ఉదయం ఆరున్నర కావస్తుండగా బాత్ రూములో అడుగుపెట్టిన కృషి బడలికగా టబ్ లోకి చేరి వాల్వ్ ని ఓపెన్ చేసింది. గోరు వెచ్చగా శరీరాన్ని తడుపుతున్న నీళ్ళు ఆమెకు అదోలాంటి ప్రశాంతతని అందిస్తుంటే స్టీరియోలో మంద్రంగా వినిపిస్తున్న మైకేల్ జాక్సన్ 'బ్లాక్ అండ్ వైట్' మనసుని వివశత్వానికి గురి చేస్తుంది.
గుండె కెందుకీ సంకోచ వ్యాకోచాలు... బ్రతుకుని కోల్పోయిందేమైనా కాని ఆశల్ని సమాధి చేసుకుని ఎక్కడో సుదూరంగా బ్రతికేస్తూ యిక్కడ కొచ్చిన తనకీ అనుభవాలేమిటి... ధృవాల దిగంతాల్లో కల్లోల రాగాలనాలపించిన వర్తమానానికి అతీతంగా శరశయ్యలాంటి భవిష్యత్తులో శేషంగా మిగలాలి అనుకుంటే కార్చిచ్చు వర్షంలో తడిసిపోయీ ఇంత కలవరపడుతుందేం.....అసలిది కలవరమూ....కోరని కలల్ని వరించడమా...ఎందుకు తనింతగా స్పందిస్తూంది...కూతకొచ్చిన కోయిలే అయితే తనకి కొరత లేదని తెలుసే - అయినా ఉదయ సంధ్యని కాదని గ్రీష్మంలో నడవాలని తను కోరుకుంటూంది అంటే ఎక్కడ తనలో లోపం - పూతకొచ్చిన మావిలా కదలాలనుకుంటూ చచ్చిపోయిన పచ్చదనంతో కాళ్ళని కదలించలేక కలత చెందుతుందెందుకని....ఇంత తెలివైన తను విస్సుని ఓడించలేక పోవటానికి కారణం గెలవలేకనా.... లేక గెలుపుకంటే ఓటమిలోనే తను ఆనందాన్ని పొందుతూందా... పూర్తిగా అతడి గురించి ఆలోచించటానికి వెనుకాడుతున్నది కౌశిక్ జ్ఞాపకాలుమాసిపోకనా, లేక విస్సుపై నిజంగానే మనసు లేకనా...
సమూహం మధ్య ఏకాంతం లాంటి ఈ బ్రతుక్కి అర్ధమేమిటి....అర్ధనిమీలితాలై ఆమె కనురెప్పల్ని పాయలుగా కదిలిన కుంతలాలు కప్పి విచిత్రంగా గిలిగింతలు పెడుతుంటే పక్కకి ఒరిగింది ఆందోళనకి ఆలాపనగా గుండెలు ఎగిసి పడుతుంటే మంత్ర ముగ్ధలా పైకి లేచింది.
తను నగ్నంగా వున్నానన్న విషయం మరచినట్టు కృషి అలాగే నడిచింది.
ఎదురుగా నిలువుటద్దం...
ఖజురహో శిల్పంలాంటి పొంకం.....నిసర్గ సుందర జానపద గీతాన్ని తలపించే హసిస్తున్న వసంత గానంలాంటి వర్చస్సు - స్వాప్నిక యుగళ గీతాల నేత్రాలు - మొలకల కనుకొలకుల్లో తళుక్కుమనే రాగరేఖలు - మౌనాన్ని వేడిగా నిట్టూర్చే వక్ష ధ్వయం - ధూళి రేగిన సంధ్య కాంతిలాంటి శరీరఛాయ.
అదిగో అప్పుడు ఆ ధ్యానంలోనే చూసింది ఎడమ స్థనానికి ఎగువగా నల్లని పుట్టుమచ్చ.
విస్సు గుర్తొచ్చాడు ఊగ్యోపం అంటే ఆలోచిస్తూనే కృషిని మరింత దిగువకి మరల్చింది....ఎడమ తొడపై మరొక పుట్టుమచ్చ - బిడియంతో ఒదిగిపోయింది....అదికాదు ఆమెను మరింత ఆందోళన పరిచింది. ఇంతకాలం తను గమనించలేదు నాభికి నాలుగు అంగుళాల దిగువునవున్న నల్లని పుట్టుమచ్చని....అది కూడా అతడు-
నెత్తుటి కొలనులో అతడి చూపుల నాళికని ముంచితే నాదం నినాదమై బిందువు సింధువై సృష్టి ద్వారా మణికవాటం తెరుచుకుని మనోసాగర స్వర మండలం గట్టుల్ని తెంచుకుని-
ఏమిటి...ఎందుకు తనిలా ఆలోచిస్తూంది.
ఒంటరితనం యింత భయానకంగా వుంటుందా...
మనసుని నిగ్రహించుకొని డ్రెస్ చేసుకుని మరో పది నిమిషాలలో గదిదాటి బయటికి వచ్చింది.
ముందు కనిపించింది విస్సు - అతడే కనిపించాడో లేక తనే ముందతడ్ని చూసిందో ఆమెకే తెలేదు. కాని డైనింగ్ టేబుల్ దగ్గర గ్రాండ్ పా కూడా వున్నాడు అప్పటికే.
అదికాదు. స్నేహితుల్లా చర్చించుకుంటున్నారు.
"గుడ్ మానింగ్ గ్రాండ్ పా" అంది తప్ప విస్సుని విష్ చేయలేదు.
అరక్షణం విరామం తర్వాత విస్సు ఇందాక ఆపిన చర్చని కొనసాగిస్తూ చెప్పుకుపోతున్నాడు. "అంచేత మీ కుడిచేతి బొటన వ్రేలిమీద పుట్టుమచ్చ మీ స్థాయికి కారణమన్న నిజాన్ని మీరు అంగీకరించాలి- ఈ లెక్కన మీకు రైట్ థై మీద కూడా మరో పుట్టుమచ్చ వుండి వుండాలి....అలాగే గుండెపై...."
ఆ తర్వాత కృషికి అతడి మాటలు వినిపించలేదు. అతడు చెబుతున్నది తనని ఉద్దేశించే అనిపిస్తుంటే ఇక భరించలేనట్టు లేవబోయింది.
"ఉండు బేబీ...." మృదువుగా వారించాడు ఉపాధ్యాయ.
"విశ్వనాథ్ మేనేజ్ మెంట్ సైన్స్ లోనే కాదు పుట్టుమచ్చల శాస్త్రం గురించీ క్షుణ్ణంగా తెలిసినవాడు.
అయినా ఆమె వెళ్ళిపోవాలనుకుంది. వెళ్ళిపోయేదే...."అదే మాదిరిగా గొప్ప అదృష్టాన్ని అందిస్తుంది ఊర్ధ్వోష్టంపై వున్న పుట్టుమచ్చ కూడా..."
టక్కున ఆగింది కృషి.
"ఊర్ధ్వోష్టం అంటే" అడిగింది కృషి కాదు ఉపాధ్యాయగారు-
అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.
'నగ్నంగా వుండే ప్రదేశం' అన్నాడు విస్సు విన్న....కృషి రెప్పలార్చకుండా చూస్తూంది.
"ఊర్ద్వోష్టం అంటే పై పెదవి..."
విభ్రమంగా చూసింది. నగ్నంగా వుండే ప్రదేశం అంటే దేనికీ మరుగున వుండని చోటని అతడి వుద్దేశ్యమా.... కేవలం తనను కంగారు పెట్టాలనే ఆ పదాన్ని వాడేడా... అసలు విస్సు నిజంగా తన నగ్నదేహాన్ని చూశాడా పై పెదవిపై తనకు పుట్టుమచ్చ వున్న విషయం తెలుసు కాని ఇన్ని గంటలుగా అతడు తనని ఆందోళన పరిచింది దాని గురించే అని తెలిసిందిప్పుడే-
ఆ చర్చ ఇంకా కొనసాగేదే.... సరిగ్గా అప్పుడు ఫోన్ రింగయింది. నౌకరు అందించిన రిసీవరు తీసుకున్న ఉపాధ్యాయగారు ఫోన్ లో ఏం విన్నదీ తెలీదు.
అచేతనంగా కుర్చీకి జారగిలబడిపోయారు.
"ఏమైంది" ఆత్రంగా అడిగింది ఆమె.
తేరుకోడానికన్నట్టుగా రెండు క్షణాలు నిశ్శబ్దంగా వుండిపోయిన ఉపాధ్యాయగారు "డిఫెన్స్ కి మనం పంపిన కొటేషన్ చేజారిపోయింది కృషి.... ఏడు కోట్ల ఖరీదుచేసే ఆర్డర్ పోయింది" అన్నారు సన్నగా కంపిస్తూ..
"కాని ఎలా..." ఉద్విగ్నంగా అడిగింది ఆమె.
"జనరల్ మేనేజర్ లీక్ చేసిన వివరాల్ని తెలుసుకుని మనం రేట్స్ ని తిరిగి కరెక్టు చేశాంగా."
ఎంత కోటీశ్వరుడికైనా ఇలాంటి నష్టం భరింపశక్యం కానిది....ఇక్కడ ఆర్ధికమైన నష్టం కారు దెబ్బతిన్న ప్రతిష్ట గురించి ఆయన అమితంగా కలవరపడుతున్నారు.
"దీనికి జవాబు చెప్పాల్సింది మీరు మిస్టర్ విశ్వనాథ్" విస్సు పై దాడి చేసింది కృషి... చౌదరి నుంచి వివరాలు సేకరించి మళ్ళీ చౌదరి గెలవటానికి కారణం కాగలిగేది విస్సు మాత్రమే అన్నది ఆమె బలమైన నమ్మకం. "ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మా గ్రాండ్ పా ని ఇంప్రెస్ చేయటానికి ఇక్కడ ఆ వివరాల్ని అందించారు..... ఈ విషయాన్ని మళ్ళీ చౌదరికి మీరు తెలియజేసి అతడు కరెక్టు చేసుకునే అవకాశం కల్పించారు."
"మిస్ కృషి" ఉద్వేగంగా అన్నాడు విస్సు. "మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్ధమౌతుందా....కష్టపడి వివరాల్ని సేకరించిన నేను కోరింది మీరు నష్టపోకూడదనే తప్ప మీ గ్రాండ్ పాని ఇంప్రెస్ చేయాలని కాదు.
"ఇంప్రెస్ చేయటమే మీకు ఆలోచన కాకపోతే మేం నష్టపోకూడదని మీరెందుకు కోరుకున్నారు - ఏమిటి ఈ కుటుంబం మీద మీకున్న శ్రద్ద...."
ఇరుకున పడిపోయాడు విస్సు తిరుగులేని ప్రశ్నతో అతడి నోరుమూయించింది.
"పోనీ చౌదరి మీద మీకున్న కక్షేమిటి"
మరో ప్రశ్న.... ఇదీ జవాబు చెప్పటానికి సాధ్యం కానిదే.... అయినా సమర్ధించుకోవాలనుకున్నాడు... తప్పదు .... ఇంతదాకా వచ్చాక ఓ బలమైన అస్త్రాన్ని సంధించాలి.
"మిస్ కృషి మీ ప్రశ్నలకి జవాబు ఒక్కటే....మీ కుటుంబం మీద నాకంటూ ఓ శ్రద్ద ఏర్పడటానికి కారణం ఉపాధ్యాయగారు నా మీద చూపించే అభిమానం - అందుకే చౌదరి ఎత్తుని తిప్పికొట్టాను. అంతే తప్ప చౌదరి మీద నాకు కక్షలేదు. ఇకపోతే ఈ దారుణం జరగటానికి కారణం మీరు-"
"వ్వాట్"
"ఎస్ మిస్ కృషీ మీరు నన్ను తొలినుంచీ నమ్మడం లేదు కాబట్టి నన్ను చౌదరి ప్రయోగించిన మనిషిగా భావించి ప్రతి క్షణమూ నన్ను అనుమానిస్తూనే వున్నారు. చివరికి చౌదరికీ మీకూ మధ్యవున్న వైరంతో నేనిక్కడ చేసిన పనికి చౌదరికి మీరే తెలియచేశారు- కేవలం చౌదరి నన్ను సాధించాలన్న ఆలోచన...."
"నో-" అరిచింది కృషి
"ఇది నిజం"
"కాని" ఆమె ఆగింది ఓ క్షణం "నేను చౌదరికి చెప్పింది వెంటనే కాదు - టెండర్ సబ్మిట్ చేయడం పూర్తయిన రెండు రోజులకీ....అప్పటికి లాస్ట్ డేట్ అయిపోయింది.
"అసలెందుకు ఫోన్ చేశారు"
జవాబు చెప్పలేకపోయింది.
"లాస్ట్ డేట్ అయిపోయినంత మాత్రాన చౌదరిలాంటి వ్యక్తికి మరో టెండరు పాత డేట్ తో అందించడం కష్టం కాదుగా"
ఇప్పుడు కృషి ఇరుకున పడింది.
నిజానికి చౌదరి టెండరు కరెక్టు చేసుకోమని విస్సు ముందే సలహా ఇచ్చాడు. ఉపాధ్యాయ కుటుంబంపై తనకున్న ఉక్రోషంతో ఆ ఇంట అడుగుపెట్టిన విస్సు దేవి నుండి వివరాలు సంపాదించి ఉపాధ్యాయ గారికి తెలియచేశాడు. ఇక్కడ ఏ పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందీ చౌదరికి తెలియచేసి అక్కడ చౌదరికి సహకరించాడు - ఈ విషయం తెలీని కృషి ఇప్పుడు దోషిలా నిలబడిపోయింది.
ఇంత పదునుగా ఓ తర్కాన్ని ప్రయోగించి తన నోరు మూయిస్తాడని ఆమె ఊహించలేకపోయింది.
నిశ్శబ్దంగా తన బెడ్ రూంలోకి వెళ్ళబోతున్న ఉపాధ్యాయగారిని చేరుకుంది "గ్రాండ్ పా.... అసలు జరిగింది"
చేతిని పైకెత్తాడు తనకు వినే సహనం లేనట్టుగా.
"ఆదిలో నువ్వు సమర్ధత కలదానివనుకున్నాను కృషి నాశనం చేశావ్"