"బావుంది. ఆయనేమో అలాగ అన్నారు. మీరు--"
"ఇదిగో మధూ! వాళ్ళకి తలా ఆరొందలకి రసీదులు తయారు చెయ్. పోనీ డబ్బవసరం అంటున్నారు యిచ్చి పంపుదాం. మళ్ళీ వచ్చేసరికి పూర్తిగా ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం" అన్నాడు పాపయ్య అక్కడికివచ్చి.
చకచకా ఓచర్లు తయారుచేశాడు మధు.
రైతులంతా డబ్బు అందుకుని వెళ్ళిపోయారు.
"ఇదుగో మధూ! ఇదే సీక్రెట్ ఆఫ్ ట్రేడ్ అంటే తెలుసా?"
జవాబివ్వలేదు మధు.
"ఆఁ ఆఁ షుగర్ ఎంతెంత డెలివరీ ఇవ్వాలో వివరంగా లెక్కలు కావాలన్నారు అయ్యగారు. అది తయారుచెయ్"
జవాబు చెప్పకుండా టైప్ చేసిన స్టేట్ మెంట్ అందించాడు మధు.
"ఓరి నీ అసాధ్యంకూలా! నీ జాగ్రత్త చూస్తుంటే నిన్ను యీ ఫేక్టరికి మేనేజర్ని చేయించాలనిపిస్తోందోయ్"
"థాంక్స్"
"ఊఁ ఊఁ రేపు పల్లెకు వెళ్ళి తోటలు చూసి రావాలన్నారు అయ్యగారు, వెళ్లొస్తావా?"
"అలాగేనండి"
"కారు తీసుకెళ్ళు. అన్నట్టు డ్రైవింగ్ వచ్చా"
"రాదండి"
"ప్చ్! ఈ రోజుల్లో ఆడపిల్లలకి డ్రైవింగ్ వస్తుంటే నీలాటి చాకులాటి కుర్రాళ్ళకి డ్రైవింగ్ రాదంటే యెలా?"
"నాన్నా!"
"ఇదిగో మణీ! ఆఫీసులో నాన్నా గీన్నా అనరాదు"
"పోన్లెండి నాన్నా, ఇక్కడింకెవరూ లేరుగా. మధూ నేనూ మీరే. నేను మధుతో కలిసి వెళ్ళనా. నాకు డ్రైవింగ్ వచ్చు కదా?"
కూతురికేసి నిశితంగా చూసి పెదవిముడి వేసి అన్నాడు. "నీవూ వెళతావా? అలాగే!" అని "ఏమోయ్ మధూ! వెళతారా?" అని అడిగేడు.
"అలాగేనండి" అన్నాడు మధు.
పాపయ్య వెళ్ళిపోయాడు.
నవ్వింది మణి.
* * *
మధ్యాహ్నం రెండుగంటలు కావస్తుంది.
బస్టాపులోనుంచున్న సుధాకర్ కి ఓ సమస్య ఎదురైంది. కాలేజీలో పాఠం వినటమా? కల్యాణిలో సినిమా చూడటమా అనేదే అతని ప్రస్తుత సమస్య. మాంచి ఇంగ్లీషు మ్యాటిని, తప్పిపోతే మళ్ళీ చూసే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. రూపులేని రేపుమీద నమ్మకం వుంచుకుని యింగ్లీషు మాట్నీ వదిలేస్తే ఏమవుతుందో?
రేపు సినిమా ఎత్తెయ్యొచ్చు. పవర్ కట్ అని మ్యాట్నీ తీసెయ్యొచ్చు, విద్యార్ధులు రాలేదే అనే బెంగతో సినిమా వాడు స్ట్రైక్ చెయ్యొచ్చు.
కానీ రేపు కాలీజీ వుండటం ఖాయం. నెత్తికి అంటూనే అతనికి కాలేజీలో రాబోయే తలనొప్పి గుర్తుకొచ్చింది.
వెధవ కాలేజి!
ఒక లెక్చరరూ పాఠాన్ని యింట్రెస్టింగ్ గా చెప్పడు కదా? వాడి అబ్బసొమ్ము పోయినట్టుగా ఫీలవుతారు తప్ప అయ్యో యిది భావిభారత పౌరుడి మనస్సుకి పడుతోందా? లేదా? అని చింతించరుగా.
సరే! కాలేజి మానేసి సినిమాకే వెళ్లాలని నిర్ణయానికొచ్చాడు సుధాకర్.
కానీ తోడు లేకుండా సినిమా చూడటం యెలా? ఎంత జనం మధ్య వున్నా నీవాడంటూ లేనప్పుడు నీవు వంటరిగాడివే! ఆస్థితి చాలా దుర్భరం.
ఏం చెయ్యాలి?
అటూ యిటూ చూశాడతను. రెండైంది. కాలేజికి వెళ్ళే బుద్ధిమంతులు ఎప్పుడో వెళ్ళిపోయారు, లేడీ స్టూడెంట్స రూమ్స్ లో నిద్దరోతూ వుంటారు. బాకులాంటి అబ్బాయిలు రమ్మీ ఆడుతూనో - సినిమా బుకింగ్ క్యూలోనో వుండి వుండారు.
అతనికి చాలా చిరాకేసింది. తనని ఒంటరివాడని చేసిన తమ స్నేహితులపై చెప్పరాని కోపంవచ్చింది. వెధవలు అని ఒక్కమాటలో తిట్టుకున్నాడు.
సినిమాకి తీసికెళ్ళే అబ్బాయికానీ, తీసికెళితే వచ్చే అమ్మాయికానీ అతని కంటికి కనిపించలేదు. వత్సలది ఆరూట్ కాదు. వనజది ఆ వేళకాదు. మంజుల హాస్టల్ నుండి నడిచి వస్తూ వుంటుంది. ఈ దారినవచ్చే ఆడపురుగే లేదు. అయ్యో! ఖర్మ. అనుకున్నాడు సుధాకర్.
సరిగ్గా ఆ సమయంలో ఓ యువతి గబగబా బస్టాపుకివచ్చింది. అత్తారింటికి వెళ్ళే కోడలిగా గాబరా పడుతోంది. తొలిసారి ఫ్రెండ్ వెంట సినిమాకి వెళ్ళె కంగారు ప్రదర్శిస్తుంది.
'కొత్త జంతువు' అనుకున్నాడతను.
అటూ యిటూ చూశాడు.
మధ్యాహ్నం! అసలే ప్రయాణీకులు తక్కువ.
ఉన్నవాళ్ళు ఎవరి గొడవలో వాళ్ళున్నారు.
ధైర్యం చేసి 'హలో!' అన్నాడు దగ్గరగా వెళ్ళి.
గాబరా తింది ఆమె.
"కంగారు పడకండి. సినిమాకి వెళుతున్నారా?"
"ఉహూఁ"
"కాలేజీకి వెళుతున్నారా?"
"ఉహూఁ" అని "ఊఁ ఊఁ" అంది మళ్ళీ.
"బెదరిపోతోంది" అనుకుని మెల్లిగా "వెధవ కాలేజి. ఎక్కడికి పోతుంది? ఈ రాత్రి పిడుగుపడి బిల్డింగ్స్ కూలిపోయినా రేపుకాక ఎల్లుండే చెట్లకింద పాఠాలు చెపుతుంటారు. కళ్యాణిలో మాంచి ఇంగ్లీషు మాటినీ వుంది. వెళదాం రండి."
తలూపింది అడ్డంగా!
"రావా?"
తీవ్రంగా చూసింది అతనివైపు.
"ఈ వూళ్ళో వుండేది ఒకే ఒక కాలేజి. బహుశా కొత్తగా చేరి వుంటావు ఈరోజు ఉదయం. నా తడాఖా తెలీదు నీకు. నేను పిలిస్తే మ్యాట్నీకి రాని అమ్మాయి ఏయే కష్టాలు అనుభవిస్తుందో నీక్లాస్ మేట్స్ ని అడుగు. అన్నట్టు బి.యస్సీ నా బి.ఏనా?"
ఆ అమ్మాయి జవాబు చెప్పేలోగానే బస్సువచ్చేసింది. చకచకా వెళ్ళి బస్సెక్కిందామె.