మా బిల్డింగ్ బయట పెద్దగా కోలాహలం, కేకలు వినిపించేసరికి అందరం బయటకు పరుగెత్తాం.
చాలా పెద్దకేక అది.
ఆ కేక ఎక్కడి నుంచి వచ్చిందో మాకర్ధం కాలేదు. ఆ కేక వెనుకే మా అపార్ట్ మెంట్స్ లోని జనం గుమిగూడిన ధ్వనులు!
మా అపార్ట్ మెంట్స్ మెయిన్ గేట్ దగ్గర కనిపించారు మా వాళ్ళంతా. ముఖ్యంగా లేడీస్, పిల్లలూ అందరూ అక్కడ కిక్కిరిసిపోయి 'ఏ' బ్లాక్ పై వైపునకు చూస్తున్నారు.
మేము కూడా వాళ్ళమధ్యకు చేరుకొని అపార్ట్ మెంట్స్ టెర్రేస్ వైపు చూశాం. అక్కడి దృశ్యం చూసేసరికి- ఒక్కసారిగా మా గుండె ఆగినంత పనయింది.
ఎనిమిదో అంతస్తు పైనున్న వాటర్ టాంక్ పైనెక్కి- కిందకు దూకటానికి సిద్దంగా కనిపించాడు ఓ యువకుడు.
"ఏంటి? వాడెందుకు వాటర్ టాంక్ ఎక్కినయ్?" అడిగాడు హమీద్ మియా.
"ఏమో సార్, ఎవరికీ తెలీదిక్కడ!" చెప్పింది షైనీ.
"అసలు అతనెవరు ఉన్నయ్?" మళ్ళీ అడిగాడు.
"అది కూడా తెలీదుసార్- అసలతను మన అపార్ట్ మెంట్స్ కి చెందినవాడు కాదని మన యూత్ అంటున్నారు"
వాటర్ టాంక్ మీదున్న వ్యక్తి సడెన్ గా ఓ స్పీకర్ పట్టుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు.
"సార్! నా పేరు దినేశ్! నేను సుధి అనే అమ్మాయిని ప్రేమించాను సార్. కానీ సుధి వాళ్ళ తల్లిదండ్రులు మా పవిత్రప్రేమను వ్యతిరేకిస్తున్నారు. మా పవిత్రప్రేమను అర్ధం చేసుకోక సుధికి ఇంకో సంబంధం చూసి పెళ్ళిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం, అమానుషం ఇలా ఇష్టంలేని పెళ్ళిచేయటం ఇల్లీగల్ కూడా! అందుకే వాళ్ళను ఒప్పించి, నాకూ సుధికి వివాహం జరిపించకపోతే- నేను ఇక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా- ఒకవేళ వాళ్ళు నా డిమాండ్ కు ఒప్పుకుంటే నేను కిందకు దిగివస్తా! లేదంటే దూకటం గ్యారంటీ!"
ఇప్పటికే మేము ఇలాంటి దూకటాల గురించి ప్రతిరోజూ న్యూస్ పేపర్లో టీవీ ఛానెల్స్ లో లైవ్ గా చూసి ఉండటం వల్ల మాకేం ఆసక్తి కలిగించలేదా దృశ్యం. మనదేశంలో వీధికొకడు ఏదొక ఎత్తుఎక్కి దూకుతానని బెదిరిస్తూనే ఉంటాడెప్పుడూ.
"ఆ సుధి అనే అమ్మాయి మా రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ లో ఉంటోందా?" అడిగాడు విజయ్ యాదవ్ బిగ్గరగా.
"లేదు- నా సుధి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటోంది"
"అయితే నువ్ అక్కడికేపోయి ఎందుకు దూకతయ్ లేవ్- ఇక్కడికొచ్చి ఏమిటికి దూకుతున్నయ్" అడిగాడు హమీద్ మియా.
"అవసలే కాంట్రాక్టర్లు కట్టిన ఇళ్ళుసార్! మెట్లెక్కుతుంటేనే బిల్డింగ్ ఊగుతోంది! టెర్రస్ మీదకెక్కముందే కూలిపోతే నా ప్రేమ ఎటూ కాకుండా ఫెయిలయిపోతుంది"
"పోనీ ఇంకో అపార్ట్ మెంట్ ఎవర్ధయినా చూసుకో! లేదా దూకే ప్రోగ్రాం ఇంకో రోజు పెట్టుకో - ఇవాళ మా అందరికి చాలా ఎంగేజ్ మెంట్స్ ఉన్నాయ్- నీ గొడవ సాల్వ్ చేసేంత టైమ్ లేదు" అన్నాడు శంకరమూర్తి.
ఆ దినేష్ అనేవాడి మొఖంలో కోపం, షాక్ కనిపించినయ్.
"నేను డిసైడ్ చేసుకునివచ్చా! ఇవాళ నా ప్రేమ సక్సెస్ అవటమో- నేను చావటమో తేలిపోవాలి-"
రాజేశ్వరి పరుగుతో వచ్చిందక్కడికి.
"ఇదిగో బాబూ! అప్పుడే దూకకు! ఇంకో అరగంటాగి దూకు-" అంటూ అరచింది ఆత్రుతగా.
దినేష్ మొఖంలో ఆనందం కనిపించింది.
"ఎందుకు? ఈ అరగంటలో సుధి పేరెంట్స్ ని పిలిపిస్తారా?" అడిగాడతను.
"అబ్బే అందుక్కాదు. మా పిల్లలు ట్యూషన్ కెళ్ళారు- ఇంకో అరగంటలో వచ్చేస్తారు- ఇలా దూకేవాళ్ళను 'లైవ్'గా చూడాలని వాళ్ళెప్పటినుంచో సరదా పడుతున్నారు-"
దినేశ్ మొఖంలో చిరాకు, కోపం కనిపించినయ్.
సరిగ్గా అప్పుడే అరడజను టీవీ న్యూస్ ఛానెల్ వాన్స్ వచ్చేసినయ్. తుగ్లక్ ఛానెల్ రాజు వాన్ దిగుతూనే కెమెరాని అపార్ట్ మెంట్స్ పై వైపు ఫిక్స్ చేయించి మా దగ్గరకొచ్చాడు.
"నమస్తే సార్- మీ అపార్ట్ మెంట్స్ లో మా ఛానెల్ కవరేజ్ కొచ్చి చాలా రోజులయిపోయింది. ఈ మధ్యన, ఇక్కడ మర్డర్స్, కిడ్నాప్ లు, గృహదహనాలు, రేప్ లు, లూఠీలు లాంటివి ఏం జరగలేదా సార్?" నిరాశగా అడిగాడు.
ఆ కొశ్చెన్ తో మా హమీద్ మియాకి కోపం వచ్చింది.
"అంటే? హమారే అపార్ట్ మెంట్స్ లో ఉండేటోళ్ళ గురించి క్యా సోంచ్ రహే హై తుమ్? మేమంతా చంచల్ గూడా జైల్లో గడిపి వచ్చిన చోర్, గూండే, లుటేరా లోగ్ అనుకున్నయ్? మాకు ఇజ్జత్ లేవనుకున్నయ్? మేము పెళ్ళాం బిడ్డల్తో సంసారం చేసే టైప్ కాదనుకున్నయ్?" అంటూ గట్టిగా బెదిరించేసరికి రాజు కొంచెం తగ్గాడు.
"అలా అఫెండవకండి సార్! కిడ్నాప్ లు, మర్డర్లు, రేప్ లు, యాసిడ్ కొట్టడాలు ఇవన్నీ మన దేశంలో చాలా నార్మల్ కద్సార్- అపార్ట్ మెంట్స్ కొంచెం ఎబ్ నార్మల్ గా ఉందని అడిగాను- అంతేగానీ అవన్నీ చేస్తారనీ, చేయాలనీ కాదు"