Previous Page Next Page 
మనసున మనసై పేజి 29


    'మీరంతా చూస్తారనే ఈ వంకతో పిలిచారు ఆయన మీకు నచ్చితే ప్రొసీడ్ అవుతారు' దమయంతి అంది.
    'దానికి నచ్చితే మాకేం అభ్యంతరం పిల్లాడు, ఉద్యోగం అన్నీ బాగున్నాయి. ఆవిడ ఊఁ అంటే చాలు' వెంకటేశ్వరరావు అన్నారు.
    'అక్కయ్య కిష్టమే నాకు తెలుసు. దివాకర్ ఊఁ అంటే చాలు' దమయంతి అంది.
    'నేను నెమ్మదిగా వాడిదగ్గిర ఈ విషయం ఎత్తి కదిపి చూస్తాను' గోపాలకృష్ణ అన్నాడు. నెమ్మదిగా మాట్లాడుకున్నా అన్ని మాటలు వినిపించాయి జయంతికి. కావాలని శ్రద్దగానే వింది. ఓ అదా దివాకర్ రావడానికి కారణం అనుకుంది. ఇదే వారం క్రితం అయితే దివాకర్ తనతో పెళ్ళికి వప్పుకుంటాడు అన్న గట్టి నమ్మకం ఉండేది. కాని మనీషాతో అతను ఆ రోజు వెంట వెంట తిరగడం, ఫోనులో మాటలు అవి చూశాక ఇప్పుడసలు అతని కోరికలేమిటో, ఆశలేమిటో అన్న సందేహం మనసులో కలిగింది. పాపం గోపాలకృష్ణ నిజంగానే తన కోసం తాపత్రయపడ్తున్నాడు. మొదటిసారి అతని మీద ఆమెకి సాభిప్రాయం కలిగింది. మంచివాడే అనుకుంది.
    
                                   * * *
    
    'హలో మనీషాజీ... దివాకర్ హియర్' శనివారం మనీషా బుటిక్ సెల్ నెంబరుకు ఫోన్ చేశాడు దివాకర్. మనీషా ఒక్కక్షణం వూరుకుని 'హలో' అంది నెమ్మదిగా. 'బిజీగా వున్నారా...' 'లేదు' ... చెప్పండి ఏమిటిలా ఫోను చేశారు. ఏదైనా పని వుందా' అంది మనీషా.
    'పనుంటే తప్ప చేయకూడదంటారా...' తమాషాగా అన్నట్టుఅడిగాడు.
    'అదేం లేదు...' కాస్త తడబడి అంది.
    'ఏం చేస్తున్నారు లంచ్ కి వెళ్ళలేదా ఇంటికి..'
    'అప్పుడేనా.. లంచ్ కి వెళ్ళను.. ఇంటి నించి రెండు గంటలకి వస్తుంది'
    'ఓ... ఐసీ, కస్టమర్లున్నారా?'
    'ఎవరూ లేరు, ఖాళీ.... ఈ టైములో కాస్త తక్కువ ఉంటారు'
    'అయితే వంటరిగా ఏం చేస్తున్నారు...?'
    'వంటరిగా ఏం, నా బెస్ట్ ఫ్రెండు వున్నారుగా' మనీషా గొంతులో కవ్వింపు. దివాకర్ ఒక్క నిముషం నిశ్శబ్దం అయిపోయాడు. 'ఎవరా బెస్ట్ ఫ్రెండ్' కొద్ది అసూయ ధ్వనించింది గొంతులో.
    మనీషా అవతల నించి కిలకిల నవ్వింది. 'గెస్' అంది కవ్విస్తూ, 'ఆడా, మగా పోనీ అది చెప్పండి' దివాకర్ బతిమాలినట్టున్నాడు.
    'నో,  యూ మస్ట్ గెస్...' అంది నవ్వి.
    'నాకసలు మా ఫ్రెండ్ ఎవరో ఏమిటో తెలిస్తేగా చెప్పగలగడానికి... ప్లీజ్ ఇంకా సస్పెన్స్ వద్దు.....'
    మై బుక్' అంది మనీషా కొంటెగా, దివాకర్ తేలిగ్గా నవ్వేసి 'అబ్బ చంపారు. ఒక్క క్షణం ఎంత టెన్షన్ అనుభవించాను' అన్నాడు.
    'ఎందుకు టెన్షన్'
    'కాదా మరి, నాకంటే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ వుండకూడదు'
    'మీరు నా బెస్ట్ ఫ్రెండా? మనం ఇంకా ఫ్రెండ్సే కాలేదు. మన పరిచయం వయసు జస్ట్ ఫిఫ్టీస్' డేస్ అంతేగా...'
    'ఫ్రెండ్స్ కావడానికి పదిహేను రోజులు చాలా ఎక్కువే అనిపిస్తుంది నాకు. నా మటుకు నేను మిమ్మల్ని చూసిన రోజు నుంచి మీరు న బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను. చేస్తే మీలాంటి వారితో స్నేహం చెయ్యాలనిపించింది' దివాకర్ గొంతు మార్దవంగా పలికింది.
    'ఎందుకేమిటి, మీలాంటి అందాలరాశి, కుసుమ కోమలితో పరిచయం అదృష్టమని ఎవరనుకోరు....'
    'మరీ పొగిడేస్తున్నారు'....
    'పొగడ్తా ఇది, మీరు అద్దం ఎప్పుడూ చూసుకోలేదా ఏమిటి.. దేముడు అతిశ్రద్దగా మంచి మూడ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని తయారు చేసినట్టున్నాడు. అన్ని మంచి మంచి పార్ట్స్ వెతికి వెతికి కష్టపడి మిమ్మల్ని తీర్చిదిద్దాడు ఓపిగ్గా- ఆ కళ్ళని కమలాలరేకుల నించి ముక్కు సంపెంగలనడిగి, నోరు దొండ పండ నడిగి, పళ్ళు దానిమ్మగింజల నించి, చేతులు తామర తూళ్ళ నించి, జుత్తు తుమ్మెద రెక్కల నించి, మెడశంఖాల నించి' కవిత్వం వచ్చేసినట్టు దివాకర్ వర్ణించుకుపోతున్నాడు.
    'ఆపండి, ఆపండి, అక్కడితో ఆపండి. బాబోయ్ కూరలు, పళ్ళు, పువ్వులు నన్ను పోల్చడానికి వా మీకు దొరికాయి.... 'కిలకిల నవ్వింది. 'మరీ అతిగా పొగిడితే ఇవతల వాళ్ళు నమ్మొద్దూ...'
    'మనీషా...మీరు నమ్మినా, మానినా ఇది పచ్చి నిజం. కావలిస్తే శ్రీధర్ కి ఫోను చేసి అడగండి. మిమ్మల్ని రిసెప్షన్ లో చూసిన మొదటి క్షణం ఏమన్నానో'
    'అమెరికా ఫోను చేసి అడగటం... ఆ డబ్బు దండగ ఎందుకు మీరే చెప్పండి'
    'ఎవరా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య? ఏ లోకం నించి వచ్చిందిరా ఈ సుందరి. ఈ అందాలరాశితో పరిచయం చెయ్యరా-ఆమెతో మాట్లాడని నా జన్మ వృధా' అంటూ అదరగొట్టి శ్రీధర్ ని తీసుకుని రాహుల్ దగ్గరకి వచ్చి డయాస్ మీదున్న మీతో మాటలు కలిసి...'
    'ఆ...ఆ...ఆపండి. ఆ తర్వాత కథ తెలుసులెండి. మీకు మనుష్యులని పొగడం బాగా వచ్చు' అంది మనీషా మురిపెంగా.
    'అబద్దాలని నిజం చేత్శూ మాట్లాడితే పొగడ్తలంటారు. నిజాలని మాట్లాడటం ఆరాధించటం అంటారు....' దివాకర్ గొంతులో నిజాయితీ ధ్వనింపచేస్తూ అన్నాడు.
    'ఏదో ఒకటి లెండి. మీకేం బ్యాంక్ లో పని లేదా. నాతో ఇలా గంటల కొద్ది మాట్లాడుతున్నారు...'
    'పోనిద్దురూ వెధవ బ్యాంక్ దివాలా తీయనీండి. నా సొమ్మేం పోతుంది'
    'దివాలా తీస్తే నాకు అప్పు ఎలా ఇస్తారు- మీ సొమ్ము పోదుగాని ఉద్యోగం పోగలదు. ఈ మేనేజరు పని పాట చేయకపోగా ఫోనులు చేస్తూ వేలకి వేలు ఫోను బిల్లులు చేశాడని....' మనీషా జోక్ గా అంది.
    'అపుడు మీ బుటిక్ లో సేల్స్మేన్ గా చేరతాను...చక్కగా రోజుకి పన్నెండు గంటలు మిమ్మల్ని చూస్తూ గడపవచ్చు... ఏం ఉద్యోగం ఇస్తారా' కొంటెగా అడిగాడు.
    'ఇందాక నన్ను పొగిడినట్టు, నా డ్రస్సులని పొగిడి సేల్స్ ఇంప్రూవ్ చేయగలిగితే రెండు నెలలు టెంపరరీగా చూసి పెర్మనెంట్ చేస్తాను' మనీషా దర్పం నటిస్తూ అంది.
    'డన్-మీ చేతులతో గీసిన డిజైనులు అందంగా ఎందుకుండవు-అవి అమ్మిపెట్టే పూచి నాది'
    'సర్లెండి ఫోను పెట్టేస్తున్నాను-ఎవరో వచ్చారు' సడన్ గా ఫోను కట్ చేసింది మనీషా. దివాకర్ కి మనీషాతో మాట్లాడాక ఏదో టానిక్ పుచ్చుకున్నట్టు నూతనోత్సాహం మనసంతా నిండి.

 Previous Page Next Page