున్న దాంట్లో వున్న నిజం గాఢతను నాకు తెలియజేయడానికే సీరియస్ అయిపోయాడని అవగతమైంది.

 

    "వివాహితగా నాకు కొన్ని హద్దులున్నాయి. వాటిని దాటితే నా పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో ఆలోచించు" అన్నాను.

 

    "అంతే మీకు ఇష్టమేనన్నమాట" అతని కళ్ళల్లో ఆనందం  చిమ్మింది.

 

    అంతవరకు నేను ఇష్టంలేదని చెబుతానేమోనన్న అనుమానం పటాపంచలు కావడంతో  ముఖం మరింత కాంతివంతమైంది. ఒక స్త్రీ తనను యాక్సెప్టు చేసినప్పుడు మగవాడు అంతగా ఎగ్జేయిట్ మెంట్ కి గురవతాడని నాకు తెలియదు. కానీ నేను ప్రకటించిన భయంలో అతను తీసుకున్న అర్థం వుందా అని ఒక్క క్షణం ఆలోచించాను.

 

    ఇక మాట్లాడడం తనవల్ల కాదని, ఆ ఆనందాన్ని తానొక్కడే సెలబ్రేట్  చేసుకోవాలని చెప్పి టక్కున లేచి, ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.

 

    దురదలేసి గోక్కుంటున్నప్పుడు ఆ సుఖానికి ఆనందించాలో, దురదలు మరింత ఎక్కువై చర్మం చిట్లుతుందని బాధపడాలో తెలియనట్లు అయి పోయింది నా పరిస్థితి.

 

    ప్రేమ, ఆకర్షణ, సెక్స్, అభిమానం..... ఇవన్నీ వేరువేరుగా...... మనం గుర్తించేంత ఈజీగా వుండవు. అవన్నీ కలిసిపోయి కలగాపులగంగా వుంటాయి. అతనిమీద నాకు ఎలాంటి మక్కువ వుందో తేల్చుకోలేక పోయాను. మొత్తానికి జీవితంలోని టెన్షన్ ని అంతా  అనుభవిస్తున్నాను. నువ్వు ఇక రావద్దు. అని సీరియస్ గా చెబితే అతనికరాడు. కానీ అలా చెప్పేస్తే నాకు మిగిలేది శూన్యం.

 

    ఇంత గందరగోళం చెలరేగాక ఆ నిశ్శబ్దాన్ని భరించగలనా?

 

    ఇది జరిగిన మళ్ళీ వారం రోజుల తరువాత నా భర్తకు ఒంగోలు పనిపడింది. ఈసారి ఇరవైరోజుల క్యాంప్. ఇంత సుదీర్ఘకాలం ఒంటరిగా వుండడం అదే మొదటిసారి. ఈ ఇరవైరోజుల్లో ఏదో జరిగిపోతుందని తెలుస్తూనే వుంది. ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడమని ఓ పక్క మనసు హెచ్చరిస్తూనే వుంది.

 

    నా భర్త వెళ్ళిపోయాడు. ఆరోజు సాయంకాలం ఆయన్ను ట్రైన్ ఎక్కించి ఇంటికొచ్చాను. అప్పటికే బాగా  చీకటి పడింది. జయంత్ వస్తాడేమోనని భయపడ్డాను. వస్తే బాగుండునన్న ఫీలింగ్ లేదని చెప్పడం కూడా అసత్యమే అవుతుంది.

 

    భోజనాలు పూర్తిచేసి పడుకున్నాను. కిటికీలోని చందమామ నావైపు యాంగ్జయిటీగా చూస్తున్నాడు. గోడకు జారగిలబడ్డ మల్లెతీగ వెన్నెల్లో ఒంటిని ఆరబెట్టుకుంటున్నట్లుంది. అప్పుడప్పుడు తలుపు చప్పుడైనట్లు ఉలిక్కిపడుతున్నాను. కానీ జయంత్ రాలేదు.

 

    ఉదయం అయింది. అతని ఆలోచనలనుంచి తప్పించుకోడానికి కావాలనే ఏవేవో పనులు కల్పించుచున్నాను. వడియాలు పెట్టాను. మధ్యాహ్నం నుంచి స్వెట్టర్  అల్లుతూ కూర్చున్నాను. సాయంకాలం అయింది. ఇక భరించలేకపోయాను. చంద్రగిరికి వెళ్ళాలని మనసు పీకుతోంది.

 

    బలవంతంగా కంట్రోల్ చేసుకుని పిల్లల్ని తీసుకుని ఫస్ట్ షో కి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అయింది ఈలోగా జయంత్  వచ్చాడేమోనని ఇంటిముందు బూట్ల ముద్రల కోసం వెదికాను. నా పిచ్చి గానీ అంత దుమ్ములో ముద్రలు కనిపిస్తాయా?

 

    భోజనాలు పూర్తిచేసి పడుకున్నాం.

 

    "ఇదే మీ శృంగార సామ్రాజ్యం?" అని జయంత్ అడగడం గుర్తుకొచ్చింది.

 

    అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. పలచటి నిద్ర శరీరాన్ని చుట్టుకుంది. తలుపు చప్పుడుకి దిగ్గున లేచి కూర్చున్నాను. తలుపు ఎవరో కొడుతున్నట్లు శబ్దం.

 

    గుండెల్లో ఏదో అలజడి. జయంత్ వస్తే ఏం చేయాలో  తోచలేదు. అతను రాకుండా నా భర్త వస్తే బావుండునని వేయి దేవుళ్ళకు మొక్కుతూ తలుపు దగ్గరికొచ్చి గడియ తీశాను.

 

    జయంత్..... నవ్వడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.

 

    "నువ్వా?"


    
    "అవును. మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేశాను" తల వంచుకుని చెప్పాడు.

 

    "ఎక్కడినుంచి?"

 

    "చంద్రగిరి నుంచి"

 

    "ఇంత రాత్రిపూట ఎలా వచ్చావ్?" ప్రకృతిలోని నిశ్శబ్దపు గాఢత్వాన్ని బట్టి పన్నెండు పైనే అయ్యుంటుంది టైమ్.

 

    "నడిచి...."

 

    "నడిచా..... ఇంత దూరం నడిచే వచ్చావా?"

 

    "ఆఁ! వెన్నెల్లో మీరు ఎలా వుంటారో చూడాలనిపించింది. నిద్ర పడక మీద నుంచి లేచి అలా వచ్చేశాను."

 

    చప్పున ఏం చెప్పాలో నాకు తెలియలేదు. తలుపుదాటి వరండాలోకి వచ్చాను.

 

    "ఇంకాస్త- అలా వరండా దిగండి. వెన్నెల్లో మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను."


    
    అది పిచ్చో, ప్రేమో, మోహమో, కామమో విశ్లేషించే స్థితిలో లేను. ఆర్గ్యుమెంట్లు, ఒట్టి మాటలు, నైతికా మీమాంసలు, మెట్ట వేదాంతాలు అనవసరమనిపించింది. అందుకే మరో మాట మాట్లాడకుండా వరండా దిగి ముందున్న తోటలోకి వచ్చి నిలబడ్డాను.

 

    నా వెనక వచ్చాడు.

 

    ఈ వారం రోజుల్లోనే ఎంత మార్పు..... అతనిలో ఏదో అలవికాని కోరికను గుండెల్లో మోస్తున్నట్టు మనిషి వంగిపోయాడు.

 

    నా ఎదురుగ్గా నిలుచుని, ఒక్కక్షణం పాటు నన్ను ఆపాదమస్తకం పరిశీలించి వేగంగా వెళ్ళిపోయాడు.

 

    ఒంటరిగా మిగిలిపోయాను.

 

    ఇంతవరకు ఏం జరిగిందో ఆలోచించలేనంతగా తలంతా దిమ్మెక్కి పోయింది.

 

    కొంతసేపు అలానే వుండి తిరిగి ఇంట్లోకి వచ్చి పడుకున్నాను. అతన్ని వెనకనుంచి పిలిచి మరి కాసేపు మాట్లాడి పంపివుంటే  బాగుండేదని పించింది. కానీ మాట వరకే అతను ఆగుతాడు?

 Previous Page Next Page