Previous Page Next Page 
భామ కలాపం పేజి 32

 

    "అట్లాకాదుర బాడఖావ్! సిమెంట్ సరిగా కలపరా! గవర్నమెంటు పనులు చేసి చేసి అలవాటయిపోయింది ఇసక ఎక్కువ కలపడం! ఇది మన సొంత పనిరా! నీయవ్వ!"

 

    "గట్లనే దొరా!" అంటూ సరిగా కలపడం మొదలెట్టాడు లంబాడి నాయక్.

 

    పనివాళ్ళని తదేకంగా చూస్తున్నాడు భరత్. అందరికి ఇళ్ళు కట్టి పెట్టడమేగానీ, తమకి తల దాచుకునే గూడులేని నిర్భాగ్యులు.

 

    సుదీరని చూడగానే రత్నాకరరావు మొహం చేటంత అయింది. "దామ్మా! దా! మనుషులు చూడు! మెషిన్ లా పని చేస్తున్నారు. టకటక జరిగిపోతోంది పని. సంవత్సరం తిరిగే లోపల అయిదంతస్తులు లేచి పోతాయి. ఎట్లా ఉంది హనీమూన్? అప్పుడే వచ్చేశారేం? నేపాల్ వెళ్ళలేదా?" అన్నాడు.

 

    "నా పాలిట శని ఇలా ఉంటె ఇక నేపాల్  వెళ్ళి మాత్రం ఏం ఎన్ జాయ్ చేస్తాను?" అంది సుదీర ముక్తసరిగా.

 

    రత్నాకరరావు ఒకసారి అనుమానంగా భరత్ వైపు చూశాడు.

 

    "ఏమ్మా! ఏమయింది?"

 

    "ఏం లేదులే!" అంది సుదీర.

 

    పోన్లే! మీరు ముందుగా రావడం కూడా మంచిదే అయింది. నువ్వోకసారి మన ఫాక్టరీ అర్జెంటు ట్రిప్పు కొట్టి రావాలి. ఎలాగా అంత దూరం వెళతావు కాబట్టి, మన పొలాలు కూడా ఒకసారి చూసుకు రావాలి. నేనే వేళుదును గానీ టయానికి ఈ డిల్లి ప్రయాణం తగిలింది. సుప్రీం కోర్టు కేసు. నేనూ సారధి కలిసి వెళుతూన్నాం."

 

    "వెళతాను డాడీ!" అంది సుదీర.

 

    "అల్లుణ్ణి కూడా తీసుకెళ్ళు" అన్నాడు రత్నాకరరావు.

    
                                                                    ------------

 

    "మీకు ఫ్యాక్టరి కూడా ఉందా? ఏం ఫ్యాక్టరి ?" అన్నాడు భరత్.

 

    "చూస్తారుగా!" అంది సుదీర. తను కారు డ్రయిన్ చేస్తోంది. నగరం శివార్లలోని ఒక పల్లెలో ఉంది ఆ ఫ్యాక్టరి. ఆ పరిసరాల్లోకి రాగానే ఆదో రకమైన వాసన వచ్చింది.

 

    కర్చీఫ్ తో ముక్కు మూసుకున్నాడు భరత్.

 

    అక్కడ డ్రమ్ముల నిండా కప్పలు ఉన్నాయి.

 

    "ఏమిటిది సుదీరా?" అని అడిగాడు భరత్. కానీ, అతని ప్రశ్న పూర్తయ్యేలోపలే అతనికి సమాధానం కూడా తట్టింది.

 

    కప్పల కాళ్ళ ఎగుమతి!

 

    విదేశాల్లో కప్పల కాళ్ళకి చాలా డిమాండు ఉంది. వాటిని ఇష్య్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారక్కడ.

 

    "నేనిక్కడే ఉంటాను వెళ్ళిరా సుదీరా!" అన్నాడు నెమ్మదిగా.

 

    అతను నెమ్మదిగా నడుస్తూ ఫాక్టరీ చుట్టుతా తిరిగి చూశాడు. అతను ఉహించింది కరెక్టే అయింది. నడుముల దాకా తెగిపోయి కొస ప్రాణాలతో ఉన్న కప్పలు కుప్పలు తెప్పలుగా పడి వున్నాయి. దుర్భరమైన బాధ అనుభవిస్తూ తేల కళ్ళు వేసి చూస్తున్నాయి అవి.

 

    మేనేజర్ అటు వైపు వచ్చాడు.

 

    "చూడండి!" అని పిలిచాడు భరత్.

 

    ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరి కొచ్చాడు మేనేజర్.

 

    "కప్పలని మత్తుమందు పోసిన డ్రమ్ములలో కనీసం రెండు మూడు గంటల సేపు ఉంచాలి. అప్పుడే స్పృహ తప్పి, కాళ్ళు నరికినా బాధ తెలియకుండా ఉంటుంది. కాళ్ళు నరికిన తరవాత స్పృహ రాకుండానే చనిపోవాలి అవి. అవునా!"

 

    "అవునండి! అలాగే ఉంచుతాం."

 

       "మీరు నిజం చెప్పడం లేదు." అన్నాడు భరత్. "చాలా ఫ్యాక్టరిలలో చేస్తున్నట్లే మీరూ చేస్తున్నారు. రెండుగంటల సేపు కప్పలని మత్తుమందులో ఉంచితే, టైము వేస్టని, బిజినెస్ దెబ్బ అని గ్రహించి, అరగంటలోనే వాటిని తీసి కాళ్ళు నరికేస్తున్నారు. ఆ షాక్ కి విలవిలలాడుతూ నరకయాతన పడి చనిపోతాయి అవి. అవునా?"

 

    "మీరు పొరపాటు పడుతున్నారు. మన ఫ్యాక్టరీలో అలా జరగదు."

 

    "మరి అవేమిటి?" అన్నాడు భరత్, కాళ్ళు తెగి, చావకుండా పడి వున్న కప్పలని చూపిస్తూ.

 

    మేనేజరు ఏమి మాట్లాడలేదు.

 

    "మేనేజరు గారూ! నేను ఎస్.పి.సి.ఏ. మెంబర్ని. రేపు మళ్ళీ నేను ఇటూ వచ్చేసరికి పరిస్థితులు ఇలాగే ఉంటె రిపోర్టు చెయ్యవలసి వస్తుంది" అన్నాడు భరత్ నిశ్చయంగా.

 

    మేనేజరు తెల్లబోయాడు.

 

    అప్పటికి సుదీర కారు దగ్గరికి వచ్చి భరత్ కోసం అటూ ఇటూ చూస్తోంది.

 

    "గుర్తుంచుకోండి" అంటూ వెళ్ళి కారు ఎక్కాడు భరత్.

 

    కారు వైవే మీద మరి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంకో పల్లెలో ప్రవేశించింది.

 

    "ఈ పల్లెలో మనకు అయిదు వందల ఎకరాల మాగాణి, మూడొందల ఎకరాల మెట్టా, ఇరవై ఎకరాల మామిడి తోటా ఉన్నాయి." అన్నది సుదీర భరత్ తో.

 

    పొలం గట్టున, చెట్టు నిడన మంచం వేసి ఉంది. దానిమీద జంబుకానా పరుచుకుని కూర్చుని ఉన్నారు ఇద్దరూ. ఎదురుగా స్టీలు పళ్ళెంలో ఉప్పు కారం జల్లిన దోసకాయ ముక్కలూ, వేరుశనగ పప్పూ, తాటి ముంజెలు పెట్టి ఉన్నాయి. ఎండ కాస్తూ ఉన్నా, పైరగాలి చల్లగా హాయిగా వీస్తోంది.

 

    "అన్ని వందల ఎకరాలా?" అన్నాడు భరత్ ఆశ్చర్యంగా. "అది ఎలా సాధ్యం అసలు? లాండ్ సీలింగ్ ఒప్పుకోదు కదా?"

 

    సహనంగా నవ్వింది సుదీర సమాధానం చెప్పకుండా, "ధశరద్!" అని పిలిచింది.

 

    ఆమె పిలుపుని ప్రతిధ్వనిస్తున్నట్లు మరింత పెద్దగా పిలిచింది ఓ మనిషి. "ఓ నాయనో! దొరసానమ్మా పిలుస్తుంది సూడు!"

 

    దశరద్ ఆదరా బాదరా పరిగెత్తు కొచ్చాడు. "ఏంది దొరసాని! పిల్చినావా? కాల్మోక్తా! బాంచను!"


    "ఎలా ఉంది ఈసారి పంట?"

 

    "చెప్పేడిదేముంది దొరసాని! కళ్ళబడతనే ఉంది గదా!" అన్నాడు ధశరద్ సంతోషంగా. "ఈ ఏడు రెట్టింపు గింజ రాల్తాదమ్మా! ఫికర్ లేదు.

 

    మరి కొంత సేపు పొలం గురించి , పంట గురించి, ఏవేవో వివరాలు చెప్పాడు ధశరద్. చేస్తున్న పనులు ఆపేసి అతని పక్కన నిలబడి వింటున్నారు అతని భార్య బాలామ్మా, కూతురు నాగమ్మా. సుదీర కట్టుకున్న చీరని అరాదనగా చూస్తోంది నాగమ్మ.

 

    కొంతసేపు గడిచాక, కంటికి చెయ్యి అడ్డం పెట్టుకుని, ఆకాశం వైపు చూశాడు ధశరద్! "పొద్దెక్కి పోయిందమ్మా! తినడానికి ఇంటికి బోతారా దొరసానీ? బండి కట్టించమంటారా?"

 

    "మాకు ఇప్పుడే ఆకలి వెయ్యడం లేదు. తరవాత తింటాంలే" అంది సుదీర.

 

    "గట్లయితే మేమిక రొట్టె తినేసి పనులు చేస్కొంటామమ్మా" అని బావి వైపు నడిచారు ధశరద్, అతని భార్య.

 

    బావి దగ్గర ఏతంతో నీళ్ళు తోడుతున్న కొడుకు యదయ్యని పిలిచాడు దశరద్.

 

    వాళ్ళందరూ చేతులూ, కాళ్ళు కడుక్కుని, సత్తుగిన్నెలలో ఉన్న రొట్టెలు, ఆకులో పెట్టుకున్నారు.

 

    "ఈ తూర్పు వైపు పొలం అంతా ఈ దశరద్ పేరా, అతని తమ్ముళ్ళ పేరా ఉన్నా, నిజానికి ఇదంతా మనదే. బినామి అన్నమాట. లాండ్ సేలింగులో కొట్టుకుపోకుండా వీళ్ళ పేరుతొ రిజిస్టర్ చేయించారు డాడీ. మళ్ళీ వీళ్ళు తోక ఆడించి మనకే ఎసరు పెట్టకుండా వీళ్ళందరూ మనకు తలా అయిదు లక్షలు అప్పు ఉన్నట్లు ప్రోనోట్లు రాయించుకున్నారు. అంటే చచ్చేదాకా వీళ్ళు, వీళ్ళ పిల్లలూ, ఆ పిల్లల పిల్లలూ మనకు చాకిరి చేస్తూనే ఉంటారన్నమాట. అయితే తిండికి మాత్రం లోపం ఉండదు. లెండి! చూడండి ఒక్కొక్కళ్ళు ఎన్నేసి రొట్టెలు లోట్టలేస్తూ లాగించేస్తున్నారో!"

 

    ఆకుల్లో ఉన్న పదార్ధాలు చూశాడు భరత్. రొట్టెలు, గొడ్డుకారం, పచ్చి ఉల్లిపాయ!

 

    అంతే!

 

    వెంటనే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. దిగులుగా ఉండే ఒక పాత గుర్తు కొచ్చింది.

 

    "ఏటికేతము పట్టి, ఏడాది పండించి,

 

    గంజిలో మెతుకేరగనన్నా!"

 

    రెక్కలు ముక్కలు చేసుకుని ధాన్యం పండించే రైతుకే కడుపునిండా తిండి లేదు.

 

    "జాలితో కరిగి పోతున్నారా?" అంది సుదీర వెటకారంగా.

 

    గొంతు పూడుకుపోయి, నోటి వెంబడి మాట రావడం లేదు భరత్ కి.

 

    "వాళ్ళ బతుకులు అంతే భరత్! డాడీ చెబుతూ ఉంటారు. ఒక రూపాయి ఎక్కువ దొరికినా , దానితో వాళ్ళు సారానో, నీరానొ, తాగుతారు తప్ప, కడుపుకి శుభ్రమైన తిండి తినరు. డబ్బు చేతిలో ఆడుతుంటే ఏ జూదమో ఆడాలనిపిస్తుంది తప్ప, కడుపుకి శుభ్రమైన తిండి తినరు. బాగుపడటం చేత కాదు వీళ్ళకి.

 Previous Page Next Page