"నోర్ముసుకోరా! అలాంటి అర్ధం లేనిమాటలు మాట్లాడ్డానికి నీకు సిగ్గేట్లా లేకుండా పోయింది? ఇదే మరొకడు మాట్లాడివుంటే ఇప్పుడే ప్రాణం తీసి వుండేవాడిని. ఆ అమ్మాయి ముఖం చూసి వదులుతున్నాను.
స్నేహితుడి భార్యను ఆ విధంగా ట్రీట్ చేసే దుర్మార్గుడి వనుకున్నావా? నా సంగతులన్నీ వివరంగా తెలుసు! చనిపోయిన నా ప్రిమికురాలిని మర్చిపోలేక ఇంతకాలం వివాహం కూడా చేసుకోలేదు.
ఇప్పుడు నీ భార్యని చూసి మోహించి ప్రేమకలాపాలు జరుపుతానా? ఎంతో అందమయిన అమ్మాయిలని వివాహం చేసుకొనే అవకాశాలెన్నో వచ్చినాయ్ రా! అలాంటి వారినే నేను కాదన్నానంటే కారణం ఏమిటి?"
చలపతి జవాబివ్వలేకపోయాడు. శ్రీకాంత్ ఉద్రేకం చూస్తే అతనికి భయంగా వుంది. ఎప్పుడూ అంత రౌద్రంగా కనిపించలేదు.
నిజమే, తనే లేనిపోని వన్నీ ఊహించుకొంటున్నాడు. శ్రీకాంత్, చెప్పేదే నిజమేమో?
నర్సరాజు, రాజ్యలక్ష్మి, శ్రీకాంత్ - ఇంతమంది అబద్దం చెప్తారా?
కొద్దిసేపటి వరకూ అలాగే నిలబడిపోయారిద్దరూ . శ్రీకాంత్ లో ఆవేశం తగ్గింది.
"ఒరే చలపతీ! స్థిమితంగా ఆలోచించు. సావిత్రే నాకు కావాలంటే నువ్వు ఇవ్వాళ ఇలా బ్రతికి ఉండేవాడివట్రా! అంత ఖర్చు చేసి నీకు ఆపరేషన్ చేయించాల్సిన అవసరం నాకేమిటి? నిన్ను చంపడం ఎంత తేలిక? ఆమెని నా చెల్లెలిగా చూడబట్టే ఆ రోజు నీకు మాటివ్వడానికి వెనుకాడాన్రా! అర్ధమయిందా ? అందుకే పెళ్ళి చేసుకోమని నువ్వడిగితే వెంటనే అంగీకరించలేకపోయాను. నీ పరిస్థితి చూసి అబద్దమయినా చెప్పాలన్నా ఉద్దేశ్యంతో మాట ఇచ్చాను......."
చలపతికి దుఖం పొంగుకొచ్చింది - నిజమే శ్రీకాంత్ తల్చుకోకపొతే తను బ్రతికేవాడా? ఒకవేళ తనే పొరబాటు పడ్దాడేమో! పొరపాటే అయివుంటే నిజంగా ఎంత దారుణమయిన తప్పు చేశాడు తను? జీవితాల్లో ఆటలాడుతున్నాడు. సావిత్రి ఏమయిపోతుంది? అలాంటి అపవాదు వేస్తె ఆత్మహత్య తప్ప శరణ్యం ఏముందీ?
అయినా తన బుద్దీ పూర్తిగా పాడయిపోయింది. అసలు శ్రీకాంత్ ని అనుమానించడమేమిటీ? తన ప్రాణ స్నేహితుడు వాడు. ఇప్పుడు ప్రాణ దానం కూడా చేశాడు. అలంటి స్నేహితుడిని శంకించడం ఎంత దారుణం.
"ఒరేయ్! చలపతీ మాట్లాడు. లోపల్లోపల ఆలోచించకు. మనసులో ఏముందో చెప్పు! ఇవాళ నీ అనుమానాలన్నీ తప్పని రుజువు చేస్తాను. లేదంటే నీ చావు కళ్ళ జూసి ఇంటికేల్తాను. నీలాంటి బుద్దీహీనుడయిన స్నేహితుడు ఉండడం కంటే - పోవడం మంచిది" ఆవేశంగా అన్నాడతను.
చలపతి కంట వెంబడి బొటబొటా కన్నీరు రాలిపోయింది.
"ఇంక చంపకురా! మతి చెడి ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు అల్లుకొన్నాను. నిన్నూ సావిత్రినీ కూడా కష్టపెట్టాను!"
శ్రీకాంత్ తమాయించుకున్నాడు" నాకు తెలుసురా మతి చెడిపోతేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయ్! పద ఇంటికెళ్ళి అమ్మాయితో నీ తెలివితక్కువ వాగుడు పట్టించుకోవద్దని చెప్పు..........."
* * *
అయిదు నిముషాల్లో కారు ఇల్లు చేరుకుంది. శ్రీకాంత్ ముందు కారు దిగి లోపలకు నడిచాడు వేగంగా. చలపతి అతనిని అనుసరించాడు. సావిత్రి ఎక్కడా కనిపించలేదు. వంటిల్లు తలుపులు మూసి ఉన్నాయ్. లోపల్నుంఛి బట్టకాలిన వాసన.
"సావిత్రీ!" భయంగా తలుపుతోశాడు చలపతి. లోపల గడవేసి ఉండటం చేత తలుపులు తెరుచుకోలేదు. శ్రీకాంత్ బలంగా తన్నాడు తలుపుల్ని ఓ తలుపు సగానికి విరిగింది. దాని కింద నుంచి లోపలకు పాకాడతను.
సావిత్రిని మంటలు కబళించడానికి ప్రయత్నిస్తున్నాయ్. అంతా కిరసనాయిలు వాసన.
"చలపతీ, దుప్పట్లు తీసుకురా త్వరగా!"
చలపతి మెరుపులాగా పరుగెత్తు పడగ్గదిలోని దుప్పట్లు తెచ్చి లోపలకు విసిరేశాడు. అతనికి గుండెదడ వచ్చినట్లుంది. అక్కడే కుప్పలా కూలబడిపోయాడు.
అయిదు నిమిషాల తర్వాత తలుపులు తెరచుకుని సావిత్రిని రెండు చేతుల్లో బయటకు ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు శ్రీకాంత్. అప్పటికే ఆమెకి స్పృహ తప్పింది.
పదినిమిషాల్లో ఇద్దరు డాక్టర్లు వచ్చేశారు. కాళ్ళు రెండూ కొంచెం కాలాయ్. అంతే బాండేజీ లు కట్టేశారు. వెంటనే స్పృహలోకొచ్చిందామె. కళ్ళు తెరచి చూసింది. ఎదురుగా దీనంగా నిలబడి ఉన్న చలపతి. ఆదుర్దాగా చూస్తోన్న శ్రీకాంత్ కనిపించారు.
చలపతికి దుఃఖం ఆగలేదు. రెండు చేతుల్లోను ముఖం దాచుకుని చిన్నపిల్లాడిలా విలపించేయసాగాడు.
"చిన్నపిల్లాడిలా ఏమిటది?" నెమ్మదిగా అంది సావిత్రి.
చలపతి కింద కూర్చుని మంచం మీద తల వాల్చాడు. అతని జుట్టులోకి ఆప్యాయంగా చేతివేళ్ళు పోనిచ్చి నిమిరిందామె ఆనందంగా.
శ్రీకాంత్ తేలిగ్గా గాలి పీల్చుకుని ఆ గదిలో నుంచి బయటకు నడిచాడు.
( సమాప్తం)