కాలాన్ని, కాలాచక్రాన్ని కూడా బంధించే విధిముందు మానవుడనగా ఎంత?
విధిని తెలుసుకోలేని మూర్ఖులు ప్రయోజనాల్ని, తమ ప్రయోజకతం క్రింద జమకట్టుకుంటారు-
తమ ఆధిక్యతకి అదొక గొప్పగా ప్రకటించుకుంటారు.
కానీ అన్నిటినీ మించి ఒకటుండి అది ఆడిస్తూ వుంటేదానితో పాటే ఆడుతున్నామనేవిషయం మరిచిపోతున్నారు.
"బావా!"
"సరోజ!"
"ఏంబావా?"
"అదిగో మాటమాటకీ అలా పిలిచిపిలిచి విసుగుఎత్తించే బదులు ఆ చెప్పదల్చుకున్నదేదోత్వరగా చెప్పెయ్యరాదూ?"
"మనసులోని మధురమైన భావనలకీపదాలు దొరకటం లేదుబావా వెలిబుచ్చటానికి"
"అలాంటప్పుడు ఊరుకో"
"ఉరకలువెయ్"
"నిజంబావా మనసు వురకలు వేస్తోంది. వయసుపరుగులు తీస్తోంది. తనువుకే బంధంవుండేది. ఆ బంధాన్ని తొలగించే మరోబంధంకోసం మనసు ఉరకలు వేస్తోంది బావా?"
"ఓయ్! ఓయ్! ఈరోజు చింతకాయపచ్చడి ఎక్కువ తిన్నావేమిటి? ఈ పైత్యం అంతా దాన్దేనా?"
"అలాగేలి చేయకు బావా! నీకు నన్ను చూస్తే ఎప్పుడూ ఎగతాళే! మనసారా నన్ను మధురంగా పలుకరించలేదు....అది నా దురదృష్టమో! లేకపోతే నీకు మనసే పుట్టదో? నేనెంత మధురభావనలతో నీదగ్గరికి వస్తానో నన్నంత ఛీత్కరించి కొడతావు-ఏమైనా అంటేపరువు, మర్యాద అని పెద్ద పెద్ద మాటలు ప్రయోగించి మామగారి పేరు, నాన్నగారి పేరు చెప్పినా నోరు మూయిస్తావు అంతే తప్ప ఒక్కడాదైనా ఈ మరదలి మనసులో ఏముందో.....మాణిక్య మోమరకతమో మసిపాతో.....కనుక్కోవటానికి ప్రయత్నం చేశావా? పోన్లే బావా దురదృష్టవంతుల్ని ఎవరు బాగుపరుస్తారు?"
కనుకొలకుల జారినకన్నీటిని తుడుచుకుంది. మనసుచాలా నొచ్చుకుని అన్నాడు అతను.
"నీమీద నాకేం ద్వేషం సరూ! ఏదో మరదలివని అలా కసరి కొడతాను. ఇంకెవరైనా అలా అంటున్నానా? చెప్పు?"
"అదేనేననే దీనూ......ఇంకెవరైనా అయితే అవతలివాళ్ళ మనసులు కరిగి నీరై వాగై నీ పాదాలముందుప్రవహించేలా మాట్లాడతావ్. అదేనేనైతే పొంగి పొరలి ప్రవహించేనా మధురానుభూతులు సెలయేరు గడ్డికట్టిమంచులా బిగుసుకుని శిలలా అయ్యేట్టు చేస్తావ్"
ఉక్రోషంతో ఆమె అనే మాటలు విని నవ్వుకున్నాడు.
మెల్లగా దగ్గరికి జరిగాడు.
ఆమెచేతిని తన చేతిలోకి తీసుకుని మరో చేత్తో మృదువుగా నిమురుతూ అన్నాడు.
"సరూ! అందరూ వేరు. నీవు వేరు. ప్రపంచంలో బావామరదళ్ళ సంబంధమే అలాంటిదే అతని మాటల్ని మధ్యలోనే ఖండిస్తూ అంది.
"అదే బావా నేననేదీ....."
ఆమెను మాట్లాడ నివ్వకుండా నోరుమూస్తూ అన్నాడు.
"అడ్డం రాకు నన్ను చెప్పనీ"
చేయితీసేసి అంది.
"ఏం చెపుతావు లే బావా ఏదో ఓదార్పు మాటలేకదా? అంతకన్నా ఈ అభాగ్యజీవితాన జీవితంలో నోచుకోదేమో-అయినా ఒకటి మాత్రంనాకు తృప్తి ఇస్తుంది బావా.....ఏది ఏమైనన్ను ఎన్నటికీ నీ మరదలుగా గుర్తించే మనసునీ దగ్గర వుంది. అంతేచాలు"
ఆమె మాటలకి కొంతబాద కొంత సంతోషమూకలిగాయ్.
"అంతటిమధురమైన బంధం మరొకటి లేదు. ఎంతటి మనిషినైనా తీయగా కదిలించేది ఆ సంబోధనే!"
ఒక్కక్షణం ఆగాడు.
"బావామరదళ్ళ అన్యోన్యానురాగాలు సహజంగా వుంటాయి. వేర్లు పాతుకునిపోయిన ఆ మనోజ్ఞభావాలతో పలుకరించుకోవటం ఎంతో సంతోషంగా వుంటుంది."
"......."
"చెప్పనీ కానీ బావా మరదళ్ళ మధ్య హాస్యంలేకుంటే అనందానికి తావులేదు.......బావబ్రతిమాలితే మరదలు చీకొట్టాలి......మరదలు బ్రతిమాలితే బావ చీకొట్టాలి.....అలాసాగి పోవాలి బావా మరదళ్ళజీవితం.....అంతేకాని ఇతర్లతోటిలాగా గౌరవా గౌరవాలు లెక్కిస్తూ కూర్చుంటే ఎలా? అంతటి మధుర బంధం ఆ సంబంధం మరెక్కడవస్తుంది సరోజా?"
"అందుకే బావా ఆ సంబంధాన్నే గుర్తుంచుకో అంటున్నాను"
సారధి మరేమీ మాట్లాడలేదు.
దశదిశలా నల్లని చీకట్లు క్రమ్ముకుంటున్నాయ్.
నిష్ప్రయోజనమైన ఆషాఢమేఘాలు చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయ్.
"ఆషాఢస్యప్రథపదివసే!"
అత్యంత భావుకమైన కాళిదాసునికవిత గుర్తుకొచ్చింది సారధికి.
ఒక్కొక్కరికి మేఘాల్ని చూడటానికి బుద్దేపుట్టదు.
ఇంకా కొందరికి చూచినా వాటిలో మనోజ్ఞతే కనిపించలేదు.
మరికొందరికి ఆ మేఘాలు రకరకాల బొమ్మలుగా కనిపిస్తాయ్.
కానీ-
కాళిదాసుమహాకవికి ఆ మేఘాల్ని చూస్తే ప్రియురాలి ఎడబాటులో వున్న ప్రియుడు తనప్రేయసికి సందేశం పంపుతున్నట్లు తోచింది.
ఎంతటిగొప్పభావన.
అందుకేకాళిదాసంతటి వాడయ్యాడు!!
అలాగే భావనలో మునిగిపోయాడు.
బావా!
ఏమీ పలకకుండా వుండటంచూచి మెల్లగా గొంతు విప్పింది సరోజ.
"ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
దేశదేశాలన్నితిరిగి చూసేవు...."
మధురంగా మనోజ్ఞంగా సాగుతున్నాగీతా గానంవింటున్నాడు సారధి లీలగా.
అతనంతటి భావనతో నన్ను ఆ వీణాగానంలాంటి, వేణుగానంలాంటి వాణి గానంవంటి, గానం వినిపిస్తూనే వుంది.
పాటముగిసింది.
"బావా! ఒక్కమాట అడగనా నిన్ను?"
"అడుగు"
"విసుక్కోవుకదా?"
"అడగందే?"
"అందుకే ముందు"
"కానీ"
"మాట ఇవు"
"సరే"
"సరైన సమాధానం చెపుతావా?"
"ప్రశ్నను బట్టి"
"యోగ్యమైన ప్రశ్నే"
"అయితే సందేహం ఎందుకు?"
"అది నా మనసులోది"
"అది కూడా వుండకూడదు"
"పుట్టుకతో వచ్చింది బావా"
"పెట్టుకునేలక్షణం వదిలెయ్"