టర్కీ
రచన: నజీమ్ హిక్మత్
సుదూరపు ఆసియా ఖండం నుంచి
నురుగులు కక్కుతూ పరవళ్లు తొక్కుతూ
మధ్యధరా సముద్రంలోనికి విస్తరించవచ్చిన
ఈ గోడిగ తలకాయలాంటి దేశం
ఈ దేశం మనది
నెత్తురు కారే మణిబంధాలు
బిగపట్టిన పళ్లు
జోళ్లు లేని కాళ్లు
ఖరీదయిన సిల్కు తివాసీలాంటి నేల
ముద్రణ: ఆంధ్రజ్యోతి వారపత్రిక -29 సెప్టెంబర్, 1972
పునర్ముద్రణ: మరో ప్రస్థానరం విరసం ప్రచురణ - మే, 1980
1. సజీమ్ హిక్మత్ (1902-63) సుప్రసిద్ధ టర్కీష్ కవి. సగానికి పైగా సర్కారు జైళ్లలో ఆతిథ్యం పొంది, తప్పించుకుని 1951లో రష్యాలో ఆశ్రయం పొంది 1963లో మరణించాడు. శ్పానిష్ లోర్కా, ఫ్రెంచ్ ఆరగో, రష్యన్ మయకోవస్కీ ఇతని కవితను ప్రభావితం చేశారు. అన్నట్టు ఆంగ్లో- అమెరికన్ టి.ఎస్. ఈలియట్ కూడా. ఇది శ్రీ శ్రీ ఇచ్చిన ఫుట్ నోట్
మరే ముంది మరణం తప్ప!
* రచన: పాబ్లో నెరూడా1 *
ఉన్నాయ్ కొన్ని ఒంటరి శ్మశానాలు
చప్పుడు చెయ్యని ఎముకలతో నిండిన సమాధులు
సొరంగం లోంచి పోతున్న హృదయం
ఆకట్లో చీకట్లో చీకట్లో
నౌకాభంగంలా మరణిస్తాం మనలోనికి పోతూ
మనగుండెల్లోపల మనం మునిగిపోతున్న మాదిరిగా
చర్మంలోంచి ఆత్మలోకి రాలినట్లు జీవించిన మాదిరిగా
మరిన్నీ ఉన్నాయ్ కొన్ని శవాలు
చల్లని జిగురుమట్టితో చేసిన పాదాలు
ఎముకల్లో ఉంది మృత్యువు
కుక్కల్లేని చోట కుక్కరుపులాగ
ఎక్కడో గుంటల్లోంచి, ఎక్కడో గోరీల్లోంచి బైటికి వస్తూ
తడిగాలిలో కన్నీళ్లలాగ వానలాగ పెరుగుతూ
అప్పుడప్పుడూ నేనొక్కణ్ని చూస్తాను
తెరచాపలెత్తిన శవపేటికల్ని
పాలిపోయిన మృతులతో చచ్చిన వెంట్రుకలున్న స్త్రీలతో బయల్దేరి
దేవదూతల్లాంటి తెల్లని రొట్టెల వాళ్లతో
చెట్టుకింద ప్లీడర్లని పెళ్లి చేసుకొని
ఆలోచనల్లో పడ్డ అమ్మాయిలతో
నిలువుగా ప్రవహించే మరణపు నదిలో తేలిపోయే పేటికలు
ముదురుటెరుపు రంగునది
మరణం చేసే చప్పుడుతో నిండిన తెరచాపలతో ఎదురీదుతూ
మరణం చప్పుడుతో నిండి, అనగా నిశ్శబ్దంతో
ఆ సమస్త ధ్వనుల మధ్యా మరణం ప్రవేశిస్తుంది
కాలులేని చెప్పుల్లాగ, మనిషిలేని దుస్తుల్లాగ
వచ్చి తలుపు తడుతుంది, రవ్వలేని ఉంగరంతో వేలులేని ఉంగరంతో
వచ్చి అరుస్తుంది నోరులేని, నాలుకలేని గొంతుకలేని అరుపులు
అయినా దాని అడుగు సవ్వడులను వినవచ్చు.
దాని దుస్తులు నింపాదిగా ధ్వనిస్తాయి. వృక్షంలాగ
సరిగ్గా చెప్పలేనుగాని, కొద్దిగానే అర్థమవుతుంది గాని,
అసలే కనిపించదు గాని
దాని సంగీతం తడిసిన నీలిపూల రంగని నాకు తోస్తుంది.
ఈ నీలిపూలకి స్వగృహం లాంటిదా నేల
ఎంచేతంటే మృత్యువు ముఖం ఆకుపచ్చరంగు కనుక
మృత్యువు చూసే చూపు ఆకుపచ్చరంగు కనుక
నీలిపూల మొక్కల ఆకుల దూసుకుపోయే శీతలత్వంతో
కసినిండిన శిశిరకాలపు పొగచూరిన రంగుతో
అయితే మృత్యువు ప్రపంచంలో నడుస్తుంది కూడా
చీపురుకట్టలాగ ముస్తాబయి
నేలను నాకుతూ, మృతదేహాల కోసం వెతుక్కుంటూ
చీపురుకట్టలో ఉంది మృత్యువు
చీపురుకట్ట శవాన్ని వెతుక్కునే మృత్యువు నాలుక
అది దారం కోసం వెదుక్కునే మృత్యువు సూది
మరణం మడత మంచాల్లో ఉంది
అది సోమరి చింకి చాపలమీద నల్లని శాలువల్లో
నిద్రపోతూ జీవితం గడుపుతుంది
హఠాత్తుగా ఊపిరి వదుల్తుంది
దుప్పట్లను ఉప్పొంగించే విషాదపు చప్పుడు చేస్తుంది.
అప్పుడు శయ్యలన్నీ ఒక రేవు వైపు పయనం కడతాయి
అక్కడ మృత్యువు వేచుకుని ఉంటుంది
నౌకాధికారి లాగ దుస్తులు ధరించి
ముద్రణ: అంధ్రజ్యోతి వారపత్రిక-1 డిశంబర్, 72
1.పాబ్లో నెరూడా(1904-1973):చిలీ కవి. స్టాలిన్ మీద నెరూడా రాసిన ఈ గేయాన్ని శ్రీశ్రీ అనువదించాడు. నెరూడా1970లో ఫ్రాన్స్ లో చిలీరాయబారిగా పనిచేశారు. 1971లో నోబెల్ బహుమతి లభించింది. 1973లో తన స్నేహితుడు, చిలీప్రధాని అలెండీని అమెరికా ప్రభుత్వం హత్యచేసిన పదిరోజులకు నెరూడా చనిపోయాడు.