Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 31

    "స్టాపిట్" అరిచింది యిక వినలేనట్టుగా - అది మోదమో ఉన్మాదమో ఆమెకే తెలీదు కాని ఇప్పటి మానసిక స్థితిలో అతడి భావుకత భరింపశక్యం కానిదైంది. "ఐ హేట్యూ."    
    "సహజమే...." విస్సులో ఇందాకటి లాలిత్యం లేదు.    
    "ఊర్ధ్వోష్టమున పుట్టుమచ్చగల అమ్మాయి మంచి వంశంలో జనించి మంచి కీర్తి ప్రతిష్టలు పొందడమేగాక ఇలా స్వాతిశయాన్ని ప్రదర్శిస్తుంది. అయితే పెళ్లి అయ్యాక ఇటువంటి మాటలకి అద్భుతంగా స్పందిస్తూ మృష్టాన్న భోజనాలతో భర్తకి ఆనందాన్ని పరుపుపై అమితమైన సుఖాన్నీ ఇస్తుందీ అని చెబుతుంది పుట్టుమచ్చల శాస్త్రం....ఇంతేకాక ఈ ఊర్ధ్వోష్టమున పుట్టు మచ్చగల అమ్మాయి-"    
    ఆమె తనను తాను మరిచినట్టు అమాంతం విస్సు షర్టు కాలరు పట్టుకుంది. అసలు కృషిలాంటి అమ్మాయి అలాంటి సాహసం చేయగలదని విస్సు సైతం వూహించలేకపోయాడు.    
    "చెప్పు.....ఊర్ధ్వోష్టము అంటే...."సీరియస్ గా అడిగింది. "ఎక్కడ....ఏ ప్లేసది...."    
    విస్సు మొహంలోని చిలిపితనం ఆమెనెంత ఉద్రేకపరిచిందీ అంటే యించుమించు కుదిపేసింది "చెప్పమంటున్నది నిన్నే"    
    "ఇందాక సైంధవుడి గురించి వివరంగా చెప్పేసి నీకున్న పరిజ్ఞానాన్ని నీ తాత ముందు ఏకరుపెట్టావ్ .....ఆ పదానికి తెలియకపోవడమేమిటి.....అది నగ్నంగా వుండే ప్రాంతం.....వెళ్ళిచూసుకో..."    
    "య్యూ...." ఉక్రోషంతో గోడకి నెట్టి విస్సు చెంపలు పగలగొట్టేదే. అదిగో అప్పుడు చూసింది ద్వారం దాటి వస్తున్న నౌకరుని అంతే విడిచిపెట్టింది.    
    ఆ తర్వాత ఆమె ఇంటిలో ఉండలేక పోయింది. అతడితో మాట్లాడుతుంటే చికాగ్గా వుందో అతడి ప్రవర్తన చికాకు కలిగిస్తూందో స్పష్టంగా తోచడం లేదు.....డాక్టర్ మహంతిని కలుసుకోవాలనుకుంది. అతడి గురించి అతని తండ్రి మరణం గురించి వివరంగా తెలుసుకోవటానికి ఆయన్ని మించి మరోదారి లేదు.    
    కారులో వెళుతూ సైతం అనుకుంది.    
    ఊర్ధ్వోష్టమూ అంటే ఏమిటి....పైగా ఆ భాగమంతా నగ్నంగా వుంటుందంటా డేమిటి...    
                                       *    *    *    *    
    "ఆశ్చర్యంగా వుంది కృషి - విస్సు మోహన్ గాంధీ కొడుకంటే నమ్మలేక పోతున్నాను" నిన్నే సుడిలా అన్నాడు డాక్టర్ మహంతి.    
    "నాక్కూడా తెలిసింది ఈ రోజు ఆశ్రమానికి వెళ్ళాకనే అంకుల్ చైతన్యానందగారు విస్సు కుటుంబం గురించి చెప్పింది విన్నాక నా అనుమానం నిజమనిపించింది" క్షణం ఆగి అంది కృషి "చెప్పండి అంకుల్ మోహన్ గాంధీ ఎలా చనిపోయాడు"    
    చాలా సేపటిదాకా నిశ్శబ్దంగా వుండిపోయాడు డాక్టర్ మహంతి.... ఉపాధ్యాయ కుటుంబానికి ఆత్మీయుడైన మహంతి కళ్ళలో చెప్పాలా వద్దా అన్న సందిగ్ధత...
    "ప్రత్యేకించి మిమ్మల్ని అడగడంలో నా ఉద్దేశ్యం నిజం మీకు మాత్రమే తెలిసి వుంటుందన్న నమ్మకం అంకుల్.....కేవలం మీ వెర్షన్ ఆధారంగా మోహన్ గాంధీ హత్యలో గ్రాండ్ పా ప్రమేయం ఎంతవరకున్నదీ తెలుసుకోవాలనుకుంటున్నాను"    
    విభ్రమంగా చూశాడు డాక్టర్ మహంతి "హత్య జరిగిన మాట నిజం కృషి. కాని దానికి మీతాతయ్య బాధ్యుడు కాదు. ఎందుకంటే తన సామ్రాజ్య విస్తరణకి మీ తాతయ్య తన వాళ్ళని వదులుకోగలడేమో కాని హత్యలు చేయించి అడ్డుతొలగించుకునేటంత రాక్షసుడు కాడు."    
    నిర్వేదంగా నవ్వింది కృషి "హత్యలు చేయించడం అంటే ఆయుధాల్ని ఉపయోగించి చంపమనడమొక్కటే కాదంకుల్. చావటానికి అనుకూలమయిన పరిస్థితుల్ని సృష్టించడమూ హత్య చేయడమే అవుతుంది."    
    "కౌశిక్ ని దృష్టిలో పెట్టుకుని నువ్విలా మాట్లాడుతున్నావనుకుంటాను."    
    "యస్" కృషి కళ్ళలో జివ్వున నీళ్ళు తిరిగాయి. "నేను కోరుకున్న కౌశిక్ చావుకి కారణమైన ప్రమాదం గ్రాండ్ పా సృష్టించింది కాదు. కాని గ్రాండ్ పా ఇచ్చిన షాక్ కౌశిక్ ని జీవచ్చవంగా మార్చేసింది. చావులాంటి బ్రతుకునుంచి చావడం దాకా తరిమింది. డబ్బు, ప్రతిష్ట, అంతస్తులు యివేగా గ్రాండ్ పా ఆరాధించేది. ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితం తన చెల్లెలు ఓ సామాన్యుడ్ని ప్రేమించినందుకు యింటినుంచి బయటకి సాగనంపటానికి గాని ఆ తర్వాత ఆమె కేన్సరుతో ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉందని తెలిసీ సహాయం చేయటానికి తిరస్కరించి ఆమె చావుకి కారణం కావటానికి కారణం ఈ అంతస్తుల వ్యామోహమేగా....అంతే అంకుల్. ఈ రోజు మోహన్ గాంధీ చావుకీ యించుమించు అలాంటి కారణం ఒకటి వుండి వుండాలి. లేకపోతే మా కుటుంబాన్ని నాశనం చేయడానికి విస్సు అనే ఓ వ్యక్తి యింటిలో అడుగుపెట్టేవాడు కాదు..."    
    ఆమె విస్సుని సమర్ధిస్తుందో లేక తిరస్కార భావంతో మాట్లాడుతుందో అర్ధం కాలేదు.    
    "కృషీ" బయటి చీకటిలోకి చూస్తూ ఉదాసీనంగా అన్నాడు డాక్టర్ మహంతి.    
    "నీ తర్కాన్ని నేను కాదనలేను. నిజమే చంపకపోయినా చావటానికి అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించడమూ హత్య చేయడంలాంటిదే. కాని మీ గ్రాండ్ పా మనస్తత్వమది.....అది మనం మార్చలేనిది. కాబట్టే తన పంతంకోసం తన ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసుకోగలడని నిరూపించుకున్నాడు మీ తాతయ్య. ఇలాంటి సమస్యకి పరిష్కారం చెప్పగలిగేది కాలమో లేక నీ ప్రయత్నమో నాకు తెలీదు కాని చెప్పాలనుకుంటున్నాను కృషి. అసలు ఇలా దాని గురించి చర్చించాల్సిన అవసరం ఏర్పడుతుందని ఇంతవరకూ ఊహించలేకపోయాను."    
    స్వగతంలా చెప్పుకుపోయాడు.    
    "మోహనగాంధీ మీ ఫ్యాక్టరీ కార్మికుడు మాత్రమే కాదు కార్మిక సంఘానికి నాయకుడు కూడా చాలా నిజాయితీపరుడని పేరుండేది. ఒకనాడు మీ గ్రాండ్ పాతో కార్మికుల డిమాండ్సుకి సంబంధించి మాట్లాడి విఫలం కావడంతో సమ్మెకి దిగాడు తన కార్మికుల అండతో ఫ్యాక్టరీ లాకౌట్ అయింది. అయినా మీ గ్రాండ్ పా చర్చలకి సిద్దం కానున్నాడు. వారం రోజుల్లోగా పరిష్కరించకపోతే ఎనిమిదో రోజు ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించాడు మోహన్ గాంధీ. ఉపాధ్యాయగారు కంగారుపడ్డారు. చర్చలకి ఆహ్వానించడానికి నిర్ణయించుకున్నారు.    
    "కాని ఆ ముందు రాత్రే టెంట్ లో కూర్చున్న మోహన్ గాంధీ హత్య చేయబడ్డాడు దారుణంగా. అయితే ఆ తర్వాత అది మోహన్ గాంధీ ఆత్మహత్యగా నిర్ణయించబడింది."    
    విస్మయంగా చూసింది కృషి "ఎలా"    
    "మీ గ్రాండ్ పా ఖర్చుచేసిన డబ్బుతో అది సాధ్యమైంది కృషీ. లేకపోతే మీ తాతయ్య హంతకుడిలా నిలబడాల్సి వచ్చేది. కాబట్టే చాలా శ్రమపడి అది ఆత్మహత్యగా నిరూపించడం జరిగింది."    
    "అసలు హత్య చేయించిందెవరు?"    
    "చౌదరి"    
    కృషి నిస్చేష్టంగా చూసింది.    
    "అవును కృషి....సమ్మెగాని చర్చగాని ఫలించడం యిష్టపడని చౌదరి మీ తాతయ్యని నేరస్థుడిగా నిలబెట్టి జైలుకి పంపాలనే ఉత్సాహముతో ఆ హత్య చేయించాడని తెలిసింది. అయితే ఆ నిజాన్ని నిరూపించడానికి ప్రయత్నించారు ఉపాధ్యాయ.....లాభం లేకపోయింది. కారణం చౌదరివైపు వున్నదేవి అనబడే ఓ ఆడది."    
    కృషి విభ్రమంగా వింటూంటే దేవి అనబడే ఓ ఆడదాని గురించి ఆధ్యాత్మిక చర్చల నీడలో జరిగే అక్రమమైన దేవి కార్యకలాపాల గురించి చెబుతూ చౌదరి నేరస్థుడిగా చిక్కిన సమయాన పోలీసు అధికారుల్ని తన శరీరంతో ఎలా ట్రాప్ చేసిందీ వివరించాడు.    
    "అంతే.... డబ్బుతో మీ తాతయ్య తను చేయని హత్య నుంచి తనను కాపాడుకుంటే అదే డబ్బుతో దేవిద్వారా హంతకుడైన చౌదరి తనను తాను కాపాడుకున్నాడు."    
    నుదుటపట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ నిలబడిపోయింది కృషి చాలా సేపటిదాకా. మరోసారి తనకు ఇష్టంలేకుండానే చౌదరి అనబడే ఓ జుగుప్సాకరమైన పాత్రగురించి వినాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఆలోచిస్తున్నది అది కాదు. ఏ వ్యక్తయితే తన తండ్రి మరణానికి కారణమయ్యాడో ఆ వ్యక్తి అండతోనే విస్సు తమపై దాడికి సిద్దపడ్డాడు..... నిజాన్ని వదిలి నీడవెంట పడుతున్నాడు. ఒక్కోసారి మేధస్సుతో ఆలోచించగల వ్యక్తులు సైతం మూర్ఖుల్లా ప్రవర్తించటానికి కారణం ఆలోచించే అవకాశమివ్వని పరిస్థితులైతే యిప్పుడు విస్సుని మంత్రించిన సర్పంలా మార్చేశాడు చౌదరి.    
    ఆధారాలులేని ఈ సత్యాన్ని విస్సుకి చెప్పినా అతడికి అర్ధం కాదు. నిరూపించాలి సోదాహరణంగా....ఇప్పుడు సమస్య విస్సుని ఇంటినుంచి బయటకి తరమడం కాదు. అతడెవరన్నది తాతయ్యకి తెలియచెప్పడం కాదు.... అతడ్నే అస్త్రంగా మార్చి చౌదరిపై చావు దెబ్బతీయడం.    
    అపరాత్రి కావస్తుంటే ఆలోచిస్తూ కారు నడుపుతున్న కృషి టేంక్ బండ్ దగ్గర పోగయివున్న జనాన్ని చూసి కారాపింది.    
    "వయసులో వున్న పిల్ల చావటానికి హుస్సేన్ సాగర్ లో దూకితే రక్షించారు...." చెబుతున్నాడెవరో.    
    రైలింగ్ కి ఆనుకునివున్న సిమెంటు బెంచీపై ఇంకా స్పృహలోకి రాని అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడో వ్యక్తి.   
    ఓ వారగా కారుని పార్కు చేసిన కృషి ఏ శక్తో ప్రేరేపించినట్టు అందరి మధ్యకి నడిచింది.    
    అంతే....    
    ఆ యువతిని చూస్తూ షాక్ తింది.   
    ఆమె ఎవరో కాదు జీవిత....కౌశిక్ చెల్లెలు.    
    ఆలోచనల తెరమాటున సమాధయిన గతంలా బ్రతుకు రంగస్థలంపై కొంత కాలం కదిలి కనుమరుగయిన కౌశిక్ నే ఇంకా మరిచిపోలేకపోతుందే. అతడి ఆలోచనలకి అవశేషమై జీవిత ఎందుకిలా కనిపించింది.    
    కృషి ఆలస్యం చేయలేదు. తనే కారులో అపోలోకి తీసుకువెళ్ళింది.    
    స్పృహలోకి రావటానికి గంట వ్యవధి అవసరమైంది.    
    ముందు చూసింది కృషీనే...జీవిత కళ్ళలో జివ్వున నీళ్ళు తిరిగాయి...అది తన ప్రయత్నం విఫలమైనందుకో లేక కృషికి యిలా దొరికిపోయినందుకో ఆమెకీ తెలీదు. వెక్కి పడుతూంది నేల చూపులుచూస్తూ.    
    ఆప్యాయంగా తల నిమిరింది కృషి..... "పిచ్చిపిల్లా! మీ అన్నయ్యే అనుకుంటే అంత కంటే పిరికిదానివి నువ్వు-"   
    కౌశిక్ గురించి ఇప్పుడు మాట్లాడింది జీవితకి జీవితంపై ఆసక్తి కలిగించాలనే....గెలుపులాంటి అనుభూతికన్నా కొన్ని సమయాలలో ఓటమి గురించి మాట్లాడుకోవడం సంతృప్తిని కలిగిస్తుంది. ఇది అలాంటి సన్నివేశమే - "ఏమైంది జీవితా....మీ అన్నయ్య జ్ఞాపకాలనుంచి మీ వాళ్ళింకా తేరుకొని వుండరే.... నువ్వు మరింత శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోవాలని ఎందుకనుకున్నావ్".    
    ఆమె జవాబు చెప్పలేదు. ఆ స్థితిలో వున్న ఏ ఆడపిల్లయినా అలాగే ప్రవర్తిస్తుంది....    
    "చెప్పమ్మా...." అక్కయ్యలా లాలించింది.    
    "నేను నీకు కావాల్సినదాన్నేగా...."    
    మనసులో ఏ పొర కదిలిందో జీవిత అశ్రుశిక్ష నయనాలతో చూస్తూ అంది. "నేను పెళ్ళి కాకుండానే తల్లి కాబోతున్నదాన్ని అందుకే...."   
    ఆశ్చర్యపోలేదు కృషి....అలాంటిదేదో వుంటే తప్ప ఆ వయసులో వున్న ఏ ఆడపిల్లా యిలాంటి నిర్ణయం తీసుకోదు....    
    "ఎవరా అబ్బాయి" నిశ్చలంగా అడిగింది కృషి - "నీకు న్యాయం చేస్తాననే హామీ ఇవ్వడం లేదు జీవితా....చేయటానికి ప్రయత్నిస్తానంటున్నాను చెప్పు."    
    కృషి స్థాయిగల ఆడపిల్ల చెప్పే ప్రతి పదమూ ఓ హామీ కాగలదనుకుందో - ఆ క్షణంలో కృషిని మించిన ఆత్మీయురాలు మరొకరు లేరనిపించిందో చెప్పింది జీవిత "రాజేష్ - రామనాథ్ చౌదరిగారి అబ్బాయి"    
    ఎక్కడో ఓ పిడుగు పడిన చప్పుడు.....ఎన్నో ప్రశ్నలకి ఒక్క జవాబులా మళ్ళీ రామనాథ చౌదరి పేరునే వినాల్సి వచ్చిందేమిటి - శాఖోపశాఖలుగా విస్తరించిపోతున్న చౌదరి దమననీతికి రాజేష్ కూడా వారసుడేనా....బ్రతుకు పుస్తకాన తల దూర్చి రేపటి పరీక్ష కోసం చదువుకొనే ఓ మధ్య తరగతి అమ్మాయి యిక్కడా పరీక్షలో విఫలమైనందుకు తనను తాను అంతం చేసుకోవాలనుకుంటూంది.    
    రాజేష్ కీ, జీవితకీ ఎలా పరిచయం అన్నది కాదు యిక్కడ సమస్య. "రాజేష్ నిన్ను కాదన్నాడా" నెమ్మదిగా అడిగింది కృషి.    
    "వాళ్ళ నాన్నకి భయపడి నేనేం చెయ్యలేనంటూ మొహం చాటేశాడు."    
    అందులో నిజానిజాలు గురించి ఆలోచించలేదు కృషి.    
    అదే రాత్రి ఆమెను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తూ అంది కృషి "ప్రపంచంలో ప్రతి సమస్యకీ చావే పరిష్కారమైతే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిగిలేవారు కాదు జీవితా - జీవితమంటే వైఫల్యం కాదు....విఫలం కావడమూ జీవితంలో ఓ భాగమని నువ్వు అర్ధం చేసుకోవాలి...ఎందుకో తెలుసా అనుకున్నది అరుదుగా జరగడం జరిగింది మనం కోరింది కాకపోవడమే జీవితం కాబట్టి - ధైర్యంగా వుండు....    
    The World is A Comedy To Those That Think, A Tragedy To Those That Feel"    
    మరో బాధ్యతని కృషి నెత్తిన వేసుకుంది....    
                                        *    *    *  

 Previous Page Next Page