Previous Page Next Page 
చిలకలు పేజి 32


    "చెప్పు!"
    "శంకర్రావే చంపి ఉండాలి. రాస్కెల్ వాడ్ని చూస్తే పక్కా హంతుకుడిలా కన్పిస్తాడు."
    "రూపాన్ని బట్టి  చెప్తున్నారా?"
    "కాదు రమణరావుకు రాధారాణిని చంపాల్సిన అవసరం ఏముంది?"
    "శంకర్రావుకు ఆ అవసరం ఉందంటావా?"
    "ఉంది. రామకృష్ణ ఆస్తిని అంతవరకూ అనుభవిస్తున్నవాళ్ళు వాళ్ళేగా? రామకృష్ణ పెళ్ళి చేసుకుంటే ఆ అవకాశం పోతుంది."
    "అతడు బతికిఉన్నా పోతుందిగా?"
    అద్వయితానికి జ్ఞానోదయం అయినట్టుగా అన్పించింది.
    "అవును! అంటే రామకృష్ణను కూడా శంకర్రావే చంపిఉంటాడు"
    నరేంద్ర నవ్వాడు.
    "మరి సూర్యనారాయణ చంపాడంటున్నావుగా?"
    "ఇప్పుడు ఆలోచిస్తుంటే నువ్వేకరెక్ట్ అన్పిస్తోంది. అతడు చంపి ఉండడు"
    మరి ఆ సిగరెట్ కేసు?"
    "నువ్వన్నట్టు అతడి సిగరెట్ కేసు శంకర్రావే కొట్టేసి హత్య జరిగిన గదిలో పడేశాడు కరెక్టు!"
    "మరీ అంత  ఖచ్చితంగా చెప్పకు. సూర్యనారాయణ సిగరెట్ కేసు శంకర్రావు ఎలా, ఎక్కడ  కొట్టేశాడో ప్రూవ్ చెయ్యగలవా?"
    "అదేం పెద్దకష్టం కాదులే. సూర్యనారాయణే చెప్తాడు"
    "చెప్తాడా? చెప్పిస్తావా?"
    "ఏదో ఒకటి చేస్తాలే!"
    నరేంద్ర చిరునవ్వు నవ్వాడు.
    జీపు కమలాంబ ఇంటి ముందు ఆగింది.
    జీపు దిగి ఇద్దరూ లోపలకు నడిచారు.
    హెడ్డు ఏడుకొండలు బయట వరండాలో నిలబడ్డాడు.
    నరేంద్ర, ఇన్ స్పెక్టర్ హల్లో కూర్చున్నారు. లోపలనుంచి అరుపులు విన్పిస్తున్నాయి.
    పనికుర్రాడు ఇన్ స్పెక్టర్ ను చూసి తోటలో చేస్తున్న పని ఆపి లోపలకు పరిగెత్తుకొచ్చాడు.
    "ఆగు! ఎక్కడివెళుతున్నావ్-"
    ఇన్ స్పెక్టర్ గద్దింపుకు ఆగిపోయాడు పనికుర్రాడు.
    "నీ పేరు?"
    "సింహాచలం"
    "ఏ ఊరు?"
    "అనకాపల్లి"
    "ఏం పనిచేస్తావ్?"
    "అన్నిపనులూ నేనే చేస్తాను"
    "వంట కూడానా?"
    "నేనూ అమ్మాయిగారూ చేస్తాం" అన్నాడు.
    "లోపల ఎవరు అరుస్తున్నారు?"
    "అమ్మగారూ, అయ్యాగారూ"
    "అయ్యగారెవరు?"
    "శంకర్రావుగారు"
    "ఏ విషయం మీద పోట్లాడుకుంటున్నారు?"
    "నాకు తెలవదు. అమ్మాయిగారి పెళ్ళి ఆగిపోయినప్పట్నుంచీ పోట్లాడుకొంటూనే  ఉన్నారు."
    "అమ్మాయిగారు ఏమంటున్నారు?"
    "ఆరు ఒకటే ఏడుపు. అమ్మగారంటే అమ్మాయిగారికి సాలాభయం.
    "సరే మేము వచ్చినట్టు చెప్పు."
    "కుర్రవాడు బతుకు జీవుడా అని పరుగుతీశాడు.
    ఒక్కసారిగా లోపలనుంచి విన్పిస్తున్న అరుపులు ఆగిపోయాయి.
    ఐదు నిముషాల  తర్వాత  ఆకుపచ్చ కాశ్మీర్ శాలువా కప్పుకొని కమలాంబ హల్లో ప్రవేశించి "నమస్కారం " అన్నది.
    "నమస్కారం" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "ఏమిటి ఇలా వచ్చారు? మాఇల్లు వదిలేలా లేరు?" ఆమె కంఠంలో భయం, కోపం ఒకదాన్నొకటి ఒరుచుకొన్నాయ్.
    "మాపని అదేగా" వ్యంగ్యం అన్నాడు ఇన్ స్పెక్టర్.
    ముంజేతుల వరకూ శాలువా కప్పుకొని కూర్చున్న కమలాంబను పరిశీలనగా చూస్తూ "వేసవి కాలంలో కూడా మీరు శాలువా కప్పుకుంటారా?" అన్నాడు నరేంద్ర.
    "నాలుగు రోజుల నుంచి జ్వరం, చలిజ్వరం. డాక్టర్ వద్దట, మందులూ వద్దట. పైగా అన్నం తింటానంటుంది. అందుకే కోప్పడుతున్నాను" అన్నాడు శంకర్రావు. ఆమె  వెనకే వచ్చిన శంకర్రావును ఇన్ స్పెక్టర్ చూడలేదు. చివ్వునతల తిప్పిచూశాడు.
    "కోప్పడటంఏమిటి? ఇద్దరూ గట్టిగాఅరుచుకొంటూ?" అన్నాడు అద్వయితం.
    "మగవాళ్ళు ఆడవాళ్లళా ఎప్పుడూ ఇంట్లోకూర్చుని నసపెట్టడం  నాకు అసహ్యం. అదే అంటున్నాను" అన్నది  కమలాంబ.
    నరేంద్ర అద్వయితం  ముఖంలోకి అర్థయుక్తంగా చూశాడు.
    "భారతి మీకు తెలుసా? కమలాంబను నరేంద్ర అడిగాడు.
    "విన్నాను. చూడలేదు" అన్నది కమలాంబ.
    "శంకర్రావు ఆమెను తీసుకురావడానికి విజయవాడ వెళ్ళాడని మీకు తెలుసా?"
    "తెలియదు. ఏదో బిజినెస్ పని ఉందని నాతో చెప్పాడు."
    "ఆయన ఎప్పుడు వచ్చాడు?"
    "తెల్లవారు ఝామున నరసాపూర్ లో."
    "మీకెలా తెలుసు? రాత్రే వచ్చి ఉండొచ్చుగా?" అన్నాడు నరేంద్ర.
    "నిన్న సాయంకాలం ఏడు గంటలకు విజయవాడా నుండి ఫోన్ చేశాడు. తెల్లవారు  ఝామున స్టేషన్ కు కారు పంపించమని చెప్పాడు"
    "తన మేనకోడలు కృష్ణాలో బయలుదేరిందనీ, స్టేషన్ కారు పంపించమనీ చెప్పలేదూ?"
    కమలాంబ ముఖం వెలావెలా పోయింది.
    "లేదు. నాకింకేమీ చెప్పలేదు" తమాయించుకొని అన్నది.
    "రాత్రి మీరు బయటికి వెళ్ళి ఎన్నిగంటలకు ఇంటికి వచ్చారు"
    కమలాంబ అదోలా నవ్వింది.
    "నేను అసలు బయటికి వెళ్ళినట్టు మీకెవరు చెప్పారు? రాత్రంతా జ్వరంతో బాధపడ్తూ ఇంట్లోనే ఉన్నాను" అన్నది కమలాంబ.
    అద్వయితానికి నరేంద్ర అనవసరంగా టైంవేస్టు వేస్తున్నాచనిపించింది.
    నరేంద్ర సిగరెట్ పెట్టె బయటికి తీసి సిగరెట్ తీసుకొన్నాడు. అగ్గిపెట్టె కోసం జేబులు వెతుక్కోసాగాడు.
    "అగ్గిపెట్టె కావాలా?" అంటూ సమాధానానికి ఎదురు చూడకుండానే లోపలకెళ్ళి అగ్గిపెట్టె తెచ్చి నరేంద్ర ఎదురుగా ఉన్నటీపాయ్ మీద పెట్టింది.
    "మీ అమ్మాయిపెళ్ళి ఏమైంది?" అద్వయితం అడిగాడు.
    "శంకర్రావుగారూ! శవదహనం ఏర్పాట్లు చెయ్యలేదా?"
    "రేపు ఉదయం చేస్తాం. శవాన్ని మార్ప్యూరీ నుంచి రేపు  ఉదయమే తెచ్చుకుంటాం."
    "ఇవ్వాళే ఎందుకు చెయ్యలేదు."
    "ఆడ దిక్కు లేనివాడ్ని గంటూరు నుంచి మా చెల్లెలు ఈ రాత్రికి వస్తుంది."
    "మీ చెల్లెలా?"
    "అవును, భారతికి జీనతల్లి అవుతుంది."
    "మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా?"
    "నా అనుమానం ఉదయమే చెప్పేశాను."
    "అలాగని రిపోర్టు రాసిస్తారా?"
    "రాసివ్వడానికి ఆధారం చూపించాలిగా? ఖచ్చితంగా అతడే హంతకుడని ఎలా రిపోర్టు ఇవ్వగలను?"
    "అలా ఇవ్వనక్కర్లేదు ఫలానా కారణంవల్ల ఫలానా వారి  మీద  అనుమానం ఉంది అని చెప్పాచ్చును. మీరు స్టేట్ మెంటు మాత్రం  ఇవ్వాలి. స్టేషన్ కు రండి" అన్నాడు అద్వయతం.
    నరేంద్ర కర్చీఫ్ తో  అగ్గిపెట్టెను తీసి జేబులో పెట్టుకోవడం ఎవరూ చూడలేదు. రెండో జేబులో నుంచి వేరే అగ్గిపెట్టి తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు.
    "ఇక వెళతామా?" అంటూ లేచాడు నరేంద్ర.
    "అగ్గిపెట్టి తీసుకెళ్ళండీ." టేబుల్ మీదున్న అగ్గిపెట్టిను నరేంద్ర వదిలెయ్యడం చూసి అన్నది కమలాంబ.
    "థాంక్యూ" అంటూ అగ్గిపెట్టి తీసుకొని జేబులో వేసుకొన్నాడు నరేంద్ర.
    "మీరు వెళ్ళండి. నేను అర్థగంటలో స్టేషన్ కు వస్తాను" అన్నాడు శంకర్రావు."
    "అలాగే అర్థగంటలో వచ్చేయ్యాలి" అంటూ అద్వయితం బయటికి నడిచాడు.
    అప్పటికే నరేంద్ర జీప్ లో కూర్చుని ఉన్నాడు.
    జీప్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది.
    ఇద్దరూ దిగి లోపలకు వస్తూండగానే కానిస్టేబుల్ యాదగిరి  శాల్యూట్ కొట్టి "సార్! మీ కోసం రమణరావు గారంట రెండుసార్లు ఫోన్ చేశారు" అన్నాడు.
    ఇన్స్ స్పెక్టర్ నరేంద్ర ముఖంలోకి చూశాడు.
    నరేంద్ర ముఖం గంభీరంగా ఉంది.
    "ముందు కాఫీ తెప్పించు" అన్నాడు నరేంద్ర కూర్చుంటూ ఇన్స్ స్పెక్టర్ హెడ్డు ముఖంలోకి చూశాడు ప్లాస్కు తీసుకుని కుర్రవాడు కాఫీ కోసం పరుగుతీశాడు.
    టెలిఫోన్ గణగణ మోగింది.
    హెడ్డు ఫోన్ ఎత్తి "రమణరావు" అని ఇన్స్ స్పెక్టర్ కు రిసీవర్ అందించాడు.
    "హల్లో! ఆ! అలాగా? ఇప్పుడె వస్తాను. ఆ డిటెక్టివ్ నరేంద్రగారు ఇక్కడ ఉన్నారు. మాట్లాడు." అంటూ ఇన్స్ స్పెక్టర్  రిసీవర్ అందించాడు.
    "ఆ అలాగా! ఎప్పుడు? మరి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేం? ఓ అలాగా ? సరేవస్తాం" అనేసి రిసీవర్ పెట్టి ఆలోచనలో పడ్డాడు నరేంద్ర. 

 Previous Page Next Page