'మహర్షుల కాలంనుండి అంతేలెండి. కాని ఆ మాటలు మీ మిత్రుని నోటిగుండా వినాలని కుతూహలంగా వుంది. ఇప్పుడు కాదు. ఈసారెప్పుడైనా వింటానులెండి శ్రవణానందంగా.'
"నువ్వు గడుసుతనం కూడా నేర్చావ్. మనం మళ్ళీ కలుసుకోటానికి పాచిక వేస్తున్నావే" అని చప్పున నాళిక కొరుక్కుని 'ఛీ ఏం మాట్లాడాను?' అని విచారించసాగాడు.
"పాచికా?" అంటూ ఆమె నివ్వెరపోయింది.
ఈ ప్రశ్నతో సివనాతరవు ముఖం మరింత తెల్లబడింది.
"హఠాత్తుగా మీ ముఖం అలా పాలిపోయిందేం?" అన్నది అనామ.
"ఊ" అని తల ఎత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూచాడు. అతని అవస్థ అతనికే జాలిగా వుంది. 'అనామా! యింక ఆ విషయాలు కట్టిపెట్టి నీ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా వుంది. తీర్చవూ!' అన్నాడు ఎలాగో.
ఆమె సంకటంలో పడి నిట్టూర్చి అంది 'ఏ ప్రశ్న అయితే మీ దగ్గర్నుంచి రాకూడదనుకున్నానో అదే వచ్చింది.' మళ్ళీ గాద్గికంగా 'నాగురించి మీరు కొత్తగా తెలుసుకోవలసింది ఏమీలేదు. అందరిలాగా నేనూ వెర్రిపిల్లనై కష్టాల్లోంచి విముక్తి పొందాలని, నా బాధలన్నీ ఎవరన్నా విని అయ్యో పాపమని నిట్టూర్చాలని పిచ్చిపిచ్చి ఊహలు ఊహించేదాన్ని అవి ఒట్టి అవివేకాపు ఆలోచనలని తెలిశాక హాయిగా నవ్వటం నేర్చుకున్నాను. కాని రోజులు ఓ రకం సంతృప్తిగానే గడుస్తున్నాయి సుమండీ. అదోరకం సంతృప్తి. గుర్తుంచుకోండి.'
"అసంతృప్తి ఆత్మ విశ్వాసానికి మారు పేరై వుండాలి" అన్నాడతను ఆశ్చర్యంతో.
"రెండూ ఒకటే కాబోలు. ఇంత కుతూహలం దేనికి యీ అభాగ్యురాలి మీద?"
"ప్రపంచంలో అభాగ్యులు కానివాళ్ళు చాలా కొద్దిమంది వుంటారు. నువ్వు కొన్నిరోజులు పోయాక ఎంతో విజ్ఞురాలవు అవుతావు."
అనామ ఈసారి బలవంతాన నవ్వి 'ఒకర్నిగురించి ఒకళ్ళు పూర్తిగా ఎప్పుడూ తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే యిద్దరిమధ్యా విలువే పూర్తిగా నశిస్తుంది' అంది.
"ఇక్కడ నీ సందర్భం?"
"చెప్పలేను బాబూ" అని ఆమె సిగ్గుపడుతూ తలవంచుకుంది.
అతనన్నాడు 'ఒకర్ని గురించి ఒకరు తెలుసుకోవటమలా వుంచు. అసలు మనగురించి మనమే తెలుసుకోకూడదు. అది ప్రతిపనికీ అడ్డువస్తుంది. అదో జంఝాటంలే! మరి ఇక్కడ కూర్చుని అంతులేకుండా కబుర్లు చెప్పడం బాగుండదు. వస్తాను' అని లేవబోయాడు.
ఆమె కలవరపాటుతో వారిస్తూ 'వద్దు. ఇవాళ నాకు చాలా సరదాగా వుంది. మీరింకా కొంతసేపు అలానే కూర్చుని కబుర్లు చెప్పాలి. చీకటి పడుతోంది, ఉండండి దీపం వెలిగించి తీసుకువస్తాను. నేను వచ్చేలోగా మీరిక్కడినుంచి వెళ్ళిపోతే ఒట్టే సుమండీ" అంటూ జవాబుకోసం ఎదురు చూడకుండా చరచర లోపలకు వెళ్ళిపోయింది.
శివనాథరావుకు యిప్పటికి ఆ యింటిని కాస్త పరిశీలించే సావకాశం కలిగింది. చాలా చిన్న పెంకుటిల్లు పైగా పురాతనమైనది. వాళ్ళు కూర్చున్న గది కాక లోపల మరో రెండు గదులున్నట్లున్నాయి. ఇంతసేపూ కృష్ణ ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. అతనివంక చూసేసరికి ఫక్కున నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి?"
"ఉందిలే తమాషా నీలో ఓ కనిపించని మనిషి వున్నాడని నాకు యివాళే తెలిసింది."
"అది సరేగాని యింతసేపటినుంచి ఏం చేస్తున్నావ్?"
"ఆమె మాటలు వింటున్నాను."
అతను ఎంత నిబ్బరంగా వున్నాడు! తానతని స్థితిలో వుంటే ఏం చేసేవాడా అని ఆలోచించాడు శివనాథరావు. చాలా శోచనీయంగా చావు నవ్వులు నవ్వుతూ...అబ్బ!
ఈ యింట్లో ఎలక్ట్రిసిటీ లేదు. అనామ చేతిలో దీపంతో నిలబడింది. మిత్రులిద్దరూ ఆమెవంక నిశితంగా చూశారు. ఆ దీపకాంతి ఆమె సౌందర్య రేఖల్ని మరింత జ్వలితం చేసింది. ఆమె ముందుకువచ్చి దీపాన్ని గోడకున్న కొంకెకు తగిలించి, బరువుగా ఊపిరి విడచి "ఇంత నిశ్శబ్దంగా కూర్చున్నారేం? ఏమయినా నేనంటే మీకు చాలా దయ. నా మాట మన్నించారు."
శివనాథరావు నొచ్చుకుని "దానికేంగాని నీ వ్యవహారం నాకేం నచ్చలా. మేమిలా దర్జాగా కూర్చునివుంటే పాపం నువ్వెంతసేపు నుంచుంటావు?"
"ఫర్వాలేదు, దీనికేమొచ్చె? అతిథి సత్కారమన్నానుగాని కాస్త ఫలమో తోయమోగూడా యివ్వలేను. సిగ్గుమాలిన బ్రతుకు-మీరు నాకు చేసిన ఉపకారానికి..."
"ఆఁ ఆఁ గొప్ప ఉపకారమే. అది సరేగాని నన్నింకా కాసేపు ఎందుకుండమన్నావు చెప్పు?"
ఆమె సంశయించకుండా "ఏంలేదు మీ యింటికి ఎప్పుడైనా మళ్ళీ రావాల్సిన ఆగత్యమేర్పడుతుందేమో తెలీదు. ఒకవేళ అలాంటి అవసరం వస్తే ఏం చేయమంటారు?" అనడిగింది.
అతని ముఖం కళావిహీనం అయింది. "పెద్ద యిబ్బందేనే....మరి..కాదు కాదు....అలాంటి అవసరం రాదు."
అనామ తీక్షణంగా చూసి క్రింది పెదవిని పంటితో నొక్కుతూ వూరుకుంది.
శివనాథరావు ఆకస్మికంగా "మీవారు లేరా?" నడిగాడు.
"ఉన్నారు...అంతేకాదు. వారికి ఎప్పుడు ఏ ఆపద వస్తుందోనని నా గుండె కొట్టుకుపోతోంది తెగ."
"ఇంత సోది ఎందుకు నా చిన్న ప్రశ్నకు?"
"మీకు చీటికీ మాటికీ యింత కోపంవస్తే ఎలా? అలా".
"ఎలా ఆ కొంటెతనమే...."
"ఓహో!" అని తల పంకించి "ఆయన వున్నారు ఊళ్ళోనే" అంది పొడిగా.
అతను చప్పున నిలబడి "నన్ను మన్నించు అనామా. ఇంకా ఇక్కడ కాలయాపన చేసి నీ సంసారానికి హాని తేలేను. వస్తామరి. బ్రతికి బాగుంటే ఎక్కడన్నా మరొకసారి." రారా కృష్ణా.
అనామ శాంత స్వరంతో "వెళ్ళండి. ఈ ప్రలోభానికి నేనెందుకు లొంగిపోయానో తెలియదు. అవును, వారువస్తే నాకు ప్రమాదమే! ఏరికోరి ఎందుకు మనకీ కష్టాలు?" అని కృష్ణని ఉద్దేశించి "క్షమించండి. మీకు చాలా విసుగు కలిగించి వుంటాను. మళ్ళీ ఈ ఛాయలకు రాకండి" అంటూంటే ఆమె కంఠం గద్గదమైంది.
శివనాథరావు వెంటనే వెళ్ళిపోదామనుకున్నాడు గానీ - ఒక సంగతి చెప్పకుండా వుండబట్టలేకపోయాడు. 'నువ్వూ నీ సంభాషణ వినేవారికి ఎలా ధ్వనిస్తుందో తెలుసా?'
"ఎలా ధ్వనిస్తుంది?" ఆమె కోపంతో, అవమానంతో వణుకుతోన్న కంఠంతో అడిగింది.
అతనికి నోటిదాకా వచ్చింది. కానీ నిగ్రహించుకుని 'ఎందుకులే? చెప్పను. అయినా ఏముంది యిందులో? ఒట్టి ప్రకర్షణ నన్ను అపార్ధం చేసుకోకు' అంటూ కదలబోయాడు.
ఆమె ఆవేశంతో అతనికి అడ్డుగానిలిచి 'ఎలా ధ్వనిస్తుంది? ఈ సంగతి చెప్పేదాకా మీరు యిక్కడ్నుంచి కదలడానికి వీలులేదు' అంది యించుమించు అరుస్తూ.
"అడ్డులే. ఈ దృశ్యం బయటివాళ్ళకి ఎంత విపరీతంగా కనిపిస్తుందో తెలుసా?"
"ఎలా అయినా చావనియ్యండి. దీపం ముందు నిల్చుని చెబుతున్నాను. ఏమిటో చెప్పకుండా మీరు వెళ్ళినట్లయితే ఉరేసుకుని చచ్చిపోతాను-నన్ను గురించి ఏమనుకుంటున్నారో" అని మొండిగా అలాగే నిల్చుంది.
ఈ ప్రవర్తనకు శివనాథరావుకు వల్లమాలిన కోపంవచ్చింది. "ఈలోగా మమ్మల్ని చంపు...అనవసరంగా అల్లరి చేయకు" అన్నాడు గట్టిగా.
ఆమె అదిరిపడి, ముఖం యింత చేసుకుని ప్రక్కకి తొలగింది. సరిగ్గా ఇదే సమయంలో బయటనుంచి పొగరుగా ఒక వ్యక్తి లోపలకు దూసుకు వచ్చాడు. ఇరవైఏడు, ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి. మాసిన బట్టలు వేసుకున్నాడు. 'నిలు' అన్నాడు శివనాథరావుతో మొరటుగా అతను వివిద భావాల్తో మ్రాన్పడి, చివరకు స్తబ్ధుడై నిలబడిపోయాడు.
"ఎవరు నువ్వు?" అన్నాడు.
"నా యింట్లోకొచ్చి నన్నే అడుగుతావా బ్రూట్! ఇవాళ నీ అంతం చూస్తాను" అంటూ ఆ వ్యక్తి యితని చొక్కాకాలరు పట్టుకుని బలంగా గుంజాడు.