అది చూడగానే భరత్ మొహం వివర్ణమయింది. "సెంటా? వద్దొద్దు! పెట్టేయ్!" అన్నాడు.
"దీని కేమయింది?" అంది సుదీర ఆశ్చర్యంగా.
"అది ఎలా తయారు చేస్తారో తెలుసా సుదీరా! గుర్రాల నుంచి తీస్తారట దాన్ని. యమబాధ పడతాయి అవి.'
సెంటు బాటిలు కౌంటర్ మీద పెట్టేసి నిశితంగా అతని వైపు చూసింది సుదీర.
"ఇవన్ని మీకెలా తెలుసు?"
"తెలుసుకోవడం నా డ్యూటీ! నేను ఎస్. పి.సి. ఏ. లో మెంబర్ని సుదీరా!"
"అంటే?"
వింతగా చూశాడు భరత్! "ఎస్.పి.సి.ఏ. అంటే తెలియదా? సొసైటి ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టి టు వర్డ్స్ యానిమల్స్! జీవకారుణ్య సంఘం!"
బోర్ గా చూసింది సుదీర.
"అసలు జీవహింస చెయ్యకపోవడం ఉత్తమోత్తమం సుదీరా! కానీ, ఆచరణలో అది కుదరనప్పుడు ఆ జీవాలకి కనీసం గౌరవప్రదమైన, బాధ లేని చావు కలిగేలా చూడకూడదా? జంతువులని చంపడం మహా పాపం అని నీతిబోధ చెయ్యడం లేదు నేను, కానీ, ఇది ఉరికే చంపడం కాదు. చిత్రహింస పెట్టడం. క్రూరమృగాలని మనం పేరు పెట్టిన పులి సింహం లాంటివి కూడా ఇంత క్రురంగా చంపవే! ఒక్క దెబ్బతో ప్రాణాలు తీస్తాయి అవి. కానీ మనిషే .......ప్రాణాలు తియ్యడంలో కూడా లాభనష్టాలు బేరీజు వేస్తూ.........."
"ఇలా మాట్లాడితే పిచ్చి అనుకుంటారు వినేవాళ్ళు. మరి ఇంత పిరికితనం పనికి రాదు" అంది సుదీర చిరాగ్గా.
ఏమి కొనకుండానే హొటలు రూమ్ కి తిరిగి వచ్చారు.
గది తలుపులు ముయగానే మొదలెట్టింది సుదీర. "ఎందుకిలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు భరత్? ఏమయింది అసలు మీకు? ఎలాంటి వయసు మనది? ఎలాంటి సమయం ఇది? హానిమూన్ లో ఎన్నో ప్లేసెస్ చూశాం. అడవులను చూసినా, పూలగుత్తులని చూసినా, చిగిరుటాకులని చూసినా, పళ్ళని చూసినా చంద్రుడిని చూసినా, పోకచెక్కల్ని చూసినా కొత్తగా పెళ్ళయిన వాళ్ళకి ఒకటే గుర్తొస్తుంది. ఆత్మహత్య చేసుకున్న ఒక గొర్రెలాంటి మనిషి, కిడ్ లెదర్ గా మారిన ఒక వెర్రి గోర్రేపిల్లా గుర్తు రాకూడదు."
దయాకర్ గుర్తు వస్తే పాడయిపోయిన నా చెల్లెలి జీవితం కూడా గుర్తు వస్తుంది సుదీరా!"
"ఏమయింది ఇప్పుడు మీ చెల్లెలి జీవితానికి? ఈ దయాకర్ తప్ప చేసుకోవడానికి వేరే మొగుడే లేడా? భరత్! వెళ్ళగానే మీరు మంచి సంబంధం చూడండి! మీ చెల్లెలి పెళ్ళి బాధ్యత నాది! నా అకౌంటులో పద్నాలుగు లక్షలో, పదిహేను లక్షలో ఉన్నాయి. మీకు బ్లాంక్ చెక్ సంతకం పెట్టి ఇచ్చేస్తాను. డబ్బుకి భయపడకుండా , ఎంత ఖర్చయినా సరే, భారతి పెళ్ళి చేసెయ్యండి. అంతేగాని, ఫర్ హెవేన్స్ సేక్, నా జీవితం పాడుచేయ్యకండి!"
చరాచర నడిచింది. సూట్ కేసు విసురుగా ఓపెన్ చేసి , చెక్కు బుక్కు తీసింది సుదీర. చెక్కు మీద అంకె ఏమి వెయ్యకుండానే, కింద సంతకం పెట్టేసి అతని చేతికి ఇచ్చింది.
"రేపే హైదరాబాద్ వెళ్ళిపోదాం మనం" అంటూ బట్టలు సూట్ కేసులో కుక్కేయ్యడం మొదలెట్టింది.
ఘోరంగా ప్లాప్ అయింది వాళ్ళ హనీమూన్. మర్నాడే హైదరాబాద్ కి తిరిగి వచ్చారు ఇద్దరూ.
---------------
హైదరాబాద్ తిరిగి రాగానే , తమ ఇంటికి వెళ్ళాడు భరత్.
నాన్నగారు ఇంకా నర్సింగ్ హోమ్ లోనే ఉన్నారని, కొంచెం నెమ్మదిగానే ఉందని చెప్పింది భారతి. గుర్తు పట్టలేనంతగా చిక్కిపోయింది ఆ అమ్మాయి. ఈ కొద్ది రోజులలోనే చెంపలు నునుపు తగ్గాయి. కళ్ళలో కాంతి లేకుండా పోయింది.
భరత్ వెళ్ళేసరికి కిరోసిన్ స్టవ్ దగ్గర కూర్చుని వంట చేస్తోంది భారతి. అతన్ని చూడగానే ఆమె మొహంలోకి కొద్దిగా కళ వచ్చింది.
"రా అన్నయ్యా ఎలా ఉంది మీ హనీమూన్?" అంది అభిమానంగా.
గుండెలో విరిగిన ముల్లు కదిలి , మళ్ళీ ఉవ్వెత్తున బాధ కలిగినట్లయింది భరత్ కి.
చెల్లెలు దుర్భరమైన మానసిక వ్యధ అనుభవిస్తూ ఉంటె తను టింగురంగా అంటూ హనీమూన్ కి వెళ్ళి వచ్చాడు!
నిజానికి తను అక్కడ సుఖపడింది ఏమి లేకపోయినా, చూసే వాళ్ళకి మాత్రం తను తెగ ఎన్ జాయ్ చేస్తున్నట్లే వుంటుంది.
సుదీర ఇచ్చిన బ్లాంక్ చెక్కు సంగతి చెప్పెయ్యాలి భారతికి. అసలు అది వినడానికి తనకి ఎంతో అసహ్యంగా అసభ్యంగా తోచింది. పోయిన మనిషికి బదులు డబ్బు పారేసి మరో మనిషిని కొనుక్కోమని సలహా!
అనాగరికంగా ఉంది అది!
ఇది వింటే భారతి చాలా అప్ సెట్ అయిపోతుంది. అయినా తను చెప్పక తప్పదు. ఈ విషయంలో భారతి తరపున తనే నిర్ణయం తీసుకోవడం తప్పు. తనకు ఆహక్కు అధికారం లేవు.
"భారతి!" అన్నాడు మెల్లిగా.
తలెత్తి చూసింది భారతి.
సంకోచంగా అన్నాడు భరత్. "సుదీర నీకో మాట చెప్పమంది భారతీ! అయినా, చెప్పడానికి నాకే నోరు రావడం లేదు.'
"ఫర్వాలేదు. చెప్పన్నయ్యా!" అంది భారతి. కానీ, ఆమె మొహంలో వెంటనే ఆందోళన కనబడింది. చెప్పడానికి అన్నయ్య తటపటాయించేంత విషయం ఏమయివుంటుంది?
"దయాకర్ చనిపోయినందుకు విచారిస్తూ కుర్చోవద్దని, నీ పెళ్ళి బాధ్యత తను తీసుకుంటానని, నీతో చెప్పమంది భారతీ! పెళ్ళి ఖర్చులకి గానూ, బ్లాంక్ చెక్ సంతకం పెట్టి ఇచ్చింది నీకు ఇవ్వమని."
"వద్దన్నయ్యా! నన్ను ఇలాగే ఉండిపోని!" అంది భారతి నిశ్చయంగా.
"ఎన్నాళ్ళు ఒంటరిగా బతకగలవు భారతీ! మగతోడు లేకుండా.........."
"నీ చిలక చనిపోతే దానికి బదులు వేరే చిలకని పెంచుకున్నావా అన్నయ్యా నువ్వు? చిలకపాటి చెయ్యడా మనిషి? వద్దు. నేను బతికినన్ని రోజులు దయాకర్ ని మర్చిపోలేను. ఆ స్థానంలో ఇంకొకళ్ళని ఉహించుకోలేను కూడా."
చాలా సేపు దుఃఖంతో అలాగే కుర్చుండిపోయారు ఇద్దరూ.
వంట అయిన తరువాత కారిడార్ లో సర్దింది భారతి. ఇద్దరూ నర్సింగ్ హోమ్ కి వెళ్ళారు.
చాలా నీరసంగా ఉన్నారు సదాశివరావుగారు. అయినా, ఓపిక చేసుకుని, "ప్రయాణం బాగా జరిగిందా నాయనా?" అన్నారు ఆప్యాయంగా.
ఇంట్లో శవం ఉండగా, హొటలుకి వెళ్ళి సుష్టుగా టిఫిన్ మెక్కుతూ దొరికిపోయినవాడు ఎంత ఇబ్బందిగా ఫీలవుతాడో, అంత ఇబ్బందిగా ఫీలయ్యాడు భరత్.
సాయంత్రం సుదీరా, భరత్ ఇద్దరూ కలిసి కొత్తగా కడుతున్న ఫైవ్ స్టార్ హొటల్ దగ్గరికి వెళ్ళారు.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదంటారు. సగటు మనిషి రెండు గదుల కొంప కట్టుకోవాలంటే , రెండు నెలలు పట్టే ఫార్మాలిటిస్ అన్ని వీళ్ళ విషయంలో చకచక జరిగిపోయాయి.
భూగరిష్ట పరిమితి నుంచి మినహయింపు, స్థలం రిజిస్ట్రేషను, ప్లాను అప్రూవల్....అన్ని పనులూ వాయువేగ మనోవేగాలతో ఒకే రోజున ముగ్గురేసి ఆఫీసర్ల సంతకాలతో పూర్తయిపోయాయి. కొన్ని పనులు పాత తేదీలతో పూర్తీ చేశారు. నిజానికి శంకుస్థాపన చేసేటప్పటికి అధికారికంగా ఆ స్థలం వాళ్ళ పేరుతొ లేదు. అయినా కూడా, ఇంతోటి పని చేయించలేకపోతామా! అన్న ధీమాతో మొదలెట్టేశారు.
వాళ్ళ పనులు అంత త్వరత్వరగా జరిగిపోయాయని ఎవరూ గింజుకొనక్కరలేదు. కానీ, 'అందరి పనులూ అంత త్వరగా అయితే బాగుండు'అ అని మదన పడాలి. అంతే!
గోడలు అప్పుడే సగం వరకూ లేచాయి.
ఇదివరకు దయాకర్ కాంటిను ఉన్న స్థలం మాత్రమే పూజ గదిలా ఉంచేశారు. అందులో దేవుడి ఫోటోలు, దీపం అగరొత్తులు ఉన్నాయి.
అది నరబలి జరిగిన చోటు కాబట్టి, దాన్ని చిన్న దేవాలయంలా వదిలెయ్యమని సలహా ఇచ్చింది చింతకాయల బాబానే. బిల్డింగు పూర్తయ్యాక అది హొటల్ తాలూకు ఫోయర్ లోకి వస్తుంది.
"అన్ని ఫైవ్ స్టార్ హోటళ్ళలో స్విమ్మింగు ఫూలు, హెల్త్ క్లబ్బు, షాపింగ్ ఆర్కేడ్ లాంటి సౌకర్యాలు మాత్రమే వుంటాయి, మన దానిలో టెంపుల్ కూడా వుంది. యాటేడ్ అట్రాక్షన్!" అన్నాడు పక్కనే వున్న సారధి నవ్వుతూ.
ఆ మాటలు వింటే ఒళ్ళు జలదరించింది భరత్ కి.
ఏదో గుర్తు వచ్చినట్లు అడిగింది సుదీర. "ఏమన్నది మీ భారతి? చెక్కు తీసుకుని చాలా సంతోషించిందా?"
ఆమె మొహంలోకి ఒకసారి చూసి తల తిప్పేసుకున్నాడు భరత్. "లేదు కాల్చేసింది."
సుదీర కళ్ళలో ఎరుపు జీర కనబడింది. "కాల్చిసిండా? అందుకే అంటారు మనీ విలువ తెలిసిన వాళ్ళ దగ్గరే మనీ నిలుస్తుందని. అల్లటప్పా వాళ్ళందరూ డబ్బు దొరికినా సరిగా హేండిల్ చెయ్యలేరు.'
దెబ్బ తిన్నట్లు చూశాడు భరత్.
రత్నాకరరావు తోడల్లుడు అక్కడ నిలబడి పనివాళ్ళ మీద అజమాయిషీ చేస్తున్నాడు. అతను క్లాస్ వన్ పీడబ్ల్యుడీ కాంట్రాక్టరు.