Previous Page Next Page 
మనసున మనసై పేజి 32


    'కాయా లేదు, పండూ లేదు. వాడు సరిగ్గా సమాధానం చెప్పలేదు- ఆవిషయం అనుకోలేదని, ఆలోచించలేదని, చూద్దామని దాటేశాడు తప్ప సరిగా అవుననీ కాదనీ అనలేదు. ఐహావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నాడు. మరి దానర్ధం ఏమిటో ఇంకేమన్నా సంబంధాలున్నాయేమో ఇంతకంటే మంచివి వాడికి ఏవో కోరికలు ఆశలుండచ్చుగదా....' దమయంతి వంక చూసి అన్నాడు.
    "మీ ఫ్రెండు దృష్టి భావిక చెల్లెలు మీద పడిందనిపిస్తుంది నాకు ఆ రోజు పెళ్ళిలో ఆ అమ్మాయి చుట్టూ వదలకుండా తిరిగాడు' దమయంతికి ఏదో తట్టి అంది.
    'ఆఁ...! ఏదో బాచిలర్.... అందంగా కనిపించే అమ్మాయి వెనక పడటం సహజం. అంతమాత్రాన పెళ్ళాడుతాడని ఏముంది. వాళ్ళకి మనకి ఎక్కడ సరిపోతుంది. వాళ్ళ అమ్మానాన్న వప్పుకోవద్దూ.... వాళ్ళు బాగా వున్నవాళ్ళు.... సింధీలు...'
    'సర్లెండి. వాళ్ళిద్దరూ చేసుకోదలిస్తే మిగతావన్నీ ఏం అడ్డు ఈ రోజుల్లో. నాకు ఎందుకో ఆ రోజు అతని ధోరణి చూసి అలా అనిపించింది'
    'ఏమో మరి...చూద్దాం....ఆలోచిస్తా....నేను అనుకుంటే చెప్తానని అన్నాడు. గదా, చూద్దాం....మన ప్రయత్నం మనం చేశాం. సంబంధం సజెస్ట్ చేశాం. అయ్యే యోగం వుంటే అవుతుంది....జయంతి కంటే మంచి వాళ్ళు దొరికితే అతను మాత్రం ఎందుకు వదులుకుంటాడులే...'
    'అమ్మా నాన్న ఈ సంబంధం వప్పుకుంటాడన్న ఆశలో వున్నారు. జయంతికీ చాలా వుంది మనసులో.... సరే కానీండి చూద్దాం....ఎవరికెవరు రాసి పెట్టి వున్నారో....
    
                                                                           * * *
    
    రోజూ ఏదో టైములో మనీషాకి ఫోను చేసి మాట్లాడటం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడు దివాకర్. ఆఫీసు కొచ్చిందగ్గిర నించి ఏదో వంకతో ఆమెకి ఫోను చెయ్యాలన్న ఆరాటం అతన్ని నిలవనిచ్చేదికాదు. తను తరచు ఫోను చేస్తే ఏమనుకుంటుందోనని కాసేపు తటపటాయించే వాడు. ఇంకా తమిద్దరి పరిచయం మొదట్లోనే ఉన్నప్పుడు ఇలా ఫోను చేస్తే విసిగిస్తున్నాడని అనుకుంటుందేమో అన్న సందిగ్ధత కాసేపు అలా ఫోను మీద చెయ్యేసి తీస్తూ ఓ గంట రెండు గంటలు కంటే ఆగలేక ఏమయితే అయింది ఆమె ధోరణి చూసి ఫోను పెట్టేయచ్చు అని ధైర్యం చేసి చేసేవాడు.
    'హలో, ఏం చేస్తున్నారు-డిస్ట్రబ్ చేశానా...' అంటూ మొదలుపెట్టాడు.
    'లేదు లెండి చెప్పండి ఏమిటి సంగతి' మనీషా అంది.
    'సంగతేం లేకపోతే ఫోను చెయ్యకూడదంటారా.... వూరికే మీతో మాట్లాడాలనిపించింది. మీ గొంతు వినాలనిపించింది....'ధైర్యం చేసి అన్నాడు. ఒక్కక్షణం నిశ్శబ్దం అనంతరం....
    'సరే విన్నారుగా, పెట్టేయమంటారా ఇంక ఫోను' మనీషా కవ్విస్తున్నట్టుంది. ఆ మాత్రం ప్రోత్సాహంతో 'అంతపని చెయ్యకండి. రోజు కోసారన్నా మీతో మాట్లాడకపోతే ఏమిటోలా, ఏదో మర్చిపోయినట్లుంటుంది. ఇలా ఫోను చేస్తే మీరేం అనుకుంటారోనని భయం! భయంలేదని మీరు అభయం ఇస్తే...' గొంతులో భయం నటిస్తూ అర్దోక్తిలో అడిగాడు. మనీషా సుతారంగా నవ్వి.... 'మీరు భలే మాట్లాడతారు. భయం దేనికి, ఇట్స్ ఎ వెల్ కం ఛేంజ్ ఫ్రమ్ ది రొటీన్' అంది.
    'అమ్మయ్య, ఆ మాత్రం అభయం ఇచ్చారు చాలు మనీషాజీ... ఏమిటో కొంత మందిని చూడగానే మనకెంతో ఆప్తులన్నట్టు, పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. వారి స్నేహం కోసం ఆరాటపడ్తాం......మిమ్మల్ని మొదటి రోజు పెళ్ళిలో చూసిందగ్గిర నించి నేను నేను లేను'    
    'అంటే.... మీరు మీరుగా లేక ఏమయ్యారు..... రూపం మారిపోయిందా' హాస్యంగా అంది నవ్వుతూ.
    'రూపానిదేం వుందండి....ఇది మనసుకి సంబంధించినది. కొద్ది మందిని మాత్రమే చూస్తే కలిగే స్పందన ఇది...."
    "ఏమిటో మీరు పాయిటిక్ గా, ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, నాకేం అర్ధం కాదు-మామూలు భాష మాట్లాడండి స్వామి...' అతని ధోరణి అర్ధమైనా కానట్టే అమాయకంగా అంది.
    'ఈ భావం వ్యక్తీకరించడానికి భాష వుండదు. ఉన్న నాలాంటి వాడికి ఆ భాష రాదు- భావం తెలియాలంటే, మనసు పలికే భాష వినాలి-చూడాలి'
    'మరి నాకెలా తెలుస్తుంది. ఇంత దూరాన వున్నాను. ఫోనులో మీ హావభావాలెలా తెలుస్తాయి. ఇంక మన దేశంలో ఫోటోలు కనిపించే ఫోనులొచ్చినట్టులేదు' మనీషా తనేం తీసిపోనట్టు అతన్ని కవ్వించసాగింది.
    'ఆ ఫోన్ వచ్చే వరకన్నా మనం ఒకరిమొహం చూసుకోవాలంటే, హావభావాలు తెలియాలంటే కలుసుకోడం తప్పనిసరి అంటారా కాదా. నేనెలా మారిపోయానో, ఎలా పిచ్చివాడినవుతున్నానో మీరు చూసి మీరే నిర్ణయించుకోండి.... చెప్పండి ఎప్పుడొచ్చి చూస్తారు..... మీరొద్దులెండి... ఎప్పుడు రమ్మంటారు చెప్పండి....చెప్పండి మనం ఎప్పుడు కలుద్దాం... ఎక్కడ కలుద్దాం....మీ ఇంటికి రమ్మంటారా' అవకాశాన్ని జారవిడుచుకుంటే మళ్ళీ దొరకదన్నట్టు గబగబ అన్నాడు. మనీషా కాసేపు మౌనంగా వుంది. 'మీరు ఏమిటి నాకు ఇంట్లో పెద్ద వాళ్ళున్నారన్న విషయం మర్చిపోతున్నట్టున్నారు'.

 Previous Page Next Page