Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 36


    పిల్లలిద్దరికి త్వరత్వరగా భోజనాలు పెట్టి నిద్ర పుచ్చాను. నాకు మాత్రం ఆకలి వేయలేదు.

 

    అలా బెడ్ మీద వాలిపోయాను.

 

    చాలా కాలం తరువాత నేను బతికున్నానన్న ఫీలింగ్ కలుగుతోంది. మొత్తానికి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. మన  అస్తిత్వం మనకి  తెలియాలంటే బాధో, ఆనందమో వుండాలి. కానీ మన జీవితాలు ఎక్కువ రొటీన్ గా సాగిపోతుంటాయి. మనం జీవించి వున్నామన్న ఫీలింగ్ కలగదు. అందుకే చాలామందిలో జీవకళ వుండదు.

 

    మా ఇద్దరి మధ్యా ఓ రహస్యం ప్రారంభమైపోయింది. ఈ రహస్యంలో నా భర్తకు గానీ, నా తల్లిదండ్రులకు గానీ మ్ నా స్నేహితులకిగానీ ఎవరికీ ఎలాంటి భాగమూ లేదు. నాకొక్క దానికే ఇది పరిమితం. దీన్ని ఎవరికీ చెప్పుకోలేమన్న నిజం తెలిశాక, మనకు కలిగిన ఆనందం మనకే  పరిమితం అనిపించాక ఏదో అలవిగాని అమృత భాండాగారాన్ని గుండెల్లో దాచుకున్నట్లు ప్రతిక్షణం ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. ప్రస్తుతం నేనూ అదే పరిస్థితిలో వున్నాను.

 

    నాకు తెలియకుండానే నా ముంజేతిని పదే పదే చూసుకుంటున్నాను. అతను అలా ముద్దు పెట్టుకోవడాన్ని న్నెఉ  ఇష్టపడుతున్నానో లేక అయిష్టపడుతున్నానో కూడా స్పష్టంగా తెలియడం లేదు.

 

    ఇలాంటివి జరిగాక అతన్ని నేను ఏవిధంగా, ఎంత  మేరకు కోరుకుంటున్నానో మనసుని డిటెక్షన్ చేసి తెలుసుకోవాలి. కాని చాలామందిలాగే నేనూ నాలోకి తొంగి చూసుకోవడానికి భయపడ్డాను.

 

    మనిషి ఎంత దౌర్భాగ్యంలో బతుకుతున్నాడయ్యా అంటే తనంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితులలో ఇలాంటి సందిగ్ధం ఆడపిల్లల్లో ఎక్కువ. వాళ్ళు మనసుతో ఆలోచిస్తారే తప్ప, మెదడుతో దేన్నీ విశ్లేషించుకోరు. అందుకే ఎవరిని ఏ పరిధి మేరకు వుంచాలో తెలియదు.

 

    ఎదుటి వ్యక్తి ఎప్పుడైనా కాస్తంత ప్రొసీడ్ అయిపోతే మీరు  షాక్ కు  గురవుతారు. 'అతన్ని అలా ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ రోజు మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేనప్పుడు వచ్చి చేయి పట్టుకున్నాడు' అతని  కళ్ళను విశాలం చేసి మగజాతి మీదే గౌరవం లేనట్లు మాట్లాడతారు.

 

    నేనూ అంతే. అందుకే జయంత్ తో ఎలాంటి  రిలేషన్  కోరుకుంటున్నానో విశ్లేషించుకోలేదు. సంసారం అనే రొటీన్  నుంచి నన్ను దూరంగా తీసుకుపోయే థ్రిల్ కలిగిస్తున్న మెజీషియన్ లా కనిపిస్తున్నాడతను. పెళ్ళికి ముందు ఇలాంటి థ్రిల్లింగ్ అనుభవంలోకి రాకపోవడమే దానికి కారణం అనుకుంటాను. అందుకే ప్రతి ఆడపిల్లా పెళ్ళికి ముందు ఇలాంటిదేదో కొంతమేరకు అనుభవించి వుండాలనిపించింది. నా భర్త ఎలాంటి ఉద్వేగాలూ నా దగ్గర ప్రదర్శించక పోవడంవల్ల ఈ థ్రిల్ మరింత బావున్నట్టనిపిస్తోంది.

 

    ఎప్పుడో తూర్పు ఆకాశంలో శుక్రుడు ఒంటరిగా తోడుకోసం వెతుక్కుంటున్నప్పుడు నిద్ర పట్టింది.

 


                                          *    *    *

 

    ఉదయం తొమ్మిది గంటల ప్రాంతాన నా భర్త వచ్చాడు. రావడమే హడావుడిగా ఆఫీసుకెళ్ళాడు. లేకుంటే నా కంగారును దాచుకోవడం కష్టమయ్యేది.

 

    ఆరోజు సాయంకాలం యథాప్రకారం మేమంతా చంద్రగిరికి వెళ్ళాము. నేను వెళ్ళేసరికి జయంత్ తన మిత్రులతో వున్నాడు. మేమిద్దరం చూసుకోవడమే కొత్తగా వుంది. అంతకు ముందు లేని రహస్యం మా ఇద్దరి మధ్యా ప్రారంభం కావడమే కారణం.

 

    అప్పుడప్పుడు అతన్ని గమనించడం, అతని గొంతు వినిపిస్తుందే మోనని చెవులను రిక్కించడం, వీలైనప్పుడల్లా అంతకు ముందు రోజు సాయంకాలాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకోవడంతోనే టైమ్ అయి పోయింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. అప్పుడప్పుడూ అతని మాట్లాడాలని ప్రయత్నించడం, వీలుకాకపోవడం జరిగింది. ఇక తట్టుకోలేక కాబోలు ఆరోజు అందరం ఇంటికి బయలుదేరుతున్నప్పుడు ఎవరూ గమనించకుండా నా చేతిలో లెటర్ కుక్కాడు.

 

    నేను తేరుకునే లోపలే అతను నన్ను దాటి వెళ్ళిపోయాడు. దాన్ని ఏం చేయాలో పాలుపోక స్త్రీకున్న ఏకైక రహస్య స్థావరంలో పెట్టుకున్నాను.

 

    ఇంటికొచ్చి అందరూ పడుకున్నాక బాత్రూమ్ లో దూరాను. ఉత్తరం మడతలు విప్పాను. తెల్లటి పేపర్ మీద రంగు రంగుల స్కెచ్ పెన్నులతో రాసిన అక్షరాలు ఒకే పంజరంలో బంధించిన రకరకాల పక్షుల్లా అనిపించాయి. "రేపు ఉదయం పదకొండు గంటలకు వస్తాను' అన్న ఒకే లైన్ వుంది. ఎందుకో దాన్ని పారవేయబుద్ధి కాలేదు.

 

    అది మొదటి ఉత్తరం జీవితంలో. నేను పురుళ్ళకు ఇంటికి పోయినప్పుడు కూడా నాభర్త ఒక్క ఉత్తరమూ రాయలేదు. అమ్మా, అమ్మమ్మా రాసిన ఉత్తరాలు తప్ప ఇలా పర్సనల్ గా  ఉత్తరం అందుకోవడం ఇదే ప్రధమం. అందుకే దాన్ని తీసుకొచ్చి నా సూట్ కేసు అడుగున చీర మడతల్లో దాచిపెట్టాను.

 

    పడుకున్నాను గానీ నిద్ర పట్టడంలేదు. ఏవేవో ఆలోచనలు ఇలా అతనితో కంటిన్యూ చేస్తే ఏమౌతుందో తెలుస్తూనే వుంది. ఈ కలుసు కోవడాలూ, మాట్లాడుకోవడాలూ, ఉత్తరాలు, ఫోన్ సంభాషణలూ ఇంత వరకే నాకు కావాలి. ఆ తరువాత ఇష్టంలేదు. కానీ ఇవన్నీ  ఒక మగవాడి దగ్గర నుంచి రావాలంటే అతను కోరుకున్నది అతని ఇచ్చెయ్యాలి.

 

    మరి రోజంతా థ్రిల్లింగ్ ఇచ్చే ఇత్తరాలు, ఫోన్ సంభాషణల కోసం  నన్ను అతనికి అర్పించుకోవాలా? లేక అర్పించుకోవడం ఇష్టంలేక ఇవన్నీ  వదులుకోవాలా? అన్న సంఘర్షణ ప్రారంభమైంది నాలో. నాలుగు గంటల తర్వాత  కూడా ఏమీ నిర్ణయించుకోలేకపొయాను.

 

    నెక్ట్సుడే కరెక్టుగా చెప్పిన టైమ్ కి వచ్చాడు. ఆయన ఆఫీసుకు వెళ్ళారు. పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయారు. వరండాలో కాకుండా హాల్లో కూర్చున్నాం.

 

    కాఫీలయ్యాక మా బెడ్ రూమ్ వైపు  చూస్తూ 'మీ శృంగార సామ్రాజ్యం అదేనా?' అని అడిగాడు నావైపు నవ్వుతూ చూస్తూ.

 

    చాలారోజులు అలా నన్ను చూస్తూ దూరంగా కూర్చోడని నాకు తెలిసిపోతోంది. ఏదో జంకు, భయం, కాస్తంత సంస్కారం- ఎగిసే అతని  అవయవాలకు కళ్ళెం వేస్తోందే తప్ప మనసు మాత్రం వాంఛతో కాలిపోతున్న విషయం అర్థమౌతూ వుంది.

 

    వరండాలోంచి హాల్లోకి వచ్చిన అతను బెడ్ రూమ్ లోకి దూకడానికి అట్టేకాలం పట్టాడని బోధపడింది.

 

    అతని వయసు అలాంటిది. ఆకలితో వున్నవాడు అతను. ఆకలి తీరినదాన్ని నేను. ఆ డిఫరెన్స్ మా చేష్టల్లోనే బయటపడుతోంది. ఆ ఒక్క  విషయాన్నీ అవాయిడ్  చేయాలనుకుంటున్నాను. అలా నేను ప్రవర్తిస్తే  ఈ థ్రిల్ అంతా ఎక్కడ  అదృశ్యమౌతుందో నన్న భయం నాలో.

 

    'రోజూ దానిమీద మీరెన్ని సుఖాలు అనుభవిస్తున్నారో కదా' నా మీద పిచ్చి  మొదలైందని అతని మాటలే  చెబుతున్నాయి.

 

    'అలాంటి మాటలు నిషిద్ధం. నేను పెళ్ళయినదాన్ని; అన్నాను ముక్తసరిగా.

 Previous Page Next Page