"లావణ్యా!"
"..............."
అతను స్నేహ బావుందంటున్నాడు. తనకి కోపం వచ్చింది. ఆ మాట గ్రహించి క్షమార్పణ చెప్పుకోడెం?
"లావణ్యా! ప్లీజ్ మాట్లాడు."
తను అన్నమాట తప్పని ఒప్పుకోడెం?
"నాకు విసుగొచ్చేస్తోంది."
"నాకు వళ్ళు మండిపోతోంది.
"ఇవాళ మంచి కాంట్రాక్టు దొరికింది లావణ్యా! సంతోషంగా ఉండాల్సిన సమయం. యాభై వేలు లాభం. ఎందుకలా మూడ్ పాడు చేసేస్తావు."
"వెధవ యాభై వేలు. యభైవేలే మీకు ముఖ్యమయితే చెక్కు రాసిస్తాను ఈ క్షణం. ఎవడిక్కావాలి యాభైవేలు?"
"నీకు మనసు బాగున్నట్టులేదు. పోనీ వెళ్ళిపోదామా?"
"మీకే వెళ్ళిపోవాలని అనిపిస్తే నాకు మాత్రం కూర్చోవాలనిపిస్తుందేమిటి. తక్షణం వెల్లిపోదాం."
"సరే" అంటూ లేచి నిలబడింది ముభావంగా.
ఇద్దరూ బయటికి వచ్చి జీప్ ఎక్కారు.
"ఇంటికేనా?" అన్నాడు శ్రీహర్ష.
"నన్ను క్లబ్బు దగ్గర దింపేయ్యండి."
జీపు క్లబ్బు దారి పట్టింది.
"లావణ్యా! ఎందుకు కోపం వచ్చింది?"
"................."అన్నీ నేనే చెప్పాలా? మీరే గ్రహించాలి.
పెదిమలు ఇంకా గట్టిగా బిగించింది.
శ్రీహర్ష ఇంక మాట్లాడలేదు. మాట్లాడితే లావణ్యకు కోపం ఎక్కువవుతుందేమోనని భయపడ్డాడు.
జీపు త్వరత్వరగా పరుగెడుతోంది.
అయిపొయింది. క్లబ్బు వచ్చేస్తుంది. తన అలక తీరకుండానే అతను వెళ్ళిపోతాడు. అలా జరగడం తను భరించలేదు. చాలా అవమానంగా ఉంటుంది తనకు. వుక్రోషంతో నరాలు తెగిపోతాయి.
లావణ్య పిడికేళ్ళు బిగుసుకున్నాయి.
జీపు క్లబ్బులో ప్రవేశించింది.
పోర్టికోలో ఆగింది.
శ్రీహర్ష లావణ్య మొహంలోకి చూశాడు.
లావణ్య మొహం విసురుగా పక్కకి తిప్పుకుంది.
"నేనేదన్నా తప్పు చేస్తే నన్ను క్షమించు" అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ.
తను కోపంతో ఉన్నప్పుడు ఎవరన్నా నవ్వుతూ మాట్లాడితే వళ్ళు మండుతుంది లావణ్యకు.
అతను సరిగా బతిమాలడం లేదు. ఐదు నిమిషాల కొకసారి ఉద్దరిస్తున్నట్లు పలకరిస్తున్నాడే కానీ తను మాట్లాడకపొతే బతకలేడు అన్న దిగులు ప్రదర్శించటంలేదు.
మాట్లాడకుండా క్లబ్బులో కెళ్ళిపోయింది లావణ్య.
కాసేపు అటే చూసి జీప్ స్టార్టు చేశాడు శ్రీహర్ష. 'ఇలాంటి సమయంలో తను ఎదుట కనపడకుండా ఉంటేనే మంచిది. పొద్దుటికి లావణ్య కోపం తగ్గిపోతుంది. పొద్దునే వెళ్ళి పలకరించాలి" అనుకుంటూ.
విసవిస నడుస్తూ క్లబ్బులో ప్రవేశించింది లావణ్య. అప్పటికే సుధా, రోసి ఇంకో స్త్రీ కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చుని కార్డ్స్ ఆడుతున్నారు.
సుధ చెయ్యి ఉపీ పిలిచింది.
ఆలోచించకుండా వెళ్ళి ఆటలో చేరింది లావణ్య. కూర్చున్న తర్వాత బాధపడింది. ఈ రోసి అంటే తనకి పడదు. అరంగుళం మందాన మేకప్పు, రక్తం తాగినట్లు భయంకరమైన రంగులో లిప్ స్టిక్కు నాలుగు రోజుల్నుంచి క్లబ్బుకి వస్తోంది ఇది.
ముక్కలు పంచేశారు.
తను అసలేకోపంగా ఉంది. అందులో రోసి పక్కన కుర్చున్నందుకు అసహ్యంగా ఉంది. యెంతగా ప్రయత్నించినా అట కుదరటం లేదు. డబ్బులు పోతున్నాయ్. తను ఓడిపోతోంది. ఎందుకిలా అవుతున్నాయి అన్నీ.
మనసు చిరాకుగా ఉంది.
తర్వాత ఆటా, తర్వాత ఆటా........అందరి డబ్బులూ పోతున్నాయ్.
కసి భరించలేకపోతోంది లావణ్య.
అదేమిటి?
హఠాత్తుగా తన దృష్టి రోసి గౌనుకి, బ్రాకి మధ్య ఉన్న జోకర్ల మీద పడింది.
ఇది దొంగాట ఆడుతోంది! దొంగ మొహమూ ఇదిను.
నిలబడింది.
పెద్ద గొంతుతో "చీట్ చేస్తున్నావా? బ్లడి బిచ్! గెటప్!" అంది.
రోసి లేవలేదు.
లావణ్య బలంగా రోసి చెంప మీద కొట్టింది.
'ఏయ్' అంటూ అడసింహంలా లేచింది రోసి.