Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 36


    అతని తిరిగి మౌనంగా వుండిపోయాడు.

     "మూట బియ్యమే. మా ఇంట్లో ఎప్పుడూ కేజీ, రెండు కేజీల బియ్యం కొంటూంటాం " బాధగా అంది భానుమతి.

    అమెది పేదకుటుంబం. రోజూ ఏ పూటాకాపూట సరుకులు కొని పొద్దుపుచ్చుకుంటారు. సరైన తిండిలేకే అమె అంత సన్నగా వుండటమని మరవలికి ఆ ఊరికి పోయినరోజే నేను కనిపెట్టాను. అదృష్టం బావుండి అమె సురేష్ ను కట్టుకోగలిగింది. కాని పుట్టింటి దరిద్రం వదిలిపెట్టడం లేదు.

    అత్తగారింట్లో అన్నీ వున్నా అనుభవించలేకపోతోంది. కంచంలో ఇడ్లీలు వేసుకుంటుందిగాని రెండు ఇడ్లీలు తినగలుగుతోంది. ఆ తరువాత తినలేకపోతుంది. చిన్నప్పట్నుంచి రెండు ఇడ్లీలే తినడంవల్ల అమె కడుపు దానికే పరిమితై పోయింది. అందుకే రెండు ఇడ్లీలు పైన తినలేక కన్నీళ్ళు కారుస్తుంది. తినలేని తన అశక్తతకు ఏడుస్తుంది.

    నాకు ఇవన్నీ గమనించక అమెపైన జాలేసింది. దరిద్రం ఎంత భయంకరంగా వుంటుందో తెలిసింది.

    ఇంతేకాకుండా పుట్టింట్లో నేర్పించిన పొదుపు ఇక్కడికి వచ్చినా పోలేదు. అది పొదుపు అక్కడగాని ఇక్కడ లోబితనం అన్పించుకుంటుంది. కూరల్లో తెల్లగడ్డలు వేయ్యదు. నూనె పోయదు.

     "నూనె తెల్లగడ్డల రేటెంత అనుకున్నారు. కూరల్లో అవి లేకపోయినా పరవాలేదు " అనేది.

    ఇవన్నీ చూసి ఇరుగుపొరుగువారు అమెకి  " పిసినారి " అని పేరు పెట్టారు.

    ఇది విని భానుమతి ఏ మాత్రం బాధపడలేదు. పై పెచ్చు సంతోషించింది. ఈ లోభీతనంవల్ల అమె చేష్టలు కూడా వింతగా వుండేవి.

    ఉదయంపూట ఇంట్లో టిఫిన్ చేసేది  కాదు. పళ్ళుతోమడం తరువాయి వేదవతి దగ్గరికో, సుందరి దగ్గరికో , కుసుమ దగ్గరికో వెళ్ళి  "కొంచెం సద్దుంటే పోయక్కా కడుపంతా ఒకటే మంట " అని అడిగేది. వాళ్ళు పోసింది తిని కాలం వెళ్ళబుచ్చేది.

    మధ్యాహ్నం కూరల దగ్గర కూడా అంతే.

    అన్నం కలుపుకోవడానికి ఏ ఊరబిండో, సాంబారో తయారుచేసి అందులో నంజుకోవడానికి ఏమైనా పెట్టమని అటూ ఇటూ తిరిగేది.

    ఎప్పుడైనా ఇంట్లో కోడిగుడ్డు తాళీంపో, పొట్టేలు మాంసమో చేస్తే అది పొయ్యిమీదుండగానే అమె సగం లాగించేసేది.

     "ఏం చేసేది?కడుపాత్రం వుండనివ్వడంలేదు. మా ఇంట్లో పండక్కో పబ్బానికో తప్ప చేసేవారు కాదు. అందుకే అంత అత్రం " అని మొహమాటం అనేది కూడా లేకుండా ఒప్పుకునేది.

    ఇవన్నీ గమనించే భానుమతి అత్త - ేమేం ఇంటి కోడల్ని తెచ్చుకోలేదమ్మా-ఓ దరిద్రాన్ని తెచ్చుకున్నాం, ఓ కడుపాత్రాన్ని తెచ్చుకున్నాం " అనేది.

    వేదవతి మెల్లమెల్లగా భానుమతి దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుండేది. అందుకే-  "మూట బియ్యం తెచ్చుకున్నామని మేమేం కుబేరులమని  అనుకోవద్దు. మూటగా తెచ్చుకునేది ఇవే. ఎందుకంటే పొలంలో పండుతాయి గనుక " అని చెప్పీంది వేదవతి  కింద కూర్చుంటూ.

    తిరిగి అందరూ అక్కడికి రావడంతో రమణ అటువైపుకి కాళ్ళు తిప్పి కూర్చున్నాడు.

    సాయంకాలాన్ని ఎక్కడికో తరిమేసి రాత్రి దాని స్ధానాన్ని అక్రమించకుంది. ఆకాశంలో మల్లెమొగ్గలు విచ్చుకున్నట్టు చుక్కలు కనిపిస్తున్నాయి. సామానుల స్టాండ్ కు తగిలించిన వెండిపళ్ళెంలా వుంది చంద్రవంక.

    సురేష్, శేఖర్ , బాలయ్య వచ్చి రమణతో చేరారు.

    శేఖర్ కి వున్నది ఎకరం పొలమే అనుకుంటాను. కానీ  ఎప్పుడూ సేద్యం గురించే మాట్లాడుతుంటాడు. సేద్యం తరువాత అతను మాట్లాడేది ఎద్దుల గురించే అతనికి ఎడ్లజత     ఒకటుంది.

     "పరశురాముడు కొత్త ఎద్దుల్ని పట్టుకొచ్చాడు తెలుసా? నాలుగువేల రూపాయలిచ్చి పడమట్లో కొన్నడట. ఓ ఎద్దు చిన్నదేగాని మరొకటి ముదురు నాలుగువేలు ఎక్కువ. నా దృష్టిలో మూడు వేలకు మించి చేయవు. ఎవరో వాడ్ని మోసం చేశారు " అన్నాడు జనాన్నంతా ఉద్దేశించిన ధోరణిలో.

     "నీ గిత్తలకీ ఏవైనా సరిరావులే శేఖరం బావా " సురేష్ చిన్నగా నవ్వుతూ అనడంతో ఆ మాటలు శేఖరాన్ని అక్షేపించినట్టు వున్నాయి.

     " నా ఎద్దులకేంరా. అవి గుర్రాలైతే- చూశావ్ గదా  ఇంతకుముందు వెంకటగిరి నుంచి పదిబస్తాల బియ్యాన్ని ఎక్కడా అగకుండా మోసుకొచ్చాయి. ఒకటే పరుగనుకో, అప్పటికీ పగ్గాల్ని గట్టిగా పట్టుకోబట్టి సరిపోయిందిగాని లేకుంటే వాడి పరుగులకి బండి అగేదా?" అన్నాడు.

 Previous Page Next Page