Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 35

  

       "ఎవర్ని?"
   
    "సుజాత. ఆనాడు హైదరాబాదు నాటకంలోని మెరుపుతీగలాంటి నటీమణి."
   
                                 13
   
    ఇంట్లోకి ప్రవేశిస్తోంటే శివనాథరావుకు ఎవరో పరాయివాళ్ళ యింట్లో ప్రవేశిస్తున్నట్లుగా నూతనభావం కలిగింది. హాల్లో సోఫాలో కూర్చుని పేపరు చదువుకుంటూన్న మాధవరావుగారు తల ఎత్తి "ఏరా ఉత్తరం రాయలేదే?" అన్నాడు. శివనాథరావు జవాబుగా నవ్వి పైకి వెళ్ళిపోయాడు.
   
    సావిత్రి పైకి వచ్చింది. అంతా యీమే చేసింది. యీమే చేసింది అనుకున్నాడు. కసితీరా అడిగేయాలనుకున్నాడు. తనకు తెలియకుండా యింకా ఏదో కారణముందని సరోజిని చెప్పింది గానీ - దాచింది ఆ కారణానికీ, పిన్నికీ ఏదో సంబంధముందనిపిస్తోంది తనకు. తను ఆమెకేం అన్యాయం చేశాడు? తనని చాలా ప్రేమిస్తోందే ఆమె. ఎందుకు యీ పగ?
   
    "పిన్నీ!" అన్నాడు.
   
    "శివా!"
   
    అతను అడగలేకపోయాడు.
   
    "రేపు రాత్రికే ఊరికి పోవాలి" అన్నాడు.
   
    "సెలవులయిపోయినాయా?"
   
    "అయిపోయి నాలుగు రోజులయింది. ఇప్పటికే ఆలస్యం చేశాను."
   
    "సరే" అని ఆమె క్రిందకు వెళ్ళిపోయింది.
   
    ఆ సాయంత్రం కృష్ణ బాగా టాయిలెట్ అయి హుషారుగా వచ్చాడు. "ఒరేయ్! అలా షికారు పోయివద్దాం రారా" అన్నాడు.
   
    "ఉండు వస్తున్నాను."
   
    ఓ పావుగంటలో అతను బట్టలు మార్చుకువచ్చాక స్నేహితులిద్దరూ బయటకు వచ్చారు.
   
    "ఎటు పోదాం?"
   
    "చూపిస్తా రా మంచిచోటు" అని సూర్యారావుపేట వైపు దారి తీశాడు.
   
    "నువ్వు మరి చదవవా?" అనడిగాడు శివనాథరావు దారిలో.
   
    "చదువా? దానివిషయం మరిచెప్పకు. మానాన్న యిదివరకు కోప్పడేవాడు. ఆయనకు విసుగుపుట్టి అదికూడా మానేశాడు. ఏదో కాస్త ఆస్తి ఉంది. అది చాలు, ఈ ఏకాంత వాసికి."
   
    "అయితే ఉద్యోగం కూసా చేయవా?"
   
    "ఉహు చెయ్యను."
   
    "పోనీ పెళ్ళి చేసుకుంటావా?"
   
    "అదీ చేసుకోను."
       
    "అదేం?"
   
    ఈ ప్రశ్నకు కృష్ణ నవ్వి ఊరుకున్నాడు. జవాబు చెప్పలేదు.
   
    "చెప్పు?"
   
    "తరువాత ఎప్పుడయినా చెబుతాను."
       
    శివనాథరావు బలవంతం చెయ్యక ఊరుకున్నాడు.
   
    "అవును గాని ఆ అమ్మాయిని గురించి చెప్పవేం?"
   
    "ఏ అమ్మాయిని గురించి?"
   
    "మీ యింటికి వచ్చిన పిల్ల నీ చుట్టం."
   
    "ఏముంది చెప్పేటందుకు?"
   
    "వంటరిగా యింట్లో కొన్నేళ్ళు అఘోరించావుగదా ఊరికినే వదిలేశావా?"
   
    "ఛ ఛ. ఆమె పెళ్ళి కావలసిన పిల్ల."
   
    "పెళ్ళయిన పిల్లయితే అభ్యంతరం లేదా నీకు?"
   
    "నోరు ముయ్యరా మొద్దూ."
   
    "అయితే చూస్తూ ఊరుకున్నావన్నమాట. నీవంటి చవటలు ఎందుకు బ్రతుకుతారో అర్ధంకాదు యీ విశాల ప్రపంచంలో."
   
    ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు చాలా దూరంపోయి ఒక చిన్న సందుగుండా నడవసాగారు. "ఎందుకు నన్నిక్కడికి తీసుకువచ్చావు?" అనడిగాడు శివనాథరావు.
   
    కృష్ణ మధురంగా నవ్వి "నీకు ఓ చిత్రం చూపిద్దామనే యిలా తీసుకువచ్చాను. అదిగో అటు చూడు" అని భుజంమీద గిచ్చాడు. శివనాథరావు అటుకేసి చూసి విస్మితుడై నిలబడిపోయాడు.
   
    ఆ సుందరాంగి నవ్వటం యింకా మానలేదు. ఒక్క క్షణం ఏమీ చేయటానికి పాలుపోని శివనాథరావు-ఆ నవ్వులో ఏముందోగానీ ఆమెను సమీపించాడు.
   
    "మీ యింటికి నేను నిర్భయంగా వచ్చాను. మీరు నన్ను యిక్కడ చూసి తడబడతారేం? అందులోనూ పెద్దవారు" అంది అనామ.
   
    "సరే. సరే. బాగుంది. లోపలకు వచ్చేదా?"
   
    అనామ నవ్వింది. "ఎంతమాట? మీకు అతిథి సత్కారం చేసే భాగ్యాన్ని వదులుకుంటానా? రండి. మా గృహం పావనం చెయ్యండి."
   
    "మరి నేను ఒంటరిగా రాలేదు."
   
    "కనబడుతూనే వుందిగా. అయినా వారుకూడా కొత్తవారు కాదు. దయ చేయండి."
   
    శివనాథరావు తెల్లబోతూ సంకోచిస్తూనే లోపలకు ప్రవేశించాడు. గదిలో రెండు విరిగిపోయిన కుర్చీలు వున్నాయి. ఆమె సిగ్గుపడుతూ "బీదవాళ్ళం అవే...మరి" అంది.
   
    ఇద్దరూ వాటిమీద జాగ్రత్తగా కూర్చున్నారు. 'నువ్వు వీడిని ఎట్లా ఎరుగుదువు?' అన్నాడు శివనాథరావు.
   
    ఆమె ఒకటి రెండు క్షణాలు నిశ్శబ్దంగా ఊరుకుంది. అనామ అప్పుడే స్నానం చేసినట్లుంది. లేత నీలంరంగు వాయిలు చీరె కట్టుకుని శుభ్రంగా తయారయింది. జడ వదులుగా వేసుకుని తల్లో సన్నజాజులు తురుముకుంది. సరోజినికి, యీమెకు ముఖ్యమైన తేడా ఒకటుంది. సరోజిని బాగా తెలుపు. అనామ ఓ ఛాయ తక్కువ. సరోజిని నవ్వు గుండెని సున్నితంగా గుచ్చుతుంది. అనామ నవ్వు గుండెను తొలుచుకుంటూ పోతుంది. 'చెప్పనా?' అంది చివరకు మెత్తగా నవ్వుతూ, కృష్ణవైపు ఓరగా చూసి.
   
    "పరాయి మొగవాడ్ని గురించి తెలుసుకోవటం యిది రెండవసారి. సంజవేళ ఏమీ తోచక యిదిగో-యీ కిటికీ దగ్గర కూర్చుని వీధిలోకి చూస్తుండటం అలవాటు. ఈయనగారు కొన్ని రోజులక్రితం యిటునుంచి పోతూ, నన్ను చూశారు. అప్పటినుంచి తరచు వస్తూనే వున్నారు. ఏవేవో చేష్టలు చేసేవారు. నేనూ నవ్వుతూ వుండేదాన్ని ఏమండీ? అవునా?" అంది కృష్ణవైపు తిరిగి.
   
    కృష్ణ చిత్రంగా మందహాసం చేసి ఊరుకున్నాడు. కంగారు లేదు, ఆశ్చర్యమూ లేదు.
   
    శివనాథరావు స్నేహితుడి భుజంమీద ఆప్యాయంగా చేయివేసి 'ఈ మనిషిని గురించి నువ్వేమనుకుంటున్నావో గాని-యితను సాధారణ వ్యక్తి మాత్రం కాదు సుమా. ముందు ముందు నీకే తెలుస్తుంది" అన్నాడు గర్వంగా.
   
    "ఛ ఛ! అంత మాట నేననగలనా? వారి స్వభావం మాత్రం చెప్పాను."
   
    "అనామా! క్రిందటిసారి నా దగ్గర్నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాటన్నావు గుర్తుందా?"
   
    "గుర్తులేకేం? ఈ పనికిమాలిన స్త్రీ మరెప్పుడూ మీకు కనబడదేమో" ఇవేగా నా మాటలు.
   
    "నీ జ్ఞాపకశక్తి మెచ్చుకోదగిందే."
   
    "ఆనాడు నేను బయటకు వచ్చాక ఆ మాటల్ని అనేకసార్లు మననం చేసుకున్నాను. క్రమంగా నామీద నాకే అసహ్యం కలిగింది. నా మాటలు నాకే అసంగతంగా తోచాయి."
   
    "అబ్బ! అన్ని అభావాలు."
   
    "నమ్మకపోయినా ఫర్వాలేదు. ఆరోజే నిర్దారణ చేసుకున్నాను-పెద్ద అబద్దమాడి వచ్చానని."
   
    "నీలో ఎంతమార్పు? నువ్వు ఆనాటి అనామవని ఊహించటానికి అతీతంగా వుంది....ఒక విషయం చెప్పనా? నీ జీవన ప్రవృత్తి మీద చాలాసార్లు ఆలోచించాను."
   
    "అవును. స్త్రీ జాతిమీద మీకు చాలా సానుభూతి."
   
    శివనాథరావు నవ్వి 'నేనివాళ ఉపన్యాసాలు ఇవ్వబోవడం లేదులే. కాని యిహముందు ఏ స్త్రీనైనా కొన్ని గంటల వ్యవధిలో అనేక రూపాల్లో చూడగలిగినా ఆశ్చర్యపడను. నమ్ము' అన్నాడు.
   
    అనామ కనులెగురవేసి 'ఏం కథ? ఇవాళ స్త్రీల మీద పట్టించారు' అంది.
       
    దీనికి సమాధానం కృష్ణ చెబితే బాగుంటుందనుకున్నాడు శివనాథరావు. ఒకనాడు ఏదో సందర్భంలో ఈ లోకంలోని ముఖ్య సమస్యల్లో ఒకటి స్త్రీ మరొకటి దానం అని పేర్కొన్నాడు. ఈ విషయమే బయటకు చెప్పాడు.

 Previous Page Next Page