Read more!
 Previous Page Next Page 
లీడర్ పేజి 2

    ఆమె కళ్ళల్లో ఆ దృశ్యం మెదిలింది!        
    "రమణా చూడు! ఈ అన్నంలో సన్న సన్న మేకులు కలిపించాడా జైలర్. ఈ సంగతి తెలీని ఆ ప్రజలు నన్ను నిరాహారదీక్ష మానమని గొడవ చేస్తున్నారు."    
    "నిరాహారదీక్ష కొనసాగినా ఆయన బ్రతకరు. ఒకవేళ మానివేసినా ఆ జైలర్ అతన్ని...." ఇంకాపైన ఆలోచించలేక, "భగవంతుడా! నువ్వే దిక్కు" అనుకుంది వెక్కి వెక్కి ఏడుస్తూ మోకాళ్ళమీద తల పెట్టుకుని.    
    రామ్మూర్తీ,  సీతమ్మలు బాధగా మొహ మొహాలు చూసుకున్నారు.    
                                       *    *    *    *    
    రామ్మూర్తిగారి చెల్లెలి కొడుకు శ్రీహరిరావు ముగ్గురన్నదమ్ములూ, ఇద్దరాడపిల్లలూ, మధ్యవాడు. మంగపేటనుండి రామచంద్రాపురం వచ్చి "నేను చదువుకుంటాను మావయ్యా!" అడిగినప్పుడు అయన కాస్త ఆలోచించారు. "నా కెలాగూ కొడుకులు లేరు! ఇతన్ని చదివించి కూతుర్నిచ్చి చేసుకుంటే యింటి పట్టునుంటాడు కదా!" అన్న ఆలోచన రావడమే తరువాయి "సరేలేరా!" అనేవారు.
    తెలుగూ, గణితం సంస్కృతం తనే స్వయంగా చెపుతూ స్కూలు ఫైనల్ దాకా రామచంద్రాపురం చదివించారు. ఆయనికి తాలూకా ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం ఇద్దరు కుమార్తెలు రమణ, సత్యవతి 1093లో పెద్ద చెల్లెలి కుమారుడు శ్రీహరిరావుని రమణకూ, చిన్న చెల్లెలి కుమారుడు శేషగిరిని సత్యవతికీ యిచ్చి వివాహాలు జరిపించారు.    
    పెళ్ళినాటికి శ్రీహరిరావుకి పదిహేనేళ్ళు, రమణకు పదకొండేళ్ళు పల్లకీలో ఊరేగుతున్న పెళ్ళికుమార్తెలనీ, పెళ్లికొడుకుల్నీ చూసిన ఊర్లో వాళ్ళందరూ "ఒకడు ఇంద్రుడూ, మరోడు చంద్రుడూనూ రామ్మూర్తి అల్లుళ్ళు" అన్నారు.    
    శ్రీహరిరావు విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఏ. చదవడానికి వెళ్ళాడు. అప్పుడేం, అతను అక్కడ సంగీతం నేర్చుకుంటున్న ఘంటసాల వెంకటేశ్వరరావనే కుర్రాడి గాత్రం గురించి తన మేనమామకి ఉత్తరాల్లో రాసేవాడు. ఆ తరువాత అతను మహాగాయకుడైన సంగతి అందరికి విదితమే!    
    శ్రీహరిరావు బి.ఏ. పరీక్ష ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడై తిరిగి వస్తుండగా, అతనీ జీవితాన్ని ఓ పెద్ద మలుపుతిప్పి, అతని భవిష్యత్తుని నిర్దేశించిన సంఘటన జరిగింది.    
    "గాంధీగారు సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు."    
    శ్రీహరిరావు ఇంకా ఇంటికి చేరలేదు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, వారితో కలిసి అలా సాగిపోయాడు. ఊరూరా, వాడ వాడలా తన వాగ్దాటితో ప్రసంగించి శ్రోతల్ని మంత్ర ముగ్దుల్ని చేసి, వారిలో దేశభక్తి జాగృతం చేస్తూ అలా కలకత్తా వరకూ సాగిపోయాడు.    
    కలకత్తాలో ఒక 'సిరీస్ ఆఫ్ లెక్చరర్స్ ఇవ్వడంవలన, బి.టిపి. అంటే 'భారతీయ తీర్ధ పండిట్' అనే బిరుదు పొందాడు.    
    ఇంగ్లీషువారి బట్టలనూ, వారు నడిపే రైళ్ళనూ నిరాకరించే ఉద్యమానికి సారధ్యం వహించాడు.    
    అవి శారదా ఏక్ట్ రాని రోజులు. పెళ్ళిళ్ళ సీజన్ లో రద్దీ బాగా వుండేది. రైళ్ళల్లో "టిక్కెట్టు కొన్న ప్రయాణీకులందరికీ సీటు దొరకాలి కాబట్టి కంపార్టుమెంట్లు పెంచాలి" అని డిమాండు చేశాడతను.    
    ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దాంతో అతను రైలు గొలుసులు లాగి రైళ్ళాపేసెయ్యసాగాడు.    
    రైలాగగానే అక్కడ ఫ్లాట్ ఫారమ్ మీద తన "స్పీచ్" ప్రారంభించే వాడు. అతని ప్రపంచం వింటున్న ప్రజలు తమని తాము మరచి, అరంగుళం కూడా కదలలేకపోయేవారంటే అతిశయోక్తి కాదేమో! అతనికి త్వరలోనే రైలుగొలుసుల శ్రీహరిరావునీ పేరొచ్చేసింది అందుకుగాను, అరెస్టుచేసి బళ్ళారి జైలులో రెండు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించారు.    
    శిక్షాకాలం పూర్తయి ఇంటికి వచ్చాడు. మేనమామచే నీతులనూ చీవాట్లనూ స్వీకరించాడు. కొన్నాళ్ళు బుద్దిగా యింటిపట్టునే వున్నాడు. కానీ పుర్రెకి పుట్టిన బుద్ది అంతలోనే పోదుగా! తిరిగి మహాత్ముని ఉద్యమం గురించి ఉపన్యాసాలిస్తూ వూరూరా తిరగసాగాడు. మళ్ళీ అరెస్టుచేసి వైజాగ్ జైల్లో పెట్టారు. అప్పటికే అతని భార్య గర్భవతి. అక్కడ ఏడాదిన్నర శిక్షపడింది.    
    జైలర్ ని కొన్ని కోరికలు కోరి అతను నిరాకరించడంతో నిరాహారదీక్ష ప్రారంభించి అరవై ఏడురోజుల తరువాత విరమించాడు.    
    ఈలోగా అతనికోసం క్రుంగి కృశించిన రమణకి గర్భస్రావమయింది.    
    1931లో జైలునుండి వచ్చిన పిమ్మట కూడా అతనిలో పెద్దమార్పేమీలేదు. మరింత ముమ్మరంగా ప్రసంగిస్తూ రైళ్లాపివేస్తూ తిరిగి అరెస్టయి, ఈసారి రాజమండ్రి జైలుకి తీసుకెళ్ళబడ్డాడు. అక్కడో సంవత్సరం శిక్ష పడింది. అతనితో ఈవిధమైన వైవాహిక జీవితం ఆమెకి అలవాటయిపోయింది.   
                                        *    *    *    *    
    1933,    
    "మీ ఆయనొస్తున్నాడు" రామ్మూర్తిగారి కంఠంలో కోపం, తండ్రి మాటలకి రమణి లేచి నిలబడింది. ఆమెలో దుఃఖం, కోపం, బాధా, ఆనందం అన్నీ మిళితమై, ఏ భావం ముందు బయల్వెడలాలో తెలియని పరిస్థితి!    
    అతను లోపలికొచ్చాడు ఎంతో మామూలుగా.    
    ఆమె కాళ్ళకి నీళ్ళిచ్చింది. తలదించి చూశాడు. నీరసంగా వున్న మొహం పాలిపోయిన చెక్కిళ్ళూ ఆమె శరీరక స్థితిని తెలియజేస్తుంటే, కళ్ళల్లో బాధా, కోపం, ఉక్రోషం ఆమె మానసిక స్థితినీ తేటతెల్లం చేస్తున్నాయి. మొదటిసారిగా గర్భవతయినప్పుడు సంతోషంగా ఆ విషయం తెలియజెయ్యడానికి ఆమెకి భర్త అందుబాటులో లేడు. నెలలు నిండి కడుపున ఓ కాయ కాస్తే చూసి ఆనందిద్దామనే తరుణంలో....తీరని ఆశాభంగం. ఆ సమయంలో కటకటాల వెనుక తను చేరలేనంత దూరంలో అతను!

 Previous Page Next Page