Previous Page Next Page 
మనసున మనసై పేజి 31


    'అదా సంగతి. అది సరే ఇల్లు, ఫేమిలీ అందరూ వుండగా తను మరి వేరే రూంలో వుండడం ఏమిటి? ఎందుకలా...' అనుమానంతో అడిగాడు. గోపాలకృష్ణ జవాబివ్వడానికి కాస్త తటపటాయించి ఏదో గొడవయిందిలే అపుడు....కోపం వచ్చి వెళ్ళిపోయింది' నసుగుతూ అన్నాడు.
    'వాళ్ళ అమ్మ, నాన్న వూరుకున్నారా- ఎలా అంగీకరించారు...?'
    'ఏం చేస్తారు. ఇంట్లో గొడవపడి కోపంగా పంతంగా వెళ్ళిపోయింది' - అని కాస్త ఆగి... కాస్త సందేహిస్తూ 'దానికి పరోక్షంగా నేనే కారణం అనుకో' ...
    'అదేమిటి, నీవేం చేశావు' దివాకర్ ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు. గోపాలకృష్ణ జరిగిందంతా చెప్పుకొచ్చాడు. దివాకర్ మనసులో జయంతి ప్రవర్తన మీద ఏ అనుమానం వుండకూడదన్న సదుద్దేశంతో నింద అంతా తన మీదే వేసుకుంటూ చెప్పాడు.
    విని ఆశ్చర్యపోయాడు 'ఈజిట్ - ఒక రిటార్ట్ ఇచ్చేవ్... దానికింద ఓవర్ రియాక్ట్ అయిందన్నమాట'
    'ఏదో నాకు ఆవేశం వచ్చేసింది. ఆ క్షణంలో - నా మేల్ ఇగో దెబ్బతిని ఏదో బుద్ది చెప్పి కసి  తీర్చుకోవాలని అనాలోచితంగా చేశాను. తరువాత ఈ ఇంటికి అల్లుడినవుతాననుకోలేదు గదా అపుడు-తరువాత చేసిన పనికి చాలా బాధపడ్డాననుకో, నాదేం తప్పులేదని అందరూ పాపం నన్నే సపోర్ట్ చేసినా నా వల్ల జయంతి ఇల్లు వదిలిందన్న బాధ నన్ను వదలడంలేదు' పశ్చాత్తాపపడ్తున్నట్టున్నాడు.
    'నీవే కాదు, ఆ సిట్యుయేషన్ లో ఎవరన్నా అలాగే రియాక్ట్ అవుతారులే. అబ్బ! జయంతిగారికింత పంతం ఉందా. అంత చిన్న విషయానికి ఇల్లు వదిలేసి ధైర్యంగా వంటరిగా వుంటుందంటే... ఇదా సంగతి...' అన్నాడు దివాకర్.
    'తనూ ఏదో ఆవేశంలో చేసింది ఇప్పుడు వెంటనే మళ్ళీ తిరిగి రావడానికి ఇగో ప్రాబ్లమ్ అడ్డువస్తూంది. వాళ్ళ వాళ్ళూ ఏదో సంబంధం కుదిరి పెళ్ళి చేసేస్తే వాళ్ళ బాధ్యత తీరుతుందని ఆలోచిస్తున్నారు' జయంతి గురించి అతను చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకోకుండా సర్దిచెప్పాడు....' అందుకే నిన్ను వప్పించి ఈ పెళ్ళి జరిగేట్టు చూస్తే నాకు ఈ గిల్టీనెస్ తగ్గుతుందని, నా స్నేహితుడివి కదాని అడుగుతున్నాను'
    దివాకర్ కాస్త ఇబ్బందిగా కదిలాడు. స్నేహితుడివి కదా చేసేసుకో,మంటావా, హాస్యంగా అన్నట్టు అని.... 'చూద్దాం... ఐ హావ్ సమ్ అదర్ ప్లాన్స్-జయంతిగారు ఏదో నా ఆఫీసులో పనిచేస్తున్నారని, ఉషారాణి ద్వారా శ్రీధర్, నీవు మళ్ళీ కలవడం వల్ల ఆవిడతో పర్సనల్ పరిచయం కల్గింది. అంతే, అంతవరకే తప్ప నేను వేరే ఆ దృష్టితో ఆమెని చూడలేదు...' ఫ్రాంక్ గా అన్నాడు.
    'ఇది వరకు చూడలేదు సరే. ఇప్పుడు చూడు పోనీ, ఈ ప్రపోజల్ ఇప్పుడు వచ్చింది కనక పోనీ, ఇప్పుడాలోచించి చెప్పు' పట్టువదలని విక్రమార్కుడిలా అన్నాడు. దివాకర్ మరోసారి ఇబ్బందిగా చూశాడు. 'నీ అందం ఆవిడకి నచ్చనట్టే. ఆవిడ అందం గురించి అవతలి వాళ్ళూ ఆలోచిస్తారుగా. తను ఏం పెద్ద అందగత్తెనని ఇతరులకి వంక పెడ్తుంది. నాకూ ఏ వంకలు పెడ్తుందో' మాటలకి తడుముకున్నాడు'
    'నీకేం వంక పెడ్తుంది. నీలాంటి స్మార్ట్, హాండ్సమ్ గై కావాలని ఆవిడ కోరిక. నీవంటే జయంతి కిష్టమే.... ఒరేయ్....ఏదో నీ మనసులో తన గురించి ఏం అపోహలు, అనుమానాలు వుండకూడదని ఇదంతా చెప్పాను. స్నేహితుడివని, జయంతి ఏం చెడ్డమ్మాయికాదు. కాస్త ఆవేశం పాలు ఎక్కువ అంతే'
    'అరే బాబూ, నన్ను ఆలోచించుకోనీయరా, ఇప్పటికిప్పుడు చెప్పేయాలంటే ఎలారా-చెప్పాగా ఐ హావ్ సమ్ అదర్ ప్లాన్స్ అని చూద్దాం- ఏమవుతుందో, మనం అనుకున్నంత మాత్రాన అన్నీ అవుతాయా-మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్' అంటారుగా.
    'ఈ డొంక తిరుగుడెందుకు - నీవు నాకేం హాప్ ఇవ్వలేనంటావా'
    'అనవసరమైన హోప్ లు ముందే ఎందుకు ఇవ్వడం... చూద్దాం-నాకు టైము కావాలి. ఇప్పుడింక నన్నిబ్బంది పెట్టకు... నాకలాంటి ఉద్దేశం కలిగితే నేనే వచ్చి నీకు చెపుతాలే' 'అంటే, నీ మనసులో ఇంకెవరన్నా వున్నారా-చెప్పు, ఫ్రాంక్ గా చెప్పు-నేనేం అనుకోనులే. నీకా ఉద్దేశం లేకపోతే టైము వేస్ట్ ఎందుకు, వాళ్ళు అనవసరంగా ఆశలు పెట్టుకోడం ఎందుకు... దమయంతి నా ప్రాణం తింటుంది నిన్ను అడగమని.... వప్పించమని' గోపాలకృష్ణ కాస్త అసహనంగా అన్నాడు.
    దివాకర్ ధైర్యం తెచ్చుకున్నట్టు 'సారీరా, ఇప్పుడు ప్రస్తుతం ఆ ఉద్దేశం లేదు- ఇక ముందు కలిగితే చూద్దాం- నా మీద ఆశ పెట్టుకోవద్దు....ఒకవేళ నేను చేసుకోవాలనుకుంటే అప్పటికింకా జయంతికి పెళ్ళవకపోతే అపుడు చూద్దాం. అనవసరమైన హోప్ ఇవ్వడం నాకు ఇష్టంలేదు...' ఖచ్చితంగానే అన్నాడు.
    'ఓకే దెన్-సీయూ' అంటూ లేచాడు గోపాలకృష్ణ కాస్త నిరాశగానే. ఈ సంబంధం తప్పక కుదురుతుందని, దివాకర్ వప్పుకుంటాడని ఆశించాడు. జయంతికీ పెళ్ళి చేస్తే తన పట్ల ఆమె ఏర్పరచుకున్న తృణీకారభావం తొలగిపోతుందని, తమా గిల్టీకాన్షన్స్ నుంచి విముక్తుడవుతాడని అనుకున్నాడు.
    ఇంటికెళ్ళగానే దమయంతి ఆరాటంగా ఎదురువచ్చింది. 'కాయా పండా' నవ్వుతూ అడిగినా గోపాలకృష్ణ మొహం చూడగానే సందేహం కల్గింది.

 Previous Page Next Page