అతనుకూడా లేచి సాగనంపుతూ అన్నాడు. "నీ మనసుకు శాంతి లభిస్తే అంతేచాలు. ఏది ఎలా అయినా పరవాలేదు, కానీ మనమధ్య రంగ నలిగిపోయాడు ఈ రెండు రోజులుగా అతనికి నీ సాన్నిధ్యం లేక యెంతగానో దుఃఖిస్తున్నాడు."
విచిత్రమయిన ఆ అబ్బాయి ప్రేమపూర్వకమయిన అంతరంగానికి సంతోషిస్తూ అంది. "ఇప్పుడే వెడతాను...."
22
దుఃఖంలో ఉన్న వాడికయినా, సుఖంలో ఉన్న వాడికయినా రోజుకి గంటలు ఇరవై నాలుగే! కానీ అనుభవంలో మాత్రం సహస్రాధికం.
రాస్తున్న లెటర్ పాడ్ ని ప్రక్కకిపెడుతూ అన్నాడు "ఎందుకిలా చేశావు విరజా!"
అర్ధంకాక తెల్లబోతూ అడిగింది. "ఏం చేసాను వేణూ! నీ మనస్సు నొప్పించేపని ఏదయినా చేశానా? చెప్పు. చెప్పు వేణూ. దిద్దుకుంటాను."
అస్తమిస్తున్న సూర్యుడిని అందుకోటానికా అన్నట్లు పరుగిడుతోంది. ఓ మేఘము అయినా అది అతన్ని అందుకుంటుందో లేదో ఆ కిటికీలోంచి కనిపించదు. చూడకున్నా మేఘానికి అతడు అందడని బుద్ధి చెబుతూనే ఉంది.
విషాదంగా అటుకేసి చూస్తూ అన్నాడు. "నా మనస్సంతా విప్పి చెప్పాను నీకు. అయినా నీవు నన్ను బాధించడం మానలేదు. ఉదయం సాయింత్రం నిన్ను చూడందే ఉండలేను. ఈ మాటంటే నీవు నవ్వుతావు. ఏవేవో సాకులు చెబుతావు. యెందుకీరోజు యింత ఆలస్యం చేశావు? అయిదున్నర దాటాక ప్రతిసెకనూ నీకోసం ఎదురు చూడటంలో నాకు భారంగా నడుస్తుందని నీకు తెలియదా? ఉండే ఒక గంటలో నీవిలా ఆలస్యంగా రావటం తిరిగి వేళకు వెళ్ళటం_ఎలా ఉంటుంది చెప్పు. మానవుడి జీవితమే అల్పం.... అందులో సగం యామిని మింగేస్తుంది. మిగతా సగం వయస్సులో పగటి నిద్రలో కాలక్షేపానికి వ్యయం చేసేవాళ్ళని ఏమనాలి? అలా వుంది నాకిప్పుడు. ఉండేది గంట! అందులో నీ ఆలస్యం సగం దోచుకుంటే మనసు దాచుకోలేని నేను యెంతో బాధపడతాను."
"అబ్బ! చీటికి మాటికి అలిగేది ఇంకా పోలేదా వేణూ. ఉదయం మీ ఇంటికి రాలేదని యిప్పుడిలా రంగని పలుకరించి వస్తున్నాను ఆలస్యమైంది. ఆ యింతకే యింత ఆవేదనా?"
"హుఁ! అనుభవించే వారికి తెలుస్తుంది! కాలం దాటాక అనుక్షణమూ నీవు వస్తానని రెమ్మ కదిలినా, కొమ్మ కదిలినా, పండుటాకు రాలినా, ఎండుటాకు గలగలమనినా నీవే వస్తున్నావని ఎదురు చూడటం_ నీవు రాకపోతే నిట్టూర్పు విడవటం! మళ్ళీ ఏదో కావటం నీవే వస్తున్నావనుకోవడం! ఎంత ఆ అడియాశ! వీటి మధ్య కొట్టుమిట్టాడుతూ సదా బలహీనంగా ఆలోచించే మనసుతో వేగలేక వేగవలసి రావటం_ యెంత బాధ! ఎంత వేదన అర్ధం చేసుకోలేవా విరజా!"
ఆమె ఏమీ జవాబు చెప్పలేక మౌనం వహించింది.
"నాకేమీ అక్కరలేదు విరజా! ఈ జీవితంలో ఇక ఆశలుకానీ, ఆశయాలు కానీ లేవు. దినానికి ఒకసారి కనిపించి మనసారా ఓమాట మాట్లాడి వెడితేచాలు. అంతే! ఇంకేమీ అక్కరలేదు! సుఖం వద్దూ, సంతోషం వద్దు. శాంతి వుంటుంది. అంతేగాదు విరజా! దినమూ అలవాటైన నీవు ఒక్కరోజు రాకపోతే మనసెంత శూన్యంగా వుంటుందో తెలుసా? అనుక్షణం అన్నిటా నీవే నిండుకుంటావ్. నీవు యెదురు చూడటంలోని బాధని అనుభవిస్తే తెలిసేది! అయినా విరజా ఎందుకిలా చేస్తావ్?"
"నీ మనసుకి మనసులోని మమతకి అవ్యాజానురాగానికీ అకారణంగా నాపై ప్రవహిస్తున్న నీ ప్రేమ సుధకి కృతజ్ఞతగా నీపై ప్రేమని నిలుపుకోవటంకంటే నేనేం చేయగలను వేణూ!
హేమంతంలో సూర్యోదయానికి పూర్వము బంతి మల్లెలా వున్నాయామె కళ్ళు.
ఇలా నిండు మనస్సుతో భగవంతుడిని పూజించినట్లు పూజిస్తూ వుంటే నా అదృష్టానికి పొంగిపోనా! నా యోగ్యతకి కృంగిపోనా? అటూ ఇటూ తేల్చుకోలేక రాత్రిళ్ళు ఒక్కోసారి నిద్ర అనేది ఎరుగక ఎర్రబారిన కళ్ళతో మరురోజు ఉదయమే వస్తే నా మనసులోని వేదనని దాచుకోవాలనుకున్నా దాగకుండా ముఖంపై ప్రస్పుటిస్తూ వుంటే కారణం అడుగుతున్న నీకు జవాబు చెప్పలేక ఎంతగా నాలో నేను కుమిలిపోతానో తెలుసా వేణూ! నాకంటే అభాగ్యురాలు ఇంకెక్కడుంటుంది? అన్నిటా వంచింప బడ్డాను!"
"ఇలా ఇరువురమూ హృదయద్వారాలు తెరుచుకుంటే బాధలే ప్రవహిస్తున్నాయ్ కానీ ఆనందం ప్రవహించటం లేదు. అదే నాఖర్మ విరజా! ఏ జన్మలో ఎవరి ప్రేమని తిరస్కరించానో ఏమో ఈ జన్మలో నీ ప్రేమకు వెలి అవుతున్నాను. నిన్ను దక్కించుకోలేని దౌర్భాగ్యపు స్థితికి ఎందరో ఎన్ని జన్మలో__"
ఒక్క క్షణం అతనిలో ఏదో మెరుపు మెరిసినట్టు అన్నాడు ఉద్రేకంగా. "జన్మల వరకూ ఎందుకు విరజా! నాకు యిప్పుడు జ్ఞప్తికి వస్తోంది."
మనం చదివేప్పుడు మనవూరి రెడ్డిగారి అమ్మాయి కూడ చదువుతుండేది గుర్తుందా కృష్ణవేణి అని.... మనతో పోటీ పోవాలని యత్నించేది. నేను ఎవరో సినిమా యాక్టరుగా పోలుస్తూ వెక్కిరించేవాడిని పారిపోయేట్టు. ఎంతో అందంగా ఉండేది. అలంకరణకూడ తక్కువేంకాదు.
కానీ నేను మన వూరులో ఏ పడుచునైనా అక్కగా, వదినలుగా చూడగల్గుతానే కానీ మరో వూహరాదు. అలాంటిది ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. చాలా ఏళ్ళ వరకూ నాకు తెలియదు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు నన్ను అనుక్షణమూ గమనిస్తూ నా జీవితాన్ని తిలకిస్తూ నన్ను తన మనసులో ప్రతిష్టించుకుంది. కానీ నాకు అదేమీ తెలియదు.
ఓరోజు అకస్మాత్తుగా నేను మెడిసన్ చదివేప్పుడు వూరినుండి తిరిగి వెళుతుంటే మా మామిడితోపులో నిలవేసి ప్రశ్నించి చిలిపిగా కవ్విస్తూ నవ్వుతూ నవ్వించ యత్నిస్తూ అన్యాపదేశంగా తనమూగ మనసుని తెలియజేసుకుంది.
నేను అనుకోకుండా ఆ అమ్మాయి మనసులో తిష్టవేసుకున్నందుకు తిట్టుకుని నా మనస్సుని విప్పి చెప్పాను. నా తిరస్కృతి భరించలేక నన్ను శపిస్తూ ఆత్మహత్య చేసుకుంది.
తన ప్రేమని స్వీకరించలేని నా హృదయాన్ని నిందిస్తూ నా అయోగ్యతని, నా దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ చివరికి ఏనాడో ఓనాడు నామనసుని ఒకరికి అర్పిస్తే వాళ్ళు నిష్కారణంగా తిరస్కరించితే అప్పుడయినా తనని జ్ఞాపకం చేసుకుని తనకోసం ఓ కన్నీటి బొట్టు విడిస్తే చాలని ఓ చిన్న కాగితంపై పంపింది. నిజం విరజా! నాకు ప్రతి అక్షరమూ జ్ఞాపకం వుంది. అది జరిగి అయిదారేళ్ళయినా__ఆమె శాపమేమో ఇది!"
ఆ విషాదజీవి కథవిని కన్నీరు తుడుచుకుంటూ అంది.
"నీకు తెలిసో తెలియకో ఓ ప్రాణిని హత్యచేశావ్ వేణూ! నిజం. ఇది ఆత్మహత్య కాదు, హత్య ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారనుకుంటే అది నీ గొప్ప అనుకున్నా తప్పులేదు, కానీ అది అవతలివాళ్ళ గొప్పదనం అని తెలుసుకోలేకపోతే మాత్రం పెద్ద దోషమే అవుతుంది. మనసిచ్చిన వారికి తిరిగి మనసివ్వలేని స్థితిలో కనీసం మంచిమాట అయినా యిచ్చేందుకు సిద్ధపడాలి. అలా కాకుండా సత్యమైనా అది అవతల వ్యక్తిని బాధించరాదు వేణూ. అప్పుడే ఆ సత్యానికి ఫలితం ముఖ్యంగా ఏది ఎలా వున్నా ఆడవాళ్ళ విషయంలో అబద్దమాడి అయినా ప్రేమ నటించి అయినాసరే వాళ్ళని తృప్తిని కలిగించాలి. అంతే! కానీ నిజం నిజం అంటూ తిరస్కరిస్తే వాళ్ళకి చేతయిందల్లా అదొక్కటే భగవానుడి సృష్టిని హేళనచేయటం."
గంభీరంగా అన్నాడు. "ఏది ఎలా అయినా నిన్ను నేను పోగొట్టుకున్నాను విరజా! వస్తువు విలువ అది దూరమైనప్పుడే తెలిసేది. దగ్గరున్నన్నాళ్ళు ఏమీ తెలియదు. దూరమయ్యాక అర్ధం అవుతుంది. అప్పుడు గమనించినా_ గమనించకున్నా చేయగలిగేది చేయవలసింది చాలా తక్కువ వుంటుంది. ఒకవేళ ఏదైనా మిగిలింది అంటే అది ఏడుపే!
ఓదార్పుగా అంది. "ప్రతి పర్యాయమూ మనసులు విషాదాన్ని తోడుకోవటమే అయితే ఇక మనసుకి విశ్రాంతి ఎక్కడిది? మనశ్శాంతి కోసం యీ రావటం ఎందుకు?"
"తను దుఃఖిస్తూ మరొకర్ని దుఃఖించొద్దు అని చెప్పవలసిన పరిస్థితి దాపురించటం యెవరికైనా సంభవించకూడదని భగవంతుని ప్రార్ధిస్తున్నాను నేను" జీవంలేని చిరునవ్వు నవ్వుతూ అన్నాడు వాచీకేసి చూసుకుంటూ. దాదాపు ఏడు కావస్తోంది.
"మనసుకు శాంతి, మనిషికి ఆరోగ్యం అనేవి ఎప్పుడు తన దుఃఖ గాథని తవ్వుకుని వెలికితీసి ప్రక్కకు విసిరేసినాడే కానీ మనసులో దాచి మగ్గంలో వున్న ఆసులాగా ఆసులోని దారములాగా బాధపడటం. వున్నవాళ్ళ మనసుకి శాంతి దొరకదు. నా మనసులో యెంత వ్యధవుందో నీ గుండెల్లో ఎలాంటి జ్వాలలు రగులుతున్నాయో కనీసం మనముందు మనం అయినా చెప్పుకుని తృప్తి పడకపోతే యెలా విరజా!"
అతని మాటకు చిరునవ్వు నవ్వుతూ అంది. "ఇక వెడతా వేణూ! ఎప్పుడూ జీవితంలో దుఃఖం తప్ప మరొకటి లేదనుకోకు. అలా అని దుఃఖం లేదని నేను అనను ఉండరాదని అనను. కష్టం తర్వాతే సుఖం విలువ తెలిసేది. మన హెడ్మాష్టరు అనేవారు చూడూ కారం తిని తీపి తినాలి. తీపితిని కారం తినకూడదు. ముందు కారం తింటే తర్వాత తీపి యెక్కువ కన్పిస్తుంది అని దుఃఖించినవాడికే సుఖం విలువ తెలిసేది. అన్నీ అనుభవించాలి. అనుభవాన్ని మనసులో దాచుకోవాలి. ఒకసారి ఒక విషయంపై కట్టిన బొడిపె మరోసారి అదే విషయంలో జరగకుండా చూచుకోవాలి. అది చాలదా వేణూ! పలుకవేం వేణూ! నీ మాటలను కాదనన్నానా? పిచ్చి వేణూ! అది నా అభిప్రాయం వెలిబుచ్చేవరకే! అంతేకాని మరొకందుకు కాదు అసలు నీకు తెలియదా మనిద్దరి తనువులు రెండుకాని మనసు మాత్రం ఒకటేనని...."