"ఏమిటి నీ జబ్బు" అడిగాడు నర్సరాజు కోపంగా.
చలపతి తెల్లబోయాడు.
"జబ్బేమిటి" ఆన్నాడు ఆశ్చర్యంగా.
"అదే ...........సావిత్రిని హింసించే జబ్బు! నేను మొన్న మీ ఇంటికొచ్చినపుడు ఆవిడను చూశాను. బహుశా నువ్వామెను చిత్రవధ పెడుతున్న సమయంలోనే వచ్చాననుకుంటానక్కడికి"
చలపతి మాట్లాడబోయి ఊరుకున్నాడు.
"ఆమెకు పొరపాటున దెబ్బ తగిలిందని నువ్వన్నావ్ గుర్తుందా? నేను అనుమానించినా మాట్లాడకుండా ఊరుకున్నాను. నువ్వు చెపుతోంది అబద్దమన్న విషయం నాకప్పుడే తెలిసింది. ఒకవేళ అ దెబ్బ పొరబాటునే తగిలి వుంటే నువ్వలా చూస్తూ నుంచోవు. ఏ మందో మాకో వేయడానికి ప్రయత్నిస్తావ్? లేదా గాయాన్ని తుడిచి కట్టుకట్టడానికయినా ప్రయత్నిస్తావ్! ఏదీ లేకుండా అలా రాయిలా నిలబడితే అర్ధం చేసుకోలేమా? అయినా నేను కల్పించుకోలేదు. ఎందుకో తెలుసా? మీరిద్దరూ చిన్న తగాదా పడినంత మాత్రానా నేను జోక్యం చేసుకోవడం సభ్యత కాదని!"
చలపతి ఇరుకున పడిపోయాడు. ఇప్పుడు నర్సరాజు కేం చెప్పాలో తెలీటం లేదు. నిజమా - అబద్దమా?
"ఇప్పుడు ఏం జరిగిందని మీరలా మాట్లాడుతున్నారు?" అన్నాడతను ఏమీ తెలీనట్లు.
"పిచ్చి వేషాలు వేయకు! గతకొద్ది రోజులుగా నువ్వెలా పశువులా ప్రవర్తిస్తోందీ, ఆ అమ్మాయిని మానసికంగా ఎంత హింసిస్తోందీ - అన్నీ తెలిసినాయ్. రాజ్యం ఇప్పుడే మీ ఇంటిదగ్గర్నుంచి వచ్చింది. సావిత్రి అన్నీ చెప్పింది."
* * *
చలపతి ఉక్కిరిబిక్కిరయ్యాడు. తనింక నిజం దాచటం అనవసరం! ఈ విషయం నలుగురిలోనూ నానాలని సావిత్రి అనుకుంటే తనకేం అభ్యంతరం లేదు.
"అవును! సావిత్రికి శ్రీకాంత్ తో సంబంధం వుంది."
"థూ!" అక్కడే ఉమ్మివేసింది రాజ్యలక్ష్మి.
"ఈ మాట అంటావా, ఆనవా అనే ఎదురుచూస్తున్నానిందాకటి నుంచి! నీకు సిగ్గూ లేదూ - ఆడపిల్ల నంత మాట అనడానికి! అసలు నువ్వు మనిషివేనా? ఆ అమ్మాయికి నువంటే ఎంత ప్రాణమో తెలుసా? నీలాంటి దౌర్భాగ్యపు వెధవని అంతగా అభిమానించటం అసలు ఆ అమ్మాయి తప్పు! కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టటం వల్లే ఆ అమ్మాయి నిప్పుడు ఇంత మాటలంటున్నావ్."
చలపతికి కోపం ముంచుకొచ్చింది. తనేందుకు అభిప్రాయానికొచ్చింది. తన నోటి వెంబడి వినకుండానే ఆమె అలా నిందించటం సహించలేకపోతున్నాడు.
"నేనేం పిచ్చివాడిని కాదు ఊరికే అభాండాలు వేయటానికి."
"ఓహో రుజువులున్నాయా? వాళ్ళిద్దరూ కౌగలించుకుని వుండగా ఫోటోలు తీశావా? లేపొతే తలుపు చాటు నుంచీ చూశావా? " విరుచుకుపడిందామె.
రాజ్యలక్ష్మి అలా మాట్లాడుతుందని గానీ, అంత అవహేళన చేస్తుందని గానీ అతనెప్పుడూ ఊహించలేదూ.
"అది కాదు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఇంట్లో ప్రణయకలాపాలు జరిపారు."
"అలాగా! అలా అని కలగన్నావా హాస్పిటల్లో! వాళ్ళిద్దరే ఇంట్లో ఉంటే అలా ప్రవర్తిస్తారా? అలా ప్రవర్తించాలనుకుంటే నువ్వు హాస్పిటల్లోనే వుండాలా? నువ్వింట్లో ఉండగానే ప్రవర్తించలేరనుకున్నావా? ఒకవేళ శ్రీకాంత్ మీద సావిత్రికి అంత ఇష్టం వుంటే నిన్ను వదిలేసి అతనితో వెళితే నువ్వేం చేయగలావ్? వాళ్ళిద్దరూ నిన్ను తరిమికొట్టి పెళ్ళి చేసుకుంటే నువ్వేమయినా చేయగలవా? అయినా నువ్వు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నేనూ ఇంట్లోనే వుండి సావిత్రికి సహాయం చేశాగా! మరి నాకూ శ్రీకాంత్ తో సంబంధం ఉన్నట్లేనా"
చలపతికి నోట మాట రాలేదు. ఆమె మాటలు అతనిలో కొత్త ఆలోచనలు కలుగజేయసాగినాయ్. రాజ్యలక్ష్మి తనింట్లో ఉన్నదన్న సంగతే తనకు తెలీదు. ఆమె వుంటే ఇంక తన అనుమానానికీ అర్ధమేముంది?
"మాట్లాడమేమిటి? జవాబు చెప్పడానికి కూడా దమ్ము లేదు కదూ?" ఈసడింపుగా అందామె.
"వాళ్ళిద్దరూ చనువుగా మసలటం నేను చూశాను - "ఇంకేమీ అనలేక అన్నాడతను.
"ఓహో! అలాగా! నువ్వు మా ఇంట్లో నాతొ చాలా సార్లు చనువుగా మాట్లాడావ్. అంతమాత్రానా మనిద్దరికీ సంబంధం ఉన్నట్లేనా? ఆరోజు నువ్వు గీత తో సినిమా కెళ్లావ్! నీకూ గీతకూ సంబంధం వుందనే నేననుకోవాలా?"
చలపతి తల తిరిగిపోసాగింది. నిజంగా తనదే తప్పా?"
నర్సరాజు ఓ క్షణం తర్వాత మాట్లాడాడు.
"ఏయ్ చలపతీ! నీకా అమ్మాయి మీద నమ్మకం లేకపోవచ్చు గానీ మా ఇద్దరికీ వుంది. మీ ఇద్దరికీ గుళ్ళో పెళ్ళి చేయించిన రోజు నీకో విషయం చెప్పటం మర్చిపోయాను. నేను మా ఫ్రెండ్స్ ఎవరికయినా లవ్ మారేజ్ చేయించనీ! వాడు ఆ అమ్మాయినీ మోసం చేయడని నమ్మకం వుంటేనే ఆ పెళ్ళి చేయిస్తాను. అంతేకాదు అప్పటికీ వాడు ఏ కారణం చేతనయినా ఆ అమ్మాయికీ అన్యాయం చేస్తే ఆ అమ్మాయిని నేను ఆదుకుంటాను. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి తన జీవితం తను గడిపే స్థితి కొచ్చేవరకూ మేమిద్దరం కనిపెట్టి వుంటాం. ఎందుకంటె మాకు కొన్ని ప్రిన్సిఫుల్స్ ఉన్నాయ్. ఇప్పుడు నువ్వు కాదన్నా సావిత్రి కొచ్చిన భయం ఏమీలేదు. ఆమె మా దగ్గరుంటుంది. సావిత్రి లాంటి అందమయిన అమ్మాయికి మరో పెళ్ళి చేయటం ఈ సిటీలో పెద్ద సమస్యేమీ కాదు. వెళ్ళిక! ఈ సంగతి చెప్పటానికే పిలిచాను........"
చలపతి లేచి నిలబడ్డాడు.
"ఇంకో సారి నీ పాడు ముఖం మళ్ళీ మాకు చూపించకు" అంది రాజ్యలక్ష్మి కోపంగా.
చలపతి బయటకొచ్చాడు. ఇంకో పావుగంట టైముంది. అఫీసు వదలడానికి. అయినా అఫేసులోకి వెళ్ళబుద్ది కాలేదతనికి.
బస్ స్టాప్ లో కూడా నిలబడకుండా ఇంటివేపు బయలుదేరాడు . చలపతి భారంగా అడుగులు వేయసాగాడు.
ప్రక్కనే కారు హారన్ మోగడంతో ఉలిక్కిపడి అటువేపు చూశాడు. శ్రీకాంత్ కారు స్లో చేసి ఆపాడు.
అతని చూస్తూనే ఆశ్చర్యపోయాడు చలపతి. "కారెక్కు" అన్నాడు శ్రీకాంత్. చలపతి మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నాడు.
కారు వేగంగా పోతోంది. బంజారాహిల్స్ మీద అంతకు ముందెప్పుడూ వెళ్ళని మార్గం అది.
తన జేబులో కాగితం పొట్లాం వంక చూసుకున్నాడు చలపతి. సావిత్రికి అదే తను విధించాలనుకొన్న శిక్ష. ఆమె తాగే నీళ్ళలో చిటికెడు పొడి వేస్తె చాలు! ఆమె జీవితం సమాప్తమయిపోతుంది.
అలాంటి ఆడదానికి అదే సరయిన శిక్ష అనుకొంటున్నాడు తను. కాని మరి ఈ నర్సారాజు చెప్పిన విషయం తనకు మళ్ళీ అశాంతిని కలుగజేస్తుంది.
ఒకవేళ సావిత్రి నిర్దోషెనేమో! తనే లేనిపోనివన్నీ కల్పించుకొని అలా అలోచిస్తున్నడేమో! ఏమి పాలు పోవడం లేదు చలపతికి.
కారు ఓ నిర్జన ప్రదేశంలో ఆగింది.
"దిగరా!" తను దిగి తలుపు తెరచి పట్టుకుంటూ అన్నాడు శ్రీకాంత్. అతని గొంతులోని రౌద్రం చూసి ఉలిక్కిపడ్డాడు చలపతి . కారు దిగి నిలబడ్డాడు.
"సావిత్రి తో ఏమిటి అన్నావుట?"
"ఓహో! సావిత్రి అంతా చెప్పెసిందన్న మాట! "
"తెలిసింది! ఇంక నన్నడగడం ఎందుకూ?" మాట పూర్తవుతొండగానే చలపతి చెంప చెళ్ళుమంది. శ్రీకాంత్ అయిదు వేళ్ళూ వాతల్లా తెలిపోయినాయ్! చేతితో రుద్దుకుంటూ శ్రీకాంత్ వేపు చూశాడు చలపతి.
"ఇడియట్! హాస్పిటల్ లో చేరేముందు నీ చాదస్తం తో మా ఇద్దరినీ నొప్పించి, అంతటితో ఆగక, ఇద్దరి చేతులూ కలిపి కిరతకుడిలా ప్రవర్తించావ్! ఇప్పుడేమో లేనిపోని సంబంధం అంటగడుతున్నావా? నిన్ను ఈ క్షణాన్న మర్డర్ చేసినా పాపంలేదు" కాలర్ పట్టుకొని ఆవేశంతో కుదిపేస్తూ అన్నాడు శ్రీకాంత్.
చలపతికి ఉక్రోషం ముంచుకొచ్చింది" నిజంగా మీ ఇద్దరకూ ఎలాంటి సంబంధం లేదా?" అన్నాడు కన్నీళ్ళు తిరుగుతుండగా.