ఉగాది గీతం
యువశక్తీ! నవ
యుగశక్తీ!
ఘనకీర్తీ! జీ
వనదీప్తీ!
దుందుభినామ సంవత్సరమిది
విజయదుందుభి మ్రోగించుదాం
విప్లవ శంఖం పూరించూదాం
ఈ ఉగాది మహోదయ వేళ
ఈ వసంత నవోదయ వేళ
విప్లవ శంఖం పూరించుదాం
విజయదుందుభి మ్రోగించుదాం
విజయం దేనిపై2
విప్లవం ఎందుకని?
అవిచ్ఛినంగా సాగుతున్న అవినీతిపై విజయం
అసందర్భంగా రేగుతున్న అధర్మాలపై విప్లవం
ఈ ఉగాది శుభోదయవేళ
విజయశంఖం పూరించుదాం
ఈ వసంత దినోదయవేళ
విప్లవఢంకా మ్రోగించుదాం
ఇది నా జీవితంలో రెండో దుందుభి
నా పండ్రెండవ యేటిది మొదటి దుందుభి
అరవయ్యేళ్ల తర్వాత మళ్లీ వచ్చింది
ఇప్పుడు విజయదుందుభులు వింటున్నాను
విప్లవ సంఘటనలు కంటున్నాను
ఆనాడు
అరవయ్యేళ్ల కిందట
పారతంత్య్రాన్ని పారద్రోలడానికి
బానిస సంకెళ్లను బద్దలు చెయ్యడానికి
ప్రతిఘటన సమరం సాగింది
ఈనాడు
పారదోలడానికి పరాయివాళ్లు లేరు
అవినీతిపరులంతా
అక్రమాలతో విక్రమిస్తున్న వాళ్లంతా
అన్యాయాల పెట్టుబడితో
అధికలాభాలు గుంజుకుంటున్న వాళ్లంతా
సరాసరి మన శిరస్సుల మీదనే
శివతాండవం చేస్తున్న వాళ్లంతా
మనవాళ్లే
ఎక్కడున్నారు వీళ్లు
ఇందుగలరందు లేరని
సందేహం అక్కరలేని
సర్వాంతర్యాములు వీళ్ళు
సాపాటు రాములు గాళ్ళు
ఈ రాముళ్ల మారాముళ్ల
ముళ్ల పొదల నుండి
బైటపడడం ఎలా సాధ్యం?
అందేకొకటే మార్గం
ఈ వ్యక్తులెవరూ మన
అసలు శత్రువులు కారు
వీరు బోరవిరుచుకుని
బయలుదేరుతున్న
భ్రష్టవ్యవస్థ అంటే అదే మన
ప్రథమ శత్రువు
ప్రధాన శత్రువు
అదేమన అవస్థల కన్నిటికీ
కారణ భూతమైన
పెట్టుబడిదారీ వ్యవస్థ
దానిమీదనే మన పోరాటం
దానిని పడగొట్టడానికే మన విప్లవం
ఇంతకూ పెట్టుబడి
అంటే ఏమిటి?
రూపాయలూ, రూబుల్సా
డాలర్లా డాయిష్ మార్కులా1
కావు ఇవి పెట్టుబడికావు
వెండి బంగారాలు
పెట్టుబడి కావు
బర్రెలూ గోవులూ
పందులూ గోర్రెలూ
ఇవేవీ కావు పెట్టుబడి
మానవుల సామూహిక శ్రమశక్తి
మాత్రమే నిజమైన ధనశక్తి
ఈ శ్రమశక్తిని
రంగురంగుల రకరకాల వేషాలతో
దోచుకుంటున్నదే ఈనాటి
అంతర్జాతీయ ధనస్వామ్య వ్యవస్థ
దీని మీదనే ఎత్తుతున్నాం మన
తిరుగుబాటు జెండా
దుందుభి మ్రోగిస్తున్నాం ఈ
తిరుగుబాటు విజయం కోసమే
అది మానవుడు అగ్నిని
లొంగదీసుకున్నాడు
ఆ తర్వాత ఆవిరిని,
విద్యుచ్ఛక్తిని తనకు
వశంవదం చేసుకున్నాడు
ఈనాడు అణువును విచ్ఛేదించి
ఆణవ శక్తిని విడుదల చేశాడు
ఇది మానవ జాతినే వినాశం
చేస్తుందంటారు కొందరు భయగ్రస్తులు
నాకాభయం లేదు
అణవశక్తి మీద అధికారం
మానవశక్తిదే
అందుకే మానవత్వాన్ని మించిన
మతం నాకు లేదు
మానవశక్తినే విశ్వసిస్తాను
మానవాతీత శక్తుల మీద
నాకు నమ్మకంలేదు
మానవుడే నా మతం
మానవత్వం సమానత్వమే
నా గమ్యం
అది సాధించడానికే
పూరించాలి విప్లవశంఖం
మ్రోగించాలి విజయ దుందుభి
రచన:21-3-1982అముద్రితం
1. డాయిష్ మార్క్ అంటే జర్మన్ కరెన్సీ. జర్మనీని డాయష్ లాండ్ అని కూడా అంటారు.
ఉర్రూతలూగే ఉత్సాహశక్తీ!
ఉప్పొంగిపోయే ఉద్రేకశక్తీ!
యువశక్తీ! నవ
యుగశక్తీ!
అకృత్యదారుణ రణ శక్తీ
అసత్య భంజన జనశక్తీ
యువశక్తీ! నవ
యుగశక్తీ!
విడుదల పొందిన అణుశక్తీ!
విజయంచాటే శ్రమశక్తీ!
నీకు స్వాగతం
యువశక్తీ!
ముద్రణ: దంటు భాస్కరరావు ప్రత్యేక సంచిక - కాకినాడ, 1982