Previous Page Next Page 
మనస్విని పేజి 30

 

    "నేను......"
    
    జడ్జి చెప్పబోయే జడ్జిమెంట్ మీద తన బ్రతుకు బ్రతుకంతా ఆధారపడివుంటే ఖైదీ అతని జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు కళ్ళంతా ప్రాణంతో వెలిగే జ్యోతుల్లా చేసుకుని చూస్తున్న మరదలి చూసేసరికి అతనికి నోరు మెదల్లేదు.
    
    "వద్దులే సరోజా" అన్నాడు.
    
    "బావా!"
    
    కేకవేసినట్టుగా అంది.
    
    కళ్ళలో అంతవరకూ వెలుగుతున్న కాంతి తగ్గినట్లయింది.
    
    రెండుభుజాలూ పట్టుకుని వూపుతూ అన్నాడు.
    
    "నేను ఏమీ చెప్పందే అలా అయ్యేవేం సరోజా"
    
    "ఇంకేం చెప్పాలి బావా?"
    
    కళ్ళనుండి నీరు ధారగా ప్రవహిస్తోంది.
    
    చెక్కిలి పైజారిపోతున్న కన్నీరు తుడుస్తూ అన్నాడు.
    
    "నిజంనా ఉద్దేశ్యం ఏమీ చెప్పలేదు"
    
    "అవును బావా నా ఉద్దేశ్యమూ నీవు అర్ధం చేసుకోలేదు. నేను వద్దులే అన్నారు. అంత కంటేపిడుగుపాటు ఏముంది?" 

   

    విభ్రాంతుడయ్యాడు.

    

    నోటమాటరాలేదు.


    
    "బావా"

   
    అతనిపాదాల మీద సొరిగి పోయింది.
    
    అతనికి అనిపించింది.
    
    తననింతగా ఆరాధిస్తోందాసరోజ? అని రెండుపాదాల్ని కన్నీటితో కడుగుతూ అంది:
    
    "నేనుకన్నీటితో కడిగే ఈ పాదాల్ని మా నాన్నపన్నీటితో కడిగేట్టు చూడు"
    
    అతను జవాబు చెప్పలేదు.
    
    "నన్ను దయ జూడుబావా?"
    
    "నేనుచెప్పాలను కున్నది చెప్పక ముందే అర్ధం చేసుకున్నావు సంతోషం సరోజా"
    
    ఆమెకి అంతకంటే మరేం శిక్ష వుంది.
    
    "బా.......వా....."    

 

    "ఆ బంధమే చాలు సరోజా......మరే అనుబంధమూ కోరకు"
    
    "బా.......వా....."
    
    "అవును సరోజా" పాదాల మీదినుంచి లేస్తూ అంది:  

 

    "అవును బావా! పూజా కుసుమంగా హృదయ కుసుమాన్ని అర్పించడమే భక్తురాలివంతు. అది దేవునికి అందిందా? లేదా? అనేది ఆమెకు అనవసరం. భగవంతుడనుగ్రహిస్తే శిరస్సుపై వుంటుంది. అనుగ్రహించకపోతే నేల రాలిపోయి మట్టిలో కలిసిపోతుంది.
    
    "ప్రిక్ మి దిస్ లిటిల్ ఫ్లవర్"
    
    అన్న గీతాంజలిలోని వాక్యం గుర్తుకొచ్చి ఆమె మాటలకి అడ్డుతగులుతూఅన్నాడు.
    
    "స్త్రీకి ఇంత భావనా బలంవుండకూడదు సరోజా! లేని పోనివి కల్పించుకుని కల్పనలన్నీకలలైతే పగిలిపోవడం మాత్రమే దాని ఫలితం అవుతుంది. మనసు నిబ్బరం కలిగివుండాలి లేనిపోనీ ఆకాశసౌధాలు...... గగనకుసుమాలు.......నిర్మించుకోరాదు..అదేం మంచిది కాదు"
    
    "నీతులు చెపుతున్నావా బావా?"
    
    "నన్ను అర్ధంచేసుకో సరోజా! నీ పదాల్లోనే చెపూతాఅప్పటికైనా బావా తప్పులేదని అర్ధం చేసుకుంటావేమోనని" 

   

    "ఆమె ఏ భావమూ ప్రకటించని కళ్ళతో చూడసాగింది అతని ముఖంలోకి సూటిగా!
    
    "నీకంటే ముందే ఓ భక్తురాలు నీ దేవుడిని పూజచేసింది. ఆమె పూయ కుసుమం తలపైదాల్చాడు దేవుడు. ఆ దేవుడి తలపైవున్న పూవుని తీసివేయటం సబబేనా?" గట్టిగా ఏడుస్తూ అంది.
    
    "ఇక చెప్పకు బావా! నన్నొల్లనంటేనా దురదృష్టం అనుకున్నాను కానీ ఒకరికి అంకితం అయింది అనేమాట చెప్పకు కనీసం నీ మనసంనా నాపైవుంది. అనే భావన అన్నానాకు నిలువు- నాకు దక్కనిది దివ్యమైంది మరొకరికి దక్కిందనే అసూయకూడా ఈ బీద హృదయంలో రానివ్వకు" తల నిమురుతూ అన్నాడు.
    
    "చెప్పినా చెప్పకపోయినా నిజం ఎప్పుడూ వుంటుంది సరూ. చెప్పకుండా దాచిమభ్య పుచ్చిమోసం చేయటంకన్నా నిజం చెపితే అవతలి మనిషి బాధపడినా మంచిదే-సత్యం అలాంటిది సరోజా"
    
    "మండిపోయేనా మనస్సుని ప్రజ్వలింపజేయకు బావా అది భగ్గునమండితే ఆ సెగ నీకుకూడా సోకవచ్చు అలా జరిగితే నేను సహించలేను"
    
    తనపై ఆమె చూపే మక్కువకి అవ్యాజానురాగానికీ అతను క్రుంగిపోయాడు. తన అశక్తతని తలచుకుని ఆర్ద్రమైన కంఠంతో అన్నాడు.
    
    "నిజం సరూ! నీ ఎదుట నిజం-బయట పెడుతున్నాను. అబద్దంచెప్పి నీ మనసుకి శాంతి కలిగిస్తే అది నీకు మంచిదే కావచ్చు తాత్కాలికంగా-కానీ నిజంమరోసారి అయినా బయటపడుతుంది. తిరిగి అప్పుడు నీవు ఇంతటివేదనా పడాలి"
    
    ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా కూర్చుంది.
    
    "నాతో చదువుకున్నా అమ్మాయి-గీతాంజలి-నన్ను ప్రేమించింది. నేనూ ప్రేమించాను......ఇద్దరం పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కానీ దేవుడు అడ్డొచ్చాడు.
    
    "అది సహజం బావా! అనుకున్నవన్నీ నెరవేరితే అతన్ని అనుకునే దిక్కెక్కడ? అందుకని ఎప్పుడూ మన ఆలోచనలకి అడగకుండానే అడ్డు వస్తాడు. అదీ ఒకందుకి మంచిదిలే! నని అన్నాడు.
    
    "కానీ ఆ అడ్డంకి తాత్కాలికమే"
    
    "శాశ్వతంకాకుండా చూసుకో బావా?"
    
    "కాదులే! పిరికి హృదయం నీది ఎప్పుడూ శంకిస్తూనే వుంటుంది"
    
    "నిజం బావా! అందుకే నా పిరికి హృదయం శంకించేది ఎప్పుడూ తప్పిపోదు"
    
    "అలా అనొద్దు సరోజా"
    
    కఠినంగా అన్నాడు.    

 

    "అపార్ధం చేసుకోకు బావా!......నాబావ ఎప్పుడూ సుఖపడాలనేనా మనసులో సదామెదిలేకోరిక.....కానీ భగవంతుడు అర్ధం చేసుకోలేకనన్ను వేరుచేశాడు......అంటే నిన్ను సుఖాన్నుండిశాంతి నుండి వేరు చేశాడనే బావా" నీ మాటలకి కోపం వస్తోంది. కానీ నిన్ను ఏమీ అనలేకుండా వున్నాను సరూ......నీ మనసు నాకు తెలుసు అందుకనే"
    
    "అదీ నీ దుర్భలతే బావా! నన్ను అలాచివాట్లు పెట్టివుంటే ఆ అడ్డు తొలిగేదేమోననిపిస్తోంది. కానీ ఇప్పుడు తప్పుదేమో బావా"
    
    "ఛీ! ఛీ! పిచ్చి పిచ్చిగా మాట్లాడకు"
    
    "నాకు పిచ్చెక్కదులే బావా! గుండె పగిలింది. ఇక చావే కానీ పిచ్చి అనేదిలేదు"    

 

    ఆమె నోరుమూస్తూ అన్నాడు.
    
    "నోటికి వచ్చినట్టల్లా వాగకు"
    
    "ఇకముందువాగేవారూ వుండర్లే బావా"
    
    "అబ్బబ్బ! నీ ధోరణి ఆపేయ్"    

 

    "ఆపుతాను బావా! నా బావకే నామటంటే విసుగొచ్చినప్పుడు ఇక నాకు దిక్కేముంది? దక్కేదేముంది? ఏమైనా నన్ను మరిచిపోతావా బావా?......మరిచిపోవద్దు.....బావా.......బావా.......నీకు కూతురు కొడుకో పుట్టితేడా పేరు పెట్టుకుంటావా?" లేస్తూ అంది.
    
    జవాబు చెప్పితే ఇంకేం మాట్లాడుతుందోనని అలాగే మౌనంగా బయల్దేరాడు.
    
    చంద్రుడిని అనుసరించే రోహిణి ఒంటరిగా బిక్కు బిక్కుమంటోంది.
    
    ధృవతార అలాగే వెలుగుతోంది వెలుగుని చిమ్మలేకచిమ్ముతూ-
    
    శుక్రుడు వెలగటం లేదు-

 Previous Page Next Page