Previous Page Next Page 
విరిజల్లు పేజి 33


    "ఎందుకిలా మాట్లాడుతున్నావ్? ఏమైంది నీకు! మనసుని సంభాళించుకో! రంగా! గుండె మంటని ఆర్పేవి కన్నీళ్ళు! నిజమే! అయినా ఒక్కోసారి ప్రజ్వలింపజేసే ఆజ్యంకూడా అవుతాయ్. మనిషి దుఃఖాన్ని తొక్కేసి ముందుకు సాగాలి రంగా?"
    దుఃఖమూ, సంతోషమూ రెండూ మనిషితో ఒకేసారి ప్రవహిస్తే అతని స్వరం ఎలా వుంటుందో అనుభవజ్ఞులకి తెలుసు.
    "నీలా స్వాంతన కలుగచేసేట్టు మాట్టాడటం అందరికీ చేతకాదు విరజక్కా! మనిషిని ముక్కలు చేసినా అంతటితో అంతమవుతుందని సంతోషమైనా వుంటుంది కానీ మనసుని ముక్కలు చేస్తే ఎలా అక్కా!
    ఒక్క నిమిషం ఆగి ఆమె చేయి వెదుక్కుని గుండెలపై ఆనించుకుని ఆర్ద్రంగా అడిగాడు. "అక్కా! అక్కా! నన్ను విడిచిపోవు గదక్కా!"
    అతని ప్రశ్న అంతరాంతరాలలో దాగున్న సోదర ప్రేమని పెలికి పొంగిస్తుంటే ఆనందాన్ని అణుచుకుంటూ అంది.
    "ఇప్పుడా ప్రశ్న ఎందుకు రంగా? నీ ప్రయత్నంలో నా మనసుకీ ఈ శరీరంపై స్వాధీనం వున్నన్ని రోజులు ఈ వూరిని విడిచి వదలిపోను. ఇక్కడున్నన్ని రోజులు నిన్ను విడిచి తిరగలేను. నా తమ్ముడిని నేను దూరం చేసుకుంటానా రంగా!"
    ఆందోళన ధ్వనించే గొంతుకతో అన్నాడు. "కాదక్కా! దుష్టశక్తులు మనవి విడదీయాలని యత్నిస్తున్నాయి నీవు దేవతవక్కా! వీటికి లొంగిపోవు. ఆ శక్తులు నిన్ను లొంగదీసుకోలేక ఓడిపోతే అవహేళనగా సంతోషంగా నేను నవ్వుకోవాలక్కా! నాకీ మాత్రమైనా సంతోషం కలుగ జేయవూ?"
    తలపై చేయివేసి నెమ్మదిగా నిమురుతూ అంది. "నీలాంటి తమ్ముడి కోసం ఏమైనా పోగొట్టుకుంటాను. అంతేకానీ నిన్ను దూరం చేసుకోలేను. నేను దేవతని కాను. అయినా నన్నే దుష్టశక్తి నీ నుండి దూరం చేయలేదు. నిజం రంగా! నీకాభయం అక్కరలేదు. ఎప్పుడూ నీ విరజ అక్క నీ దగ్గరే వుంటుంది. కానీ నువ్వు ఇలా బేలగా ఏడుస్తూ వుండరాదు. చూడరాదూ నేను స్త్రీని, కానీ ఎంత ధైర్యంగా వున్నాను. నీవు మగరాయుడివి అయివుండికూడా అమ్మాయిలా ఏడిస్తే ఎలా?"
    "ఏడ్వటం మీ సొమ్మేకాదక్కా! మనసులోని భారాన్ని దింపుకోవాలని కోరుకునే ప్రతివారి సొమ్ము. అది అయినా నీవు చెప్పావు గదా! మనసులోకి దుఃఖాన్ని చేరనివ్వను...." ధృడంగా అన్నాడు.
    "సరే! నాకు అంతకంటే కావలసింది ఏమీలేదు. ఇంతకీ నీ భయమేమిటి బాబూ!"
    "మనుషులు అందరూ సమానంగా ఎదగలేరక్కా! వయసొచ్చిన మనసు వికసించక కుళ్ళుబోతు తనాన్ని విడువలేక ఔన్నత్యం లేక నాగరికత వాసనలేక మనుషుల్ని నమ్మలేక నిజాయితీని విశ్వసించలేక ఎప్పుడూ స్త్రీలనీ, పురుషుల్నీ ఒకే సంబంధం దృష్ట్యా చూస్తూ వారి పరోక్షంలో నీచంగా మాట్లాడుకుని సంతోషించే పాపవిశక్తులు ఈ సంఘంలో చాలా వున్నాయక్కా! అలాంటి నీచపురుగుల్ని నీవులెక్కచేయవద్దనికోరుతున్నానక్కా!"
    నవ్వుతూ అంది "నింద అనేది ఎప్పుడూ నిజం కాదు రంగా! సత్యానికీ భగవంతుడికీ భయపడాలిగానీ, పోచికోలు మాటలాడే వారికి వారి మాటలకి భయపడితే ఎలా? సంఘంలో మంచీ వుందీ....చెడూ వుంది.... దాన్ని చూచీ చూడనట్లు పోవాలి. చెడుమనవరకూ ప్రాకకుండేంత వరకూ దాన్ని లెక్క చేయకూడదు అంతే రంగా! గర్వానికీ భయపడను.... నీవూ భయపడవలసిన అవసరం లేదు. అలా ఎవరో ఎందుకో అనేమాటల్ని లెక్కజేసి నిన్ను దూరంచేసి పోలేను. మల్లెపువ్వులాంటి తమ్ముడివి. నిన్ను కాదని మరెక్కడికిపోతాను. నీకోసం ఏ కష్టమయినా భరిస్తా రంగా! దేవుడు నీపై ఎంతో దయచూసి తోబుట్టువుల్ని ఎరుగని నాకు భాతృవాత్సల్యాన్ని పసిడి కొమ్మలా అందించాడు. ఆ అమృత కలశాన్ని ఎలాంటి స్థితిలోనయినా పోగొట్టుకోను. ఈ జీవితమే మారిపోయేప్పుడు తప్ప నిన్ను వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. ప్రశ్నే లేదు"
    ప్రేమగా ఆమె నిమురుతూ వుంటే తృప్తితో అన్నాడు.
    "అమ్మకంటే ప్రేమగా, అక్కకంటే తీయగా అన్నిటికంటే మధురంగా వున్నావాక్కా; నీవు నీ మాటలు వింటూంటే చచ్చేవాడికైనా బ్రతకాలనిపిస్తుంది. ఎలా సృష్టించాడక్కా దేవుడు నిన్ను."


                                                            25


    అద్దం ముందు కూర్చుని జడవేసుకుంటున్న సావిత్రి వెనుగ్గా వచ్చి నిల్చుని భుజంపై రెండుచేతులూ వేసి అన్నాడు.
    "సావిత్రీ! విజయవాడ వెళుతున్నాను. నీవు రావాలి. కనకదుర్గ దర్శనం చేసుకోవాలని యెన్నాళ్ళుగానో అనుకుంటున్నావు కదా!"
    మెల్లిగా ఆ చేతుల్ని తొలగించి జడ చివర అల్లుకుని రిబ్బను ముడేసుకుంటూ అంది.
    "హుఁ....అదొక్కటే తక్కువైంది లెండి....అయినా మీ వెంట షికార్లకూ, సినిమాలకీ యాత్రలకీ వెళ్ళేందుకు నేను తగుదునా? పల్లెటూరి బైతులాగా నేనూ నా వేషం. అసలు నాకు చీర కట్టుకునేందుకే రాదాయె....ఎవ్వరయినా చూస్తే ఎంతో గొప్ప డాక్టరు అనిపించేలా మీరు నన్ను చూస్తే....
    తనవేపు తిప్పుకుని గడ్డం పట్టుకుని మునివేళ్ళలోకి చూస్తూ అన్నాడు.
    "మనస్పూర్తిగా అంటున్నావా సావిత్రి! ఏనాడయినా నిన్నామాట అన్నానా? నీవు నాకు తగవని. భార్యగా భగవంతుడు నా పాలిటి వరంలా దయచేశాడు నిన్ను. అలాంటి దానివి యిలా మాట్లాడితే నాకు యెంత బాధ?"
    ముఖం ప్రక్కకు తిప్పుకుని చూపుల్ని తప్పించుకుంటూ అంది "అవున్లెండి బావా! ఎదురుగా అద్దంలో ముఖం చూచుకుని అతని అంద వికారాన్ని గమనించి బాధపడుతున్న వ్యక్తితో అతని ఎదురుగానే ముఖం మీదే అతని అందాన్ని పొగడుతూ వినేవాళ్ళకి, చూసేవాళ్ళ తమ సహృదయతని చాటుకోవడం మాత్రమే తెలుసు కొందరికి. కానీ ఆ వ్యక్తి మాటలతో ఎంతగా కృంగిపోతాడో కృశించిపోతాడో తెలీదు. తెలిసికోయత్నించరు! అతని మనసుపై సీసం కరిగించి పోస్తున్నట్టుగా ఎంత బాధపడతారో ఎరుగరు వారు. కానీ అభాగ్యత అనేది జన్మతో రాకున్నా జగతిలో జీవనం వెంటవస్తుంది కొందరికి. అలాంటివారు ఏం చేస్తారు! ఏం చేయగలరు ఏడ్వటం తప్ప?"  
    భుజాలమీదున్న రెండు చేతుల్ని కొంచెం బిగించి అన్నాడు.
    "ఇలా చూడు నా ముఖంలోకి.... ఏమనిపిస్తోంది నీకు అబద్ధం చెప్పే వ్యక్తినేనా నేను? నిన్ను ఏనాడైనా అలా హింసించానా? మనస్సు బాగులేని వేళల్లో నన్ను బాధపెడితే తాత్కాలికోద్రేకంలో ఏదైనా అంటే అది నన్ను నేను హింసించుకోవటమే అవుతుంది. కానీ మారేదికాదు సావిత్రీ! ఆవేశంలో అనే మాటలకి విలువయిచ్చి మనస్పూర్తిగా అంటున్న మాటలని నమ్మలేని మనస్తత్వమే అర్ధం కావడంలేదు.
    జారబోతున్న కన్నీటిని అతనెక్కడ చూచిపోతాడోనని గుడ్లల్లోనే కుక్కుకుని ముఖం ప్రక్కకు తిప్పుకుని అంది.
    "పోనీలే బావా! నీ మనస్తత్వం అర్ధం కాకపోతే దానిదేముంది? మనసులు కలియని మనువులు ఎన్నిలేవు? జీవితంలో నీకు గుదిబండలా తయారు కాకుండా వున్నన్నిరోజులు మీ నీడన ఉంటాను. మాకు ఏనాడైతే విసుగు అనిపిస్తుందో ఆనాడు మీ ఛాయలకికూడా రాకుండా మాయమవుతాను. నా బావకి నేను అక్కరలేని రోజున నేను జీవించి వ్యర్ధమే కదా బావా! ఎవరికోసమైతే బుద్ధి తెలిసిన రోజునుంచీ మనసులో భర్తగా పొందాలనుకుంటూ దివ్యమైన అనుభూతిలో తేలిపోతూ బ్రతికానో ఆ వ్యక్తికే నేను బరువైన రోజున నాకు దక్కిన అమూల్యమయిన మణి నీదికాదని, నేను అందుకు అర్హురాల్ని కాదని తెలుసుకుని దూరంగా పోతాను...."
    బరువెక్కిన మనసుతో ఇంకేం మాట్లాడినా యింతేననుకుని వెళ్ళిపోయాడు అతడు.


                                                         *    *    *


    ఏసుక్రీస్తు పటానికి ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకుని మనసు నిబ్బరపరచుకోవాలని యత్నిస్తోంది విరజ.
    కళ్ళు మూసుకున్నా ఆయన పవిత్రమూర్తి మనో నేత్రాలకి దివ్యంగా కనిపిస్తోంది.
    కదలుతున్న మనస్సుని కట్టివేయాలని చేసే యత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మేరీమాత క్షణక్షణానికి గుర్తుకు వస్తున్నా ఆమెరూపం మనసులో మెదలుతున్నా శాంతి చిక్కడంలేదు.
    దొరకని వాటికయి యత్నించేకొద్దీ అవి దూరం వెళ్ళటం ఈ ప్రపంచంలో సహజమేమో?
    సర్వ ప్రపంచానికీ సర్వ చరాచర సృష్టికీ శాంతిని ప్రసాదించే తల్లీ తనయులు తనకి శాంతి నొసగడంలేదు. అది తన అభాగ్యత. గలగలపారే సెలయేరులో నీళ్ళు తాగాలనే వాడిది ఆశక్తత కానీ యేరుదేముంది?
    పరుగిడుతున్న ఆలోచనా ప్రవాహాన్ని ఆపుకోటానికి యత్నిస్తూ క్రాన్ పై మనసుని నిలువ ప్రయత్నం చేస్తోంది. ఆమె ఎంత ప్రయత్నించినా అది అశక్తుని యత్నంలా నిష్పలమౌతూనే వుంది.
    కళ్ళు తెరిచి మిలమిలా వెండినదిలా మెరిసిపోతున్న శిలువని కళ్ళకద్దుకుంటూ అనుకుంది.
    "భగవాన్! సంయమన శక్తినివ్వు. మనసుని కట్టివేసుకోలేని ఈ జీవితం ఎందుకు? నీ సేవలో నిన్ను ధ్యానిస్తూ జీవితం గడపాలని ప్రయత్నిస్తూంటే నాకు అడుగడుగునా అడ్డంకులే వస్తున్నాయి ప్రభూ.... క్షణికమయిన ఏదో ఒక్కక్షణంలో అనుకోకుండా పీలిపోయే ఈ జీవితంపై భ్రమ ఎందుకు కలిగిస్తావు ప్రభూ! నిత్యమై నిలయమై విశ్వమయమైన నీ చరణ పీఠికపై పూజాసుమంలో పడివుండనివ్వు.

 Previous Page Next Page