"రమణా! ఆ పైన ఏం మాట్లాడాలో తెలియనట్లు మౌనంగా వుండి పోయాడు. ఆమె భుజం మీద చెయ్యేసి, దగ్గరగా తీసుకున్నాడు. ఆ మాత్రం స్వాంతన చాలు, ఆమె హృదయంలోని దుఃఖం గట్లు తెగి ప్రవహించడానికి! ఎన్నో రోజుల తర్వాత కూతురి మొహం కళకళలాడటం చూసి చాలా సంతోషించారు రామ్మూర్తి, సీతమ్మగార్లు.
"పోనీలే! ఏ ఉద్యోగాలూ చెయ్యకపోయినా ఇంటి పట్టునుంటే అంతే చాలు అన్నారాయన భార్యతో.
మర్నాడు భోజనాల దగ్గర అల్లుడితో మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ "ఈసారైనా కుదురుగా వుండు, పిల్ల చాలా దిగులు పడిపోయింది. చూడు! ఎలా అయిపోయిందో" అన్నారు రామ్మూర్తిగారు.
"అవును! ఈసారి వచ్చాక తనని నాతో ఎక్కడికెళ్ళినా తీసుకుపోదామనే అనుకుంటున్నాను" అన్నాడు శ్రీహరి అన్నం కలుపుకుంటూ.
"ఈసారి వచ్చాకనా? ఎక్కడికెళుతున్నావు?" ఆయన ఆశ్చర్యంగా అడిగారు. సీతమ్మగారు కూడా వడ్డిస్తున్నదల్లా ఆగి అల్లుడివైపు అనుమానంగా చూసింది.
"బర్మా వెళుతున్నాను. అక్కడి యూత్ ప్రెసిడెంట్ కబురుచేశాడు సాధ్యమయినంత త్వరగా వచ్చేస్తాను" అన్నాడతను చాలా మామూలుగా.
"ఎప్పుడెళుతున్నావు?" సీతమ్మ అడిగింది.
"రేపే!"
రామ్మూర్తిగారు చెయ్యి కడుక్కుని లేచెళ్ళిపోతుండగా, గదిలోకి నోట్లో కొంగు కుక్కుకుని వెళుతున్న కుమార్తె కనిపించింది. అయన భారంగా నిట్టూర్చాడు.
మర్నాడే శ్రీహరిరావు బర్మా వెళ్ళిపోయాడు.
* * * *
బర్మాలో ఒక సి.ఐ.డి. ఇన్స్ పెక్టర్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చలామణి అవుతూ, ప్రజల దగ్గర్నుండి కాంగ్రెస్ సమాచారమంతా సేకరించి గవర్నమెంటుకి చేరవేస్తుండగా అవమానమొచ్చిన యూత్ లీడర్ వాళ్ళు శ్రీహరిరావుకి సమాచారం అందించారు.
శ్రీహరిరావు వెళ్తూనే రంగంలోకి దిగాడు. పెద్దఎత్తున ప్రసంగాలు ప్రారంభించాడు. వాటిలో "ఎవరో ఒకరు మాలో వున్నట్లు నటిస్తూనే ఇక్కడి సమాచారమంతా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అతని పేరు నాకు తెలుసు. బయటపెడితే ప్రజలు ఊర్కోరు!" అంటూ చెప్పనారంభించారు, కొన్నాళ్ళు అతను భయపడి తన కార్యకలాపాలు నిలిపేశాడ
ఈలోగా శ్రీహరిరావు ఖాళీగా వుండకుండా, ఎన్.ఎస్.అయ్యర్ అనే స్నేహితుడితో కలిసి (Whip) అనే పత్రిక ప్రారంభించాడు. దేశంలో జరుగుతున్న అరాచకాల్నీ, అన్యాయాల్నీ ప్రముఖంగా ప్రచురించసాగారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చలామణి అవుతున్న సి.ఐ.డి ఇన్ స్పెక్టర్ గురించి కూడా అందులో బయటపెట్టడం జరిగింది. దాంతో అతను ఎవరికీ కనిపించకుండా పారిపోవడం జరిగింది.
"విప్" పత్రిక నడవడానికి ప్రభుత్వ అనుమతి లేదన్న కారణాన, శ్రీహరిరావుని అరెస్ట్ చేసి, మాండలే జైలుకి పంపించారు.
ఏడాది శిక్షపడింది.
1934లో, బర్మానుండి వచ్చాడు. ప్రవర్తనలో పెద్దగా మార్పేం లేదు. "రైలు గొలుసుల శ్రీహరిరావుగా" పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖులెవరన్నా రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు, ఇతనివల్ల ఇబ్బంది లేకుండా ముందుగా అరెస్ట్ చేసి జైల్లో వుంచేవారు. వారు తిరిగి వెళ్ళిపోయాకా విడుదల చెయ్యడం ఆనవాయితీగా జరుగుతుండేది.
అతనో గొప్ప వక్త! అతని ఉపన్యాసాల కోసం ప్రజలు ఆహార నిద్రలు మానుకుని మరీ కూర్చునేవారు, విద్యార్ధులు అతన్ని 'గురువుగారు' అంటూ సంబోధిస్తూ చాలా గౌరవం చూపించేవారు. వారూ, వీరూ ఇచ్చిన డబ్బంతా పార్టీ ఫండ్ పేరిట ఇచ్చేస్తారని కొందరు స్నేహితులు బియ్యం, కందులూ మొదలగు వస్తురూపేణా ఇంటికి బస్తాలు పంపేవారు. అది అతనికి సుతరామూ ఇష్టం వుండేదికాదు.
1934 లోనే ఆడపిల్ల పుట్టింది. దుర్గా సావిత్రి అని పేరు పెట్టారు. ఆ పిల్లని చూసుకుని రమణ కాలక్షేపం చేస్తోంది. భర్త ఏ వేళప్పుడో ఇంటికి రావడం, కాసేపు పిల్లతో ఆడడం తనను పలకరించటం ఇంతలో పోలీసులొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవటం నిత్యకృత్యమయిపోయింది. ఎన్నాళ్ళిలా? పుట్టింట్లో! తనీడు వాళ్ళందరూ హాయిగా భర్త, పిల్లలతో కాపురాలు చేసుకుంటుంటే! అని మధనపడేది ఆమె అంతరంగం.
ఓ రోజు హఠాత్తుగా వచ్చి "రమణా! మేమందరం కాంగ్రెసు మహాసభలకి లక్నో ఎళుతున్నాం నువ్వు వస్తావా?" అని అడిగాడు శ్రీహరి.
ఈ మాత్రం అవకాశం చాలు భర్త వెంట వుండటానికి అనుకుంది. వెంటనే "సరే!" అని సంసిద్దత వ్యక్తం చేసింది.
"కానీ మేమందరం లక్నో దాకా పాదయాత్ర చేస్తున్నాం. చాలా మజిలీలుంటాయి. ఎన్నాళ్ళు పడ్తుందో అసలు తెలియదు పాపని కూడా మనతోబాటే తీసుకెళదాం."
"అలాగే."
ఇదంతా వింటున్న సీతమ్మగారికి ఒళ్ళు మండిపోయింది.
"చాల్లే ఉద్దరించింది! నువ్వు ఊళ్ళట్టుకుని ఊరేగుతున్నది కాకుండా దాన్నీ, ఏడాది పిల్లనీ కూడా నీతోబాటు అడవుల పాలు చేస్తావా? మా పిల్ల మాకు బరువేంకాదు. కన్నందుకు మాకు తప్పదు. నువ్వెళ్ళు, అదెక్కడికీరాదు" అని ఖచ్చితంగా చెప్పేసింది.
"అమ్మా!" అంటూ తత్తరపాటుతో భర్తవైపు చూసింది రమణ.
"నీ ఇష్టం. మళ్ళీ ఎప్పుడొస్తానో చెప్పలేను నువ్వు వెంట వుంటే వెనక్కి రావాలన్న ధ్యాసుంటుంది. లేకపోతే చెప్పలేను" అన్నాడు నెమ్మదిగా అయినా దృఢంగా.
"లేదు లేదు తప్పకుండా వస్తాను" అంది కంగారుగా. "ఎప్పుడు బయల్దేరాలి?"
"నవంబర్ మూడున బయల్దేరుతున్నాం. మనతో కలుపుకునీ తొమ్మండుగురం. అందరూ పురుషులే నువ్వు ఒకత్తివే స్త్రీవి అభ్యంతరం లేదుగా" అన్నారు.
ఆమె తల అడ్డంగా తిప్పింది అభ్యంతరం లేదన్నట్లు.
ఆ రాత్రి రామ్మూర్తిగారు చాలా హడావుడి చేశారు. శ్రీహరిరావుని చెడామడా తిట్టారు. అడవుల్లోపడి, చంటిపిల్లనేసుకుని నీతోబాటు కాళ్ళరిగేలా అది తిరగాలా? ఎన్ని నెలలు పడ్తుందో కూడా తెలియదా? అసలు జ్ఞానం వుండే మాట్లాడుతున్నావా? అంతమంది మగవాళ్ళ మధ్య ఇదో కత్తి ఆడపిల్ల ఎలా వుండగలదనుకున్నావు? మేనల్లుడివని దరిజేర్చి పిల్ల నిచ్చి పెళ్ళి చేసినందుకు నన్ను బానే కుడిపిస్తున్నావురా!"