Previous Page Next Page 
లీడర్ పేజి 28

    "రాజ్ భవన్"లో అని చెప్పి, ఆయన తన పని చూసుకోసాగారు.    
    "రాజ్ భవన్" ఆ మాట మననం చేసుకుంటూ ఆమె ఇంటి దారి పట్టింది.    
    మర్నాడు వేకువజామునే లేచి, ఇద్దరు ఆడవాళ్ళూ రాజ్ భవన్ వెళ్ళేబస్సులో ఎక్కారు.    
    డ్రైవర్ సత్యవతికి తెలుసు. ఆమె కూడా ఆర్.టి.సి.లోనే ఉద్యోగం చేస్తుంది కదా!    
    "ఇంత ప్రొద్దుటే అమ్మగార్ని తీసుకుని ఎక్కడకమ్మా?" అనడిగాడు యధాలాపంగా.    
    "వి.వి. గిరిగార్ని కలవడానికి."    
    "ఆ..." అంటూ అతను ఓ నిమిషం ఏం వింటున్నాడో అర్ధం కానట్లు చూసాడు.    
    "ఏవిటీ అంటున్నారు?" అన్నాడు మళ్ళీ ఈసారి నవ్వుతూ.    
    "ప్రెసిడెంట్ ని కలవడానికయ్యా!" ఎంతో మామూలుగా జవాబిచ్చిందామె.    
    అతి మామూలు బట్టల్లో, బీదగా కనిపిస్తున్న ఇద్దరు ఆడవాళ్ళు ఎంతో ధీమాగా దేశాధినేతని కలవడానికి ప్రొద్దుటే బయల్దేరి వెళ్ళడం అతనికి నవ్వూ, జాలీ కలిగించాయి కాబోలు!    
    "ప్రెసిడెంట్ ని కలవాలంటే మాటలు కావు ఎంత సెక్యూరిటీ వుంటుందో, ఎన్ని లాంఛనాలుంటాయో మీకు తెలుసా?" అనడిగాడు.    
    "ఏమో! మాకు తెలియదు. మా నాన్నగారెప్పుడూ 'ఇది మనం చెయ్యలేము' అని ఆలోచించి భయపడొద్దనేవారు. అందుకే అవన్నీ ఇప్పుడాలోచించదలచుకోలేదు" అంది సత్యవతి.    
    తరువాత, తెల్లవారి ఐదుగంటలకి శీతాకాలం, చలి వల్లో లేక సంశయం వల్లో వణుకుతున్న తల్లిని దగ్గరగా తీసుకుని చెప్పింది, "భయపడద్దు, నాన్నగారి ఆత్మ మనకు తోడుగా వుంటుంది,"    
    రాజ్ భవన్ ముందు బస్సు ఆపి-    
    "ప్రెసిడెంటుగారిని కలిసి, మాట్లాడ్తూ అక్కడే కూర్చోకండి. తిరిగి ఒంటిగంటకి ఇక్కడ నిలబడితే, ఇదే బస్సులో వెనక్కి వెళ్ళచ్చు" అన్నాడు హాస్యం పట్టిస్తూ.    
    వాళ్ళు పట్టించుకోలేదు. దిగి వెళ్ళిపోయారు.    
    గేటు వద్దకు చేరగానే, సెక్యూరిటీవాళ్ళు నిలేసారు.    
    "ఏం పనిమీద వచ్చారు?" అనడిగారు.    
    "గిరిగార్ని కలవాలి! ఆయన నా భర్తకు స్నేహితుడు" చెప్పింది రమణమ్మ.    
    "ఎపాయింట్ మెంట్ తీసుకున్నారా?"
    "లేదు! అలా తీసుకోవాలని మాకు తెలియదు!"    
    "సారీ! ఈ వారం రోజులకీ ప్రోగ్రాం చాక్ అవుట్ అయిపోయింది. మీరు కలవడం కుదరదు."    
    రమణమ్మ నిస్సహాయంగా చూసి, వెనుతిరగబోయింది.    
    "ఇదిగోండి! ఆయన స్వయంగా మాకు రాసిన ఉత్తరం, క్రింద రాజముద్రిక! ఇది చూపించి, శ్రీహరిరావు భార్యా, కూతురూ వచ్చారు మిమ్మల్ని కలవాలని, అని చెప్పండి. దయచేసి ఒక్కసారి కనుక్కోండి!" అంది సత్యవతి ఉత్తరం అందిస్తూ.    
    అతనో నిమిషం ఆలోచించాడు. తెలుగులో ఆత్మీయంగా రాసిన లేఖ. క్రింద ఆయన స్వహస్తాలతో చేసిన సంతకం!    
    "ఉండండి!" అంటూ అది తీసుకుని లోపలికెళ్ళారు.    
    అతను లోపలికెళ్ళి తిరిగి వచ్చేవరకూ ఆ అరఘడియా, ఒక యుగంలా దైవప్రార్ధన చేస్తూ గడిపారు.  అప్పుడప్పుడే వారికి ప్రెసిడెంటు హంగూ, ఆర్భాటం, ఆయన్ని కలుసుకోవడానికి జరగవలసిన లాంఛనాలూ అవగతమవసాగాయి.    
    కాసేపటికి ఆ సెక్యూరిటీ ఆఫీసరొచ్చి "రమ్మంటున్నారు రమణమ్మ గారిని" అన్నాడు. సత్యవతి వెంటనే తల్లి చెయ్యి గట్టిగా పట్టుకుని, మా అమ్మగారికి కళ్ళు సరిగ్గా కనిపించవు, నేను కూడా వెంటవుండాల్సిందే" అంది. అతనో నిముషం ఆలోచించి, "సరే!" అన్నాడు.    
    విశాలమైన హాల్లోకి అడుగుపెడుతుండగా, వారి కళ్ళు వణికాయి హుందాగా కుర్చీలో కూర్చుని కనిపించారు గిరిగారు.    
    ఆమెకి ఆయన సుపరిచితమే!    
    "రమణమ్మా బావున్నావా?" అన్నారు వాత్సల్యపూరితంగా.    
    ఆ పలకరింపులోని అభిమానానికి ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. గొంతు పెగుల్చుకుని మాట బయటికి రావడం చాలా కష్టమయిపోయింది.    
    "మీ స్నేహితుడు నన్ను అన్నివిధాలా అన్యాయం చేసి...." అంటుండగానే, ఆమెకి వెక్కి వెక్కి ఏడుపొచ్చేసింది.    
    ఆయన లేచి, దగ్గరగా వచ్చి భుజంమీద చెయ్యేసి, "ఊర్కోమ్మా వాడికన్నీ తొందరే!" అన్నారు ఒకమారు విచలితుడై.    
    ఆమె కూడా సర్దుకుంది. "కూర్చోండి" అని కుర్చీ చూపించారు.    
    "ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి?" అనడిగారు.    
    "మూడో అమ్మాయి" అందామె.    
    "పెద్ద అమ్మాయేమో అనుకున్నాను! అన్నీ తండ్రి పోలికలే పుణికి పుచ్చుకున్నట్లుంది. లోగడ వాడు పోయినప్పుడు నాకో ఉత్తరం రాసిందిలే!" అన్నారు.    
    రమణమ్మకి చాలా సిగ్గనిపించింది కూతురి తొందరపాటు చర్యకి. కానీ, ఆయన ఇన్ని రాచకార్యాలలోనూ ఇంత స్వల్ప విషయం గుర్తుపెట్టుకోవడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. అందుకే వాళ్ళు 'గొప్ప వాళ్ళయ్యారు.'    
    "నేనేమీ అనుకోలేదులే! సింహం కడుపున సింహం పిల్లేగా పుడుతుంది!" అని నవ్వారు.

 Previous Page Next Page