ఆమె చేతులు జోడించటం మినహా ఏమీ చెయ్యలేకపోయింది.
"ముగ్గురూ కూతుళ్ళేగా, ఏం చేస్తున్నారూ?" ఆమె చెప్పింది.
సత్యవతి నోరు విప్పి "అమ్మకి ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ రావడం లేదు, అందుకనీ.....అంది.
ఆయన ఆశ్చర్యపోయి, "ఔనా!" అని ఎదురుగుండా వున్న కాయితం మీద రమణమ్మ పేరూ, వయసూ, ఇతర వివరాలూ స్వహస్తాలతో రాసుకుని, నే చూస్తానమ్మా! వీలైనంత త్వరలో జరిగేటట్లు చూస్తాను" అన్నారు.
ఆ తర్వాత ఆయన కోసం తండోపతండాలుగా బయట ఎదురుచూస్తున్న జనాన్ని తలుచుకుని, శలవు తీసుకుని బయల్దేరారు.
ఆ రోజు రాఖీ పండుగ తన 'అన్ననే' కలిసినట్లుగా అనిపించింది రమణమ్మకి. ఎంతోమంది 'సోదరి' లు రాఖీలతో ఆయన కోసం బయట ఎదురుచూస్తున్నారు. తన పాత జ్ఞాపకాలనే బంధనాలు ఆయన చేతికి కట్టివస్తున్న అనుభూతి కలిగింది.
తరువాత వెంట వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్, సరస్వతీగిరిగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆమె కూడా ఆప్యాయతాదరణలలో భర్తకు తగ్గ ఇల్లాలు. చాలా ప్రేమగా మాట్లాడి పంపించారు.
ఒంటిగంటకల్లా బస్ స్టాపుకొచ్చి నిలబడ్డారు. అదే బస్సు తిరిగొచ్చింది.
డ్రైవర్ నవ్వుతూ "ప్రెసిడెంటు కలిసారా?" అన్నాడు.
"ఆ.....చాలా బాగా మాట్లాడారు. మేము వచ్చిన పని జరిగింది" అంది రమణమ్మ ఎంతో తృప్తిగా.
అతను వెంటనే నిశ్చేష్టుడై ఆ తర్వాత నెమ్మదిగా చేతులు జోడించి "క్షమించడమ్మా! ఏదో తెలియక వాగాను. మీరెంత గొప్పవారు కాకపోతే ఆయన 'ఎపాయింట్ మెంట్' తీసుకోకుండానే మాట్లాడి పంపిస్తారూ?" అన్నాడు చాలా సిగ్గుపడుతూ.
"ఒకప్పుడు మా యింట్లో మా వారితోబాటు నేలమీద కూర్చుని, నేను వడ్డించిణ చింతకాయ పచ్చడీ, అన్నం తిన్నవారే! కానీ, ఆయన మమ్మల్ని మరిచిపోకపోవడం ఆయన ఔన్నత్యాన్ని చాటుతోంది. అదే ఆనాటి వారికీ, ఈనాటి వారికీ తేడా!" అందామె కళ్ళల్లోంచీ అప్రయత్నంగా వచ్చిన కన్నీరు తుడుచుకుంటూ.
"మావయ్యా! నువ్వు చెప్పినట్లే, 'ప్రెసిడెంట్ గారిని కలిసాము. ఆయన అమ్మ పెన్షన్ విషయం వీలైనంత త్వరగా జరిగేటట్లు చూస్తానన్నారు. అని సత్య చెప్పగానే, నోరు తెరిచి చూస్తుండిపోయారు రాజలింగం.' ఏదో మాటవరసకి తను వెళ్ళి ప్రెసిడెంటుని కలవండి!" అంటే బిరబిరా వెళ్ళి కలిసొచ్చిన వాళ్ళల్లో, అజ్ఞానం పరమైన ఒక 'తిన్నడూ', 'శబరీ' మొదలైనవాళ్ళు కనిపించారు.
కళ్ళు అశ్రుపూరితా లవుతుండగా, "నాకు తెలుసే, నువ్వు శ్రీహరి రావు కూతురివీ, ఆవిడేమో ఆయనకు సాక్షాత్తూ, ధర్మపత్నీ! మీరు సాధించలేనిదేముంటుంది?" అన్నారు రాజలింగంగారు.
ఇది జరిగిన వారానికల్లా, ఆవిడకి పెన్షన్ ఇస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి.
'ఎరియర్స్' రూ|| 1700 అందాయి. నెల నెలా, వందరూపాయలిచ్చేవారు. ఆ తర్వాత రెండొందలయింది. కాలక్రమేణా పెరుగుతూ ప్రస్తుతం 1000 రూ|| అందుతున్నాయి. ఆవిడకి ఎక్కడికి ప్రయాణం చేసినా రైల్లో ఫస్ట్ క్లాస్ పాస్ అటెండెంటుతో సహా ప్రయాణం చెయ్యడానికిచ్చారు. ఈ మధ్యే ఫోన్ సౌకర్యం కూడా కల్పించారు.
గిరిగారు పోయినా, ఆయన ఆత్మీయతాభిమానాలవల్ల అందరి మనస్సులో 'చిరంజీవి'గా నిలిచారు.
* * * *
"అమ్మమ్మా! ఎలా వుంది?" అనడిగింది. ఇదంతా కధ క్రింద రాస్తున్న ఆమె ఆఖరి మనవరాలు, అంటే ఆఖరి కూతురి కూతురు రమణి.
"మీ తాతయ్య గొప్పవాడని తెలుసు కానీ, ఇంత గొప్పవాడని, ఇదంతా చదివాకా ఇప్పుడే తెలుస్తోంది. అప్పట్లో నేనింకా సహాయ సహకారాలా లందించివుంటే, ఆయన ఇంకా తృప్తిగా, సంతోషంగా మరింతగా దేశానికి సేవచేసి వుండేవారేమో!" అంది రమణమ్మ, చమరించిన కళ్ళు తుడుచుకుంటూ.
కానీ, ఆయన ఆనాటి రాజకీయాలనే 'కుళ్ళు'గా 'రొచ్చు'గా ఉదాహరిస్తూ, ఆరగించుకోలేక ఎదురు తిరిగారు. ఈనాడు బ్రతికుండి, ప్రస్తుత రాజకీయ పరిణామాలు కళ్ళారా చూడడం తటస్తిస్తే, ప్రతి నిముషం, నరకం అనుభవించేవారేమో! అందుకే అలా 'అకాల మృత్యువు' అనే వరమిచ్చి, ప్రేమగా అక్కున చేర్చుకుంది భరతమాత!
దుందుడుకుగా, అల్లరిగా వుండే పిల్లలమీదే తల్లికి ప్రేమెక్కువ! శ్రద్దాసక్తులు కనబరుస్తూ 'దగ్గర'గా వుంచుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఈనాటి వాళ్ళకి ఆయనెవరో తెలియదు! ఆనాటి వాళ్ళకి ఆయన ఓ 'నాయకుడిగా' పరిచయమే! అందరికీ ఆయనేమిటో తెలియాలనే ఈ చిన్న ప్రయత్నం.
జైహింద్... జైభరతమాతా...... __: సమాప్తం :__